Previous Page Next Page 
మనస్విని పేజి 12


    
    'చూస్తున్నావుగా, నీ దృష్టికెలా వున్నాను?'    

 

    'బాగానే వున్నారు'
    
    "మరింకేం?'
    
    'అదికాదు'
    
    'ఒక్కోసారి మనసులో తోచినభావాన్ని మాటల్లో పెట్టాలంటే చాలాకష్టం ఎంత తిప్పలు పడినా ఎన్నిమార్లు ఆలోచించినా అది అందదు.....ఒకదానిబదులు ఇంకొకటి మాట్లాడటంకూడా సంభవిస్తుందికూడా'
    
    'నిజమే వదినా'
    
    అతన్ని అలాగే కూర్చుని ఉండమని వంటింట్లోకి వెళ్ళింది. అతనికి వదినగారితో కొంచెం హాస్యమాడాలని పించింది. కాఫీ తీసుకుని తిరిగి వచ్చింది.    

 

    వచ్చేసరికి-కుర్చీలో స్తంభీభూతుడిలా-స్థాణువులా-రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు- విభ్రాంతురాలైంది.  

 

    'ఏయేమిటది సారధీ-?'
    
    'ఏం లేదు వదినా మీరే కదా కదలకుండా అలాగేకూర్చోమన్నారు అందుకే....'    

 

    కప్పునిచేతికి అందిస్తూ అంది హాస్యం మిళితమైన కోపంతో.    

 

    'మంచివాడివే బాబూ-అలాగే కూర్చోమంటే అర్ధం అదా? వదినగార్ని నిజంగా సుగ్రీవుడి ని చేసేసేలా వున్నావ్!'
    
    'నిజంవదినా, మీ మాటజవదాట లేను-కానీ కొంచెం ఊపిరి పీల్చకుండా ఉండటమే కష్టమైంది అందులో కూడా నీమాటేవింటే ఇంతకు ముందునే పెట్టిన భంగిమ నిజంగా.......'
    
    మాటని పూర్తి లేకుండా నోరుమూస్తూ అంది.
    
    'ఛీ!ఛీ!! హద్దూపద్దూ లేకుండా నోటికి ఎలావస్తే అలా అనటమేనా విషఘడియలుంటాయ్, దుర్ముహూర్తాలుంటాయ్.పైగా వెధవ తధాస్తుదేవతలుంటారట-మంచికేమోగానీ చెడుకి మాత్రం తధ్యంతధాస్తు అంటూ వుంటారట-'
    
    వదినగారినవనీత సదృశ్యమైనమనసు ముందు మార్జాండుడిలాంటి సారధి కరిగిపోయాడు.
    
    మౌనంగా కాఫీ త్రాగటం ముగించాడు.
    
    కప్పుని స్టూలుమీద పెడుతూ అన్నాడు 'మీ మనసుబంగారం కన్నా మెత్తనైంది-మేలిమైందీ వదినా.....'
    
    'సరేలే......'
    
    పొగడటంపొడిగించు కోవటం అంటే ఆమెకి నచ్చదు. మాట మార్చాడు.    

 

    'మీకోమాట చెప్పానుగుర్తుందా వదినా?'    

 

    'ఉంది'    

 

    'ఏమిటో?'    

    'కథ'
    
    'గుర్తుందే!'
    
    'అంతఆశ్చర్యం ఎందుకయ్యా?'
    
    'అహ అది కాదు'
    
    'ఏదికాదు-పైగా అంత మతిమరుపు నాకు లేదు. ఒకవేళ నీవు వుందనుకున్నా మరుపు ఇందులో రాదు-అది నీ మాట కదా సారధీమరొక సంగతా? ఏమిటన్నానా?'    

 

    'మరి అడగలేదేం?'
    
    'చెపుతానన్నది నీవు-చెప్పే బాధ్యత నీది- చెపితే వినటం నీవు ఏదైనా అడిగితే తోస్తే తెలిస్తే చెప్పటం ఆ సలహా విడుదల చేసేవరకే బాధ్యత వుంచుకోవటం-తర్వాత నీవు ఆచరణలో పెట్టినా, పెట్టకున్నా ఏమీ అనుకోక పోవటం- అది మా బాధ్యత అయినా ఒకరి విషయాలు అడిగిచెప్పించుకోరారు'
    
    'ఒకరి'అనే పదం మీద ఎక్కువశక్తి వేసి నొక్కుతూ అనేసరికి సారధికి కోపం వచ్చింది.
    
    'నేను ఒకరినా వదినా?' మూతిబుంగగా చేసి తల్లిదగ్గర బిడ్డ గోముచేస్తూ అడిగినట్లు అన్నాడు. అతని బాధ అర్ధమైంది. అతడి మనసులో మెదలిన భావాన్ని గురించి అన్నది నవ్వుతూ.

 

    'ఒక్కడివేకదయ్యా నీవు? ఇంకాఇద్దరు కాలేదు కదా? ముగ్గురందాంమంటే ఇద్దరేలేంది ముగ్గురెలా అవుతారు?'
    
    మనసులో మెదలిన ఏదో భావాన్ని మధురంగా మార్చిన వదినగారి చమత్కారదృష్టికి సృష్టికి సంతోషించాడు.  

 

    'చెపుతాను వింటారా?'    

 

    'అలాగే' కుర్చీ దగ్గరగా లాక్కుని కూర్చుంది.
    
    ఈజీచైర్లో చేరగిలబడుతూ కళ్ళుమూసుకొని అన్నాడు.
    
    'మధ్య మధ్యన ప్రశ్నలు వేయకండి వదినా? అంతా విన్నాక కావలిస్తే చివర్న అడిగెయ్యండి'
    
    'అలాగేనయ్యా ఇంక ఏమైనా కండిషన్స్ పెడతావా?'  

 

    'ఉహు అంతే'    

 

    'సరే అలాగే కానీ'
    
    ఒక్కక్షణం నిశ్శబ్దం రాజ్యం వేసింది ఎలా చెప్పాలా? ఎలా ప్రారంభించాలా? చెపితే తర్వాత ఫలితం ఎలా వుంటుందా అని సాగింది సారధి ఆలోచన.
    
    ఏమిచెపుతాడా అని ఎదురుచూస్తోంది సుభద్ర.    

 

    'ఆంధ్రదేశంలో ఓ పట్టణంలో ఓ ఉన్నత పాఠశాల్లో ప్రధాన తెలుగుపండితుడుగా పని చేస్తూ లైబ్రరీలో టాగూర్ గారి గీతాంజలి తెలుగు అనువాదం చదివిమురిసిపోయి ఇంగ్లీషు మేష్టార్ని అడిగాడు.
    
    "ఇంతకంతే మధురంగా వుందా గీతాంజలి ఇంగ్లీషులో" అని ఆయనరెండు మూడు గీతాలు చదివి పెదవి చప్పరించి.  

 

    "తెలుగులో అనువాదం ఏమి బాగులేదండి. కావాలంటే మీకు నేను ఇంగ్లీషు నేర్పుతాను చదువుకోండి మీకే అర్ధం అవుతుంది మీరు బెంగాలీ చదివితే ఇక నిలువలేరు" టాగూరు అపరశిష్యుడిలా అన్నాడా వ్యక్తి ఏనాడూ ఏబీసీడీల మొఖం ఎరుగని ఇరువయ్యయిదు సంవత్సర సంస్కృతశిరోమణి విదాంసుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి-తల్లిదండ్రుల్ని పోరి ఒప్పించి భార్యతో సహా వెళ్ళి శాంతినికేతన్ లో చేరాడు.  

 

    అక్కడున్న ఐదేళ్ళు టాగూర్ గారి సేవలో శిశ్రూష లో బోధలో నిత్యనూతనమైన మనస్సుకి మెరుగులు దిద్దుకున్నారు. ఒకవైపు బెంగాలీ, మరోవైపు ఆంగ్లమూ ధారాళంగా శుద్దంగా నేర్చుకుని టాగూర్ గారితోనే సెభాష్ అనిపించుకున్నారు ఇద్దరూ.
    
    అక్కడున్నన్ని రోజులు వ్యర్ధంకాకుండా భార్యకు సంస్క్రుత్తంకూడా ధారపోశాడు-అంతేకాదు ఆమె చిత్రలేఖనంలో విశిష్టమైన సాధనచేసింది. విద్యాభ్యాసం ముగించుకుని వస్తూ టాగూరుగారి సాహిత్యాన్నంతా ఔపోసనంలాగా గ్రోలిన ఆ మనస్సుతో ఆ మధురభావనతో ఆయనచిత్రాన్ని రంగులతోగీసి ఇచ్చింది. దానిక్రింద "పరమసుకుమార భావనాగురుడు గురుడు" అని వ్రాశాడతను.
    
    ఇద్దరి ఆ సుకుమార భావనాపటిమకు ముగ్ధుడై జంటగా విద్యాభ్యాసంలో చేసిన కృషికి తన్మయుడై అభినందిస్తూ ఆశీర్వదించారు రవీంద్రులు.
    
    తిరిగివచ్చాక మళ్ళీ అదే పాఠశాల్లో ఉపాధ్యాయుడిగాచేరి విద్యార్దులకూతోటి ఉపాధ్యాయులకు రవీంద్రుడి రచనాశక్తిని శాంతినికేతన్ నడపటంలో ఆయన ఉద్దేశ్యాన్ని, శక్తినిచెప్పి, బోధించి ఆ పాఠశాలని దగ్గర దగ్గరగా రవీంద్రుడి ఆశయాలకి ప్రతిబింబం అన్నట్టు చేశారు.
    
    ఉద్యోగం చేస్తూ రవీంద్రుడి శక్తిని కవితని ఆయనలోని విశిష్టతలన్నింటినీ ప్రచారం చేస్తూ అప్పుడప్పుడూ తీరిక దొరికి నప్పుడల్లా ఆయన రచనల్ని తెలుగులోకి అనువాదం చేశాడు.
    
    గీతాంజలి అనువాదం చేసేప్పుడు ఓ కూతురు పుట్టింది. గీతాంజలి పై అభిమానం రవీంద్రునిపై భక్తి, విశ్వాసమూ కలిసి కూతురికి అదే పేరు పెట్టేట్టు చేసింది. రవీంద్రులంటే అంత భక్తి గీతాంజలి అంటే అంత ప్రేమ. దినానికి ఒక్కసారైనా ఒక్క గీతమైనా చదవంది నిద్రపోరు ఆయన.
    
    ఒక్కగానొక్క కూతురు-రవీంద్రుడిది ఒకే గీతాంజలి-తనకూ-తనదీ-ఒకేగీతాంజలి అంటారాయన.
    
    సుఖంగా శాంతితో జీవనం గడిపి రిటైరయ్యాక కుటుంబం అంతా ఈ వైపువచ్చేసి మిగిలించుకునికూడేసుకున్న ఆ డబ్బుతో కెనాల్ క్రింద ఓ పదెకరాల మాగాణి తీసుకుని స్వయంగా చేసుకుంటున్నారు. ఇప్పటికి పగలంతా వ్యవసాయం-రాత్రిళ్ళు రవీంద్రుని రచనపై తన విమర్శ రాస్తున్నారు-"
    
    కొద్దిగా ఆగాడు.
    
    సుభద్ర ఇంకేం చెపుతాడా అని ఎదురుచూడసాగింది.
    
    "వదినా!"
    
    "ఏంమరిదీ"
    
    "అదిగో......ఆ హాస్యమే వద్దన్నానుకదండి వదినా"   

 Previous Page Next Page