"పిచ్చిదానిలాగున్నావ్! ఇప్పుడు గాని మీ ఇంట్లో లెవరు. లేచి నువ్వు లేవన్న సంగతి తెలుసుకునే సరికి మరో రెండు గంటలయినా పడుతుంది. అప్పుడు ఆలోచించటం మొదలు పెడతారు. అప్పుడు తోమ్మిదయిపోతుంది. అంటే అప్పటికి మన పెళ్ళి అయి గంట జరిగిపోతుందన్నమాట.........!" ధైర్యం చెపుతూ అన్నాడు చలపతి.
"తరువాతయినా గొడవలవుతాయి కదా?"
"ఏం కావ్! నువ్వు కొంచెం ధైర్యంగా వుండాలి. మరీ అంత భయపడిపోతే యెలా?"
ఏడు గంటలకల్లా టాక్సీలో గుడికి చేరుకున్నారు నలుగురు.
అప్పటికే అక్కడ నర్సరాజు 'లా' కాలేజీ స్నేహితులు పదిమంది ఎదుర్చుస్తూన్నారు. పురోహితుడు కూడా సిద్దంగా వున్నాడు. మరికొద్ది సేపట్లో కార్యక్రమం మొదలయిపోయింది. మేళ తాళాలు లేకపోవడం వల్ల ఎలాంటి సందడీ లేదు. మంత్రాలు చదవడమొక్కటే గట్టిగా విననడుతోంది . సావిత్రీ పక్కనే కూర్చుంది రాజ్యలక్ష్మి.
సరిగ్గా ఎనిమిదింటికి మంగళసూత్రాధారణ అయిపొయింది. అప్పటి గాని సావిత్రిలో బెరుకుతనం పోలేదు. అందరూ రెండు టాక్సీలలో హోటల్స్ కు వెళ్ళి కాఫీ టిఫిన్లు తీసుకుని అక్కడి నుంచి రిజిస్ట్రారాఫీసు చేరుకున్నారు.
రెండు గంటల్లో అక్కడి తతంగమంతా పూర్తయింది. హోటల్లో ముందే ఏర్పాటు చేసుకున్న విందుకి చేరుకున్నారు.
చలపతికి ఆశ్చర్యంగా వుంది. నర్సరాజు ఇన్ని ఏర్పాట్లు ఎప్పుడు చేశాడో తనకే తెలీదు. భోజనాలు ముగించి తిరిగి నర్సరాజు యింటికి చేరుకొన్నారు చలపతీ, సావిత్రీ!
"ఇంక మేము మా ఇంటికి వెళ్ళవచ్చా?" అడిగాడు చలపతి నవ్వుతూ.
"అప్పుడేనా! మధ్యాహ్నం సినిమా ప్రోగ్రాం వుంది. సాయంత్రం మళ్ళీ డిన్నర్ ! అంత వరకూ ఇక్కడి నుంచీ కదలడానికీ వీల్లేదు.
సావిత్రికి నర్సరాజంటే గౌరవం పెరిగిపోయింది. ఇలాంటి ఉత్తములు కూడా ఉంటారా అనిపించిందతన్ని చూస్తోంటే! అతని భార్య కూడా అతనికి తగ్గట్టే వుంది.
ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు తప్పితే మరో బావం కన్పించదు. మధ్యాహ్నం సినిమాకి వెళ్ళారు నలుగురూ! సావిత్రికి అంతా కల లాగుంది. తలుచుకొంటే నమ్మబుద్ది కావటం లేదు!
ఇంట్లో వాళ్ళకు తెలీకుండా పెళ్ళాడటం ఇంత తేలికా?" అని ఆశ్చర్యంగా ఉంది.
సినిమా మీద దృష్టి లేదామెకి. అన్నీ ఆలోచనలే! ఇంట్లో ఏమనుకోంటూ టారు. ఈ పాటికి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయుంటుంది. సావిత్రి లేచిపోయింది! ఇదే మాట వినబడుతుంది అందరి నోట! చివరకు పోలీసు రిపోర్టు ఇస్తారేమో!
అలాంటివి తన పిన్నికి ఇష్టం ఉండదు. పరువు ప్రతిష్టలు నాశనమవుతాయని భయం! తను చలపతిని చేసుకొందని తెలిస్తే అందరూ ఏమనుకోంటారు?
"సినిమా అయిపోయిందండోయ్! మీరింకా మీ ఊరి గురించే ఆలోచిస్తున్నట్లున్నారు!" నవ్వుతూ అంది రాజ్యం.
సిగ్గుపడి లేచి నుంచుని వారితో పాటు తనూ బయటకు నడిచింది. కాసేపు టాంక్ బండ్ మీద కూర్చున్నారందరు.
నర్సరాజు తను చేసిన ఓ పెళ్ళి గురించి చలపతికి వివరించి చెపుతున్నాడు వింటుంటే సావిత్రికి కూడా నవ్వుగా ఉంది.
"ఇంక చాల్లెండి! మీ కధలు తర్వాత చెబుదురు గాని టైము ఎనిమిదవుతోంది!" అని రాజ్యం మందలించేసరికి కధ త్వరత్వరగా ముగించి లేచి నుంచున్నాడు నర్సరాజు.
నలుగురూ ఓ ఖరీదైన హోటల్ లో భోజనం ముగించారు. టాక్సీ అక్కడి నుంచి ఓ అదునికమయిన హోటల్ ముందాగింది.
"మళ్ళీ ఇక్కడేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు చలపతి.
"లేకపోతే మొదటి రాత్రి ఆ ఇరుకు అద్దె కొంపలో గడుపుతారా ఏమిటి? మొదటిరాత్రనేది ఒకేసారి వస్తుంది బ్రదర్! ఆ రాత్రినే మనం నిర్లక్ష్యం చేస్తే ఇంక జీవితంలో గుర్తుంచుకోడానికేమి మిగలదు! అందుకే ఈ హోటల్లో ఒక ఎయిర్ కండిషన్ గది బుక్ చేశాను మీ కోసం....!" కొంటర్ దగ్గర కెళ్ళి తాళం చెవులు తీసుకొని లిప్టు వేపు నడిచాడు నర్సరాజు.
అతన్ని అనుసరించారు అందరూ. లిప్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఆగింది. గది తాళం తీసి లోపలి నడిచారు నలుగురూ.
సినిమాలో చూస్తున్నట్లుంది లోపలి అలంకరణ. పెద్దగది! అందమైన సోఫా! మంచాలు మల్లెపువ్వులాంటి దుప్పట్లు! నిలువెత్తు అద్దం! బీరువా, హంగర్లు ఫానులు , నైట్ లైట్లు.
"ఇంక మేం శెలవు తీసుకొంటాం!" నవ్వుతూ అన్నాడు నర్సరాజు.
"మీ ఋణం ఎలా తీర్చుకోగాలనో తెలీటం లేదు........"నర్సరాజు వంక గౌరవ ప్రవర్తులతో చూస్తూ అన్నాడు చలపతి.
"ఆర్ధిక మాత్రం నెలనెలా జీతంలో కొంత కట్టి తీర్చుకో! ఇక మిగతా ఋణం అంటావు! అది నీ ఇష్టం! అవకాశం వచ్చినప్పుడు నేనే అడుగుతాను! అప్పుడు తీర్చుకొందువ్ గాని! ఒకే - విష్ యూ ఏ వండర్ ఫుల్ నైట్......"
నర్సరాజు అతని భార్యా వెళ్ళిపోయారు.
సూట్ కేస్ తెరచి బట్టలు మార్చుకున్నాడు చలపతి. తలుపులు మూసి గడియ పెట్టి సావిత్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు.
గది అద్దాలోంచి దూరంగా వెలుగుతున్న లైట్ల వంక చూస్తోంది సావిత్రి. ఆమె కళ్ళ వెంబడి చారికలున్నాయ్.
"సావిత్రీ!" ఆవేదనగా పిలిచాడతను.
"ఊ!"
"ఏడుస్తున్నావా"
"కాదండీ! అనందం ఎక్కువయిపోయి!"
"అండీ అంటున్నావా?" ఆశ్చర్యంగా అన్నాడతను.
"అవునండీ నా కలా పిలవడమే ఇష్టం! వివాహం అయిన తరువాత భర్తని నువ్వు, అనడం నాకిష్టం లేదు!"
"ఇష్టం లేని పని చేయమని నేనూ అననులే! రా! అలా మంచం మీద కూర్చుందాం!"
నెమ్మదిగా నడిచి అతని పక్కనే కూర్చుందామే.
ఆమెను తన వేపు తిప్పుకొని గాడంగా హృదయానికి హత్తుకున్నాడు చలపతి.
"ఇదంతా కలలాగా లేదూ?" అడిగింది సావిత్రి.
"నువ్వు ఎదురుగా వుంటే కలయినా కూడా నిజంగానే ఉంటుంది నాకు!" నవ్వుతూ అన్నాడు చలపతి.
"నాకెందుకో! ఇంకా నమ్మబుద్ది కావడం లేదు! నిన్న ఈపాటికి మా ఇంట్లో - ఇవాళ మీ పక్కన! తమాషాగా ఉంది! ఆరోజు మీరన్నారు గానీ ఎందుకో ఇదంతా ఇంత తేలిగా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు!"
"నిజం సావిత్రీ! ఏదో పైకీ మాట్లాడుతున్నాను గానీ! నాకూ ఇంకా పూర్తిగా భయం తొలిగిపోలేదు! అయినా ఇప్పుడు ఆ విషయాలూ ఆలోచించడం అనవసరం! నర్సరాజు అన్న మాటలు గుర్తున్నాయా నీకు! మొదటి రాత్రిని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో ఇంక గుర్తుంచుకొదానికేమీ మిగలదట! చాలా బాగా చెప్పాడు కదూ?"
సిగ్గుతో తలూపింది సావిత్రి ఆమెను తన మీదకు లాక్కుని మంచం మీదకు వరిగిపోయాడు చలపతి. ఇద్దరి పెదాలూ కలుసుకున్నాయ్!
* * *
మర్నాడు మధ్యాహ్నం తమ ఇంటికి చేరుకొన్నారిద్దరూ!