"అందంగా ఉండడం, ఉండకపోవడం వేరే సంగతి. ఇలా అలంకారాల్లో ముంచి తేల్చబట్టే ఆడది ఓ ఆట వస్తువులా తయారయింది. న్యాయంమీరే చెప్పండి! అలంకారాలు ఆడదానికే ఎందుకు! మగాడికెందుకు కూడదు?" చిరునవ్వుతో అందామె.
"ఇదిగో చూడమ్మాయ్! ఆడదానికి అలంకారాలు అవసరమా, కాదా అని చర్చించుకోడానికి మనం సమావేశమవలేదు!" అతని మాటలకు సిగ్గుపడిందామె. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాసరావ్. "హేమ!" ఆమె పెదాలమీద ముద్దుపెట్టుకొని తన్మయత్వంతో పిలిచాడతను.
"ఊ!" "ఈ క్షణం కోసం నేనెన్ని రోజులనుంచీ కలలు కంటున్నానో తెలుసా?"
"ఏమో!"
"ఆరోజు మనిద్దరికీ పరిచయమయింది గుర్తుందా? అప్పటినుంచీ?"
"నిజమా?" నమ్మలేనట్లు అడిగిందామె.
"అవును! ఆ రోజు నుంచీ రాత్రింబగళ్ళు నీ గురించే ఆలోచన!".
"అప్పుడేం రాలేదేం మరి మా ఇంటికి?"
"బావుంది. నువ్వూ, సుధీర్ వివాహంచేసుకోబోతున్నారేమోనన్న అనుమానం! ఈ మధ్య అతనితో మాట్లాడే వరకూ అసలు విషయం నాకు తెలీదు!" "మీరు నన్ను చేసుకోడానికి మీ వాళ్ళు మనస్ఫూర్తిగా వప్పుకున్నారా?" అడిగిందామె.
"అవును! ఏం?"
"అనుమానమొచ్చింది! అంతే!".
"ముందు కొంత వెనుకాడారుగానీ నేను నచ్చజెప్పాక వప్పుకున్నారు. అయినా మనం ఆ విషయం అంతగా పట్టించుకోవాల్సినపని లేదు. జీవితాంతం కలిసి జీవించేది మనం గాని వాళ్ళుకాదు!".
ఆమె చిరునవ్వు నవ్వింది. "మీరు చెప్పింది నిజమే!" అంది తలూపుతూ.
"అదిసరేగాని హేమా! ఇవాళ మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాల్సినరోజు కాదు కబుర్లకి చాలా సమయం ముందుంది. అవునా?" అంటూ ఆమెను కౌగిలించుకొని అలాగే లేవనెత్తిమంచంమీదకు వరిగిపోయాడు. ఆమె అతని కౌగిట్లో పసిపిల్లలా ఒదిగిపోయింది.
మరో పదిరోజుల తర్వాత విజయవాడలో సంసారం ప్రారంభించాడు శ్రీనివాసరావ్. ఆఫీసుకి దగ్గర్లోనే ఇల్లు తీసుకున్నాడతను. అంతవరకూ నిలువఉన్న డబ్బుతో ఇంట్లోకి ఎన్నో వస్తువులు కొన్నాడు. మంచాలూ, డైనింగ్ టేబులూ, సోఫా సెట్టూ, ఫ్రిజ్, రేడియో! ఆ ఇల్లు చూచిహేమ పొంగిపోయింది.
"నాకు ఏడువందలు జీతంవస్తుంది హేమా! అదంతా నీ చేతికే ఇస్తాను. ఇంటి బాధ్యతంతా నువ్వే చూసుకోవాలి! సరేనా?" అడిగాడు శ్రీనివాసరావ్.
తలూపింది ఆమె. మొదటి నెలజీతం తీసుకుని హనీమూన్ బయల్దేరారు వాళ్ళు. దక్షిణ దేశంలోని కొన్ని ముఖ్యమయిన పట్టణాలు మాత్రం చూచి తిరిగి వచ్చారు.
రాన్రాను ఇంట్లో ఏమీ తోచక విసుగుపుడుతుండేది ఆమెకు. శ్రీనివాసరావ్ ఉదయం తొమ్మిదిన్నరకు ఆఫీసు కెళ్ళి సాయంత్రం అయిదింటికిగాని తిరిగివచ్చేవాడు కాదు. అంచేత ఇరుగు పొరుగు వారిమీదకు తన దృష్టిని మళ్ళించిందామె. పక్కింట్లో ఉన్నామె అనూరాధ.
ముగ్గురుపిల్లలు ఆమెకి. ఆమెభర్త రెండు మూడురోజులకోసారి ఇంటికివచ్చి పోతూంటాడు. ఆమె తేలిగ్గానే స్నేహం కలిసిపోయింది హేమకు. ఇద్దరూ కలిసికాయగూరలకు, షాపింగ్ కీ కలసివెళ్తూండేవాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం పదకొండవుతూండగా ఇంట్లో కొచ్చింది అనూరాధ.
"ఏమండీ! మార్నింగ్ షోకెళ్దామా?" అంటూ అడిగిందామె హేమని.
"సినిమాకా?"
"అవును! మళ్ళీ రెండింటికల్లా ఇంట్లో ఉండవచ్చు!"
కొద్దిక్షణాలు ఆలోచించింది ఆమె. శ్రీనివాసరావ్ నడగకుండా ఎప్పుడూ సినిమాకి వెళ్ళలేదు. వెళ్ళినా అతనేమీ అభ్యంతరం చెప్పడని తనకు తెలుసు.
"సరేపదండి" అంది అంగీకరిస్తూ. ఇద్దరూ ఇంటికి తాళంవేసి సినిమాకి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నంమూడయిపోయింది. శ్రీనివాసరావ్ వచ్చాక మాటల్లో ఆ విషయం చెప్పిందామె.
"ఎవర్తో? ఈ పక్కింటిదాన్తో సినిమాకెళ్ళావా?" చిరాకుగా అడిగాడతను.
"అవును! ఏం?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"అలాంటిమనిషితో తిరగడం మంచిది కాదు."
"ఎందుకని?" "దానిది చాలా బాడ్ కారెక్టర్....".
"అంటే?"
"భర్తను వదిలి వేరొకడితోలేచి వచ్చేసింది...."
ఆమె ఆశ్చర్యపోయింది.
"అదేమిటి? ఇప్పుడున్నతను ఈమె భర్త కాదా?"
"ఊహు!...."
"అయినాగాని దానికి తప్పు పూర్తిగా ఈమెదే అని ఎందుకనుకుంటున్నారు?"
శ్రీనివాసరావ్ కి నవ్వొచ్చింది. తను మర్చిపోయాడు. ఆమె విప్లవ నారీ సమితి సెక్రటరీకదా ఒకప్పుడు.
"అంటే తప్పెవరిదంటావ్?"
"ఆమెని అలాంటి పరిస్థితికి ఆమె భర్తే తీసుకువచ్చాడేమో ఎందుకాలోచించరు? అతనెన్ని దారుణాలు చేస్తే ఆమె ఇంత ఎక్స్ ట్రీమ్ స్టెప్ తీసుకుందో మనకేం తెలుసు?"
"సరే! పోనీ తప్పు ఆమె భర్తదికూడా ఉందనుకుందాం! అంత మాత్రాన ఇలా మరో వివాహితుడితోలేచి వచ్చేయడమే?" అనునయంగా అడిగాడతను.
"అదే మీ మగాళ్ళ దుర్భుద్ది ఆ పనే మొగాడు చేస్తేపట్టించుకునేవాడు లేడు. కానీ ఆడది చేస్తే మాత్రం కొంపలు అంటుకుపోయినట్లు కేకలు పెడబొబ్బలు, ఆ ఆడదానికి 'బాడ్ కారెక్టర్' అన్న బిరుదులూ! అసలు, ఆమెది బాడ్ కారెక్టరని మీకెలా తెలిసింది? భర్తను వదలి ఇంకొక పురుషుడితో సంసారం చేస్తున్నంత మాత్రాన బాడ్ కారెక్టర్ ఎలా అవుతుంది? ఆమె పదిమందితో వ్యభిచారం చేయడంలేదుకదా?"
శ్రీనివాసరావ్ కేం మాట్లాడాలో తోచలేదు.
"ఇదిగో! వాళ్ళ గురించి మనకువాదనెందుకు గానీ, ఇంకోసారి దాన్తో తిరగవద్దు! అంతే!" కోపం అణుచుకుంటూ అన్నాడతను.
"తిరుగుతే నేనూ చెడిపోతానంటారు! అంతేనా?" నవ్వుతూ అంది ఆమె.
"హేమా! లేనిపోని అర్ధాలు తీయకు. నేనలా అనలేదు. అలాంటివాళ్ళతో తిరగడంవల్ల మనకు అగౌరవమని చెప్తున్నాను! అంతే!"
హేమకు అతని వాదన నచ్చలేదు. అనూరాధ అంత చేయరాని ఘోరమేం చేసిందో ఎంత ఆలోచించినా అర్ధంకావడంలేదు. తనకు సరిపడని భర్తనువదలి, తనను గౌరవించగలడని నమ్మకమున్న మరొక అతన్తో కాపురం చేయడంలో అనౌచిత్యం ఏముంది? ఒకవేళ అది తప్పే అనేట్లయితే ఇదేపని మగవాడు చేస్తే అది తప్పుగా ఎందుకు భావించరు?అతన్నెందుకు వెలివేయరు? భార్యనూ, పిల్లలనూ వదలి వేరొక స్త్రీని వివాహం చేసుకున్న వారెంతమంది లేరు! భార్యతో సంబంధాలు త్రెంచేసుకుని స్త్రీతో అక్రమంగా సంసారంచేస్తున్న పురుషులు చాలామంది తెలుసుతనకు వారి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఆపని ఆడది చేస్తేనే ఘోరం వీళ్ళ ఆలోచనా ధోరణిలో మార్పురాదా ఇక! భర్త ఎలాంటివాడయినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని అభిప్రాయభేదాలున్నా అతనితోనే జీవితమంతా గడిపేయాల్సిందేనా?
శ్రీనివాసరావుతో వాదన పెంచదల్చుకోలేదామె. తనెంత వాదించినా అతను వినిపించుకోడు. ఎందుకంటే అతనూ ఓ మొగాడేగా! మర్నాడు మళ్ళీ అనూరాధ వచ్చిందామె ఇంటికి. ఎలాగయినా ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపించింది హేమకూ.
"మీవారు రాలేదా?" అడిగింది చిరునవ్వుతో.
"ఊహు! లేదండీ!"
"ఆయనీ ఊళ్ళో ఉండరా! సాధారణంగా ఇంటిదగ్గర కనిపించరుకదా?" అడిగింది హేమ.
అనూరాధ కొంచెం తటపటాయించింది. ఆమె మొఖంలో మేఘాలుకమ్ముకున్నాయ్.
"నా గురించి ఏమయినా విన్నారా?" అడిగింది తన చేతివేళ్ళ వంక చూసుకుంటూ.
"అవును...." ఆమె కొద్దిక్షణాలు మౌనం వహించింది.
"నిజమే! నేను మా వారిని వదిలేసివచ్చాను."
"మీకభ్యంతరం లేకపోతే అలా ఎందుకు జరిగిందో చెప్పగలరా? ఇందులో బలవంతమేమీలేదు. ఎందుకో ఈ విషయంలో మీ తప్పేమీ లేదని నా కనిపిస్తోంది. నా ఆలోచనసరయినదే అని తెలుసుకోడానికే అడుగుతున్నాను."
"ఇందులో అభ్యంతరం ఏముందిలెండి! అయినా మీలాంటి సహృదయులకయినా అసలు విషయం తెలిస్తే నన్ను సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతారు".
హేమ నవ్వింది.