"భోజనందా చేస్తారు!" వ్యంగ్యంగా అన్నాడు నవ్వి.
సుజాత తెల్లబోయింది వాడిమాటలలో వ్యంగ్యానికి. యజమాని గురించి అంత హేళనగా మాట్లాడినందుకు కాస్త కోపం వచ్చింది.
"అంటే ఉద్యోగం ఏమి లేదా? డాక్టరుగారేనా పని చేసేది?" వింతగా చూస్తూ అంది.
"ఆ....అమ్మగారుదా పని చేస్తారు. అయ్యదా ఖర్చుపెడతారు" అన్నాడు. ఓ వంకర నవ్వు నవ్వి "క్లబ్బులకి వెడతారు. పేకాడుతారు" అన్నాడు.
సుజాతకి ఏం అర్ధంకాలేదు. ఏదో వింతగావుంది వ్యవహారం అనుకుంది.
ఆయన ఉద్యోగం సద్యోగం లేకుండా భార్య సంపాదిస్తూంటే తిని కూర్చుంటారా? అలనాటి మనిషిని యీమె యెలా వివాహమాడింది? భార్య సంపాదన తింటూ ఆయన యెలా బ్రతుకుతున్నాడు. ఎన్నో అనుమానాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి సుజాతని. కాని వంటవాడిని అవన్నీ అడగడం ఉచితం అనిపించాలేదు. నెమ్మదిగా తనకే తెలుస్తాయి ఇంట్లో వుంటే అనుకుంది.
"అయన యింట్లో లేరా?" అంది నెమ్మదిగా.
అంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. "అదిగో అయ్య లేచాడు" అన్నాడు నాయర్. ఫ్లాస్కులో కాఫీ కప్పులోకి వచ్చి మేడమీదకి తీసుకెళ్ళాడు.
సుజాత ఆశ్చర్యపోయింది ఇంకా నిద్రపోతున్నారా!'
నాయరు వెళ్ళాక వంట గదిలోంచి డ్రాయింగు రూంలోకి వచ్చింది. ఏం చెయ్యడానికి తోచక పుస్తకాల షెల్ఫుదగ్గిర నించుని పుస్తకాలు చూడడం ఆరంభించింది! ఆ పుస్తకాలన్నీ చూస్తుంటే సుజాత మనసు సంతోషంతో నిండిపోయింది. తన కెంతో యిష్టమయిన రచయితల ఇంగ్లీషు నవలలు అన్నీ ఉన్నాయి. ఇష్టమయినా కొని చదివే తాహతులేక. లైబ్రరీలో యెప్పుడూ దొరకనివీ, తను చదవాలనుకున్నవీ కంటబడగానే సుజాత ఆత్రుతగా అవన్నీ ఒక్కొక్కటీ పైకి తీసి చూసి పెట్టడం ఆరంభించింది.
ఇవన్నీ పని లేనప్పుడల్లా తను చదువుకోవచ్చు. అడ్డదిడ్డంగా, వరస వావి లేకుండా పడివున్న పుస్తకాలని దుమ్ముదులిపి, రచయితల వారిగా సర్ది వరసగా పెడదామని అన్నీ తీసింది. ఎలాగా తీశానని షెల్ఫ్ అంత దులిపి క్రొత్త పేపరు పరిచి వరసగా సర్దడం ఆరంభించింది.
సుజాత పుస్తకాలన్నీ సర్దింది. పాత పేపర్లు, పాత మేగజేన్స్ అన్నీ తీసి ఆ రోజు పేపరు, లేటెస్టు వీక్లీలు మాత్రం వుంచింది సెంటర్ టేబిల్ మీద. ఏష్ ట్రేల నిండావున్న సిగరెట్ల పీకలు పారపోసింది. తివాచి దుమ్ముదులిపి తుడిచి వేసింది. సోఫా కవర్లు అన్నీ తీసి దుమ్ముదులిపి మళ్ళీ వేసింది. కుషన్సు ముడతలు లేకుండా సర్దింది. రేడియోగ్రాం మీద పేరుకున్న దుమ్ము దులిపింది. షో కేస్ లో బొమ్మలని తుడిచి అందంగా అమర్చింది. ఫ్లవర్ వేజులలో వాడిన పూలన్నీ పారేసి తోటలోకి వెళ్ళి ఆకులు, పువ్వులు, మొగ్గలు అన్నీ కోసుకొచ్చి మంచి అభిరుచితో అమర్చింది.
తర్వాత కల్యాణి వచ్చేవరకు ఏం చెయ్యాలో తోచని సుజాత ఓసారి యిల్లంతా చుట్టి చూసింది. క్రింద డ్రాయింగురూము, డైనింగ్ రూము, వంటగది, స్టోరురూము, ముసలావిడ పడుకునే గదికాక మరో గది వుంది. మంచం, టేబిల్ వగరాయిలతో వున్న ఆ గది చూసి గెస్ట్ రూము కాబోలనుకుంది సుజాత. ఆ రెండింటికి కలసి మధ్యన బాత్ రూం వుంది. పెరడు పెద్ద యెక్కువ జాగా లేకపోయినా అంట్లు తోముకోడానికి, బట్టలు ఆరేసుకోడానికి-కొంచెంగా కూరమొక్కలు వేసుకునే జాగా వుంది. వంటగదిని ఆనుకుని వున్న సర్వెంట్ రూములో నాయర్ జాగా వుంది. వంటగదిని ఆనుకుని వున్న సర్వెంట్ రూములో నాయర్ వుంటాడు. వీధిలో గార్డెన్ కి ఓ ప్రక్కన కారుషెడ్డు, దానిమీద ఓ గది వున్నాయి. బెడ్ రూములు మూడు మేడమీదే వున్నాయి. ఒకటి పిల్లలకి, మరొకటి డాక్టరుగారిది, ఆ మూడో గది బహుశా ఆయనది అయి వుంటుంది అనుకుంది సుజాత. సుజాతకి ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, కల్యాణి గదిలో వేరే ఒకటే మంచం, డ్రస్సింగ్ టేబిల్, గాడ్రేజ్ బీరువా, వార్ డ్రోబ్ అన్నీ వున్నాయి. అంటే భార్యాభర్తలు యిద్దరూ ఓ గదిలో పడుకోరా? ఇద్దరి కిద్దరిని వేరే గదులు. మధ్య పిల్లల గది! సుజాతకి కాస్త ఆశ్చర్యం అన్పించింది ఆ విషయం. మేడమీద మూడు గదులకి వీధివైపు వరండా, వెనకవేపు డాబా వుంది. ముందు వరండా అందంగా వుంటుంది. అక్కడ ఓ పేముకుర్చీలసెట్టు పిల్లలు చదువు కోడానికి టేబిలు, రెండు కుర్చీలు, జోళ్ళరాక్ వగయిరా లున్నాయి!
సుజాత అంతా తిరిగి చూసి మళ్ళీ వంటింట్లోకి వచ్చింది. సరస్వతమ్మగారు పదకొండుగంటలకి భోజనం చేస్
తాననడం గుర్తుకు వచ్చి ఆవిడకి భోజనం తీసికెళ్ళడానికి వచ్చింది. నాయరు రెండు చిన్న క్యారియర్ల కి భోజనం సర్దుతున్నాడు. పప్పు, అన్నం కలిపి పెడుతున్న నాయరుని "నెయ్యి వేయలేదే" అంది సుజాత. నాయరు చిరాకుగా నుదురు చిట్లించి "నెయ్యి లేదు కొంచెం వుంది అమ్మకోసం వుంచాను" అన్నాడు. సుజాతకి కాస్త కష్టం అన్పించింది. బహుశా యీ సంగతి డాక్టరుగారికి తెలిసి వుండదు. ఆవిడ నెయ్యి తేవడానికి డబ్బు యిచ్చే వుంటారు. ఆ డబ్బు ఖర్చు చేసేసో, చెప్పిందానిలో సగం తెచ్చో, ఆ కొంచెం నెయ్యి ఆవిడకుదుటున వేస్తూండవచ్చు. పిల్లలకి యేం కలుపుతున్నాడో యేం పెడుతున్నాడో ఆవిడ కెలా తెలుస్తుంది! తెలిస్తే పిల్లలకి వెయ్యకుండా తను వేసుకుంటూ యే తల్లి తినగలదు! పాపం యెంత సంపాదిస్తున్నా కన్న పిల్లలు యేం తింటున్నారో చూసుకోడానికి లేదు. సుజాత నాయరుని అంతకంటే యేం అనలేక వూరుకుంది, వచ్చిన గంటనించి అతనిమీద అజమాయిషీ చేయడానికి తనకేం అధికారం వుంది?
సరస్వతమ్మగారి కోసం కంచంలో అన్నీ పెట్టుకుని ఆవిడ గదిలోకి వెడుతూంటే.....అప్పుడే మేడ దిగి వస్తున్నాయనని చూపి సుజాత కాస్త తొట్రుపడింది. ఆయనే యింటి యజమాని అని యెవరూ చెప్పనక్కర లేకుండానే పోల్చుకుంది. నలభై, నలభై అయిదేళ్ళ మధ్య వయసులో, సగం నెరిసిన జుత్తు, కాస్త మొరటుగావున్న మొహం, పెద్ద పెద్ద కనుగుడ్లు, ఎర్రగావున్న వడ్డుపొడుగుతో వున్నాయనని చూసి యీయనా డాక్టరుగారి భర్త అని అనుకోకుండా వుండలేకపోయింది సుజాత. ఆయన కాస్త ఆశ్చర్యంగా సుజాత వంక పట్టి పట్టి చూస్తూ, ఏదో అనాలని నోరుతెరిచి మళ్ళా ఆ ఉద్దేశం విరమించుకుని సుజాత వంకే చూస్తూ వెళ్ళిపోయాడు! చేతిలో కంచం వున్నందున నమస్కారం పెట్టే వీలులేక ఒదిగి నిల్చుని ఆయన దాటి వెళ్ళిపోయాక ముసలామె గదిలోకి వెళ్ళింది.