Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 11


    "నోర్మూసుకోమని ఓసారి చెప్పాను"
    సింహాద్రి నోరు మూసేసుకున్నాడు.
    "ఇవాళ సాయంత్రం ఈ పిల్ల తండ్రి భావయ్యగారు నిన్ను చూడ్డాని కొస్తున్నారు. ఆయనొచ్చినప్పుడు వెధవ్వేషాలేయకుండా నోర్మూసుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు తెల్సిందా?"
    "తెలిసింది" నీరసంగా అన్నాడు సింహాద్రి.
    "ఒకవేళ ఏమైనా పిచ్చివాగుడు వాగినట్లు తెలిసిందో బుర్ర రామకీర్తన పాడిస్తాను. అర్ధమయిందా?"
    "అయింది."
    "నీక్కూడా వార్నింగిస్తున్నాను చిరంజీవి! పిచ్చివేషాలేయకండి!"
    "అబ్బే నేనెందుకేస్తానండీ! నాకేం సంబంధం?"
    "అతి వినయం ప్రదర్శిస్తున్నావ్ నువ్వు అందుకే అనుమానంగా వుంది"
    "అబ్బే- ఒరిజినల్ గా ఇంతేనండి నేను ఎప్పుడూ వినయం గానే వుంటాను"
    విశ్వనాథం వెళ్ళిపోయాడు.
    
                        * * * * *
    
    "దిసీజ్ టూమచ్" అన్నాడు సింహాద్రి ఇంగ్లీష్ లో.
    చిరంజీవి నిజమేనని ఒప్పుకున్నాడు.
    "ఆ మాటకొస్తే టూ మచ్ కంటే కూడా కొంచెం ఎక్కువే" అన్నాడు జాలిగా.
    సింహాద్రి మళ్ళీ ఆ ఫోటో తనచేతుల్లోకి తీసుకున్నాడు.
    "ఇది నిజంగా ఆడపిల్లేనంటావా?"
    "ఓ యస్. అనుమానం అక్కర్లేదు" అన్నాడు చిరంజీవి.
    "నీకెలా తెలుసు అంత నమ్మకంగా?"
    "ఆమధ్య మా ఫ్రెండొకడితో అడివికి షికారుకెళ్ళా! అక్కడ చిరుతపులిని చూశాం! ఆ చిరుతపులి- అచ్చం ఇదుగో ఈ అమ్మాయిలాగే వుంది"
    "అయితే?"
    "అయితే ఏముందీ! ఆ చిరుతపులీ ఆడ చిరుతపులేనని మా ఫ్రెండ్ చెప్పాడు కదా. అయినా మెడలో నెక్లెస్ కనిపించటం లేదూ?"
    "అంటే మెడలో నెక్లెసున్నవాళ్ళంతా ఆడవాళ్ళేనా?"
    "ఈ ఫోటో చూడక ముందు అభిప్రాయం అలా వుండేది!"
    "మరి ఇప్పుడు?"
    "ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మార్చుకున్నాను అంతేకాదు! ఇంకా కొన్ని అభిప్రాయాలు కూడా మారిపోయాయ్!"
    "ఏమిటవి?"
    "చీరలు కట్టేవారంతా స్త్రీలు కారనీ, లోలాకులు పెట్టుకునే వారంతా కూడా స్త్రీలు కాదనీ, స్త్రీలను కేవలం లేళ్ళతోనూ, చిలకలతోనే కాక చిరుతపులులతో, పెద్ద పులులతో కూడా పోల్చవచ్చనీ- ఇలా చాలా చాలా..."
    సింహాద్రికి ఏడుపొచ్చింది.
    "ఇప్పుడు బలవంతంగా వాడిని... అంటే- అదే ఆ చిరుతపులిని నాకిచ్చి పెళ్లి చేస్తారా ఏమిటి ఖర్మ?"
    "పరిస్థితిని సమీక్షిస్తే అలాగే కనబడుతోంది" జాలిగా అన్నాడు చిరంజీవి.
    "ఎలారా ఈ వెధవ సంబంధం తప్పించుకోవడం?"
    "మీ మావయ్యా దగ్గరకెళ్ళి - ఈ సంబంధం విషయం ఇంకోసారి నా దగ్గర ఎత్తావంటే మొఖం చట్నీ చేస్తానని వార్నింగివ్వు తప్పిపోతుంది"
    ఆ సీన్ ఓసారి ఊహించి చూసుకున్నాడు సింహాద్రి. కానీ అదేమంత ఆకర్షణీయంగా కనిపించలేదు.
    "ఇంకో పద్ధతేమీ తేదుట్రా?" ఆశగా అడిగాడు.
    "ఉంది?"
    "ఏమిటది?"
    "ఆ చిరుతపులినే పెళ్లి చేసుకోవడం"
    "ఇది అన్యాయంరా! ఓ పక్క నా హృదయం ఇంకో అమ్మాయికిచ్చేశానే?"
    "ఇంకో పక్క ఆ చిరుతపులిని ఉండనీ"
    "వద్దురా! అసలా చిరుతపులి పక్కన నిలబడే సీన్ తల్చుకుంటేనే భయంగా ఉంది. ఇంకా పెళ్లి చేసుకుని మగరాయుడితో సంసారం చేయడం మాటలా?"
    "అలాంటి మగరాయుదితో సంసారం చేసేందుకు కూడా ఓ పద్దతుందిరా! భయపడకు"
    "ఏమిటా పద్దతి?"
    "దాన్ని టూరింగ్ లైఫ్ పద్దతి అంటారు"
    "అంటే ఏం చేస్తారు?"
    "ఆ మగాడిలాంటి అమ్మాయిని చేసుకున్నవాడు పెళ్లి అయిన మర్నాటినుంచి టూర్లు తిరుగుతాడన్న మాట. అంటే- భార్యతో అనుకునేవ్; కాదు. ఒక్కడే! అలా తిరిగి తిరిగి, తిరిగి తిరిగి చివరకు రిటైరయాక అప్పుడు ఇల్లు చేరుకుంటాడు"
    "టూర్లేమిట్రా? నాకేం అర్ధం కావటం లేదు" అడిగాడు సింహాద్రి.
    "ఇంకా అర్ధం కాలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు చిరంజీవి.
    "లేదు"
    "వెరీ బాడ్ బైదిబై- ఇటీవలి కాలంలో నీ మెదడు కేమయినా దెబ్బతగలడం గానీ లేక మరోటి గానీ ఏదయినా జరిగిందా?"
    "లేదు. ఎందుకు?"
    "జస్ట్ డౌట్ అంతే ఓకే! అర్ధం కాలేదన్నావ్ కదూ! అయ్ విల్ ఎక్స్ ప్లెయిన్! టూరింగ్ లైఫ్ మెథడ్ అంటే భార్య మగాడిలాగా గానీ లేక చిరుతపులిలాగా గానీ లేక ఈ రెండూ కలిసినట్లున్నా గానీ, లేక ఇంకే క్రూర జంతువు పోలికలున్నా గానీ సాధారణంగా ఈ టూరింగ్ లైఫ్ మెథడ్ వాడతాడన్నమాట భర్త. అంటే పెళ్ళయిన మర్నాడు అతను టూర్ కి బయల్దేరతాడు. ఆ టూర్ ఇలా వుంటుంది. జనవరి నుంచి మార్చి వరకూ కలకత్తాలో కాన్ఫరెన్స్, మార్చి నుంచి జూన్ వరకూ మద్రాసులో బ్రాంచ్ ఇన్ స్పెక్షన్, జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ బాంబేలో బోర్డ్ మీటింగు, సెప్టెంబర్ నుంచి జనవరి వరకూ వైజాగ్ లో సర్వే లేదా డార్జిలింగ్ లో ఇన్ వెస్టిగేషన్! ఇలా మూడువందల అరవై అయిదు రోజులూ టూర్లోనే గడిపేస్తారన్నమాట! ఇంటికి రావటం అంటూ వుండదు. ఈ రకంగా హాయిగా భార్యకు దూరంగా ఆమెను చూడకుండా, తను ఆమె కంట పడకుండా జీవితం ఆనందకరంగా గడపవచ్చన్నమాట. ఎటొచ్చీ లీప్ ఇయర్లో మాత్రం ఓ రోజు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే లీప్ సంవత్సరానికి మూడువందల అరవై ఆరురోజులుకదా! ఆ ఒక్కరోజూ భార్య తెలివిగలదయితే ఇంటిదగ్గర గడపమని ఆజ్ఞాపించవచ్చు"
    సింహాద్రి కాపద్దతి ఏమంత నచ్చలేదు.
    "నాకేం నచ్చలేదురా" అన్నాడు మళ్ళీ దిగులుపడి.
    "నీ మొఖం! నీకు తెలీదు! కె.యస్.యస్.రాజు గాడు ఇలాగే నచ్చలేదు. నచ్చలేదని ఇప్పుడు అదే బ్రహ్మాండమయిన పద్దతిని తెగ మెచ్చుకుంటున్నాడు"
    "రాజెవరు?"
    "మా కొలీగ్?"
    "అంటే అతని భార్య కూడా..."
    "యస్! అనుమానం ఎందుకు? భీకరమయిన ఆకారం. అంతే టూరింగ్ లైఫ్ మెథడ్ లోకి దిగాడు. ఇప్పటికి ఇంటి మొఖం చూసి ఎనిమిదేళ్ళయింది. చాలా స్ట్రిక్ట్ గా షెడ్యూల్డ్ టూర్ అమలు చేస్తున్నాడు"

 Previous Page Next Page