Previous Page Next Page 
శతఘ్ని పేజి 12

 

    జవాబు చెప్పలేదు సౌందర్య.
    
    ఆడపిల్లలు సైతం పదే పదే చూడాలనిపించే అందం ఆమెది
    
    "మాటాడవ్....."
    
    "ఏమిటి?"
    
    "జరిగిందిచూశావుగా...." కావాలని ప్రసక్తిని పొడిగించింది నీలిమ "పాపం అక్కడ లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళని సరిగా పట్టించుకునే నాధుడే లేకపోయాడు"
    
    "వాళ్ళకి కూలిడబ్బులు గిట్టే వుంటాయిగా"
    
    "అందరూ అలా డబ్బులకోసం ఊరేగింపుకి వచ్చారంటావా"
    
    "కాక....సిన్సియర్ గా బయలుదేరావంటావా...."
    
    "మొత్తానికి వాళ్ళని చూస్తే జాలనిపించడంలేదూ" క్షణమాగి అంది "పైగా యిన్ని దశాబ్దాల తర్వాత సీతారామ రాజుకోసం ఈ ఉద్యమం....."
    
    "సమస్యకోపేరు కావాలి నీలూ...... అదిదొరికితే చాలు, ఈ దేశంలో రాజకీయనాయకులు ఎంత దూరమైనా సాగిపోగలరు. ఏ చరిత్ర గోతులనైనా తవ్వి శవాలకు సైతం ప్రశాంతి లేకుండా చేయగలరు. పేరు పెట్టుకునే ప్రయత్నంలో అసలు పేరు మరిపించే అరాచకం...... దాని పేరే రాజకీయం....." సౌందర్య యిందాకటి సంఘటనతో ఎంతరియాక్టయ్యిందో అర్దమైపోయింది.
    
    "లేకపోతే దేశంలో యిన్ని సమస్యలుండగా ఎప్పుడో ఆత్మబలిదానంతో ప్రాణాలుకోల్పోయిన మహానుభావుడి పేరుని యింతకాలానికిలా రచ్చ కీడ్చడమేమిటి? ఆ పేరు మీద ఉద్యమం ప్రారంభించడమేమిటి?"
    
    పి.జి.స్టూడెంటుగా మనుషులమనస్తత్వాల్నేకాక ఒకప్పటి స్వాతంత్ర్యసమరయోధుల వ్యక్తిత్వాలు మొదలుకుని యిప్పటి స్వార్ధపూరిత రాజకీయ వాదులగురించీ అద్బుతంగా అంచనా వేసే సౌందర్యనిజానికి తన పరిధిలో ఇలా ఆలోచించాల్సిన ఆగత్యం లేదు. కోట్ల ఆస్తి, అందం, అంతకుమించిన మేధస్సు ఆమెను సంతృప్తిపరచకుండా ఒక్కోమారు ఎంతటి అంతర్మధనానికి గురిచేసేదీ నీలిమకి తెలుసు.
    
    "మరోగాంధీ పుడితే తప్ప ఈ దేశం బాగుపడదు"
    
    "పుట్టడు" టక్కున అంది సౌందర్య" ఒకవేళ పుట్టిన ఈ జాతి కోసమా యింతశ్రమపడాలి అనుకుంటూగుండెలు బాదుకునిపోతాడు."
    
    నవ్వేసింది నీలిమ. సౌందర్యమాటలు ఆమెలాగేచాలా అందంగా వినిపిస్తుంటాయి.
    
    "ఒకవేళ ఏ అపరాత్రి వేళనో సమాధి నుంచిలేస్తే....."
    
    "ఛాన్సు లేదు"
    
    "అదేం"
    
    "ఎక్కడో చదివాను"
    
    "ఏమిటి?"
    
    "భాక్రానంగల్ నాగార్జున సాగర్ డామ్స్ నికల్తీ సిమెంట్ తో కట్టారేమోకాని మహాత్ముడిసమాధిని మాత్రం నిఖార్సయిన సిమెంటుతో కాంక్రీటు చేసి వదిలిపెట్టారని కాబట్టే యిక లేచే అవకాశంలేదని"
    
    ఆ తర్వాత నీలిమ చాలా సేపటిదాకా నిశ్శబ్దంగా వుండిపోయింది.
    
    కారు విద్యానగర్ దాటుతుండగా అంది సౌందర్య "ఏమిటి..... ఇంత సేపూ నన్నువాగించి హఠాత్తుగా నోరు మూసుకున్నావేం?"
    
    "సీరియస్ గా ఆలోచిస్తున్నాను"
    
    "ఏమిటి?"
    
    "నిన్నుకట్టుకోబోయే మనిషి గురించి"
    
    "దారుణం"
    
    "అదేం?"
    
    "పెళ్ళయిన నువ్వు ఆలోచించాల్సింది ఇప్పటికే నువ్వుకట్టుకున్న మీ ఆయనగురించి నేను కట్టుకోబోయే మగాడి గురించి అయితే అదీ మిత్రద్రోహం అవుతుంది"
    
    పగలబడి నవ్వేసింది నీలిమ. సౌందర్యకున్న ఒకే ఒక్క స్నేహితురాలైన నీలిమ యూనివర్శిటీలో అడుగుపెట్టేసరికే ఓ పిల్లాడికి తల్లి.
    
    "నీతో మాట్లాడలేం మహాలక్ష్మీ"
    
    "నాకు అనుమానమే"
    
    "దేని విషయంలో?"
    
    "మీ ఆయనతోనైనా నువ్వు సరిగా మాట్లాడగలవా అని"
    
    "ఆయన చాలా మంచివాడు"
    
    "అది నీ దురదృష్టమేమో"
    
    "మంచి భర్త దొరకడం దురదృష్టమెలా అవుతుందే"
    
    "అవును నీలూ..... సమస్యల్లేని దాంపత్యం ఆడపిల్ల ఎదుగుదలని ఆపేస్తుందంటుంది మనస్తత్వ శాస్త్రం. ప్రస్తుతం నువ్వా సమస్యలో ఇరుక్కున్నావ్."
    
    "నీపెళ్ళయ్యేక మళ్ళీ అడుగుతాను"
    
    "ఏమిటి"
    
    "నీ ఎదుగుదల సంగతి"
    
    మృదువుగా నవ్వింది సౌందర్య" బహుశా యిప్పుడప్పుడే నీ కోరికనెరవేరదు నీలూ"
    
    "చాలామంది వెంటపడుతున్నారుగా"
    
    "వెంటనేవాడుకాదు, నేను కోరుకునేది వెంట నడిచేవాడు"
    
    "నీకీజన్మలో పెళ్ళికాదు"
    
    "పాతస్టేట్ మెంటేగా"
    
    కారాగింది సౌందర్య కాలేజీ సమీపించడంతో.....దిగుతూ న్యూస్ పేపర్ తీసుకోబోయిన నీలిమతో అంది సౌందర్య"ఈ పేపరు నా దగ్గరే వుండనీయ్!"
    
    కావాలంటే న్యూస్ పేపర్ సంస్థనే కొనేయగల సౌందర్యయిలా ఆసక్తిని ప్రదర్శిస్తుంటే ఆశ్చర్యంగా చూసింది నీలిమ "ఏమిటి విశేషం?"
    
    "రాష్ట్రముఖ్యమంత్రి మీద అవాకులూ చెవాకులూ రాసిన యీ త్యాగి గురించి కాస్త స్టడీచేయాలనివుంది."
    
    "బాగారాసేడు కదూ?"
    
    "బాగారాయించారనుకుంటున్నాను"
    
    విస్మయంగా చూసింది నీలిమ.
    
    "అవును నీలూ వైరస్ లా విస్తరించిన రాష్ట్ర మంత్రివర్గం అంటూ మంత్రి మండలి మొదలకుని సందర్భంతో పనిలేకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితం గురించి రాసిన ఈ వ్యక్తిధైర్యవంతుడేమోకాని నిజాయితీపరుడుకాడు."
    
    "ఎందుకలా అనుకుంటున్నావు"
    
    ఈ రోజేకాదు చాలాసార్లు పత్రికల్లో రాయబడిన ఆర్టికల్స్ చదివి రాసిన వ్యక్తిసైకాలజీ గురించి మాట్లాడే అలవాటున్న సౌందర్య ఇప్పుడూ అలాంటి అనుమానాన్ని ప్రకటించడమేగాక యిక్కడ కాస్తలోతుగా వెళ్ళాలనుకోవడం నీలిమకి నచ్చలేదు.
    
    "ప్రతిజర్నలిస్టు నీ అనుమానించడం నీకు అలవాటైపోయింది."
    
    "లేదు నీలూ..... ఇందాక చూసిన ఉద్యమానికి యిప్పుడీ ఆర్టికల్స్ ని సమన్వయపరచుకుని ఆలోచిస్తే త్యాగి అనబడే ఈ వ్యక్తి తెలివైన అవకాశవాదిలా అనిపిస్తున్నాడు."
    
    "నీమొహం"
    
    "నిరూపిస్తానునీలూ నా నమ్మకంసరైనదే అని నీకు తెలియచెప్పడం మాత్రమే కాదు జర్నలిజమన్నది ఎంత పవిత్రమైన ప్రొఫెషనో అర్ధమయ్యేట్టు చేస్తాను" ఓ ఛాలెంజ్ లా అంది సౌందర్య.
    
    ఇంతదూరం ఎందుకు ఆలోచిస్తున్నదీ అర్ధంకాని నీలిమ విస్మయంగా చూస్తుండగానే సౌందర్యక్లాసు రూంవేపు వెళ్ళిపోయింది.    
    
                                                                      * * *
    
    "దారుణం" తన చాంబర్ లో అసహనంగా పచార్లు చేస్తున్న ముఖ్యమంత్రి రాజారాం అన్నాడు.

 Previous Page Next Page