Previous Page Next Page 
శతఘ్ని పేజి 11

 

    "ఇది ఘోరం మహాజనులారా "డిసిపి చర్య చట్టబద్దమైనదిగా అనిపించినా అంగీకరించడం తన నైజం కాదన్నట్టుగావు కేకలు పెట్టాడు బ్రహ్మాజీ" ఘోరాతి ఘోరం అని మనవి చేస్తున్నాను. పోలీసులు కిరాయి గూండాళ్ళా వ్యవహరించడం, నా నియోజకవర్గపు పేదప్రజల్ని అమానుషంగా హింసించడాన్నిగట్టిగా ఖండిస్తున్నాను. నేనో అరక్షణం ఆలస్యమైతే యిక్కడ కాల్పులు జరపడానికి వెనుకాడేవారు కాదని తీర్మానిస్తున్నాను...."
    
    లారీలోనుంచి చెంగున బయటికి దూకిన అప్పారావు ఒక్క అంగలో బ్రహ్మాజీని చేరుకున్నాడు "కాల్పులేతప్పనిసరైతే ఓ నియోజకవర్గంమనుషులుగా ఛాతీల్ని ఎదురొడ్డుతాం..."
    
    "వీల్లేదు......ఆస్థితి వస్తే ముందునేను ఆహుతికావడానికి సిద్దం" నొక్కిపలికాడు బ్రహ్మాజీ.....    

 

    "సోదరులారా, జరిగిన దానికి చింతిస్తున్న మీ నాయకుడిగా ప్రభుత్వయంత్రాంగాన్ని నిలదీస్తున్నాను. ఆ గాయపడ్డ నా ప్రజలకి ఒకొక్కరికి పదివేలరూపాయల నష్టపరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను"
    
    "వద్దు" అరిచాడు అప్పారావు అదేస్థాయిలో...

 

    "పోనీ, రేటు ఇంకో వెయ్యి పెంచుదాం...." నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు బ్రహ్మాజీ.
    
    "మాకు కావల్సింది డబ్బుకాదు-" అప్పారావు ప్రక్కననిలబడ్డ మరోఖద్దరు చొక్కాగట్టిగా కేక పెట్టాడు.    

 

    "ఇలాగాయపరిచిన పోలీసుఅధికారిపై తక్షణ చర్యలు తీసుకోమని ప్రభుత్వం పైఒత్తిడి తీసుకొస్తాను"
    
    "అదికూడా వద్దు"
    
    మరేంకావాలో బ్రహ్మాజీకి తెలుసు. అయినా తెలియనట్టు అభినయిస్తూనే అన్నాడు" ఇంకేం కావాలి. మిమ్మల్ని దారుణంగా దెబ్బతీసిన పోలీసుల్ని సైతం క్షమించగల ఔదార్యాన్ని ప్రకటించగలుగుతున్న సోదరులారా.....ఏది కావాలి...నా ప్రాణాలా....."
    
    "క్షమార్పణలు...." జనం కేకలు పెట్టారు.
    
    "ఏ విషయంలో? ఎవరు చెప్పాలి?"
    
    "రూథర్ ఫర్డ్ వంశం"
    
    "పాపం అదేం చేసింది."    

 

    "మాసీతారామరాజుని కాల్చిచంపింది"
    
    "అవును...." మనసు ద్రవించినట్టుచూశాడు "మహానుభావుడు......కిరాతకంగా చంపబడ్డాడు...."
    
    "ఇదిదారుణం. ఒప్పుకుంటున్నాను"    

 

    "మేందాన్ని ఖండిస్తున్నాం"
    
    "తప్పులేదు"
    
    "లేనపుడు చనిపోయిన రూథర్ ఫర్డ్ చేత క్షమార్పణ చెప్పించండి"
    
    "అవును...చెప్పించి తీరాలి"
    
   బృందగానంలా అప్పారావుతో పాటు మరో ఏభై మంది పొలికేకలు ప్రారంభించారు.....ఆవేశంతో గుండెలు బాదుకుంటున్నారు.
    
    "మీరు మాటాడాలి..." బ్రహ్మాజీని నిలదీశారు.
    
    "మీరుహామీ యివ్వనిదే మేం యిక్కడి నుంచికదలం..."
    
    "మాప్రాణాలు పోయినా గానిమేం పట్టువదలం...."
    
    "సీతారామ్రాజు అమర్ హై"
    
    "బ్రిటిష్ జులుం...నశించాలి"
    
 "ఓహోహో" చేతులుజోడించాడు బ్రహ్మాజీ" ఏం దేశభక్తి......ఎంతటి త్యాగనిరతి.....మహాజనులారా.....పులకించిపోతున్నాను....ఎప్పుడో గతించిన మహోన్నతుడు, అసహాయశూరుడు, ఈ దేశంలో స్వేచ్చా వసంతమారుతం వినిపించాలనికంకణం కట్టుకుని మూడేళ్ళపాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరోదాత్తుడు మన్య ప్రాంతవాసులుజీవితాల్ని చక్కదిద్దాలని విప్లవ శంఖం పూరించి సర్వతోముఖమైన కృషితో ఆత్మార్పణకి సిద్దపడినవాడూ అయిన ఓ ప్రజలమనిషికోసం మీరిలా పోరాడటం నాకెంతో అందానివ్వడమేగాక పరవశాన్ని కలగచేస్తుందని మనవి చేసుకుంటూ..." క్షణం ఆగేడు దేభ్యంమొహం వేసుకుని నిలబడ్డ అప్పారావుకి నినాదం చేసే అవకాశమిస్తూ.....అయినా బ్రహ్మాజీ చెప్పిందేమిటో సరిగా అర్ధం కాని అప్పారావు వెంటనే రెస్పాండ్ కాలేక పోయాడు...
    
    బ్రహ్మాజీకి ఒళ్ళు మండిపోయిందేమో ఉక్రోషంగా చూస్తూ తన ఉపన్యాసంలో అది స్పష్టంగానే వ్యక్తం చేశాడు.....
    
    "అయితే మహాజనురాలా.....ధైర్యసాహస పరాక్ర విక్రముడైన సీతారామరాజు మరణంయింత కాలానికి మీ కళ్ళు తెరిపించి మీలో యీపోరాటపటిమని కలిగించినందుకు ఆనందిస్తూ మీ కోర్కె సరైనదే నని భావిస్తూ వెంటనే ప్రభుత్వం పై ఒత్తిడితీసుకురానివాడు నగరంలోనేకాక రాష్ట్ర స్థాయిలో యీ ఉద్యమం ఉధృతమయ్యే అవకాశముందని భావిస్తున్నాను.....వెంటనే నా నియోజకవర్గంలోని మురికివాడలకి సీతారామరాజుపేటలుగా పేర్లను మార్చి అలా నా భక్తినీప్రకటించుకుంటున్నాను...."
    
    ఇదికొంత అర్ధమైందేమో-అప్పారావు ఆనందంగా చప్పట్లుకొట్టగా అతని అనుయాయులూ అనుసరించారు.
    
    "అలాచప్పట్లతో మనం విశ్రమించలేం మహాజనులారా....మన ముందున్నయీ భయంకర సమస్యని యింకా గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలని నేనుమనవి చేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్ రాజ్యాంగ యంత్రాగాన్ని స్తంభింపచేసిన సీతారామరాజు అంతటివాళ్ళుగా కావాలని ఆకాంక్షిస్తూ నేను యీరోజే రాష్ట్ర ప్రభుత్వంతో యీ విషయం మాట్లాడి ఐక్యరాజ్యసమితిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి ఆ తెల్లవాడ్ని ఈ మన్యాల్లో చెప్పుల్లేకుండా నడిపించి అతడి సమాధి దగ్గర క్షమార్పణలు చెప్పిస్తానాని హామీ ఇస్తున్నాను. అంతవరకూ నేనూ నిద్రపోనని మాటిస్తూ మీరు ఈ రోజుకి విశ్రమించాలని కోరుతున్నాను"
    
    బ్రహ్మాజీ కారెక్కాడు వీరావేశంతో.....
    
    కొన్నిక్షణాల క్రితం దాకా కనిపించిన ఊరేగింపు లేదక్కడ.....వచ్చిన పనైనట్టు అప్పారావు తన అనుచరుల్తో వెళ్ళిపోతుంటే అంతదాకా స్తంభించిపోయిన ట్రాపిక్ లో మళ్ళీ చైతన్యం పుంజుకుంది.
    
    ----
    
    "ఇంక చదివింది చాలు......కారుపోనియ్..."
    
    డ్రైవింగ్ సీటులో కూచుని ఇంగ్లీష్ డెయిలీ చదువుతున్న సౌందర్య పేపర్ని పక్కనపడేసింది స్నేహితురాలి హెచ్చరికతో.
    
    నిజమే...రోడ్డుమీద యిందాకటి జనంలేరు. మారుతినిముందుకు పోనిచ్చింది సౌందర్య.
    
    కారుయూనివర్శిటీ వేపు దూసుకుపోతూంది "అరగంట ఎండలో వుండేసరికి కందిపోయావు సౌందర్యా"

 Previous Page Next Page