చాలా విషయాల్లో బేలెన్స్ డ్ గా వుండే ముఖ్యమంత్రి ఇప్పుడింతగా రియాక్టవడం అతని మిత్రులకు నచ్చలేదు.
అతడికి అభిముఖంగా కాక ఆ ప్రక్కనే కూర్చున్న ప్రముఖపారిశ్రామికవేత్త, ఎక్సైజ్ కాంట్రాక్టరూ అయిన విమలానంద్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు.
ఇలా విడిచిపెడితే మతిభ్రమించే ప్రమాదముందనిపించడంతో నెమ్మదిగా.
అన్నాడు..... "నా అంచనా ప్రకారం ఇది నా ప్రత్యర్ధి ముకుందంపన్నాగంలా అనిపిస్తుంది."
"అవును" ఇన్ఫర్మేషన్ మినిష్టర్ వత్తాసు పలికాడు "లేకపోతే ఈ గొడవంతా ఏమిటి?"
అసలు గొడవేమిటి తెలీని అబ్కారీ మంత్రి టక్కున అన్నాడు తను మౌనంగా వుండడం బాగోదన్నట్టుగా "ఆవ్..... నేను బీగప్పుడే చెప్పిన...... జర సోంచాయించి అడుగెయ్యాలని...... గిప్పుడిలగైనది"
"అలా అని నేను వూరుకోను" పైకి లేచాడు చీఫ్ మినిస్టర్.
"అగో....." మంత్రి వారిస్తున్నట్టుగా అన్నాడు "నేను వూకోమంటున్నానే"
"నేనుముందే వాడి సంగతి చూసుకోవాల్సింది"
"మనకి సమఝయిందిప్పుడే గద...... ఆలు బారాత్ తీసిండ్రు...... చౌరస్తాతాన పోలీసులు గొట్టిండ్రు..... జరుసపు బ్రహ్మాజీ"
"నేనుమాట్లాడుతున్నది బ్రహ్మాజీ గురించి కాదు"
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
ఇంతసేపూ అక్కడున్న వ్యక్తులంతా అనుకుంటున్నది ఆ విషయం గురించే.
ఆ తర్వాత రాజారాం గారి నోటి నుంచి బండబూతులు దొర్లాయి "వాడికిలా రాయటానికి ఎన్ని గుండెలుండాలి....."
"ఆవ్" తలలాడించడానికి సిద్దంగా వున్న మిగతా మిత్రులకేసి చూశాడు అబ్కారీ మంత్రి.
"నేన్గదేఅనుకుంటున్నా......."
"నాగురించి యింత పచ్చిగరాస్తాడా?"
"ఆవ్....."
"నాతోపెట్టుకుంటాడా!"
"ఆవ్......"
"నేను లోఫర్ నా...."
"ఆవ్" అసంకల్పితంగా నోరుజారేడు అబ్కారీ శాఖామాత్యులు మల్లేశు.
"మల్లేశూ....." ముఖ్యమంత్రిగారికేకతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది. తొట్రుపడిపోయిన మల్లేశు రాజారాంగారి చేతులు పట్టుకున్నాడు" నువ్ చెప్పన్న......పొద్దుటి కల్లా ఆన్ని చూస్కుంటా"
"ఎవర్ని?"
"నువ్వు చెప్పినోడ్ని."
"నేను చెప్పిందెవరి గురించి."
తెల్లమొహం వేసుకుని నిలబడిపోయాడు మల్లేశు"అద్గదన్నా అనేటోళ్ళు దునియా అంతకి ......మలిగింతదానికే పరేశానైతే....ఏరేటోల్లంగద సూసెటోళ్ళకి బాగుండదు గద మల్ల."
"మూర్తిగారూ" చీఫ్ సెక్రటరీని చూస్తూ అడిగాడు రాజారాం" అబ్జర్వర్ పత్రిక మీరు చరివారా?"
"యస్సర్....."
"నాగురించి రాసింది చదివారా?"
"యస్సర్!"
"కానినేను చదవలే......చదివించుకున్న..... బ్లాక్ మార్కెటీర్ ని గదా..... నాకు యింగ్లీషు రాదు. అందుకని మా పి.ఏ. చేత పదిసార్లయినా చదివించుకున్న..... చెప్పండి....... ఈ పత్రిక సర్క్యులేషన్ యెంత....."
"ఒకేసారి దేశంలో పది పట్టణాలనుంచి రిలీజవుతుంది. సుమారు ముప్పైలక్షలు....."
"మన రాష్ట్రంలో"
"మూడు లక్షలు...."
"గింతేగదా....."
"మల్లేశూ" అరిచాడు ముఖ్యమంత్రి......మల్లేశు నోరుమూతబడి పోయింది."మూర్తిగారూ ..... యీ పత్రికచదివేది - అంటే మన రాష్ట్రంలో మూడులక్షలంటారా....." "ముఫ్ఫైలక్షల దాకా వుంటారు"
ఉలిక్కిపడ్డ మల్లేశు చీఫ్ సెక్రటరీ లెక్క కరెక్ట్ చేయబోయాడు అప్పటికే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. "సామాన్యంగా ఒక్కో దినపత్రికని కొన్నవాళ్ళు ఒక్కరేచదవరు- ఆ ఫ్యామిలీ మెంబర్సుంటారు స్నేహితులుంటారు.....అంటే సర్వే ప్రకారం సగటున ఒక్కో పేపరుని పదిమంది చదువుతుంటారు....... అలా....."
"దేశంలో యీ యింగ్లీషు పత్రిక అమ్ముడయ్యేముఫ్ఫై లక్షల సంఖ్యలో మనరాష్ట్రంలోనే ముఫ్ఫైలక్షలు దాకా చదువుతారంటారు."
"అవును"
"పుల్లారావ్....." ఇన్ ఫర్మేషన్ మినిష్టర్ కేసి చూశాడు ముఖ్యమంత్రి" వెంటనే మనప్రభుత్వం అడ్వర్టయిజ్ మెంట్లు యీ పత్రిక్కి యివ్వకుండా ఆపెయ్..... రేపు ప్రజలమధ్య కెళ్ళేపత్రికల వ్యాన్స్ ని తగలబెట్టించు....."
"సర్....." జోక్యం చేసుకున్నాడు చీఫ్ సెక్రటరీ" ఒక్కసారి కే మీరింతగా రియాక్టయితే బాగోదేమో...."
"రేపు మళ్ళీ రాస్తాడు."
"అవును....... ప్రభుత్వం......ముఖ్యంగా ముఖ్యమంత్రినిజాన్ని తట్టుకోలేకయిలా కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటున్నాడని దేశస్థాయిలో యీ గొడవలగురించి ప్రజలకి తెలియచెబుతాడు మరోసారి."
"అంటే మనం చేతులుకట్టుక్కూచోవాల పోనీ......" ఏదో ఆలోచనమెరిసినట్టయింది" పత్రిక మూయించలేమా!"
"అదిచట్టవిరుద్ధం......"
"నాగురించి అలా రాసినందుకు పరువు నష్టం దావా వేస్తే......"
"తనురాసింది నిరూపించే ఆధారాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తాడు."
రాజారాంగుండె దడదడలాడింది.
ఒకవేళతను అప్పుడెప్పుడో చేసిన బ్లాక్ మార్కెటింగ్ వివరాల్ని పోలీసు నిర్భంధాలకి చెందిన ఎఫ్.ఐ.ఆర్.కాపీల్ని పత్రికలో పబ్లిష్ చేస్తేపేరు ఏం కావాలి.
"అయితే ఇప్పట్లో మనమేమీ చెయ్యలేం.....ఇంతటితో ఈ మీటింగ్ ముగిస్తున్నాను......."
అర్ధంతరంగా ముగిసిపోయిన సమావేశంనుంచి అందరూ వెళ్ళిపోయాక ముఖ్యమంత్రితో మిగిలింది అబ్కారీ శాఖమంత్రి మల్లేశు.
"మల్లేశూ......" సాలోచనగా అన్నాడు ముఖ్యమంత్రి రాజారాం "ఒక్క పక్క మనప్రత్యర్ధులు బలాన్ని పుంజుకోవాలని ప్రయత్నిస్తుంటే మరో పక్క పత్రికలు మన గురించి రాయటం మొదలు పెట్టాయి"
"చెప్పన్నా.......గిట్ల ఉకోటాన్ని మనం బేవకూఫ్ లంగాదు నువ్ జెర్రంతయిషారాయిస్తేలే....... కాల్చేతుల్ తీయించేస్తా......"
"అదికాదు మల్లేశూ......"
రాజకీయాల్లో చేరకముందు సారా కాంట్రాక్టరుగా గూండా నాయకుడిగా ఎన్నిహత్యలుచేసి సునాయాసంగా తప్పించుకున్నది, యిప్పటికి మల్లేశుకి గూండాలతో ఎలాంటి సంబంధం బాంధవ్యాలున్నదీ ముఖ్యమంత్రికి తెలుసు.
"నువ్వు నాకు అంతరంగికుడివి ....... సరాసరి వాడి కథ ముగించడం కాదు...... ముందు కాస్తబుజ్జగించి దారిలోకి రప్పించే ప్రయత్నంచేయించడం ముఖ్యం. అంటే డబ్బుతో కొనేసెయ్ ....... వినకపోతే ఆ తర్వాత నీ యిష్ట ప్రకారం చెయ్. కాని ఏదైనా రహస్యంగా జరగాలి"
"నీకు తెల్వదన్నా........గిట్ల కులాటీల్ గొట్టేటోళ్ళని సీదా సెయ్యాలంటే డబ్బు మూటల్ గాదు......."
"నా మాట విను"
"గట్టనే" వెళ్ళిపోయాడు మల్లేశు విసుగ్గా.
ఇంతచిన్న విషయానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రిస్థానంలో వున్న వ్యక్తి యిలా కలవరపడటం మల్లేశుకి నచ్చలేదు. అసలు రాజారాం ఎందుకిలాంటిఉపదేశం చేసిందీ అర్ధం కాలేదు.
అప్పటికే ఇంటెలిజేన్సీ యస్సీ త్యాగి గురించి అందించిన వివరాలు నిజంగానే కంగారు పెట్టాయిరా రాజారాంని.
"అయిదేళ్ళక్రితం ఆంధ్రా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ గోల్డ్ మెడలిస్టు అయిన త్యాగి ఆ తర్వాత ప్రొఫెసర్ల రాజకీయాలకి బలై రీసెర్చి మధ్యలోనే ఆపి డాక్టరేట్ సాధించలేకపోయాడు. ఆ తర్వాత స్నేహితుల అండతో స్టేట్సు వెళ్ళి అక్కడ న్యూయార్క్ టైమ్స్ లో చేరి అతి స్వల్ప కాలంలోనే సమర్ధుడైన జర్నలిస్ట్ గా చాలా ఖ్యాతిని పొందాడు. అక్కడా యిమడలేక రెండు నెలల క్రితమే ఇండియా వచ్చి అబ్జర్వ్ లో చేరాడు. వెనకా ముందూ ఎవరూ లేరు....... ఒంటరివాడు..... మొండితనం, సాహసంతో ఎవర్నీ లక్ష్యం చేయనివాడు.....".
సరిగ్గా చివరి వాక్యమే రాజారాంని అమితంగా ఆందోళన పరిచింది.
రాజకీయదక్షతగల రాజారాంతనకు ఎదురునిలిచిన కోటీశ్వరుల్ని డబ్బుతో కొన్నాడు. తననుమించిన రాజకీయదురంథరులనిపించుకున్న వాళ్ళని మరోలా అదుపు చేయగలిగాడు.
కానిత్యాగి ఒంటరివాడు......పైగా మేధావి- అంతకు మించిమొండివాడు......
మొండివాడు రాజు కన్నా బలవంతుడైతే వెనకా ముందూ ఎవరూలేని మొండివాడు మృత్యువు కన్నాశక్తివంతుడు ......
అందుకే మరో ట్రేక్ లో అతడ్నిదారిలోకి రప్పించాలనుకున్నాడు.
దురదృష్టవశాత్తు ఆ పనిని మల్లేశునికి అప్పగించాడు.
మల్లేశుని సమర్దుడే కాని చూసిరమ్మంటే కాల్చివచ్చేరకం.
అదే...... తొందరపాటులో రాజారాం ఆలోచించనిది........
* * *
"హల్లో!"