Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 11


    "జాగ్రత్త పరధ్యాసలో వుండి డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లవుతాయి. సునంద కిలకిలమని నవ్వింది. "నా చేతిలో స్టీరింగ్ వుండగా యాక్సిడెంట్ అన్న ప్రశ్నే లేదు."
    ఇంచుమించు సందు చివరకు రాబోతున్నారు.
    "వొస్తా" అన్నది సునంద. కారు ముందుకు దూకింది.
    
                              *    *    *
    
    ఆ సాయంత్రం ఫోటో స్టూడియో నుండి చాలా హడావుడిగా వొచ్చాడు చంద్రం.
    "మీ మరదలుపిల్లేదీ?" అన్నాడు.
    "పెరట్లో, పచార్లుచేస్తోందేమో, లేకపోతే యింట్లో బోర్ కొట్టి అలా సందుచివరిదాకా వెళ్ళి వుండవచ్చు. ఏమిటంత హడావుడిగా వున్నావు?"
    "సారీ గురూ! నిన్ను చూస్తే జాలేస్తోంది."
    "ఏం?"
    "నిన్ను వొంటరిగా విడిచి వెళ్ళిపోతున్నాను కాబట్టి."
    "అదేమిటి?"
    "ఈ ఊళ్ళో టుబాకో మర్చంట్సంతా కలిసి నెలరోజులు కాశ్మీర్ ట్రిప్ వేసుకున్నారు. ఈ టూర్ లో వాళ్ళ విందులూ, వినోదాలూ, ఎడ్వెంచర్సూ-అన్నీ ఫోటోలు తియ్యటానికి మంచి ఫోటో గ్రాఫర్ కావాలట మా ప్రొప్రయిటర్నడిగితే - ఆయనకు నా మీదవున్న సదభిప్రాయం చేత నన్ను ప్రపోజ్ చేశాడు. అంతేకాదు. ఓ గంటలో వాళ్ళంతా బయల్దేరబోతున్నారు. నేనర్జంటుగా వెళ్ళి జాయినవ్వాలి అంతా బాగానే వుంది కానీ నిన్నీ పరిస్థితుల్లో విడిచివెళ్ళడమే బాధగా వుంది."
    "ఏ పరిస్థితుల్లో?"
    "ముక్కూ మొహం తెలియని మరదలుపిల్లని దగ్గర దిగవిడచి వెళ్ళటం. పోలీసు వ్యవహారం. సమయానికి నేను కూడా వుండను. చిక్కుల్లో పడతావని చూస్తున్నా."
    "ఫర్వాలేదు. ఎలాంటి చిక్కులోచ్చినా తట్టుకోగల ధైర్యముంది?"
    "ఇక్కడ ధైర్యం కాదు బ్రదర్ ప్రధానం. నిగ్రహం."
    "అబ్బా! అది మనదగ్గిర చాలావుంది."
    "చూస్తాగా" అని మంచంమీద చిన్న సూట్ కేస్ తెరచి నాలుగు బట్టలు కుక్కుకో సాగాడు. అంతలో అక్కడికి చక్కర్లు కట్టిపెట్టి  ప్రియంవద వచ్చింది.
    "ఏమండోయ్ ఎక్కడికో ప్రయాణమవుతున్నట్లున్నారే" అంది.
    "అవునండీ మరదలుపిల్లగారూ అనుకోకుండా కాశ్మీర్ ట్రిప్ కి ఛాన్స్ వచ్చింది-ఫోటో గ్రాఫర్ గా. అర్జంట్ గా బయల్దేరి వెళుతున్నాను. కాస్త మావాణ్ణి కనిపెట్టి చూస్తూ వుండండి."
    "ఏం ఫర్వాలేదండీ. మీరు వెళ్ళిరండి నిశ్చింతగా" అన్నదా అమ్మాయి అభయమిస్తోన్నట్టు.
    అతనాశ్చర్యంగా ఆమెవైపు చూశాడు-ఈపిల్ల నిజంగానే సిసింద్రీ అనుకుంటూ.
    
                             *    *    *
    
    రాత్రి పదయింది. మహేష్ టేబుల్ లైటు దగ్గర పెట్టుకుని చాపమీద కూర్చుని శ్రద్దగా ఎనాటమీ రికార్డు చేసుకుంటున్నాడు. ప్రియంవద అక్కడున్న పాత పత్రికలు కాసేపు తిరగేసింది. కొంతసేపు అటూ ఇటూ పచార్లు చేసింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. కాని ఎలా చెప్పాలో తెలియడంలేదు.
    అప్రయత్నంగా ఆమెవైపు చూసి "ఏం నిద్రవస్తోందా?" అనడిగాడు.
    అవునన్నట్లు తలవూపింది.
    "ఆ మంచంమీద పడుకో."
    "మీరు?"
    "ఇద్దరం ఒకమంచం మీద ఎలా పడుకుంటాం? నేను చాపమీదపడుకుంటాను." అన్నాడు కొంచెం కటువుగా.
    "అది కాదండీ. నేను మీ యింటికి వొచ్చి....? మీరే మంచం మీద పడుకోండి నేను చాపమీద పడుకుంటాను."
    "చూడమ్మాయి ఇలాంటి విషయాల్లో తీసుకునే నిర్ణయాలు నాకు వదిలెయ్యి. ఎందుకంటే.....ఎందుకంటే.....నీకంటే నా కెక్కువ తెలుసు కాబట్టి."
    అలాగేనండీ మీరు చెప్పినట్లే చేస్తాను". అంది బుద్దిమంతురాలిలా.
    తర్వాత మంచంమీద పడుకుంది.
    మహేష్ మళ్ళీ రికార్డు గీసుకోవడంలో మునిగిపోయాడు.
    అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఒక బొమ్మ గియ్యటం పూర్తి చేసి డేట్ త్రిప్పుతూ యాదృచ్చికంగా అటుకేసి చూసేసరికి ఆమె యిటువైపు తిరిగి పడుకుని కన్నార్పకుండా తన ముఖంలోకే చూస్తూ వుండటం కనబడింది.
    అతను కొంచెం యిబ్బందికి లోనవుతూ "నిద్రపోకుండా ఎందుకలా కళ్ళు తెరచుకొని చూస్తున్నావు?" అన్నాడు.
    "మిమ్మల్నే" అంది.
    "ఎందుకు?"
    "అంత ఏకాగ్రతతో పనిచేస్తోంటే చూడాలని వుంది."
    "నీకు చూడాలని వుంది. సరే- అలా మొహంలో ముఖంపెట్టి చూస్తోంటే ఎదుటివాళ్ళకు ఎంత ఇన్ కన్వీయన్స్ గా వుంటుందో తెలుసా?"
    "నేను మొహంలో మొహంపెట్టి చూడటం లేదండీ."
    "మరీ?"
    "దూరంగా వుండే చూస్తున్నాను. అలా మొహంలో మొహం పెట్టటం నాకూ యిష్టం వుండదు."
    "అవునా?"
    "అవునండి."
    "సరే"! అంటూ లేచి ఓ పాతదుప్పటి వెదికి తీసి అటు కిటికీకి యిటు గోడమేకు ఆధారంతో యిద్దరికీ మధ్య ఓ కర్టెన్ లా కట్టేశాడు.
    "ఇహ పడుకో" అన్నాడు చాపమీద కూర్చుంటూ.
    "అయ్యో నాకు మనిషి వొంటరితనం తక్కువండీ మొహాలు కనబడక పోతే నిద్రపట్టదండీ" అంది దుప్పటి అవతల్నుంచి ప్రియంవద.
    "ఇదిగో చూడమ్మాయి నువ్విక్కడవున్నది నీక్కావలసిన మనిషిని వెతుక్కునేందుకా లేక నన్ను డిస్టర్బ్ చెయ్యటానికా?"
    "నాకు కావాల్సిన మనిషిని వెతుక్కునేందుకేనండీ."
    "మరైతే నా పనికి అంతరాయం కలిగించకుండా పడుకో."
    "పడుకుంటానండీ".
    తర్వాత ఆమె ఇహ ఏమీ మాట్లాడలేదు.
    ఓ గంటసేపు రికార్డు గీసుకుని లైటు తీసేసి పడుకున్నాడు. అతను చేసే పనుల్లో ఇదొకటే తలనొప్పి. గంటలకు గంటలు రికార్డులు గీసుకుంటూ కూర్చోవడం. అందులో అతనికి బొమ్మలు గియ్యటం సరిగ్గా చేతకాదు. గీస్తూ చెరిపేస్తూ నానా హైరానా పడుతూ వుంటాడు.

 Previous Page Next Page