రిసీవర్ అందుకున్నాడు అసహనంగా "ఎవరది"
"నేను... కృషి..... ఉపాధ్యాయ గ్రాండ్ డాటర్ ని"
ఉన్నట్టుండి చౌదరి మొహం జేవురించింది. ఓ పిల్ల కాకి సరాసరి పులితో మాట్లాడే సాహసం చేస్తుంది. "చెప్పు నాకెందుకు ఫోన్ చేసావ్"
"చాలా టెన్షన్ లో వున్నట్టున్నారు"
చౌదరి పిడికిలి బిగుసుకుంది "ఏ విషయంలో"
"మీ ముందున్న పేపరులో రాయబడింది దాని గురించి"
సన్నగా వినిపించిన కృషి నవ్వు చౌదరి రక్త ప్రసరణ వేగాన్ని పెంచింది. "నువ్వు మాట్లాడుతున్నదెవతోనో తెలుసనుకుంటాను"
"యస్ తెలుసు ఒకప్పుడు పారిశ్రామిక వేత్తతో ఓటమి అంటే భయపడుతూ డబ్బుతో గెలుపును కొనుక్కోగల ఓ సూడో ఇంటిలెక్చువల్ రాజేంద్ర తండ్రితో..."
ఇదో విచిత్రమైన అనుభవం అతడికి...
అత్యున్నత స్థానంలో వున్న బ్యూరో క్రాట్స్ రాజకీయ నాయకులూ సైతం భయపడే తనతో మామూలుగా మాట్లాడ్డం లేదు కృషి. ఆకతాయిగా ఆడుకుంటూంది. "ఇప్పటికీ నేను నీపై గెలుపు సాధించగలను కృషి"
"మీ కృషి చాలదు"
"ఏమిటి నీకంత నమ్మకం"
"హై స్కూలు స్థాయి పరిజ్ఞానం గల మీ అబ్బాయి రాజేంద్రని ఇంతకాలం తెలివితోగాని డబ్బు విరజిమ్మి మొదటి స్థానంలో నిలబెట్టారని నాకు తెలుసు కాబట్టి."
"ఈ రోజూ విరజిమ్మగలను"
"కాని విశ్వనాథ్ లొంగడు"
"అంత పెట్టుబడి పెట్టావా"
"యస్....మీరు ఊహించలేనంత ధర చెల్లించబోతున్నాను"
"అంతకు పది రెట్లు నేనూ చెల్లిస్తాను"
"నేను చెల్లించేది నీ దగ్గర లేనిది..." "నా దగ్గర మాత్రమే వున్నద"న లేదు కృషి.....ఎగతాళిగా నవ్వింది "సో...మీ జెవెఇథమ్లొ తొలిసారి ఓటమిని టేస్ట్ చేయబోతున్నారు....అదీ ఉపాధ్యాయ మనవరాలి మూలంగా"
"నో..." చౌదరి గావుకేకతో ఆ హాలు ప్రతిధ్వనించిపోయింది. "నేనే గెలుస్తాను"
"గావుకేకలతో గెలుపు గురించి మాట్లాడితే చాలదు మిస్టర్ చౌదరి.... మేధస్సంటే గూండాలూ దళారీలతో మెట్లెక్కడం కాదు."
"మిస్ కృషి..."
"ఆయాస పడకండి ఆదివారం నాటి మీ అబ్బాయి ఓటమికి ఈ రోజు నుంచీ ప్రిపేరవ్వండి. అంతవరకు ఆగలేకపోతే అది నిష్టూరం నయమనిపించేలా మీ అబ్బాయిని పోటీ నుంచి తప్పించండి".
"అసంభవం..." ఉక్రోషంగా కంపించిపోతున్నాడు చౌదరి "వాడు నా కొడుకు"
"నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది చౌదరిసాబ్..."
చౌదరికి చురుక్కు మనిపించేట్టు నిగూఢంగా మాట్లాడిన కృషి చివరిగా అంది "అందుకే నా మాట విని రాజేంద్రని పోటీ నుంచి విత్ డ్రా కమ్మనండి. లేదూ అంటే వేలమంది విద్యార్ధుల సమక్షంలో మీ పరపతికి వస్త్రాపహరణం తప్పదు....ఓకే...."
ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు...
అప్పటికే స్వేదంతో తడిసిపోయిన చౌదరి రిసీవరు విరిగేట్టు నేలపైకి విసిరేశాడు.
హఠాత్తు గా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
అంతసేపూ మాట్లాడిందెవరితోనో అందరికీ తెలిసిపోయింది. పైగా ఎంతగా కృషి రెచ్చగొట్టిందీ అన్న విషయమూ బోధపడి పోయింది.
"రంగధాం" గొంతు నాళాలు పగిలేట్టుగా అరిచాడు చౌదరి "నా కొడుకు గెలవాలి..."
"గెలుస్తాడు" ధీమాగా హామీ యిచ్చాడు రంగధాం.
"ఎలా..."
"ఆ విషయం నాకు వదిలిపెట్టండి" ఎలాగో అర్ధం కాలేదు చౌదరికి.
కాని ఆనందు అంటే ఏదన్నా చేయగల రంగధాం పై చాలా గురి వుండటంతో నిశ్శబ్దంగా వుండిపోయాడు.
"రాజేంద్ర..." పైకి లేస్తూ అన్నాడు రంగధాం" యధాప్రకారం ఆదివారం సాయంకాలం 'ఐక్యూ' కాంపిటీషన్ కి నువ్వెళుతున్నావు...నువ్వే గెలుస్తున్నావ్"
* * * *
ఆదివారం సాయంకాలం అయిదున్నర గంటల సమయం...
ఆకాశం మేఘావృతమై వుంది...
అప్పటికే యూనివర్సితీ ఆడిటోరియం విధ్యార్ధులతో నిండిపోయి వుంది.
రాజేంద్ర గెలుపుకి సాక్ష్యంగా వుండాలనుకున్న రెండు వందల మంది విద్యార్ధులు ఓ పక్క సెటిలై ఆసక్తిగా డయాస్ వేపు చూస్తున్నారు.
చాలా అరుదైన పోటీ అది. నిజానికి అది రాజేంద్ర - విశ్వనాథ్ ల మధ్య కాదు. రెండు పెద్ద సంస్థల మద్య ఇద్దరు శక్తివంతులైన కోటీశ్వరుల మధ్య పోరాటం.
ఆ విషయం నగరం నలుమూలలా ప్రాకడంతో కేవలం యూనివర్సితీ విద్యార్ధులే కాక పత్రికా విలేకర్లు కూడా అక్కడికి చేరుకున్నారు.
డయాస్ కి అభిముఖంగా ముందు వరుసలో కూర్చున్న కృషి యిదేమీ పట్టించుకోవడంలేదు. విజయం తమదేనన్న అహంతో ఓ మూల స్నేహితులతో మాట్లాడుతున్న రాజేంద్రని గమనిస్తుంది.
క్విజ్ పోటీ నిర్వాహణకి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించిన సత్యేంద్రబసు అతడి సహాయకురాలితో చర్చిస్తున్నాడేదో.
రిస్ట్ వాచ్ చూసుకుంది కృషి.
అయిదు గంటల నలభై అయిదు నిముషాలు...
ఇంకా మిగిలింది పదిహేను నిముషాలు మాత్రమే.
ఖచ్చితంగా ఆరు గంటలకల్లా పార్టిసిపెంట్స్ యిద్దరూ క్విజ్ మాస్టర్ సమక్షంలో వుండాలి.
ఒక్క నిముషం ఆలస్యం జరిగినా పోటీలో పాల్గొనటానికి అనర్హులైపోతారు.
కొద్దిపాటి అసహనంతో ఆడిటోరియం బయటకి వచ్చి నిలబడింది కృషి.
మిగిలింది పది నిముషాలు మాత్రమే.
విస్సూ జాడలేదు...
ఏమైంది...
కృషి యిక్కడ నిలబడి విస్సు గురించి ఆలోచిస్తున్న సమయానికి ఆటోలో వస్తున్నాడు విస్సు.
ఆటో బర్కత్ పురా చౌరస్తా దాటుతూంది.
యూనివర్సిటీ చేరుకోటానికి ఇంకా పది నిముషాలు కావాలి.
అసలు ముందే వచ్చేవాడు కాని సెంట్రల్ లైబ్రరీలో ఆలస్యమైంది. ఎన్ సైక్లోపిడియాలతో నాలుగు రోజులుగా సాగిస్తున్న కుస్తీ ఓ అరగంట క్రితంగాని పూర్తి కాలేదు.
ఫీవర్ హాస్పిటల్ దాటుతుండగా హఠాత్తుగా ఆగిపోయింది ఆటో.
ఏం జరిగిందీ విశ్సు ఆలోచించే లోగానే ఆటోకి అడ్డంగా వున్న టాక్సీలో నుంచి నలుగురు దృఢకాయులు దిగారు.
మనసేదో కీడు శంకించిన విస్సూకి తనను తాను రక్షించుకునే అవకాశం సైతం లేకపోయింది.
ట్రాఫిక్ మొత్తం దిగ్భ్రాంతిగా చూస్తుండగానే ఆ నలుగురూ విస్సూని బయటకి లాగారు.
ముందొక మెరుపు. మరుక్షణం కత్తి విస్సు పొట్టలో దిగింది.
కెవ్వుమన్న ఆర్తనాదానికి ముందే రక్తం ఫౌంటెన్ లా బయటికి చిమ్మింది.
ఆ క్షణంలో విస్సు చేసిన పొరపాటు వెళ్ళబోతున్న నలుగుర్నీ ప్రతిఘటించాలని ప్రయట్నించటం.
అంతే...
మరోసారి గాలిలోకి లేచిన కత్తి యీ సారి కూడా పొట్టని చీరింది నిర్దాక్షిణ్యంగా.
అ...మ్మా...
సన్నని మూలుగు వెలువడింది విస్సూ నోటి నుంచి.
మరుక్షణం నిస్త్రాణగా రక్తపు మడుగులోకి జారిపోయాడు.
అప్పుడు సమయం అయిదు గంటల ఏభయి రెండు నిముషాలు.
ఆరు గంటలు కావటానికి మిగిలింది మరో నిముషం.
అప్పటికే క్విజ్ మాస్టర్ సత్యేంద్ర బసుతో పాటు రాజేంద్ర కూడా వేదికపై కూర్చుని వున్నారు.
క్విజ్ కాంపిటీషన్ స్పాన్సర్ చేసే కృషి ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మైకు ముందు నిలబడి ఆదేశం కోసం అన్నట్టుగా ముందు వరుసలో కూర్చున్న కృషి వేపు చూశాడు.
ఆమెలో సంచలనం లేదు.
భావరహితంగా...
ఆ రోజు నిన్ను పందానికి పెట్టిన షరతుతో ఆమె అప్పటి నుంచీ సందిగ్ధంలో పడి ఆలోచిస్తూంది.
విశ్సూ గెలిస్తే తను ఓడిపోతుంది....విస్సూ ఓడినా తను చౌదరితో గెలుపు సాధించలేక అదో ఓటమే అవుతుంది...
ఆరు గంటలకి మిగిలింది మరో ముప్పై సెకండ్లు...
విస్సు రాలేదు...
ఇక రాజేంద్ర గెలిచినట్టుగా అనౌన్స్ చేయడమే మిగిలిన కార్యక్రమం...
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ని చూస్తూ సంజ్ఞ చేసింది కృషి.
"డియర్ ఫ్రెండ్స్" చెప్పడం ప్రారంభించాడు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు "పోటీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇద్దరు పార్టిసిపెంట్స్ క్విజ్ మాస్టరు ముందు నిర్ణీత సమయానికి హాజరుకావాలి. కాని ఒక్క రాజేంద్ర మాత్రమే అటెండ్ కావడంతో...."
అతడు చెప్పబోతున్నది యింకా పూర్తికానేలేదు. విద్యార్ధులు విజయోత్సాహంతో రాజేంద్రకి అనుకూలంగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు.
అదిగో సరిగ్గా అప్పుడు వినిపించింది...
"ప్లీజ్...వెయిట్"
ఆ గావు కేకతో అంతా ద్వారం వేపు చూశారు...
శరీరానికి ఓ షాల్ లాంటిది చుట్టుకుని నిలబడి వున్నాడు విస్సు...
కళ్ళలో ఎరుపు జీరలతో తూలిపోతున్న శరీరాన్ని బలంగా కూడగట్టుకుంటూ ఒక్కో అడుగూ వేస్తున్న విస్సు పోటీకి వచ్చినట్టు లేదు...వధ్య శిలవేపు నడుస్తున్న బలిపశువులా కనిపిస్తున్నాడు.
రాజేంద్ర మోహంలో నిశ్చేష్టత...
అప్పటికే ఏం జరిగిందీ తెలుసుకున్న రాజేంద్ర విస్సు యిక రాడూ అనుకున్నాడు. బ్రతికే అవకాశంలేని విస్సు ఒకవేళ బ్రతకాలనుకున్నా వెళ్ళాల్సింది హాస్పిటల్ కి కాని యిక్కడకు కాదు.
కేవలం అతనే స్థితిలో వున్నదీ ఒక్క రాజేంద్రకి మాత్రమే తెలుసు....అందుకే ముందు వరుసలోని లాయరు రంగధాం కేసి చూశాడు.
రంగధాం కంగారు పడలేదు....ఏ క్షణంలో అయినా స్పృహ తప్పే విస్సునే గమనిస్తున్నాడు మృదువుగా నవ్వుతూ...
కళ్ళు మసకలుబారుతుంటే డయాస్ పైకి వచ్చి తన సీటులో కూర్చున్నాడు విస్సు...
"నౌ ఇటీజ్ ఎగ్జాక్ట్ లీ సిక్స్....డయాస్ ని క్విజ్ మాస్టర్ కి హేండోవర్ చేస్తున్నాను." అంటూ సత్యేంద్రబసుకి మైక్ ని అప్పచెప్పి పక్కకి జరిగాడు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్...
సూటిగా అసలు విషయానికి వస్తూ సత్యేంద్రబసు అన్నాడు. "ఐ వెల్ కమ్ మై అదర్ ఫ్రెండ్ మిస్టర్ విశ్వనాథ్ అండ్ ఐ విష్ ఆల్ ధీ బెస్ట్ తు పార్టిసిపెంట్స్ ఆఫ్ ది కాంపిటీషన్ ఇప్పుడు పోటీ నిబంధనలకి సంబంధించిన కాంపిటీషన్ గడువు అరవై నిముషాలు...మొదటి ఏభై నిముషాలు సుమారు ముప్పై ప్రశ్నలు అడగడం జరుగుతుంది ....అంటే చెరో పదిహేను ప్రశ్నలు....ఆలోచించుకోటానికి యివ్వబడే వ్యవధి ముఫ్ఫై సెకండ్లు....ఒక్కో జవాబుకి పది మార్కులు....ఏ వ్యక్తయినా జవాబు చెప్పలేకపోతే అదే ప్రశ్న రెండో పార్టిసిపెంట్ ని అడుగుతాను....అతడూ చెప్పలేనప్పుడు ఆ మార్కులు క్విజ్ మాస్టర్ కి చెందుతాయి." క్షణం ఆగి సాలోచనగా ఆడిటోరియం వేపు చూశాడు. "చివరిగా మిగిలిన పది నిముషాల్ని చెరో అయిదు నిముషాలుగా విభజించి ఒక్కో వ్యక్తినీ వరుసగా పది ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్కో జవాబుకీ కేటాయించబడిన మార్కులు అయిదు...సో మిస్ రీటా..." డయాస్ పై ఓ మూల కూర్చున్న తన అసిస్టెంటు రీటా కేసి చూశాడు సత్యేంద్రబసు...
రీటా స్కోరు రికార్డ్ చేయడానికి ఉద్యుక్తురాలౌతూ స్టాప్ వాచ్ బటన్ ప్రెస్ చేసింది.
"మిస్టర్ రాజేంద్ర...మెదడుని శరీరంలో రక్తాన్ని చల్లబరిచే పదార్ధంగా పొరపాటు పడిన వేదాంతి ఎవరు?"
"అరిస్టాటిల్"
"రైట్.... నౌ ఇట్స్ యువర్ టర్న్ మిస్టర్ విశ్వనాథ్ సైంటిఫిక్ అయిడియాల్ని ప్రయోగాత్మకంగా నిర్ధారిస్తే తప్ప నమ్మకూడదని ప్రపంచానికి తెలియ చెప్పిన తొలి శాస్త్రజ్ఞుడెవరు?"
"ఫ్రాన్సిస్ బేకన్"
"రైట్....నౌ మిస్టర్ రాజేంద్ర....దూరాన్ని నిర్దారించే 'మైలు' అనే పదానికి మూలం ఏమిటి?"
"లాటిన్ భాషలోని మిల్లెపాస్సయ్. అంటే థౌజండ్ పేసెస్"
"వెరీ కరెక్టు..." విస్సుని చూస్తూ అడిగాడు సత్యేంద్రబసు.
"మిస్టర్ విశ్వనాథ్....సముద్రంలో అతి లోతైన ప్రాంతం ఏ సముద్రంలో ఎక్కడ వుంది?"
"పసిఫిక్ మహా సముద్రంలోని యారియానాస్ ట్రెంచ్...అక్కడ లోతు ముఫ్ఫై ఆరువేల నూట అరవై అడుగులు."
"రైట్.....నౌ మిస్టర్ రాజేంద్ర...అన్ని సముద్రాలనీ ఉప్పుగా మార్చితే ఎంత పరిణామం గలదవుతుంది."
"అన్ని ఖండాలనీ నూట ఏభై మీటర్ల దళసరి ఉప్పుతో సమాధిచేయవచ్చుంటూంది సైన్స్..."
"వెరీ కరెక్టు"
విద్యార్ధులు కరతాళ ధ్వనులతో హోరుతో ఆడిటోరియం ప్రతిధ్వనించిపోయింది...
"నౌ మిస్టర్ విశ్వనాథ్....సుమారు ఇరవై నాలుగుఇ సంవత్సరాల పాటు సముద్రంలోని ఓడలకి ఎస్మార్ట్ గా వ్యవహరించిన ఓ డాల్ఫిన్ పేరు ఫెలోరస్ జాన్ చారిత్రాత్మకమైన ఈ డాల్ఫిన్ ఏ ప్రాంతంలో ఉండేదో చెప్పగలరా?"