"దిసీజ్ సృజన్!"
సృజన్ జేబులోంచి కూపన్ పుస్తకం , డబ్బూ తీసి ఆమె కందించాడు.
"పుస్తకం అంతా అమ్మావా.......ఏమయినా మిగిల్చావా? అంటూ పుస్తకం తీసి చుసిందామే.
"అరె! ఇదేమిటి? ఇంకా కూపన్స్ వున్నాయి కదా?" ఆశ్చర్యంగా అడిగింది.
"కొన్నే మిగిలాయ్?"
"ఒక్క పుస్తకం కూడా అమ్మేటంత ఇన్ ఫ్లుయేన్స్ లేదా నీకు?" హేళనగా అడిగింది.
"లేదు"
"ఇన్ ఫాక్ట్ - నీకు ఇంకో పుస్తకం ఇద్దామనుకుంటున్నాను."
"ఒక్కసారి మీ మిగతా ఫ్రెండ్స్ అమ్మిన పుస్తకాలు చూపించకూడదూ?" అడిగాడు సృజన్.
దీప నవ్వేసింది.
"ఎందుకులే! మిగతావారికంటే నువ్వే ఎక్కువ అమ్మావ్."
"అలా దొరికారా" నవ్వుతూ అన్నాడు.
"కూల్ డ్రింక్స్ తెస్తాను......" లేచి లోపలికెళ్ళాబోయిందామె.
"ఆచ్చా! హామ్ జాయేంగే" అంది వనిత.
"ఊ.కె. ---సీయూ ఎగైన్"
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక కూల్ డ్రింక్స్ తెచ్చి అతని ముందుంచింది.
"నీకు"
"జస్ట్ అయ్ హాడ్ ఇట్"
అతను త్రాగుతుండగా బయటి నుంచి "దీపా" అంటూ పిలుపు వినిపించింది.
దీప తలుపు దగ్గర వెళుతూ "ఎవరు?" అనడిగింది.
"నేనే --సంగీతను" అంది ఓ యువతి లోపలికొస్తూ.
"ఓ ! నువ్వా......ఏమిటిలా వచ్చావ్?"
"ఈ పక్కన కమ్యునిటీ హల్లో మా బంధువుల అమ్మాయి మారేజ్ అవుతోంది. ఎలాగూ వచ్చాం కదా ------నీతో కాసేపు టైమ్ స్పెండ్ చేద్దామని వచ్చాను......." అందామె.
"ఐ.సి! సరే ----ఓ పని చేస్తావా? నేనిప్పుడు కొంచెం బిజీగా వున్నాను. వీలయితే సాయింత్రం రాకుడదూ?"
ఆ యువతి ముఖం చిన్నబోయింది.
"సరే వస్తాను" అనేసి వెళ్ళిపోయింది వడివడిగా.
దీప ప్రవర్తన సృజన్ కి ఆశ్చర్యం కలిగించింది.
"ఎవరీమె?" అడిగాడతను.
"మా క్లాస్ మెట్ కానీ -----ఇలాంటి వాళ్ళతో టైమ్ వెస్ట్ చేయటం నాకిష్టం లేక పంపించేశాను."
"కూర్చోమని కూడా అనకుండా పంపించేశావేమిటి?"
దీప ముఖంలో చిరాకు కనిపించింది.
"నీకు తెలీదులే! ఎవరితో ఎలా వుండాలో అలాగే వుండాలి. లేకపోతే నెత్తికెక్కుతారు."
"అంటే?"
"వాళ్ళు చాలా పూర్ ఫామిలీ........! అందుకే డబ్బున్న వాళ్ళతో స్నేహం చేసుకుని ఉపయోగించుకోవాలని వాళ్ళ ప్లాన్! నేను వీళ్ళను దూరంగా వుంచుతానెప్పుడూ."
సృజన్ నివ్వెరపోయాడు.
ఇంత అందమయిన అమ్మాయి మనసులో ఇలాంటి ఆలోచనలా! అంతవరకూ ఆమె మీదున్న గౌరవమూ, అభిమానం అన్నీ కూలిపోయినట్లనిపించింది.
తన స్నేహితుల విషయంలో తానెప్పుడూ ఇలాంటి తేడాలు పాటించలేదు అసలు ఆలోచన రాలేదు.
"నిన్న కొత్త క్యాసెట్ తెచ్చాను, చాలా మంచి ఫిలిం చూద్దామా" అడిగిందామె.
"సారీ! నాకు అర్జెంట్ పని వుంది."
"ఏమిటో ఆది?"
"ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు."
"నువ్వెప్పుడూ ఇంతే! నాకు టైమ్ స్పెండ్ చేయమంటే పారిపోతావ్........ఇంకెవరయినా గాళ్ ఫ్రెండ్స్ వున్నారా నీకు?"
సృజన్ నవ్వాడు . నేను నీ అంత పాస్ట్ కాదులే"
"సిల్లీ మాన్"
సృజన్ బయటకు వచ్చేశాడు.
ఆమెకు కొద్దిపాటి గర్వం ఉందనే అనుకున్నాడిన్నాళ్ళు. కాని ఆమె ఇందాక జరిగిన సంఘటనతో ఆమె మనస్తత్వమే నచ్చటం లేదు.
అందానికీ , మనసుకీ ఎంత వ్యత్యాసం?
తనకూ దీపకూ పెళ్ళి చేయాలన్న ఆలోచనలో వున్నారు ఇరువైపులవాళ్ళు!
ఆమెను పెళ్ళి చేసుకుంటే తామిద్దరికీ ఎలా సరిపోతుంది?
ఖచ్చితంగా ఉత్తర దక్షిణ ధ్రువాల్లా ఉంటాయ్ ఆలోచనావిధానాలు.
తను మానవత్వాన్ని ప్రేమిస్తాడు. మనిషిని గౌరవిస్తాడు, అతని వెనుక వున్న ఆస్తికీ, అంతస్తుకి , హోదాకి ఏ మాత్రం విలువ ఇవ్వడు.
తన గదిలో పడుకుని ఆ రోజంతా ఆమె గురించే ఆలోచిస్తుండిపొయాడతను.
* * * *
శ్రీధర్ తన రూమ్ లో కూర్చున్నాడు.
ఎదురుగా టేబుల్ మీదున్న కాగితాలు పేపర్ వెయిట్ క్రింద గాలికి రెపరెప కొట్టుకుంటున్నాయ్.......
అరగంట నుంచీ అతను అలా నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు మనసంతా బండబారిపోయినట్లుంది.