Previous Page Next Page 
షా పేజి 13

 

    గది బయట ఆఫీస్ లో మిగిలిన కొద్దిమంది స్టాప్ కూడా దిగాలు పడి కూర్చుని ఉన్నారు. ఆచారి పరిస్థితి మరీ దారుణంగా వుంది, పిల్లల చదువు పూర్తయ్యే స్టేజిలో - -----తను మరో ఊద్యోగం వెతుక్కోవాల్సి రావటం విపరీతమయిన భయం కలిగిస్తోంది. రామనాధం సరేసరి --గత నెలరోజుల నుంచీ అతను సరిగ్గా భోజనమే చేయటం లేదు. భార్యా పిల్లలను పుట్టింటికి పంపిచేశాడు.
    ఆ రోజు శ్రీధర్ అందరికీ కబురు చేశాడు. ఉద్యోగంలో ఇంకా వున్న వారికీ, మరో చోట ఉద్యోగాలు వెతుకున్నవారికి. అందరికీ తన నిర్ణయం తెలియజేయదల్చుకున్నాడీ రోజు. అతి దురదృష్టకరమైన నిర్ణయం అందరూ ఏ క్షణానికాక్షణం తమ మీద అశానిపాతంలా పడబోతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్న నిర్ణయం !
    సాయంత్రం నాలుగవుతొండగా అందరూ మీటింగ్ రూమ్ కి చేరుకున్నారు. శ్రీధర్ పాలిపోయిన ముఖంతో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మాట్లాడదలుచుకున్న నాలుగు ముక్కలూ తలవంచుకునే మాట్లాడాడతను!
    "ఫ్రెండ్స్! మనందరం రాకూడదని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది ఇవాళ! ఈ రోజు నుంచీ అందరమూ ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూచుకోవాలి. ఎవరెక్కడ సెటిలవుతారో, ఎంతకాలానికి మళ్ళీ దారిన పడతారో ఎవరికీ తెలియని పరిస్థితి. అయినా అధైర్యపడకుండా ఎవరికాళ్ళ మీద వారు నిలబడటానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నంలో భగవంతుడు మనకి తప్పక సాయపడతాడు.'
    అందరూ టీ తాగారు.
    ఆ తరువాత నిశ్శబ్దంగా బయటికెళ్ళిపోయారు. శ్రీధర్ కూడా బయటికొచ్చి కార్లో కూర్చున్నాడు. కారు తిన్నగా గారేజ్ చేరుకుంది. మెకానిక్ పరుగుతో వచ్చాడు. "కార్ తెచ్చారా సార్?"
    కారు దిగి మౌనంగా ఇగ్నిషియాన్ కీస్ అతని కందించాడు శ్రీధర్. రోడ్ మీద నడుస్తొంటే వింతగా వుంది. ఏరోజూ కారు లేకుండా లేదు. చిన్నప్పటి నుంచీ తనకు సొంతంగా కారు వుండేది. అయినా తనకు సమస్య ఇప్పుడు కారు లేకపోవడం కాదు. ఈపరిస్థితికి తను మానసికంగా ఎప్పుడో రాజీ పడిపోయాడు. తన భవిష్యత్ ఏమిటా అనేదే బోధపడటం లేదు. తనకున్న అనుభవం, విజ్ఞానం తనకేదయినా ఉద్యోగం సంపాదించి పెడతాయా - ఏమో - ప్రయత్నించాలి.
    బస్ స్టాప్ లో నిలబడ్డాడతను. ఏ నెంబర్ బస్ ఎటు వెళ్ళేది కూడా సరిగ్గా తెలీదు తనకి. మొట్టమొదటి సారి బస్ ఎక్కటం.
    అందరితో పాటు తోసుకుని ఎక్కకుండా నిలబడ్డాడతను. నాలుగు బస్ లు వెళ్ళిపోయినాయ్ గానీ తను ఎక్కేందుకు వీలు కుదరటం లేదు.
    మరో నాలుగు బస్ లు వెళ్ళాక అప్పుడు అతికష్టం మీద పుట్ బోర్డ్ ఎక్కగాలిగాడు. ఇంటిదగ్గర సుభద్ర, పిల్లలు ఎదురు చూస్తున్నారు తన కోసం.
    "డాడీ ! కారేది?" ఆశ్చర్యంగా అడిగారు పిల్లలు.
    "కారు.....కారు లేదు మా ఫ్రెండ్ కిచ్చేశాను........." అన్నాడతను తడబడుతూ.....
    సుభద్ర కర్ధమయి[పోయింది.
    అతనికి "టీ" తీసుకొచ్చి ఇచ్చిందామే.
    "కారు అమ్మేశారు కదూ?" అతను పేపరు చదువుతుంటే అడిగిందామె.
    "అవును సుభద్రా..?! ఇవాలిటితో ఆఫీస్ కెళ్ళే అవసరం తీరిపోయింది కదా!"
    రాత్రి తొమ్మిదయిపోయింది. తన మంచం మీద పడుకుని తీవ్రమయిన ఆలోచనలో మునిగిపోయాడు శ్రీధరం. పక్క గదిలో నుంచి సృజన్ గొంతు వినబడుతోంది. పిల్లలకు కధ చెప్తున్నాడతను.
    "అప్పుడు రాజకుమారుడు వెంటనే పేదరాసి పెద్దమ్మతో నీ కొడుకుని రాక్షసుడి దగ్గరకు పపవద్దు. ఆ రాక్షసుడి దగ్గరకు రేపు నేనే ఆహారంగా వెళతాను" అని చెప్పాడు.
    "నువ్వా! ఈ రాజ్యంలోని వాడవు కాదు గదా నువ్వు! నువ్వెందుకు రాక్షసుడి ఆహారంగా వెళ్ళటం!" అంది పెద్దమ్మ.
    కానీ రాజకుమారుడు వినిపించుకోలేదు.........మర్నాడు రాజభటులు వచ్చారు. పేదరాసి పెద్దమ్మా కొడుకుని తీసుకెళ్ళబోతుంటే రాజకుమారుడు అడ్డుపడ్డాడు.
    "అతని బదులు నన్ను తీసుకెళ్ళండి" అని చెప్పాడు వాళ్ళతో.
    వాళ్ళు రాజకుమారుడిని తీసుకెళ్ళి గుహలోకి తీసుకెళ్ళారు. రాక్షసుడు రాజకుమారుడిని పట్టుకోబోయాడు గానీ రాజకుమారుడు ఎదురు తిరిగి యుద్ధం మొదలుపెట్టాడు. కొన్ని గంటలు యుద్ధం చేశాక రాక్షసుడికి కట్టి దెబ్బలు తగిలి చచ్చిపోయాడు వెంటనే రాజు ఆ రాజకుమారుడిని తన కోటకు తీసుకెళ్ళి సత్కరించి రాజకుమారిని ఇచ్చి పెళ్ళి చేసి అర్ధరాజ్యం ఇచ్చాడు...."
    "కానీ ఆ రాక్షసుడుని రాజకుమారుడు ఎలా చంపాడు బాబాయ్?" అడిగింది సీత.
    "ఏలాగేముంది? యుద్ధం చేసి."
    "ఒక్కడే అంత పెద్ద రాక్షసుడిని చంపేశాడు కదా. మరి ఆ రాజు సైన్యమంతా కలిసి ఆరాక్షసుడిని ఎందుకు చంపలేకపోయారు?"
    "ఆ రాజుకి సైన్యం లేదసలు"
    "ఎందుకని?"
    "జీతాలివ్వటానికి రాజు దగ్గర డబ్బు లేదు."
    కొద్దిసేపు నిశ్శబ్దంగా వున్న తర్వాత ఇద్దరూ ఒకేసారి అన్నారు.
    "కధ ఏం బాగాలేదు బాబాయ్"
    "రేపు మంచి కధ చెపుతాలే ఇంక పడుకోండి...."
    నిశ్శబ్దం.....
    గడియారం పది, పదకొండు, పన్నెండు గంటలు కొట్టడం కూడా వింటూనే వుంది సుభద్ర.

 Previous Page Next Page