కాలేజీకి బయలుదేరుతుంటే యింటిముందు ఆగిన అటో రిక్షాలో నుంచి నాగేందర్ రిక్షా దిగడం చూసి ఆశ్చర్యపోయాడతను.
తనతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తీ చేశాడు నాగేందర్. ఆ తరువాత తను యూనివర్శిటీకి అతను ఉద్యోగానికీ!
"ఏమిట్రా! చెప్పా చెయ్యకుండా సడన్ గా ఊడిపడ్డావ్" నవ్వుతూ అడిగాడు అతనిని.
"లీవ్ లో మా ఊరు వెళ్ళాను తిరిగి బొంబాయి వెళుతూ దిగాను"
"అయితే సాయంత్రం వరకూ నాకు నీ బోర్ తప్పదన్న మాట."
"సాయంత్రం వరకూ ఏమిటి? నేను వెళ్ళేది రాత్రి బండీకి"
ఇద్దరూ లోపలికొచ్చి కూర్చున్నారు.
"ఎలా వుందిరా చదువు?"
"ఏదో కుంటుతోంది"
"మీ వదినా, అన్నయ్యా బావున్నారా?"
"ఓ బ్రహ్మాండంగా."
"మీ వదిన పెట్టె ఉప్మా మాత్రం జన్మలో మర్చిపోలేనురా! ఎన్నో హోటల్స్ కి వెళ్ళాను . ఎంతో మంది ఇళ్ళల్లో ఉప్మా తిన్నాను గానీ , ఆ టెస్ట్ రావడం ఎవరికీ చేతకాదు."
సుభద్ర వాళ్ళ మాటలు విని బయటికొచ్చింది.
"నువ్వా! ఎలా వున్నరయ్యా! ఇంట్లో అందరూ బావున్నారా?"
"అల్ ఓ.కే. వదినమ్మా!"
"ఊద్యోగం ఎలా వుంది?"
"ఫర్లేదోదినా! వచ్చే సంవత్సరం ప్రమోషన్ వస్తుంది. అప్పుడు కొంచెం సుఖపడొచ్చు."
"ఒరేయ్, నాకు టైమయింది. పుస్తకాలు తీసుకుని లేచి నిలబడుతూ అన్నాడు సృజన్.
"అదేమిట్రానేను అంత దూరం నుంచి వస్తే."
"ఏం ఫర్వాలేదు, సాయంత్రం మాట్లాడుకుంటూ కూర్చోటానికి చాలా టైముంది."
"అయితే నన్ను వర్కింగ్ ఉమెన్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. ఈ సంచీ ఒకామెకీవ్వాలి."
"ఏమిటది?"
"ఎముంటాయిరా, ఏవో పచ్చళ్ళు, వగైరాలు. వాళ్ళ అమ్మా, నాన్న మా పక్కింట్లోనే ఉంటారు. ఇమ్మని బ్రతిమాలినప్పుడు బావుండదు కదా?"
"అయితే పద"
"మరి భోజనం ఎప్పుడు చేస్తావ్?" అడిగింది సుభద్ర.
"అన్నీ తిరిగి రెండింటి కోస్తానండీ? అప్పుడు తింటాను."
"హోటల్లో తినకు మొహమాటపడి"
"మీ యింట్లో మొహమాటమేమిటి వదినా! డిగ్రీ చదివినన్ని రోజులూ తెగ మెక్కెవాడిని కదా!"
ఇద్దరూ సృజన్ స్కూటర్ మీద బయల్దేరారు.
అబిడ్స్ లోని వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ముందాగింది స్కూటర్.
వాచ్ మెన్ నుంచుని వున్నాడు గేటు దగ్గర.
":ఎవరు కావాలండీ?"
"భారతీ!"
"ఆ రూమ్ లో కూర్చోండి! పిలుచుకొస్తాను"
ఇద్దరూ విజిటర్స్ రూమ్ లో కెళ్ళి కూర్చున్నారు. అయిదు నిమిషాల తర్వాత ఓ యువతి వచ్చిందక్కడికి.
నాగేందర్ చూస్తూనే గుర్తుపట్టిందామే.
"మీరా?" అంది చిరునవ్వుతో పలుకరించిందామె.
"బొంబాయి వెళ్తూ దిగానిక్కడ . మీవాళ్ళు ఈ బాగ్ మీకిమ్మన్నారు"
"ఓ . థాంక్యూ వెరీ మచ్"
"బైదిబై ఇతను మా ఫ్రెండ్ సృజన్ ఎమ్మెస్సీ ప్రీవియస్ . ఈమె భారతి!"
"నమస్తే!" అందామె.
"నమస్తే!" అన్నాడు సృజన్.
"చాలా ఆకర్షణీయంగా వున్న ఆమె రూపం మరీ మరీ చూడాలనిపిస్తోంది. బహుశా ఆమె కళ్ళజోడే ఆమెకు ఆకర్షణ కలుగజేస్తోందేమో!
"ఇంక వెళతామండీ!" అన్నాడు నాగేందర్ లేచి నిలబడుతూ.
"థాంక్యూ వెరీ మచ్! మా వాళ్ళతో ఎన్నో సార్లు చెప్పాను. ఇలా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దని! కానీ వింటేనా ఏదో ఒకటి పంపుతూనే వుంటారు......"
"ఫర్లేదులెండి! ఇందులో నేను పడ్డ శ్రమేమీలేదు. మావాడి కెలాగూ స్కూటర్ వుంది కదా......."
ఇద్దరూ బయటికొచ్చేశారు.
నాగేందర్ ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాడు సృజన్.
"సాయంత్రం నేను వచ్చాక మన ఫ్రెండ్స్ దగ్గర కేల్దాంలే. నువ్ తిన్నగా ఇంటికెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకో....."
"ఓ.కే. "
సృజన్ యూనివర్శిటీ వేపు బయల్దేరాడు.
* * * *
ఆ మర్నాడు ఉదయం దీప ఇంటికీ చేరుకున్నాడు సృజన్. ఆమె మరో ఇద్దరు స్నేహితురాండ్రతో హాల్లోనే కూర్చుని మాట్లాడుతోంది.
"హలో సృజన్" అందామె అతనిని చూడగానే ఉత్సాహంగా.
"హలో......." పలకరించి ఆమె కెదురుగా వున్న సోఫాలో కుర్చున్నడతను.
"మీట్ మై ఫ్రెండ్స్ పవిత్ర, డేయిసీ...."
"హలో" అన్నారు వాళ్ళిద్దరూ ఒకేసారి "హలో" అన్నాడు సృజన్.