బస్సు దిగేసరికి బస్సు స్టాప్ పక్కనే రెడీగా నిలబడి వున్నడతను. అతని వేపు కోపంగా చూసి తనింటికి బయలుదేరిందామే. కొద్దిదూరం నడిచిందో లేదో అతను మళ్ళీ తన పక్కనే నడవటం గమనించింది. ఈ పరిస్థితిలో అతని చెంప చెళ్ళుమనిపించటం తప్ప మరో గత్యంతరం లేదని అర్ధమయిందామెకి. వెంటనే అందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. అతని వేపు చిరునవ్వుతో చూస్తూ రోడ్ ప్రక్కనే నిలబడి పోయింది.
"ఏయ్ మిస్టర్! ఓ సారిలా రండి - మీ కోమాట చెప్పాలి!" అంది అద్బుతమైన నటన ప్రదర్శిస్తూ.
అతడు కాలరు సర్దుకుని ఉత్సాహంతో ఆమె సమీపంగా నడిచాడు.
"యస్ కామ్రేడ్. ఏమిటామాట!" అన్నాడు ఆనందంగా.
ఆమె ఇంక ఆలస్యం చేయకుండా చేయి ఎత్తి అతని చెంప మీద విసురుగా కొట్టబోయింది.
అప్పుడు గమనించాడతను. అతివేగంగా తమ మీదకోస్తున్న మరో కారు. అతి సమీపంగా వచ్చేసిందప్పటికే.
ఒక్కసారిగా స్మితతో పాటు రోడ్ పక్కనే వున్న గోతిలోకి దొర్లిపోయాడతను. కారు పుట్ పాత్ ని కొట్టుకుని కంట్రోల్ తప్పి ఎలక్ట్రిక్ పోల్ ని తగిలి , అక్కడికి ఆగక బస్సు స్టాప్ లో దూరి ఆగిపోయింది.
స్మిత కొద్ది క్షణాల వరకూ నిశ్చేష్టురాలయి కూర్చుండి పోయిందా గోతిలో. భవానీశంకర్ మాత్రం స్ప్రింగ్ లా లేచి నిలబడి పరుగుతో కారు దగ్గరకు చేరుకున్నాడు.
అప్పుడే కార్లో నుంచి అతి కష్టం మీద డోర్ తీసుకుని దిగుతున్నాడోకతను. అతని కాలికి దెబ్బ తగిలింది. అతని కాలర్ పట్టుకున్నాడు భవానీశంకర్!
"నీ ఫీట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయ్ కామ్రేడ్! గ్రాండ్ ఫ్రిక్స్ ఎవార్డు కొట్టే ఉంటావని నాకు అనుమానంగా వుంది."
"సారీ! డ్రయివింగ్ నేర్చుకుంటున్నాను , అందుకని- "
అతని ముఖం మీద భవానీశంకర్ ఉక్కు పిడికిలి చాలా బలంగా తాకింది. అతను వెనుకే ఉన్న కారు మీద విసురుగా పడి జారి పుట్ పాత్ మీద పడిపోయాడు మళ్ళీ.
వెంటనే అతనిని తన చేయి అందించి లేపి నిలబెట్టాడు భవానీ శంకర్.
"నీ ఎక్స్ ప్లనేషన్ ని చాలా చక్కగా అల్లావ్ కామ్రేడ్! ఇంకొచెం గట్టిగా ప్రయత్నిస్తే "బెస్టు తెలుగు ఫిక్షన్ర్ రైటర్ ఆఫ్ ది ఇయర్" బహుమతిని సునాయాసంగా గెలుచుకోవచ్చు!
ఆ ప్రయత్నాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసి నిజం చెప్పు కామ్రేడ్ లేకపోతే మరోసారి ఫుట్ పాత్ కి పాదాభివందనం చేయాల్సి వస్తుంది అన్నాడు మరోసారి పిడికిలి బిగిస్తూ.
అతను చేతులు జోడించాడు. "నిజంగానే చెప్తున్నాను. కొత్తగా డ్రయివింగ్ నేర్చుకోవడం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పి."
ఈసారి మరింత గట్టిగా తగిలిందతనికి దెబ్బ. కిందపడి లేచి కూర్చునేసరికి నోటి నుంచి రక్తం కారుతోంది.
అప్పుడే పోలీసు వాన్ సైరన్ శబ్దం చేసుకుంటూ వచ్చి ఆగింది అక్కడ.
అందులో నుంచి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ దిగివచ్చారు. ఆ వ్యక్తీ వాళ్ళ దగ్గరకు పరిగెత్తాడు ఒగరుస్తూ.
"స్టీరింగ్ కంట్రోలు తప్పింది, దెబ్బలు తగిలి నేను బాధపతుంటే - వీడెవడో నన్ను కొడుకున్నాడు:" అన్నాడు భవానీశంకర్ ని చూపుతూ.
కానిస్టేబుల్ భవానీశంకర్ దగ్గరకొచ్చాడు.
"నీ పేరు" అన్నాడు నోటు పుస్తకం , పెన్ను తీసుకుని.
"కామ్రేడ్ డ్రయివర్" చిరున్నవ్వుతో సమాధానం చెప్పాడు. భవానీ శంకర్.
రాసుకోబోయి టక్కున ఆగిపోయాడు కానిస్టేబుల్
"కామ్రేడ్ డ్రయివర్ ఏమిటి? ఇలాంటి పేర్లు నేనెక్కడా వినలేదే?"
"వినలేదా కొంచెం ఆలోచించు కామ్రేడ్! మెదడుకి పదును పెట్టండి. లేక మీ మెదడుకి మేత పెట్టండి! శీర్షికలో చురుకుగా పాల్గొనండి! రాజేష్ పైలటు అనే కేంద్రమంత్రిగారూ లేరూ. అయన మనదేశంలో "పైలటు" వుండగా లేనిది నా పేరులో "డ్రైయివర్" ఉంటే తప్పోచ్చిందా?"
కానిస్టేబుల్ ఇంకా మాట్లాడలేదు.
"నీ బాబు పేరు."
"రమేష్ ట్రాక్టర్!"
కానిస్టేబుల్ మరోసారి అనుమానంగా చూసి పీరు రాసుకున్నాడు.
"నీ తాత పేరు చెప్పు......"
"భీమేష్ బాక్సర్."
"నీ అడ్రసెంటి?"
"కేరాఫ్ ఉమేష్ సింగర్ - శ్మశానం పక్కన - రోడ్ నెంబర్ 1183 బై 1183 సికింద్రాబాద్."
"సాయంత్రం స్టేషనుకి రావాలి -- లేకపోతే అరెస్టు చెయ్యాల్సి వస్తుంది.
"ఓ.కే. కామ్రేడ్! తప్పకుండా వస్తాను. మనం ప్రస్తుత పరిస్థితుల్లో "ఫ్రీ అండ్ ఫ్రాంక్" డిస్కషన్స్ చేసుకునే అవకాశం చాలా అవసరం."
భవానిశంకర్ వెనక్కు తిరిగే సరికి స్మితారాణి వెళ్ళిపోతూ కనిపించింది.
"హలో మిస్ ఆగండి - వన్ మినిట్" అంటూ ఆమె వెంట పరుగెత్తాడతను.
ఆమె మరింత వేగంగా నడిచి సందులోకి తిరిగి రెండో యింట్లోకి ప్రవేశించింది.
భవానీశంకర్ కూడా ఆమె వెనకే యింట్లోకి నడుస్తుంటే తులసి ఎదురుగా వచ్చింది.
భవానీశంకర్ ఆశ్చర్యంతోఉక్కిరిబిక్కిరయ్యాడు. అది తులసి ఇల్లు! మరి ఈమె ఆ ఇంట్లో కెందుకేళ్తుంతుంది?