మరో వారానికి షాష్ట్రి, నీలవేణి, నల్లపిల్లి - కారులో అవధానిగారి ఇంటికి వచ్చారు.
నీలవేణిలో ఈవారానికే చాలా గొప్పమార్పు వచ్చింది. మనిషిలో హుందాతనం , కళ్లలోగర్వం, మొగుడిమీద అపారమైన ప్రేమా వున్నట్లు దోక్త్యమయ్యింది.
అవదానిగారు -కాంతమ్మగారూ నీలవేణిని లక్షప్రశ్నలతో ముంచెత్తారు.
అన్నిటికీ వోపికగా సమాధానమిచ్చింది. నల్లపిల్లి నీలవేణిని క్షణంవదిలి వుంటంలేదు.
ఆ నల్లపిల్లిని ఎంతో ముద్దుచేస్తూంది నీలవేణి.
ఇదిచూసి ముగ్గురూ ఆశ్చర్యపోయారు.
తర్వాత వెళ్లెటప్పుడు చెప్పింది. వారు త్వరలో వో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారనీ - అదీ ఫారిన్ కొలాబరేషన్ మీద.... దానికి ఎంబ్లం పిల్లి అనీ, దాని పేరూ c. A. T. ఇండస్ట్రీస్! అని చెప్పింది.
అల్లుడి పిల్లిప్రేమ - ఎవ్వరికీ అర్దంకాలేదు.
ఆ మర్నాడే నీలవేణిని తీసుకొని వెళ్లిపోయాడు షాష్ట్రి.
నీలవేణి ఆనందంగా వున్నందుకు ఆముగ్గురూ సంతోషించారు. ఇకమిగిలింది వొక్క కృష్ణమూర్తి సమస్యే!
8
" ఏరా! అబ్బాయీ! ఇలా ఇంకెంతకాల వుంటావురా! నువ్వు ఎప్పుడు పెళ్లిచేసుకుంటావూ - ఎప్పుడు మనవడ్ని అందిస్తావూ?" అని అడుగుతూంది రోజు కృష్ణమూర్తిని కాంతమ్మ గారు.
"నేనేం చెయ్యనే. ఉద్యోగం రాందే! ఉద్యోగం లేందే పెళ్లెందుకూ? దాన్ని తెచ్చి నా నెత్తిన ఎక్కించుకోవాలి ఇక!" అంటాడు కృష్ణమూర్తి.
కాలగర్బంలో రెండు సంవత్సరాలు గడిచాయి.
కృష్ణమూర్తికి ఉద్యోగం దొరకలేదు.
పెళ్ళీ చేసుకోలేదు.
అవధానిగారూ కాంతమ్మగారూ ఇదే ఆలోచనతో విచారపడ్తున్నారు.
అప్పుడో లెటరు వచ్చింది అవధానిగార్కి.అది అల్లుడి నుంచి.
మీకు రెండు శుభవార్తలు!
ఒకటి నీలవేణి త్వరలో మీకో మనవడ్ని ఇవ్వబోతూంది.
రెండు.
మీ వెంకట కృష్ణమూర్తికి ఇంకా ఉద్యోగం దొరకలేదని నీలవేణి చెప్తూంది. అతనికి మా ఇండస్ట్రీస్ లో మేనేజర్ పోస్టు ఇస్తున్నాను. జీతం వెయ్యి రూపాయలు. ఎలౌన్సులు అదనం.
వెంటనే అతన్నిపంపండి. షాష్ట్రి.
అవధానిగార్కి వెర్రి ఆనందం కల్గింది. కాంతమ్మగారు ఆనందంతో స్పృహ కోల్పోయింది. వెంకటకృష్ణమూర్తికి బావ నిజంగా దేవుడే అనుకొని మనస్సులోనే నమస్కరించాడు.
"ఇవ్వాళె బయలుదేరమన్నారు కృష్ణమూర్తిని" అవధానిగారు.
"వారం... వర్జ్యం" నసిగింది కాంతమ్మగారు.
'జాన్తానై... బయలుదేర్రా కృష్ణమూర్తి!' అని ఆర్డరు జారీచేశారు.
ఆయనకు అల్లుడిమీద అపారమైన నమ్మకం. గురి కుదిరాయి. పట్టుదలతో సాధిస్తే ఏదయినా సాధించవచ్చునని అల్లుడ్నిచూసి - ఆయన తెల్సుకున్నారు.
ఆరోజే కృష్ణమూర్తి బయలు దేరాడు....
వాకిట్లోకి వచ్చాడు... ఎదురుగా వో బామ్మగారు వస్తూంది.... ఎవరింట్లోనుంచో పిల్లి వీధికి అడ్డంగా పరిగెట్టింది. కృష్ణమూర్తి అవధానిగారివైపు చూశాడు. పర్వాలేదు.... బావను తలుచుకో.... 'వెళ్ళిరా శుభంగా.....' అన్నారు.
కృష్ణమూర్తి బయలుదేరి వెళ్లాడు.
ఎవరో యెక్కడో తుమ్మారు.
కాంతమ్మగార్కి మనస్సు చివుక్కుమంది. అవదానిగారు నిశ్చింతగా లోపలికి నడిచారు.
* * * * *
కృష్ణమూర్తి నుండి లెటరు వచ్చింది.
తనకు మొత్తం పదమూడు వందలు వస్తాయనీ బావ పలుకుబడి, అతని గౌరవం, ఇండస్ట్రీ గుఱించి ... త్వరలో బావే ఏదో పెళ్లిచూపులూ అరెంజ్ చేస్తానని చెప్పాడనీ.... ఏవేవో పదిపేజీలు వ్రాశాడు.
ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు.
*