Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 11

  
    'నీ ఇష్టమే - నా ఇష్టం నాన్నా!' అన్నాడా తనయుడు
    "సరే, మీ ఇష్టప్రకారమే - అని ఉత్తరం వ్రాస్తానుమరి" అవధానిగారు.
    "మీ ఇష్టం" తల్లీ కొడుకులు వొకేసారి అన్నారు.
    నీలవేణి విని మురిసిపోయింది.
    అవధానిగారు శనివారం అయిదు లోగా అందేటట్లు   లెటరు వ్రాసి రిజిస్టర్  పోస్టు చేశారు. తిరిగి అందలేదంటా రేమోనని.
                                           5
    ఎక్ నా లెడ్జిఫారమూ, షాష్ట్రి జవాబు రెండూ ఒకే సారి వచ్చాయి. "ఆదివారం రాత్రికి కారు మీ ఇంటికి వస్తుంది అందులో మీ కుటుంబం తరలి వచ్చెయ్యండి. సోమవారం మార్నింగ్ - వివాహం రిజిస్ట్రాఫీసులో . అంతాఫిక్సుడు. షాష్ట్రి" అని.
     అది ఉత్తరంలా లేదు, టెలిగ్రామ్ భాషలాగానో, టెలెక్సు భాషలాగానో వుంది. అల్లుడుగారు ముక్తసరిగా వ్రాయటం అలవాటనుకొన్నారు అవధానిగారు.
     అంతా నోళ్లు  తెరిచారు.
     వాట్ ఏ డేరింగ్ ఫెలో!
     ఏమిటీ? పెళ్లనుకున్నాడా..... చింతకాయల వ్యాపారమనుకొన్నాడా?
    అంతా అలా ఆలోచిస్తుండగానే - ఆదివారం రానే వచ్చింది.
     ఆదివారం సాయంత్రం అంబాసిడర్ కారు వాకిట్లో నిలిచింది. అవధానిగారు, కాంతమ్మా, వెంకటకృష్ణమూర్తి, నీలవేణి ఎక్కికూర్చున్నారు, కారు బయలుదేరింది.
     శకునం చూట్టాం మర్చిపోయారు అందరూ- ఆ హడావుడిలో.
     నీలవేణి మనస్సంతా షాష్ట్రి మీదే వుంది. అతని చేతిలోని బొచ్చు  నల్లిపిల్లి మీదే వుంది.
     కాంతమ్మకు ఇదంతా అయోమయంగా, భయంగా, వింతగా వుంది.
     వెంకటకృష్ణమూర్తి  - ఇదేమిటో అర్దం కావటంలేదు. ఆచారాలూ - వ్యవహారాలూ - తమ కులంలోని వ్యక్తి ఇలా నూతన భాష్యాలు చెప్తున్నాడేమిటి? ...  అని తెగ ఆలోచిస్తూ ఎందుకైనా మంచిదని గాయిత్రీని స్మరించుకోసాగాడు.
     అవధానిగారు భారమంతా ఏడుకొండలవాడి మీద వేసి నిశ్చింతగా కూర్చున్నారు.
     కారు ఆగింది. అది హోటల్ కిన్నెర ఎ. సి. అక్కడే రెండు రూంలు  బుక్ చేశాడు షాష్ట్రి.
     అక్కడే దింపాడు డ్రైవరు. 'అన్నీ మీకు అందుతాయి. రేపు మార్నింగ్ పదిన్నరకల్లా రిజిస్ట్రాపీసుకు పోవాలి రెడీగా వుండండి.' అనేసి వెళ్ళిపోయాడు.
     వాళ్లు ఆ రూంలోకి పోయారు. అవధాని, వె. కృ మూర్తి, ఒకగదిలోకి, ఆడవాళ్లిద్దరూ వొకగదిలోకి. అక్కడ వైభవం - ఆ అరేంజ్ మెంట్సు చూసి కళ్లు తిరిగాయి నల్గురికీ.
     అల్లుడు ఎంత గమ్మత్తువాడో. ఎంత గొప్పవాడో వాళ్లకు అర్దం కావటంలేదు.
     ఏమిటో లోకాల్లో వున్నాట్లున్నారు.
    షవర్ బాత్, ఉబ్ బాత్, యూరోపియన్ స్టయిల్ లెట్రిన్, కార్పెట్లు, ఎ.సి. రూమ్ లు. ఫోన్ సంగీతం కర్టెన్లు పరుపులు, దిండ్లు - అంతా.. రాజభోగంలా వున్నట్లున్నది వాళ్లకు.
     నీలవేణి క్రొత్తగా కన్పడుతుంది కాంతమ్మకు. అప్పుడే తనపిల్ల కానట్లుగా వున్నది.
     అవధానిగారు 'వొరె, వెంకటాయ్.... ఈ ఇంద్రభవనం లోకి దింపాడూ?'
    "ఇది కిన్నెర అని. ఎ. సి. హోటల్. ఇది మనకు విడిది అన్నమాట...."
    "అయినా నాకర్దంకాదు... పెళ్ళికొడుకు రావాలి కానీ! పెళ్లికూతుర్ని తీసుకొచ్చావేంరా మనం...."
    "అదే ఆశ్చర్యంగా వుంది నాన్నా!"
    తర్వాత మరీ ఆశ్చర్యం కలిగించింది - అక్కడ భోజనం - వారికి సమస్త ఆదరణ!
    తెల్లవారింది .రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు.
    పదయింది కారు వచ్చింది. అంతా కారెక్కారు. రిజిస్ట్రాఫీసు ముందాగింది కారు.
                                          6
    అనుకున్నట్లుగానే అక్కడికి షాష్ట్రి, షాష్ట్రి ఫాదర్, మదర్, బామ్మ మరికొందరు పెద్దలు వున్నారు. వీరి కారురాగానే అక్కడి వారందరూ వీరిని ఆప్యాయంగా  ఆహ్వానించారు లోపలకు. పరస్పరం తెలుసుకొన్నారు.
     రిజిస్ట్రారు టేబిల్ మీద పిల్లిని వుంచాడు షాష్ట్రి. రిజిష్ట్రారుగారు సంతకాలకై పుస్తకం రడీగావుంచారు.
     ముందుగా బామ్మకాళ్లకు నమస్కరించాడు షాష్ట్రి, తర్వాత  ఫాదర్ మదర్ కాళ్లకు నమస్కరించాడు. తిరిగి నీలవేణిని దగ్గరకు రమ్మని - ఇద్దరూ వాగ్దానాలు చేసి పిల్లిముందు సంతకాలు చేశారు.
     పెళ్లయిపోయింది. దండలు వేసుకొన్నారు.
    తిరిగి బామ్మకూ, షాష్ట్రి ఫాదరు మదరుకూ, నీలవేణి తల్లిదండ్రులకూ, వెంకటకృష్ణమూర్తికీ నమస్కారాలుచేశారు.
     అక్కడకు వచ్చిన వారంతా సంతకాలుచేసి - ఆశీర్వదించారు.
     తిరిగి అంతా  హోటల్ కిన్నెరకు వచ్చారు. అప్పటికే అక్కడ పెళ్ళిభోజనం రెడిగా వుంది. ఊళ్ళోని పెద్దలు అంతా రెడీ ఐవున్నారు. అంతా దంపతులకు శభాకాంక్షలు తెల్పి -   భోజనాలకు కూర్చున్నారు, అంతా కలసి యాభైమంది లేరు.
     మధ్యాహ్నం ఒంటిగంటకు అంతా వాపోయింది. రెండు గంటల ప్లేనులో షాష్ట్రి, పిల్లి, నీలవేణి - ఢిల్లీ వెళ్లిపోయారు.
     ఓకారులో అవధానిగార్నీ, కాంతమ్మగార్ని, వెంకట కృష్ణమూర్తిని తిరిగి పంపివేశాడు ఎయిర్ పోర్ట్ నుండి.
    ఎయిర్ పోర్టులో కాంతమ్మ, అవధానిగారు ఏడ్చేశారు. ఇక వెంకటకృష్ణమూర్తి సంగతి చెప్పనవసరంలేదు.
    'ఎందుకు ఏడుస్తారు?' అని షాష్ట్రి కొంత విసుక్కున్నాడు.
                                        7
    'అమ్మాయి ఢిల్లీలో వుంటుంది కాబోలు!' అంది కాంతమ్మగారు.
     'అవును! ఢిల్లీనుండి మళ్ళా ఏవేవో ప్రాంతాలు చూసి వస్తామని చెప్పాడు అల్లుడు' అన్నారు అవదానిగారు.
     'అయినా - ఆ పిల్లిని ఎప్పుడూ బావగారు అలా చంకన వుంచుకోవటం నాకేం నచ్చలేదు నాన్నగారూ! తెలుగు సినిమాల్లో విలన్లూ అలా పిల్లుల్ని పెంచుతారు.....'
    'ఛ.....ఛ.... షాష్ట్రి కాదు నాన్నారు!శాస్త్రే......!' అని సరిదిద్దాడు కృష్ణమూర్తి.
    'ఏది ఏమైతేనేం- అమ్మాయిని గొప్పయింట్లో ఇచ్చాం అత్తమామలూ మంచివారె! అయితే వొకటే లోపం...... అబ్బాయి కాస్త నాస్తిక భావాలు కలవాడు....'
    'నాస్తిక భావాలు కలవాడయితే గాయత్రి జపించడానాన్నగారూ!' అని ప్రశ్నించాడు కృష్ణమూర్తి.
     'అదే తెలియకుండా వున్నది. అమ్మాయిని అడగాల్సిందే ఇవన్నీ!'
                                                                     *    *    *    *

 Previous Page Next Page