Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 13

           
    
                               మగాడి ఇన్ ఫీరియారిటీ
                
                                                                    ---చివుకుల పురుషోత్తం


    శోభన్ బి. ఎ. శాంత బి. ఎ, లు, కొత్తగా కాపురం పెట్టారు. అదీ నిన్న సాయంకాలమే దిగారు. హైద్రాబాద్ లో మూడురోజుల శోభనం, గుంటూరులో ముగించుకొని.
     శోభన్ తల్లి, తనూ ఒచ్చి, ఓ రెండునెలలు కాపురం సరిగా జరిగేట్లు చూస్తానన్నది. దానికి శోభన్ ఒప్పుకోలేదు.
     "ఇద్దరం గ్రాడ్యుఏట్లం! ఆమాత్రం స్వంత కాపురం నిర్వహించుకోలేమా?!"అన్నాడు!  కనీసం  ఓ పదిరోజులైనా కందుకూరు ఒచ్చిపొండర్రా, మీ కాపురం చూసి ఆనందిస్తాం! అన్నది తల్లి. దానికీ ఒప్పుకోలేదు శోభన్. తనకు అర్జెంటు ఆఫీసుపనులు, మునిగిపోతున్నాయని, సెలవు బొత్తిగా లేదనీ, బుకాయించాడు.


    కారణ మేమంటే కొత్తకాపురం,  హాయిగా, ఎవరి డిస్టర్ బెన్సు లేకుండా గడపాలని.
     శోభన్ బి. ఎ. పాసై రెండునెలలు కాఒస్తున్నది. అయితే సంవత్సరం క్రింద, ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో బ్యాంక్ ఉద్యోగానికి అప్లైచేశాడు. బి. ఎ. పరీక్షలై పోవడం ఉద్యోగం రావడం ఒకేసారి జరిగాయి. దానితో కందుకూరు నుండి హైదరాబాద్ ఒచ్చేశాడు.
    ఉద్యోగంలో చేరిన పదిరోజులకే  ఎన్నో సంబంధాలు ఒచ్చినవి. అందులో గుంటూరునుండి ఒచ్చిన శాంత సంబంధం శోభన్ కు బాగానచ్చింది. ఎందుకంటే ఫోటోలో శాంత అందంగా వుంది. బి. ఎ.  పరీక్ష వ్రాసింది. వెంటనే తన సమ్మతిని  తండ్రికి తెలియజేశాడు శోభన్.
     శోభన్ తండ్రి జానకిరామయ్య పెండ్లిచూపులు వగైరాలు. అర్జంటుగా జరిపించేశాడు. పెండ్లి గూడా పోయిన ఆదివారంనాడే  అయింది - అంటే ఈరోజుకు సరిగా వారం అన్నమాట.
     "ఏమండీ! ప్లాజాలో మంచి ఇంగ్లీషు సినిమా వుంది. మ్యాటినీకి వెళదామా?"  అని అడిగింది శాంత.
     'ఇంగ్లీషు పిక్టరా? నీ కర్దం అవుతుందా? హాయిగా 'నోము' సినిమా కెళదాం. అందులో పాము యాక్షన్ వుందిట!' అన్నాడు శోభన్.
     "ఛీ! ఛీ! పాము ఏక్షన్ చేయడం ఏంటండి?!అవన్నీ ఫోటో గ్రాఫిక్ ట్రిక్స్. ఈ ఇంగ్లీషు సినిమా 'మామ్' వ్రాసిన కథ కనుగుణంగా - తీశారట. చాలా బాగుందట" అన్నది శాంత.
     సరే!పోదాం పద!' అయిష్టంగా అన్నాడు శోభన్. శాంత సంతోషంగా తయారైంది సినిమాకు, శోభన్ అయిష్టతను గమనించకుండా.
     ఇద్దరూ బయలుదేరారు మధ్యాహ్నం మ్యాటినికీ. ఆటోలో ప్లాజాదగ్గర దిగారు. శోభన్ టిక్కెట్లు తేవడానికి పోయాడు. టిక్కెట్లు తీసుకొని రాగానే శాంత ఎవరితోనో మాట్లాడుతున్నది. శోభన్ దగ్గరకు రాగానే క్రొత్త వ్యక్తిని పరిచయం చేసింది శోభన్ కు శాంత .
     'ఈయన మా మేనత్తకొడుకు విశ్వం - బి. టెక్ - ఇక్కడే ఇంజనీరుగా పనిచేస్తున్నాడు' అని. శోభన్ ని  విశ్వానికి పరిచయం చేసింది.  విశ్వం చేయిచాచాడు. శోభన్ అందుకొని షేక్ హాండ్ ఇచ్చాడు.
     విశ్వం అన్నాడు, "ఈ సినిమా చాల బ్రహ్మాండంగా వుందట. మామ్  వ్రాసిన నవల ఆధారంగా తీశారట. నాకు బెంగుళూరులో వున్నప్పుడిది - మిస్ అయింది. అప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. అందుకని చూడలేకపోయినా" నన్నాడు శోభన్ తో.
     శోభన్ పలుకలేదు.
     శాంత అందుకుంది. 'అవును! అసలు మామ్ వ్రాసిన ఆ నవలే ఇరవైలక్షల కాపీలు పోయాయట. చాలా మంచి సినిమా అని శాంత అంటుండగానే బెల్ కొట్టారు. ముగ్గురూ  హాల్లోకి వెళ్లారు. శాంతా, శోభన్ లు ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు. విశ్వం శోభన్ ప్రక్కన కూర్చున్నాడు. సినిమా మొదలైంది.


     శోభన్ కు విసుగుపుట్టింది. ఒకముక్క అర్దంకాలేదు. ఆ సినిమాలోని మాటలు శోభన్ చదివిన ఏ పుస్తకంలోను లేవు. ఒక్క 'నో' అనేమాట అప్పుడప్పుడు వినిపించేది. శోభన్ కు బోర్ కొట్టింది. ఎంతసేపు గ్లాసులలో బ్రాందీలాంటిది పోసుకోవడం, బాతాఖానీ కొట్టడం, ముద్దులు పెట్టుకోవడం తప్ప స్టంటూలేదు, ఏమీ లేదు.
     శోభన్ ఒకటవ క్లాసునుండి బి. ఏ. దాకా కందుకూరు లోనే చదివాడు. క్లాసు పుస్తకాలు తప్పించి రెండోవి తాకేవాడు గాడు. హైద్రాబాద్ ఒచ్చాకే ఒక్క ఇంగ్లీషు సినిమా చూచాడు. ఏమీ అర్దం కాకపోయినందున, మళ్లీ ఇంగ్లీష్ సినిమా కెళ్లలేదు. కానీ విశ్వం, శాంతమటుకు నవ్వుతున్నారు. ఓహో! అంటున్నారు.
     ఇంటర్వెల్ అయింది. విశ్వం సినిమాను గురించి ఇంగ్లీషులో డిస్కషన్ మొదలుపెట్టాడు. 'కోకోకోలా' తెస్తానని శోభన్ వాకిట్లోకొచ్చి మూడు కోకోకోలా తెచ్చి తనొకటి తీసుకుని, శాంత, విశ్వాలకు మిగతావిచ్చాడు. వాళ్లు కోకొకోలా త్రాగుతూ, ఇంగ్లీషులో సినిమాను గురించి డిస్కస్ చేస్తున్నారు. ఖాళీసీసాలు తీసుకొని వాకిట్లోకెళ్లి సిసాలు షాపులో ఇచ్చి సినిమా మొదలుపెట్టేదాకా వాకిట్లో నిలబడ్డాడు శోభన్. సినిమా మొదలెట్టాక లోపలికిపోయి కూర్చున్నాడు.
     ఐదున్నర ప్రాంతంలో సినిమావదిలారు. విశ్వం నూతన దంపతులిద్దర్నీ హోటల్ కి  తీసికెళ్లి కాఫీ ఇప్పించాడు. తరువాత ముగ్గురూ సినిమాహాలు  దగ్గరనున్న రెస్ కోర్సు మైదానంలో కూర్చున్నారు. ఎంతసేపటికి  విశ్వం శాంతా మాట్లాడారే గాని, శోభన్ మాటల్లో పాల్గొనలేదు. గడ్డి పీకుతూ' ఎటో చూస్తూ కూర్చొని వున్నాడు. ఏడుగంటల ప్రాంతంలో లేచారు. శాంత విశ్వాన్ని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. విశ్వం సరేనన్నాడు. శాంతాశోభన్ లు ఆటోలో ఇల్లుచేరారు.
     శాంత వెంటనే స్టౌ వెలిగించి అన్నం  వండుతున్నది. శోభన్ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు.
     'సినిమా ఎలావుంది' అడిగింది శాంత .
    'ఏమో! నాకేం బాగాలేదు. అది సరే, విశ్వం మీ మేనత్త కొడుకుగదా! మరి - నిన్ను - మీవాళ్లు అతని కెందుకిచ్చి పెళ్లి చేయలేదు?"
    "అబ్బో!వాడి చూపులు ఆకాశం మీద వుంటాయి! వాడికి యం. ఏ. పాస్ అయిన పిల్ల కావాలిట! అమెరికా పంపే మామగారు కావాలట. మేం తూగలేం కదా!"
    'అందుకనేనా ఐదువేల  కట్నంతో నన్ను చేసుకొన్నావ్?'
    విస్తుపోయి చూసింది శాంత శోభన్  వంక.
    శోభన్ ముందు గదిలోకెళ్లి రేడియో ఆన్ చేసి వింటున్నాడు. శాంత వంట పూర్తిచేసి, శోబన్ ని పిలిచింది. ఇద్దరూ అన్నాలు తిన్నారు. భోజనం చేసేటప్పుడు శాంత ఏదో మాట్లాడింది. కానీ శోబన్ పలకలేదు. ఉఁ! ఆఁ! అంటూ భోజనం కానిచ్చి ముందుగదిలో పక్కమీద పడుకున్నాడు.
     అరగంట తరువాత, శాంత శోభన్ వున్న గదిలో కొచ్చింది. శాంతను చూడగానే పక్కకు జరిగాడు శోభన్. శాంతకు పడుకోడానికి చోటు ఇచ్చి. శాంత శోభన్ ప్రక్కన పడుకోకుండా, దూరంగా వున్న సోఫాపైన పడుకుంది.
     శోబన్ మనస్సు గాయపడింది. శాంత సోఫాపైన కొద్దిసేపు కూర్చుని, శోభన్ వంక చూచింది. శోభన్ కండ్లు మూసుకొని వుండటంతో, ఒక ఐదునిమిషాలు శోభన్ వంక చూచి. అతడు కళ్ళు తెరవకపోవడంతో తనూ సోఫామీద పడుకుంది. సోఫా చప్పుడువల్ల, శోభన్ శాంత సోఫాపైన పడుకొన్నట్లు గ్రహించగానే, శోభన్ మనస్సు కుతకుత వుడికిపోయింది. తనే ఎందుకు బ్రతిమలాడాలి? రోజూవచ్చి పక్కనే పడుకొనేది గదా! ఎంత బెట్టు? ఎంత గర్వం! తనేనా. అంత సిగ్గుమాలినవాడు?హు! అనుకొని కొంతసేపు ఉడికి పోయినాడు శోభన్! ఒక పదినిమిషాల తరువాత ఇక ఆగలేక -
     "శాంతా! ఇలా వచ్చిపడుకో' అన్నాడు.
     'ఇవాల్టికి ఇక్కడే పడుకుంటా లెండి' అన్నది నిద్రమత్తుగా శాంత.

 Previous Page Next Page