ఆయన ఆర్ అండ్ బిలో ఇంజనీర్.
పాల వ్యాపారంలో లాభాలొస్తున్న కొద్దీ సంఘంలో తనపట్ల మారే ధృక్పథాన్ని అతను కనిపెట్టాడు. డబ్బు కూడేకొద్దీ పరపతి, గౌరవం, ఆదరాభిమానాలు పెరుగుతాయని గుర్తించాడు. వాటినన్నిట్నీ ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. గతంలో జరిగిన అవమానాలన్నీ మరుగున పడిపోతున్నాయి.
డబ్బుకున్న పవర్ ఏమిటో తెలిసింది.
పదిమందిలో అధిపతిగా వుంటే ఆ ఆధిక్యం ఇచ్చే మత్తు ఎంత గొప్పగా వుంటుందో తెలిసింది. ఇక పాల వ్యాపారం వదిలేసి అంచెలంచెలుగా అందరూ తన గురించే మాట్లాడుకునే స్థాయికి ఎదగాలని అనుకున్నాడు.
అలా నిర్ణయం తీసుకున్న తరువాత శివరామారావు అభిమానం పొందడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశాడు. ఆయన దృష్టిలో నరేంద్ర అంటే చాలా కష్టపడే మనిషి, నిజాయితీపరుడన్న పేరు సంపాదించాడు. ఆయనకి అలాంటి అభిప్రాయం కలిగించిన తర్వాత మెల్లగా ఓరోజు తనేం అనుకుంటున్నాడో చెప్పాడు.
"పాలవ్యాపారం ఎంతకాలమని చేయడం, మీరేదైనా దారి చూపించాలి" అంటూ కాంట్రాక్టర్ కావాలనీ వుందన్న కోరికను వెలిబుచ్చాడు.
ఆయన సరేనన్నాడు.
నరేంద్ర అదృష్టంకొద్దీ అంతకుముందు రోడ్డుపని తీసుకున్న కాంట్రాక్టర్ గుండెపోటుతో చనిపోతే దాన్ని శివరామారావు నరేంద్రకు ఇప్పించాడు.
అలా నరేంద్ర ఆర్ అండ్ బిలో కాంట్రాక్టర్ అయ్యాడు. జీవితం చూసిన మనిషి, దరిద్రాన్ని అనుభవించిన మనిషి కావడంతో ఎక్కడా పొరబాట్లు చేయలేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు. అందులోనూ డబ్బు కూడబెట్టడంలో వుండే తీపి తెలుసుగనుక ఇక వెనక్కిచూసే అవసరం లేకుండాపోయింది.
అంచెలంచెలుగా అనుకున్న రేంజ్ కి ఎదిగాడు.
తమ పల్లెటూరికి దగ్గర్లో వున్న ఓ చిన్న టౌన్ కి ఫ్యామిలీ మార్చాడు. అక్కకి పెళ్ళిచేశాడు. ఇప్పట్లో తను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాడు.
కాంట్రాక్టర్ గా నెంబర్ వన్ పొజిషన్ లో వుండాలని రేయింబవళ్ళు కష్టపడ్డాడు.
పదిమంది తనను చూసి మెచ్చుకోవాలన్నదే అతని ఏకైక ఆశయం, ఆనందం. అందుకు ఏమేం అవసరమవుతాయో అన్నీ చేసుకోవాలనుకున్నాడు.
బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. జీప్ కొన్నాడు. ఆస్తులు సంపాదించాడు. కాంట్రాక్టులు ప్రారంభించిన ఆరేళ్లకే బంధువుల్లో నెంబర్ వన్ పొజిషన్ కి ఎదిగాడు.
"మన దగ్గరి బంధువుల్లో నాకున్న ఆస్థి ఎవరికీ వుండకూడదు. అప్పుడే నా పెళ్ళి" అని తల్లితో అనేవాడు.
ఇప్పుడు ఆస్థాయీ వచ్చింది కనుక తల్లి పెళ్ళి చేసుకొమ్మని పోరింది. సరేననుకుని అతనికోసం సంబంధాలని చూసే పెళ్ళిళ్ళ పేరయ్యని రమ్మన్నాడు.
తన ఆశయం, ఆశ ఏమిటో చెప్పాడు- "నేనూ, నా భార్యా కలిసి అలా బజారంటపోతుంటే అబ్బ! నరేంద్ర ఎలాంటి భార్యను కొట్టేశాడ్రా! అని అందరూ ముక్కుమీద వేలేసుకోవాలి." అంటూ వివరించి- "అలాంటి అమ్మాయి కావాలి. డబ్బు లేకపోయినా ఫరవాలేదు. గతంలో నువ్వు నాకో అమ్మాయి ఫోటో చూపించావ్. అప్సరసలాగుంది. ఆమెకి పెళ్ళికాలేదేమో కనుక్కో, రేపు ఈపాటికి చేసేసుకుంటాను...." అన్నాడు.
పెళ్ళిళ్ళ పేరయ్య అసాధ్యుడు. అతను ఎవర్ని అప్సరస అన్నాడో కనిపెట్టాడు. వారం రోజుల తరువాత విజయగర్వంతో చెప్పాడు-
"ప్రభూ! మీరు చెప్పిన అమ్మాయి ఎవరో కనిపెట్టాను. కావలి సంబంధం వెంకట్రామయ్య కూతురు. అయితే ఆమెకి పెళ్ళయిపోయింది."
నరేంద్రకి కోపం వచ్చింది. ఇంత వెధవన్యూస్ చెబుతూ పేరయ్య ముఖం వెలిగిపోవడం అసలు నచ్చలేదు. తన ఫీలింగ్స్ నన్ని కళ్ళల్లోకి తెచ్చుకుని చూశాడు.
అంతటితో ఆగిపోలేదు. "వెంకట్రామయ్యకి రెండో కూతురుంది. పెద్దమ్మాయి పేరు చంద్రలేఖ అయితే రెండో అమ్మాయి పేరు శశిరేఖ.
వరసకి చెల్లెలే అయినా అందంలో ఆమె అక్కలాంటిది. కాబట్టి మీరొక్కసారి దయచేసి చూడండి"
సరేనన్నాడు నరేంద్ర.
మధ్యవర్తితో కలిసి ఓరోజు పెళ్ళిచూపుల కోసమని వెళ్ళాడు నరేంద్ర. యమగండాలు, వర్జ్యాలు వస్తాయని వెంటనే అమ్మాయిని చూపించారు.
శశిరేఖను చూడగానే నరేంద్ర నోటంట 'అద్భుతం' అన్న మాట వచ్చేసింది.
పసుపుకొమ్ములు, కుంకుమ పూసి ఆపై పాలతో కడిగినట్టు ఆమె ఒంటిరంగూ, అల్లరినీ, అమాయకత్వాన్నీ రంగరించి చేసినట్టున్న పెద్ద పెద్ద కళ్ళూ, కాఠిన్యాన్నీ లాలిత్యాన్ని కలిపి తయారుచేసినట్టున్న సమున్నతమయిన వక్షద్వయం, రోజాల్నీ, చేమంతుల్నీ రుద్దిచేసినట్టున్న పెదవుల్నీ చూశాక అంతకంటే కిందకు దిగాలని వ్యర్థ ప్రయత్నాలు చాలానే చేశాడు.
ఈ అందం 'మేడిన్ బ్రహ్మలోకం' అన్న బోర్డును తగిలించినట్టున్న బొడ్డును మాత్రం కాఫీ అందించడానికి ఆమె వంగినప్పుడు చూశాడు.
పెళ్ళిచూపులయ్యాక పెళ్ళిళ్ళ పేరయ్య, నరేంద్ర తిరిగి బయలుదేరారు.
"ఒక్క రూపాయ ఇవ్వకపోయినా ఫరవాలేదు. రేపు ఉదయానికల్లా పెళ్ళి సెటిలయిపోవాలి.... ఆలస్యం వద్దు. ఇక్కడే దిగి తిరిగి బస్సులో ఆ ఊరెళ్ళిపో" అని జీప్ మధ్యలో ఆపి దించేశాడు. అనా నరేంద్ర పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగిపోయింది.
శశిరేఖ తెలివైన పిల్ల. కాపురానికి వచ్చిన వెంటనే భర్త మనస్తత్వాన్ని పసిగట్టింది.
భార్యంటే అతని దృష్టిలో ఓ షోకేసు లాంటిది. అది ఎంత అందంగా వుంటే అంతగొప్ప. అందుకే తను పేద అమ్మాయి అయినా పెళ్ళి చేసుకున్నాడు. ఇదంతా తెలిశాక అతన్ని మరికాస్త డీప్ గా స్టడీ చేసింది.
"మీరు అందరిలోకెల్లా గ్రేట్ గా వుండాలని కోరుకుంటాను. అదేం పెద్ద తప్పని నేననను. కానీ ప్రతి నిముషం పదిమందికోసమూ మీరు బతికితే, దానినే అలవాటు చేసుకుని అందులోనే ఆనందం ఫీలయితే మీకంటూ మీ జీవితం వుండదు. నిజమే. చిన్నప్పట్నుంచీ మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవించిన పేదరికం మిమ్మల్ని ఇలా తయారుచేసి వుండవచ్చు.
కానీ తెలివైనవాళ్ళు ఇతరుల మీద కసి తీర్చుకోడానికే బతకరు. మీ జీవితం మీరు జీవించండి. ఏ పని చేసేప్పుడైనా ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకండి" అని అర్థంవచ్చేటట్లు చాలాసార్లు చెప్పింది.
అతను మారాడో లేదో తెలియదుగానీ ఆమె దగ్గర తన మనసుని కంట్రోల్ చేసుకున్నట్లు ప్రవర్తించేవాడు. ఇక ఆమె దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
ఆమె బి.ఎ. వరకు చదువుకుంది.