Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 11

   

    అతనికి ఊహ తెలిసేటప్పటికి కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా వుంది. తండ్రి అప్పటికే చనిపోయాడు.  ఆస్తంటూ ఏమీలేదు. తల్లి విస్తర్లు కుట్టి అమ్మేది. ఆ వచ్చిందాంతో కుటుంబాన్ని లాగవలసివచ్చింది.


    అతనికి అప్పుడు పన్నెండేళ్ళు.  అతనికి ఓ అక్క వుండేది. ఆమె ఓ సంవత్సరం పెద్ద. పేరు ప్రియబాంధవి. ఆ ఊర్లో చాలామంది వాళ్ళ బంధువులే. అందర్లోకి వాళ్ళ కుటుంబమే పేదరికంతో వున్నా ఎవరూ చేయూత ఇవ్వలేదు, ఎవరి బతుకులు వాళ్ళు బతకడానికే సరిపోయేది. వీళ్ళ గురించెవరు పట్టించుకుంటారు?


    ప్రియ ఏడవ తరగతితోనే చదువు ఆపేసింది. ఆ ఊళ్లో అంతవరకే వుంది. ఎనిమిదిలో చేరాలంటే టౌన్ కి వెళ్లాలి. ఆడపిల్లను చదివించాలన్న పట్టుదల లేకపోవడంతోనూ, తను అనారోగ్యంతో బాధపడుతూ వుండడం వల్లనూ ప్రియను తల్లి టౌన్ లో చేర్పించలేదు. మగపిల్లాడ్ని చదివిస్తే చాలనుకుంది.


    అట్లా నరేంద్ర టౌన్ లో ఎనిమిదో తరగతిలో చేరాడు. ఆ ఊర్లోంచి హైస్కూల్ కి వెళ్ళే వాళ్ళు పదిమంది వున్నారు. ఇద్దరమ్మాయిలయితే మిగిలిన వాళ్ళు మగపిల్లలు.


    తల్లి తనకు స్కూల్ యూనిఫారమ్ కుట్టిస్తుందని, కొత్త పుస్తకాలు కొనిస్తుందని నరేంద్ర బహుసంతోషంగా వున్నాడు. ఇంటింటికీ వెళ్లి తన స్నేహితులతో తాను టౌన్ లోని హైస్కూల్ లో చేరుతున్నానని కొత్త బట్టలు, కొత్త పుస్తకాలు కొనిస్తుందని చెప్పాడు.


    అయితే చివరికి అతను స్కూల్లో చేరాడుగానీ, కొత్త పుస్తకాలు గానీ, కొత్తబట్టలుగానీ లేవు.


    "నిదానంగా తీసిస్తారా కన్నా- ఫీజు కట్టడానికే తల ప్రాణం తోకకు వచ్చిందని" తల్లి బ్రతిమలాడుతూ చెబుతుంటే ఏడుపు ఆగింది కాదు.


    రోజూ పాత బట్టల్తోనే స్కూల్ కి వెళ్ళేవాడు. యూనిఫారమ్ లేదని మొదట్లో హెడ్మాస్టర్ తిట్టేవాడు. ఆ తర్వాత ఓరోజు ప్రేయర్ లో వుండగా పట్టుకున్నాడు. యూనిఫారమ్ వేసుకురానందుకు తల వాచేలా చీవాట్లు పెట్టి చివరగా "ఈరోజు బెల్ అంతా నువ్వే కొట్టాలి" అని ప్రతి పీరియడ్ కి బెల్ అతనిచేతే కొట్టించాడు.


    ఆ సంఘటన కుర్రాడి హృదయంలో బలంగా ముద్రవేసింది. తనతో చదువుకునే పిల్లలంతా ఎగతాళి చేయడం ప్రారంభించారు. అలాంటి సమయాల్లో గుండె అవిసిపోయేలా ఏడ్చేవాడు. ఆ తరువాతెప్పుడో ఆరునెలల పరీక్షలైపోయాక, తల్లి యూనిఫారమ్ బట్టలు కొనివ్వగలిగింది. అయితే అంతటితో అతని బాధలు తీరిపోలేదు. ప్రతీ చిన్న విషయంలో అతని పేదరికం అతన్ని అపహాస్యం చేసేది. ఒంటరివాడ్నిచేసి వెక్కిరించేది.


    రోజూ పిల్లలంతా ఊర్నించి టౌన్ కు నడిచిపోయేవారు. ఒక్కోరోజు బస్సుకు వెళ్ళాలని నిర్ణయించేవారు. తలా అర్దరూపాయి ఇవ్వాలని అనేవారు. అంతా అలానే ఇచ్చేవారు. కండక్టర్ ని బ్రతిమలాడుకుని వచ్చిన కలెక్షన్ అంతా అతని చేతిలో పెట్టి స్కూల్ కి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ అర్ధరూపాయి కూడా ఇవ్వని నరేంద్రను కండక్టర్ ఎక్కించుకునేవాడు కాదు. దీంతో ఒక్కడే మూడు కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు.


    ఇదేకాదు- ఇలాంటివి చాలా. ప్రతిసారీ అతను డబ్బుల్లేక ఒంటరి వాడైపోయేవాడు.


    ఒక్కోరోజు స్కూల్ వదిలిపెట్టగానే హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేయాలనుకునేవారు పిల్లలు.


    "ఎవరి జేబుల్లో ఎంతుందో అంతా ఇచ్చేయండి" అనేవాడు లీడర్ గా వుండేవాడు. అంతా ఎంతో కొంత ఇచ్చేవారు. అయితే ఏమీ ఇవ్వంది నరేంద్రే. దాంతో అతన్ని వదిలిపెట్టి అందరూ లోపలికెళ్ళేవాళ్ళు.


    ఒంటరిగా ఊరికి వెళ్ళడం భయం కాబట్టి వాళ్ళు వచ్చేంతవరకు హోటల్ బయటే నిలబడేవాడు.


    వాళ్ళు బయటకువచ్చేవరకు హోటల్ మెట్లమీద నిలబడడం ఎలా వుంటుందో ఊహించవచ్చు.


    వాళ్ళు వచ్చాక ఊరికి బయల్దేరేవాడు. ఇక ఇంటికి చేరేవరకు తోటి పిల్లలు హోటల్లో తాము తిన్న పదార్ధాల మీద కామెంట్లే. అవి వింటూవుంటే దరిద్రం తన గుండెను తిప్పుతున్నట్లే వుండేది.


    హైస్కూల్ చదువంతా అలానే గడిచింది. స్కూల్ కి మధ్యాహ్న భోజనం కోసం ఇంట్లోంచి చద్దిఅన్నం, మిరపకాయ తీసుకెళ్ళే విద్యార్థి అతనొక్కడే. అందరూ స్టీల్ క్యారియర్లలో భోజనాలు తెచ్చుకుంటే అతను మాత్రం పాత అల్యూమినియమ్ క్యారియర్ లో అన్నం తెచ్చుకునేవాడు. అలా అందర్లోనూ అతను ఎంతో తక్కువగా వుండేవాడు. స్కూల్ లైఫ్ ముగిసి కాలేజీలో చేరాడు. అక్కడా అంతే. వేసుకోవడానికి బట్టలుండేవి కావు. పుస్తకాలుండేవి కావు. తోటి విద్యార్థులు దయతలిచి ప్యాంట్లూ, షర్టులు ఇచ్చేవాళ్ళు.


    ఇంటర్మీడియట్ రెండేళ్ళు గడిచాయి. అన్నింట్లో వెనకబడ్డ తను చదువులో అయినా ఫస్ట్ రావాలని కష్టపడి చదివాడు. పుస్తకాలు అరువు తెచ్చుకుని చదివాడు. కొందరు పుస్తకాలు ఇవ్వక అంతా కావాలంటే మా ఇంట్లో చదువుకొని వెళ్ళిపో అంటే అట్లాగేనని ఇళ్ళకువెళ్ళి ఆ వరండాలలో కూర్చుని చదివాడు.


    పరీక్షలు అనౌన్స్ చేశారు. ఫీజు కట్టాలి. ఆత్మాభిమానం చంపుకుని తల్లిని డబ్బులు అడిగాడు. ఆ వయసులో తల్లిమీద ఆధారపడటం సిగ్గుగా అనిపించేది.


    "ఇస్తాను లే బాబూ" అని అందిగానీ ఆ మాట వింటూనే ఆమె గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. తినడానికే తిండి లేదు. పస్తులతో కాలం గడుపుతున్నారు. మరిప్పుడు ఫీజు అంటే ఎలా? ఆమె ఆ డబ్బు కోసం చేయని ప్రయత్నమంటూలేదు.


    పరీక్షఫీజు గడుపు సమీపిస్తోంది. ఏంచేయాలో తోచడంలేదు. అతను మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా చదువుతున్నాడు. ఇక రెండ్రోజులే టైముంది. ఫీజు కట్టకపోతే పరీక్షకు హాజరు కానివ్వరు. గంటలు గడిచే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది.


    ఆ రాత్రి తల్లి ఫీజుడబ్బులు చేతిలో పెట్టింది. ఫీజు కట్టకుండా చదువు కొండెక్కిపోతుందని భయపడ్డ అతనికి ఎంతగానో రిలీఫ్ అన్పించింది.


    "ఎలా తెచ్చానమ్మా?" అనడిగితే ఆమె జవాబు చెప్పలేదు. అతను బలవంతం చేస్తే చెప్పింది. "నా పెళ్ళికి పెట్టిన పట్టుచీరవుంది కదా. ఇక అదెందుకు? ఆయనే వెళ్ళాక అది పెట్టెకే పరిమితమైపోయింది. అందుకే దాన్ని చించి అందులో వెండిజరీని అమ్మేశాను."


    ఆమె చెప్పుకుపోతోందిగానీ అతనికేమీ వినిపించలేదు. తల ముక్కలుగా పగిలిపోతున్నట్టు అనిపించింది.


    పరీక్షలు రాశాడు. రిజల్ట్స్ వచ్చి పాసయ్యాడు ఫస్ట్ క్లాస్ లో. కానీ డిగ్రీలో చేరలేదు.


    ప్రపంచంమీద, తన చుట్టూవున్న వాళ్ళమీద, తన పరిస్థితుల మీద, తమ దరిద్రంమీద, తమను అనాథుల్నిచేసి చచ్పిపోయిన తండ్రిమీద, పౌష్టికాహార లోపంవల్ల ఇరవైఏళ్ళు వచ్చినా సరైన గ్రోత్ లేక చిన్నపిల్లలా కనిపించే తన అక్కమీద, ఏడ్వడం, విస్తర్లు కుట్టడం తప్ప మరేమీ చేతకాని తల్లిమీద, ఇలా అన్నిటిమీదా కసిపెంచుకోవడం తప్ప మరేమీ చేయలేనటువంటి తన చేతకాని తనంమీద కసి పుట్టుకొచ్చింది.


    ఏదైనా చేసి ఇన్నాళ్ళూ తన దరిద్రం మీద జోక్ లు వేసి నవ్వుకున్న ఈ లోకంమీద కసి తీర్చుకోవాలనిపించింది. కానీ ఏం చేయాలన్నీ డబ్బు కావాలి. ఎట్లా?


    చాలారోజులు ఆలోచించిన తరువాత అతనికి పెట్టుబడిలేని వ్యాపారం ఒకటి తట్టింది. అది పాలు.


    పల్లెటూర్లలో పాలు సేకరించి టౌన్ లో టీ అంగళ్ళకు, హోటళ్ళకు పోయడం. టౌన్ లో కెళ్ళి ఓ పెద్ద హోటల్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. వాళ్ళచేత అడ్వాన్స్ పుచ్చుకుని పాలక్యాన్స్, సైకిలు కొన్నాడు.


    అలా వ్యాపారం ప్రారంభించాడు. పాలు పెరిగాయి. హోటళ్ళకే కాకుండా, ఇళ్ళకు కూడా పాలుపోయడం ప్రారంభించాడు. పెద్దవాళ్ళతో పరిచయం వుండాలని పాలు పోయడానికి ఆఫీసర్స్ కాలనీని ఎంపిక చేసుకున్నాడు. అలానే పరచయమయ్యాడు అతనికి శివరామారావు.

 Previous Page Next Page