Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 13


    
    మొదట్లో వాళ్ళు సింగరాయకొండలో వుండేటప్పుడు తను ఉద్యోగం చేస్తానంది.


    "నువ్వు ఉద్యోగం చేయడమా? నా పరువేంగాను, అలాంటివితప్ప నువ్వు ఏం కోరుకున్నా యిస్తాను" అని ఖచ్చితంగా చెప్పేశాడు.


    "పరువు మిగిలిన విషయాలవల్ల పాతికశాతం వస్తే, మిగిలిన డెబ్భై అయిదుశాతం భార్యవల్లే వస్తుంది" అని ఆమె కొద్దిగా సన్నబడ్డా తెగ బాధ పడిపోయేవాడు.


    ఎప్పుడయినా రంగు వెలసిపోయిన నైటీ వేసుకుంటే చిరాకుపడిపోయేవాడు. ఆమె ఎప్పుడూ ఖరీదుగా, అందంగా కనపడాలని కోరుకునేవాడు.


    అతను ఏం చేసినా, ఏం చేస్తున్నా అది సంఘంలో తన పరపతిని పెంచుతుందా లేదా అనే ఆలోచిస్తూ ఉంటాడు.


    కాంట్రాక్టులు బాగానే జరుగుతున్నాయి. సంసారమూ హ్యాపీ.


    నరేంద్ర ఎలాంటి సమస్యలు లేకుండా పైపెచ్చు తన గొప్పల్ని అందరికీ చూపించుకుంటూ, చెప్పుకుంటూ ఆనందంగా వున్నాడు.


    నాలుగేళ్ళు గడిచిపోయాయి.


    ఈ కాలంలో అతను కాంట్రాక్టు రంగంలో మరింత పాతుకుపోయాడు. డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. సింగరాయకొండలోని బహుముఖ్యుల్లో ఒకడిగా పేరుబడ్డాడు.


    బంధువులందరూ రోజుకోసారయినా వీళ్ళని తలుచుకునే విధంగా పైకొచ్చాడు.


    అయితే అతనికి ఓ కొత్త సమస్య ఎదురయింది. అది అంతవరకూ పిల్లలు కలగకపోవడం.


    మొదట్లో అయితే పిల్లలు పుట్టకుండా తామే అడ్డుకుంటున్నామన్నట్లు చెప్పేవాడు.


    "పిల్లలా! అప్పుడే ఏమిట్రా? లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. పెళ్ళి అయిన వెంటనే పిల్లల్ని కనేసి అప్పుడే ముసలివాళ్ళం అయిపోయామన్న ఫీలింగ్ తెచ్చుకోవాల్రా? నో.... నెవ్వర్! హ్యాపీగా లైఫ్ ని, వైఫ్ ని ఎంజాయ్ చేశాకే పిల్లలు.... " ఇలా ఊదరగొట్టేవాడు.


    రెండో సంవత్సరం కూడా బలవంతంగా ఆ ఆర్గ్యుమెంట్ తోనే లాక్కొచ్చాడు. మూడో సంవత్సరం అలా చెప్పడం మానేశాడు. ఎదుటి వ్యక్తి తన మాటలు నమ్మలేదని ముఖం చూస్తూనే స్పష్టంగా తెలిసేది.


    అందుకే-


    లైఫ్ ని, వైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అన్న కేసెట్ ని ఫ్రెండ్స్ కి వినిపించడం పూర్తిగా మానేశాడు.


    మూడో సంవత్సరం నుంచి అసంతృప్తి పట్టుకుంది. పదిమంది కోసం బతికే నరేంద్రలాంటి వాళ్ళతో వచ్చిన చిక్కే అది. చిన్న సమస్య వచ్చినా భూతద్దంలో పెట్టి చూస్తారు. నలుగురిలో చులకన అయిపోయినట్టు ఫీలవుతారు. దాంతో మనశ్శాంతి కరువవుతుంది.


    నరేంద్ర కూడా అలాగే తయారయ్యాడు.


    పిల్లలు లేకపోవడంతో శశిరేఖ అసంతృప్తికి లోనవుతుందేమోనన్న అనుమానం మొదలైంది. చిన్న అసంతృప్తే భార్యాభర్తలమధ్య అగాధం పెంచుతుందని, దాంతో శశిరేఖ తనకు దూరమైపోతుందన్న భయం.


    భార్య వదిలిపోవడం కంటే అవమానకరమైన విషయం ప్రపంచంలో మరొకటి లేదని అతని ప్రగాఢమైన విశ్వాసం. అందుకోసం కావాలంటే తన ప్రాణాలైనా యిస్తాడుగానీ భార్యను మాత్రం వదులుకోడు.


    మగాడి పరువు, గౌరవం అన్నీ భార్యలోనే వుందని నమ్ముతాడు. అందుకే భార్య అంటే అతని దృష్టిలో విలువైనది. కోహినూర్ వజ్రం కన్నా అపురూపమైంది.


    నాలుగో సంవత్సరం మొదలైంది. తమకింకా పిల్లలు కలగకపోవడంపై బంధువులు, స్నేహితులు తమ వెనక గుసగుసలు పోతున్నారని కనిపెట్టాడు. ఇది భరించలేని నరకం అని తెలుసు. కానీ ఏమిటి చేయడం?


    పిల్లలు లేకపోవడం నలుగురిలో తనకు ఎంత తలవంపులు తెచ్చి పెడుతోందో తెలుసుకున్నాడు.


    తన మగతనం మీదే అనుమానాలు మొదలయ్యాయనిపించడంతో భరించలేకపోయాడు.


    అయితే ఆమె మాత్రం దీన్నొక సీరియస్ యైన విషయంగానే తీసుకోలేదు. ఎందుకంత టెన్షన్ పడిపోతారు. పిల్లలు పుడితే పుడతారు లేకుంటే లేదు. దానికెందుకంత హైరానా పడతారు. పదిమందిలో మనం గొప్పగా వుండాలని ఫీలవడం ఎంత తప్పో, పిల్లలు లేకపోవడం వల్ల మన పరపతి పడిపోతుందనుకోవడం కూడా అంతే తప్పు. పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోతున్నామేనని బాధపడం. అందులో కొంత అర్ధం వుంది.


    పిల్లల్లేకపోవడంతో నలుగురిలోనూ చులకన అయిపోతున్నామని ఫీలవకండి. దట్ ఈజ్ వెరీ బ్యాడ్" అని అతను బాధపడిపోతున్నప్పుడంతా చెప్పింది.


    మొత్తంమీద తను తిరిగి అందరికంటే తక్కువైపోయిన ఫీలింగ్ బయల్దేరింది నరేంద్రలో.


    అదిగో ఆ సమయంలో ఈ ఊరి దగ్గరున్న మామంతూరు బ్రిడ్జి పని వచ్చింది. మొత్తం ఫ్యామిలీతో కొన్నాళ్ళు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడు. అదీగాక శశిరేఖను విడిచి వుండలేనితనం కూడా వుంది. ఈ కారణాల రీత్యా ప్యామిలీని ఈ ఊరికి మార్చేశాడు.


    తను ఎప్పుడూ బయట వుంటాడు గనుక భార్యకు తోడుగా గంగారత్నంను నియమించాడు. గంగారత్నంతో మొదట మాట్లాడినప్పుడే అతను ఆమెను తన భార్యకు తోడుగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు.


    గంగారత్నానికీ చింతామణి వయసే వుంటుంది. అరవై ఏళ్ళు. భర్త ఇరవై సంవత్సరాలక్రితం చనిపోయాడు. అప్పట్నుంచే ఒంటరి జీవితం. పిల్లల్లేరు.


    ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి, సాయం చేయడానికీ ముందుంటుంది.


    ఆమె దృక్పథం కూడా అలాంటిదే. మనిషికన్నా సంఘం ముఖ్యం. మన ప్రవర్తనవల్ల సంఘం మరింత బావుండాలిగానీ చెడిపోకూడదు.


    "మనం ఏపని చేసేప్పుడైనా దీనివల్ల సంఘానికి మంచా? చెడా? అనేది ఆలోచించాలి. సంఘం కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళకోసం మన సుఖసంతోషాలైనా త్యాగంచేయాలి" అలా మాట్లాడుతుందామె.


    "మా ఆవిడకంటే విలువైనది మరొకటి లేదు ప్రపంచంలో నాకు. కాబట్టి నేను లేనప్పుడు మా శశికి ఎలాంటి ప్రాబ్లమ్ లు రాకుండా చూడు. ఇక ఇందుకోసం జీతం అంటావా? నీ ఇష్టం. ఎంతైనా తీసుకో" అన్నాడు. భార్యపట్ల అతనికున్న ప్రేమను చూసి ఆమె సంతోషించింది.


    "అలానే" అన్నది.


    అట్లా గంగారత్నం నరేంద్ర ఇంట్లో ఉండిపోయింది.


    ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వున్నా నరేంద్ర ఆమెకోసం వెయిట్ చేస్తున్నాడు.


    "గంగారత్నం ఎక్కడికి వెళ్ళింది?" అన్నిపనులూ అయ్యాక సోఫాలో కూర్చుంటూ అడిగాడు నరేంద్ర.


    "ఆంజనేయుల గుడికివెళ్ళింది. వచ్చేస్తుంది. అయినా నేనేం చిన్న పిల్లనా! నాకేం కాదు మీరెళ్ళిరండి" అంది శశి, వంటగదిలోంచి హాల్లోకి వస్తూ.

 Previous Page Next Page