Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 11


    
    "ఇంత పెద్ద సంఘటన పోనీ పరిణామం కేవలం అలవాటుగా తీసుకుంటుందా?"
    
    రాజీవ్ నవ్వాడు. "అలవాటుగా మారకముందు అన్నీ పెద్ద సమస్యల లాంటివే.  మారిపోయాక చాల స్వల్ప విషయంగా మారిపోతుంది. అప్పుడు పెద్ద సమస్యల్లా... ఈ రహస్యాన్ని ఎలా దాచివుంచాలా అన్నదే."
    
    "ఛీ!" అన్నది చిన్మయి.
    
    "అలా రహస్యంగా ఉంచటం ఒక్కోసారి అవసరముంటుంది. జీవితాలు పాడుకాకుండా వుండేందుకు."
    
    "తప్పుచేసి రహస్యంగా వుంచడంకన్నా- ఆ జీవితాలు నాశనం కావడమే ఒకరకంగా మేలు."
    
    "ఇంకో విశేషం కూడా మనం ఆలోచించాలి. ఒక మనిషి పోనీ ఆడది తప్పు చేసినంతమాత్రాన భర్త అంటే గౌరవం లేనిదని మనం భావించకూడదు. అవసరమొస్తే ఆ రెండోమనిషి కంటే భర్తనే వెనకేసుకు వస్తుంది."
    
    చిన్మయి ముఖం ఎర్రబడింది. "ఓ పాడుపని చేసి భర్తని వెనకేసుకు వచ్చినంతమాత్రాన ఆ పాపం కరిగిపోతుందా? అలా వెనకేసుకు వచ్చిందంటే అది ఆత్మవంచన అవుతుంది. లేకపోతే నటన అన్నా అవుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే భర్తని దారుణంగా మోసం చేయటం అవుతుంది."
    
    అతను మాట్లాడటం ఆపేసి కోపంతో ఎర్రబడ్డ ఆమెముఖంలోకి, కళ్ళలో పొంగే కన్నీరును, వణికే పెదవులను చూస్తున్నాడు.
    
    "ఏమిటలా చూస్తున్నారు?"
    
    "కోపంతో వున్నప్పుడు అందంగా వెలిగే నీ సుందర వదనారవిందాన్ని."
    
    "కవిత్వం చెప్పకండి" అంతలోనే సిగ్గుపడిపోయిందామె.
    
    "అప్పుడు క్రోధారుణిమ! ఇప్పుడు లజ్జారుణిమ!"
    
    "ఏమిటీవేళ కవిత్వం ఒలకబోస్తున్నారు?"
    
    దగ్గరకు వచ్చి ఆమెముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
    
    "ఇంతటి అపురూప వజ్రం ఎక్కడో అరుదుగా వుంటుంది.  ఎంతో తపస్సు చేస్తేగాని దొరకదు."
    
    పెదిమలమీద పెదిమలు ఆనాయి.
    
    చిన్మయికి సర్వం మరిచిపోయినట్లయింది. ఈ లోకం ఎలాంటిదయితేనేం గాక, ఒక మహాకారుణ్యమూర్తి ప్రేమ, సమర్ధత, హృదయం, గుణం అన్నీ కలబోసివున్న సంపూర్ణమూర్తి తనకు భర్తగా లభించాడు. ఇతని నీడలో ఏ తప్పు జరుగదు.
    
    "చిన్మయి!"
    
    "ఊఁ"
    
    "నా కోసమే పుట్టిన పుష్పానివి నువ్వు నీ నీడలో ఏ తప్పు నన్ను సమీపించలేదు."    

    పెదవులతో బాటు శరీరాలు పెనవేసుకుపోయాయి.

                                             6
    
    తర్వాత రెండురోజులకే ఓ సంఘటన జరిగింది. రాజీవ్ ఆఫీసులో తనూజ అనే స్టెనో వుంది. ఇంకా అవివాహిత అందరితోనూ సోషల్ గా వుంటుంది గాని రాజీవ్ తో ఎక్కువగా డ్యూటీకోసం ఏర్పడ్డ సహచర్యంవల్ల కావచ్చు ఎక్కువగా మాట్లాడుతూ వుంటుంది. ఆమె మాటల్లో అప్రయత్నంగా వచ్చిన కవ్వింపు వుంటుంది. ఏదైనా మాట చెప్పేముందు నవ్వి, తరువాత మాట్లాడుతుంది. ఒక్కోసారి ఆమెమాటల్లో తనకుతాను తెచ్చుకున్న గారాబం కూడా వుట్టిపడుతూ వుంటుంది.
    
    మధ్యాహ్నం లంచ్ అవర్ లో అతనిదగ్గరికి వెళ్ళి టేబుల్ మీద చేతులాన్చి నిలబడి "మీతో ఓ సంగతి చెప్పాలి" అంది.
    
    "ఏమిటి?" అన్నాడు చదువుతున్నా పుస్తకంలోంచి తల ఎత్తి.
    
    "ఈవేళ నా బర్త్ డే."
    
    "అరె! ఇంతవరకూ చెప్పలేదే? మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే!"
    
    "ఈరోజు సాయంత్రం మీరు మాయింటికి రావాలి."
    
    "దేనికి?"
    
    "టీకి."
    
    "ఆఫీసులో మిగతావాళ్ళనికూడా పిలిచారా?"
    
    "ఏం, పిలవకపోతే మీరు రారా?"
    
    "అలా అనికాదు పార్టీ అదీ అంటే అందరూ వస్తారుకదా అని అడిగాను. సినిమాలోలాగా కొన్ని పదులమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు గుమిగూడడమూ, సర్వర్లు ట్రేలలో డ్రింక్ సీసాలు, గ్లాసులూ పట్టుకుని అటూ యిటూ తిరుగుతూ వుండటమూ, ఇంతలో హీరోయిన్ అద్భుతంగా అలంకరించుకుని మేడమేట్లు దిగివస్తూ హొయలు ప్రదర్శించడం, హీరో కళ్ళూ, హీరోయిన్ కళ్ళూ కలుసుకోవడం, ఆమెతోబాటు చెలికత్తెలందరూ అతన్ని పాటపాడమని కోరడం, అతను పియానో ముందు కూచుని మెట్లు నొక్కుతూ పాత ప్రారంభించటం హీరోయిన్ ఆ పాట కనుగుణంగా స్టెప్స్ వేస్తూ మధ్య మధ్య ఆగిపోయి పియానోమీద మోచేతులు ఆన్చి నిలబడి అతని కళ్ళల్లోకి చూస్తూ వుండటం ఇవేమీ వుండవు."
    
    "మిమ్మల్నే ఆహ్వానిస్తున్నాను అవును ఒక్క మిమ్మల్నే."
    
    టేబుల్ మీద చేతులాన్చి నిలబడ్డ ఆమెవైపు పరీక్షగా చూశాడు.
    
    "మీ ఇంట్లో ఎవరెవరున్నారు?"
    
    "మా అమ్మా, నాన్న, అన్నయ్యలూ అంతా వున్నారు."
    
    రాజీవ్ కొంచెం ఆలోచించి "సరే వస్తాను" అని "ఇల్లెక్కడ" అనడిగాడు.
    
    తనూజ వివరంగా ఎడ్రెస్ చెప్పింది.
    
    ఆ సాయంత్రం అయిదుగంటలకు రాజీవ్ స్కూటర్ పై టి. నగర్ అన్నామలై అమ్మాళ్ళ స్ట్రీట్ లో వున్న ఆమె ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు. తనూజ మూడుగంటలకే పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయింది.

 Previous Page Next Page