Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 11


    "ఎందుకనిపిస్తుంది? భార్యాభర్తల మధ్య అది పవిత్రమైన బాధ్యత."
    
    జగదీశ్ నవ్వాడు. "భార్యాభర్తల మధ్య ఒక అందమైన ఉరితాడు బిగించుకోవటమంటే అదే."
    
    "ఈ బంధాన్ని ఉరితాడు అని పిలవటం మంచిది కాదేమో."
    
    "చూడు చంద్రా, నువ్వు అవసరముంటేగానీ సొసైటీలో ఎక్కువగా మూవ్ అవవు సున్నితంగా సుకుమారంగా ఇతరులను గురించి మంచిగా మాత్రమే అలోచించటం చేతనవును. నీ అమాయకత్వం, నీ సెన్సిటివ్ నెస్- ఇవే నీ జీవితానికి ఎప్పటికైనా శత్రువులుగా పరిణమిస్తాయి. భార్యకోసం భర్త, భర్తకోసం భార్య ఎదురుతెన్నులు చూస్తూ ఉండటం, ఒకర్ని ఒకరు చూడకపోతే భరించలేకపోవటం ఇదంతా ఓ అందమైన నటన, పోనీ ఆత్మవంచన."
    
    "ఒకరినొకరు ప్రేమించుకోవటం ఆత్మవంచన, నటన అంటావా జగదీష్?"
    
    "ప్రేమ ఉండటం ఆత్మవంచన కాదు చంద్రా ప్రేమప్రకర్ష గురించి నే చెప్పేది. ఎదుటి వ్యక్తి స్నేహితుడైనా కానీ, భార్య అయినా కానీ, పిల్లలయినా కానీ పూర్తివిలువ నివ్వకు. ఎక్కువగా ఎటాచ్ మెంట్ పెట్టుకోకు. వాళ్ళు చెప్పేదంతా నిజమేనని నమ్మకు. నీకు తెలీని జీవితం వారికి కొంత ఉందనీ, నీ నుంచి వారు కొంత దాచిపెడుతున్నారనీ గ్రహించు."
    
    "నీ భార్యా పిల్లల్ని గురించి నువ్వలా అనుకుంటావా?"
    
    "తప్పకుండా నాకు తెలీని జీవితం ఎంతోకొంత వారికి ఉందని నేను నమ్ముతాను. కాని పట్టించుకొను. పిల్లలు ఇంటికి ఆలస్యంగా వస్తే కారణం అడగను. నా వైఫ్ దేన్ని గురించయినా నాకు చెప్పకుండా దాచిపెట్టిందని అనిపిస్తే నేను గుచ్చి గుచ్చి అడగను. అడిగి ప్రయోజనం లేదు కాబట్టి దాని వల్ల ఇద్దరిమధ్యా దూరం పెరుగుతుందిగాని దగ్గరవటం జరగదు. యాంత్రికంగా ఉండటం వల్ల మనల్ని మనం నలిపేసుకోకుండా కాపాడుకోగలుగుతాం. వాళ్ళ గురించి నేనెలా గుచ్చి గుచ్చి అడగనో- అలాగే నా గురించీ వాళ్ళకు వివరంగా చెప్పను."
    
    "నీ భార్య నీతో అరమరికలు లేకుండా ఉండాలనీ, నీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలనీ నువ్వు కోరుకోవా?
    
    "కోరిక ఎందుకుండదు? వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ చేస్తాను పైకి వస్తానంటే ఎంతయినా సహకారం అందిస్తాను. కాని నేననుకున్నట్లు వాళ్ళ జీవితాలు రూపురేఖలు దిద్దుకోకపోతే క్రుంగిపోను. సరిపెట్టుకుంటాను. అది సహజమైన విషయంగా భావించి ఊరుకుంటాను."
    
    "పిల్లలకోసం తల్లీ, తండ్రీ మధనపడటం తప్పంటావా?"
    
    "తప్పుకాదు మథనం చాదస్తం కాకూడదు దానిని తేలికగా తీసుకోకపోతే ఇవ్వకూడనంత ప్రాధాన్యం ఇస్తే మనం మెంటల్ పేషెంట్స్ గా తయారవవలసి వస్తుంది."
    
    రాజాచంద్ర ఏమీ మాట్లాడలేక కొంచెంసేపు స్తబ్దుగా ఉండిపోయాడు.
    
    జగదీష్ అతని ఖాళీ గ్లాసులో కొంచెం విస్కీ పోశాడు.
    
    రాజాచంద్ర ఉలిక్కిపడి "అరె! ఇదేమిటి? ఇప్పటికే కొంచెం ఎక్కువ తీసుకున్నాను" అన్నాడు కంగారుపడుతూ.
    
    "నువ్వెక్కువేం తీసుకోలేదు నువ్వు డ్రింక్ చేసినవన్నీ హాఫ్ పెగ్సే అప్పుడప్పుడూ లైఫ్ కి కొంత థ్రిల్, మనసొంత జీవితమంటూ ఉండాలి చంద్రా."
    
    ఎందుకో ఆరోజు ఇంకా కొంచెం తాగాలనిపించింది. జగదీష్ సోడా కలిపాక గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు.
    
                                                * * *
    
    దాదాపు ఓ గంట గడిచాక రాజాచంద్ర కారు డ్రైవ్ చేస్తూ ఇంటివైపు పోనిస్తున్నాడు.
    
    జగదీష్ మాటలు మెదడులో ప్రతిధ్వనిస్తున్నాయి.
    
    ఎన్ని రకాల మనస్తత్వాలు! భార్య, భర్త ఒకరికోసం ఒకరు అనుక్షణం తాపత్రయపడుతూ, పిల్లలను స్నేహితులుగా చూసుకుంటూ, వలల వ్యక్తిత్వాలకి గౌరవమిస్తూ, వాళ్ళ గురించి ఆరాటపడుతూ- తమ కుటుంబం, ఏం జరిగినా తేలికగా, నిర్లక్ష్యంగా తీసుకుంటూ ఏ కాంప్లికేషన్ కయినా సిద్దపడే జగదీష్ కుటుంబం...
    
    ఎక్కడ లోపముందీ తెలీటంలేదు. అసలీ జనరేషన్ లోనేనా? పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మనుషులని మనవైపు తిప్పుకోలేకపోవటం వల్లనా?
    
    అతనికి నిజంగా తెలీటంలేదు.
    
                                                * * *
    
    కారు పోర్టికోలో పెట్టి దగ్గరగా వేసి ఉన్న డోర్ తెరుచుకుని లోపలకు వెళ్ళాడు. విశారద సోఫాలో కూర్చుని టీ.వీ.వైపు చూస్తోంది. టీ.వీ. స్క్రీన్ మీద ఏవో బొమ్మలు కదులుతున్నాయి. అతనివైపు తలతిప్పి చూసి నవ్వింది.
    
    ఓ పది నిమిషాలు గడిచాక అతను డ్రెస్ ఛేంజ్ చేసుకుని బెడ్ మీద ఉన్నాడు. విశారద లోపలికి వచ్చి తలుపులు మూసింది.
    
    "పిల్లలంతా ఇంటికి వచ్చారా?" అన్నాడు.
    
    "ఊ" అంది నిజానికి వినూత్న ఒక్కతే ఇంట్లో ఉంది.
    
    అతనా రోజు భోజనానికి రానని ముందే చెప్పాడు. అందుకని ఆ విషయం ప్రస్తావనకు రాలేదు.
    
    "నేను... ఇవాళ డ్రింక్ చేశాను" అన్నాడు. ఆ సంగతి ఆమె కెంత తొందరగా చెబుదామా అని ఆరాటపడుతున్నాడు.
    
    విశారద నవ్వింది. బెడ్ మీద అతని పక్కకి వచ్చి కూర్చుంది.
    
    "నీకు... నేనంటే కోపం రావటంలేదా?"
    
    "దేనికి?"
    
    "డ్రింక్ చేసినందుకు..."
    
    "మొగవాడు సొసైటీలో అనేకమందితో సంచరించాల్సి వస్తూ ఉంటుంది. అందుకని కొన్ని తప్పవు. అంతే కాక డెయిలీ రొటీన్ తో విసుగెత్తి, అలసిపోయి ఉన్న మనిషికి కొంత రిలీఫ్ కావాలని తెలుసు."
    
    అతని గుండెలోంచి బరువు తీసేసినట్లయింది. ఇప్పుడు చాలా నిశ్చింతగా ఉంది.

 Previous Page Next Page