Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 12


                                  చావులేని చారుశీలికి1

విద్యుత్తులు ప్రవహించే నీ నరాల్తో
విప్లవం శాలువ అల్లినవాడా
తెల్లభయాని2 కెదురుగుండా
ఎర్ర బీభత్సం జల్లినవాడా

ఉడుకు నెత్తురుప్పోంగే యువతీ యువకుల్నీ
అడవుల్లోకి పంపించినవాడా
అడవుల్లోంచి మైదానాల్లోకి
ఆనందం దింపించినవాడా

ఆలోచనల్ని ఘాటెక్కించి
ఆచరణగా మార్పించినవాడా
అన్యాయాల్ని బోనెక్కించి
ఆయుధానికి అఆలు నేర్పించినవాడా

భ్రమకి డమరుకం కొట్టి
శ్రమకి బొమిడికం పెట్టి
జులుం పని పట్టించినవాడా
హజం ఆట' కట్టించినవాడా

జనం బలం అనే నిస్త్రింశంలో
ధనం వ్రణం శాస్త్రించిన వాడా
డియర్ కామ్రేడ్ చారుమజుందార్
అందుకో మా అందరి జోహార్

                                                                               రచన : 26 - 7 - 1973
                                             ముద్రణ : మరో ప్రస్థానం , విరసం ప్రచురణ - మే, 1980.

1. చారుమజుందార్.
2. తెల్లభయం : ప్రభుత్వ దమనకాండని ఇంగ్లీషులో వైట్ టెర్రర్ అంటారు. దీన్ని శ్రీశ్రీ తెల్ల భయంగా తెనిగించారు.

 Previous Page Next Page