కన్నవాళ్ళకి కన్నీళ్ళు మిగల్చడం తప్ప గెంజినీళ్ళు పోయని కొడుకుల గురించి ఆ వృద్దుడు దిగులుగా చెబుతుంటే భావరహితంగా చూస్తుండిపోయింది.
"విజయలక్ష్మిగారి కూతురు"
ఉలికిపాటుగా చూసింది ఏకాంత. అప్పుడే తననెవరో గుర్తుపట్టారు. ఊరి పొలిమేరల్లోని ఇళ్ళలో సందడి మొదలైన సూచనగా గడపల దగ్గర నుంచి ఆమెను చూస్తున్నారు ఆడా మగా ఆమెకు ఆశ్చర్యంగా వుంది. ఎవరో తనను స్టేషన్ లోనే చూసి ఈ వార్తను మోసుకొచ్చినట్టుగా వుంది.
పరిచితులైన ఒకరిద్దరిని పలకరించాలనుకుంది కాని ఆమె ప్రయత్నాన్ని చూసి కంగారుపడినట్టు తల తిప్పుకున్నారు.
ఆశ్చర్యం... బావినుంచి నీళ్ళ బిందె తీసుకొస్తూ ఎదురైంది నారాయణమ్మ.
"నారీ....." హైస్కూలులో ఏకాంత ఆమెను ముద్దుగా అలానే పిలిచేది.
ముందు నారాయణమ్మ నివ్వెరపోయింది.
రిక్షాలో నుంచి దిగబోయిన ఏకాంతతో మాట్లాడ్డం ఇష్టం లేనట్టు వేగంగా సందులోకి నడిచింది.
మనసు చివుక్కుమన్నా ఏకాంత బాధపడలేదు.
ఎందుకు బాధపడాలి? ఒకనాడు తనను చట్టం తిరుగుబోతు అంది. చెడగొట్టబడినా చెడిపోయినదానిగానే ముద్రవేసింది. ఆ తర్వాత అదే చట్టం హంతకురాలిగానూ బ్రాండ్ వేసింది. ఏ వ్యక్తిగానీ తననెందుకు గౌరవించాలి? ఎప్పుడో ఆణిముత్యాలూ, రత్నాలూ, ఖనిజ నిక్షేపాలూ దాచుకున్న జలధిలా తన తెలివిని అందరూ అభినందించిన రోజు తనతో స్నేహం గర్వకారణం ఇప్పుడు తను కల్మషాన్ని మోసుకువెళుతున్న ఓ కాలువ... ఎవరైనా తన మీద ఎందుకు ఆపేక్షని ప్రదర్శించాలి?
రిక్షా సాగిపోతూంది చివరి గమ్యానికి చేరువగా....
ఆకాశంలోని సూర్యుడు బలిపీఠంపై అడుగుపెడుతున్న దోషిని చూస్తున్నట్టు వేడి కిరణాలను వర్షిస్తున్నాడు.
ఏకాంతకి టెన్షన్ గా వుంది. ఫాలభాగంపై పేరుకుంటున్న స్వేదబిందువుల్ని తుడుచుకుంటూ ఇళ్ళ వెనుకవున్న మామిడి తోపుని చూస్తూ చిన్నతనంలో సంక్రాంతికి కూడబెట్టుకున్న గొబ్బి పూలని గుర్తుచేసుకుంది. పలచగా ప్రవహిస్తున్న కాలువని చూస్తూ కొట్టుకుపోతున్న తాటిపళ్ళకోసం స్నేహితురాళ్ళతో కలిసి కాలువలోకి దుమికి చేసిన అల్లరి జ్ఞప్తికి తెచ్చుకుంది.
ఎలిమెంటరీ స్కూలు ఆవరణలో ప్రియనేస్తాలతో వెన్నెల నీడన ఆడుకున్న చెమ్మచెక్కల చిలిపి తగాదాలూ మనసుని మెలిపెట్టి బాధాకరమైన ఆనందాన్ని అందిస్తుంటే "ఆపేయ్ తాతా" అంది కంపించే స్వరంతో
"ఇల్లు ఆ ముందు వీధిలో కదమ్మా!"
పెదనాన్న ఇంటిముందు రిక్షా దిగడానికి మనస్కరించలేదు. రిక్షా కిరాయి ఇస్తూ చేసే ఆ కొద్దిపాటి జాప్యాన్నీ ఆ ఇంటివాళ్ళు భరించలేరు.
"వంద రూఅపయాల చిల్లర లేదమ్మా" అన్నాడు రిక్షా తాత ఇబ్బందిగా.
"ఫర్వాలేదు! ఉంచుకో"
నిశ్చేష్టుడయ్యాడు "అమ్మా..."
అది పిలుపు కాదు. అనూహ్యమైన కృతజ్ఞతని మాటలతో వ్యక్తం చేయలేని నిస్సహాయత. కన్నబిడ్డలు పట్టించుకొని తండ్రి గుండెల్లో ఓ అపరిచితురాలి ఆప్యాయతని ఖరీదు కట్టలేని ఆర్ద్రత.
"నూరేళ్ళు చల్లగా వుండమ్మా" అన్నాడు ఆ వృద్దుడు కళ్ళు చెమ్మగిల్లుతుంటే.
టక్కున ఆగింది ఏకాంత. గట్టు దాటే సముద్రం ఇంకా తన ఉనికి గట్టుకి దిగువనే అని ఏ రుషో గుర్తుచేస్తుంటే రియాక్టయినట్టు చూసింది. ఒకనాడైతే ఈ ఆశీస్సులకి ఆనందించేది.... ఆర్తిని మనసులోనే దాచుకునేది. ఇప్పుడామె నీరుగానే ఇంకిపోయే కొలను కాదు. బ్రతుకు వెదికి ఆవిరై, ఆనక మేఘమై తన అస్తిత్వాన్ని విస్తృతం చేసుకోవాలనుకుంటూంది. తను వచ్చింది ఇక్కడే వుండటానికి కాదు. తనవాళ్ళనుకుంటున్న మనుషుల్ని, తను ఒకనాడు తిరుగాడిన ప్రదేశాలను చివరగా చూడటానికి.... ఉరితీయబడుతున్న క్షణంలో ఆత్మీయులనోమారు కలవాలనే ఆఖరి కోరికలాంటి స్థితి అది.
నడుస్తూంటే ఆమె కాళ్ళు సహకరించడం లేదు.
ఏదో సాధించి వున్న ఇంటికి తిరిగివచ్చే వ్యక్తికీ, ఓడిన బ్రతుకును మోసుకుంటూ తన వాళ్ళని దర్శించటానికీ చాలా వ్యత్యాసముంటే ఇప్పుడు ఏకాంత కూడా అదే స్థితిలో వుంది.
అయినా ఇదేమిటి...
వింత జంతువును చూస్తున్నట్టు అంతా గడపల దగ్గర నిలబడ్డారే తప్ప ఏ ఒక్కరూ పలకరించరే....మాట్లాడితేనె మైలపడిపోతారా?
లోగిలిలాంటి ఇంటిముందు ఆగింది ఏకాంత. బయట అలికిడిగా లేదు. తను వస్తున్నట్టు ఈపాటికి ఇంట్లోవాళ్ళకి తెలిసి వుండాలే!
నెమ్మదిగా, నిస్త్రాణగా అడుగులు వేస్తూ కాంపౌండ్ దాటి ఇంటివసారాలో అడుగుపెట్టింది. ఇక్కడే..... పెదనాన్నతో మంచంమీద కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ప్రశ్నలు అడిగేది. అన్నయ్యలతో, వదినలతో కబుర్లు చెబుతూ ఆటలాడుకున్నది ఈ ప్రాంగణంలోనే.
ఏమిటి.... ఇంట్లో ఎవరూ లేరా?
ఇంటినిండా మనుషులుండే ఈ కొంపలో అలికిడి లేదేం?
అదోలాంటి ఉద్వేగం.
ద్వారం ధాటి లోపల అడుగుపెడుతుంటే అప్పుడు వినిపించింది "ఆగు"
అది పెదనాన్న గొంతే...
కానీ అందులో ఆప్యాయత లేదు.
ఎదురుగా హాలులో నిలబడ్డ రామునాయుడుగార్ని చూస్తూ "పెదనాన్నా" అంది తడబడుతూ.
"ఎందుకిక్కడికి వచ్చావు?"
దిగ్ర్భాంతిగా చూసింది ఏకాంత. వాడిపోయిన పువ్వుని గురించి కూడా జాలిని ప్రదర్శించే ఆ పెదనాన్నేనా ఇప్పుడు తనని నిలదీస్తున్నది. "నువ్వు నా తమ్ముడి కూతురివి కాదే..... నా బిడ్డవే" అంటూ గర్వంగా గుండెలకు హత్తుకుని మొన్న గర్వపడింది ఈ పెదనాన్నేనా....ప్రపంచమంతా తనను నిరసించినా తనను అర్ధం చేసుకోగల మనిషి పెదనాన్న మాత్రమే అనుకుంటే ఇలా ప్రవర్తిస్తున్నాడేం? అన్నయ్యలూ, వదినలు, తమ్ముడు ఎక్కడా.... ఎవరూ కనిపించరేం? తనను కలవకూడదని, కనీసం చూడకూడదని పెదనాన్న శాసించాడా... పెద్దమ్మేది?
అదిగో అప్పుడు వచ్చింది పక్క గదిలోంచి పెద్దమ్మ.
"ఇది మర్యాదస్తుల కుటుంబం ఏకాంతా! నలుగురి మధ్య మేం తలెత్తుకు తిరగాలి అంటే నువ్వు నీ దోవ చూసుకోవడం నయం"