Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 11


    "ఎటు వెడదాం?"

    "ఇటు" అన్నాడు గంగాధరగారు ఒకవైపు దారి చూపిస్తూ.

    లాకులు దాటి ఇద్దరూ కృష్ణానదివైపు నడవసాగారు. చాలా మనోహరమైన సాయంత్రం. నదిగాలి ఇద్దరి బట్టతలల మీద వున్న కాసిని వెంట్రుకల్నీ గలగల లాడిస్తోంది.

    కొంతదూరం పోయాక గంగాధరంగారు "ఇవాళ మీతో ఒక విషయం చెప్పాలి" అన్నాడు కొంచెం తగ్గి.

    "ఏమిటి?" ఈ నూతన ధోరణిచూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి ప్రశ్నించాడు చిదంబరం.

    గంగాధరంగారన్నారు, "చూడండి. ఈ విషయం మీతో చెప్పాలని చాలా రోజుల్నుంచీ అనుకుంటున్నాను. కాని ఏది?" అని చుట్ట పీలుస్తూ "ఎప్పటికప్పుడు యేదో అవాంతరం వచ్చి పడుతూనే వుంది. చిన్నపిల్లాడిలా అడుగుతున్నా ననుకోకండి. నేనంటే, మా సంప్రదాయం అంటే మీకున్న అభిప్రాయం ఏమిటి?"

    చిదంబరం కొంచెం ఆలోచించి "ఎంతమాటా? మీ విషయం, మీ సాంప్రదాయం విషయం ఒకర్ని అభిప్రాయం అడగవలసిన అభిప్రాయం కూడానా?" అన్నాడు.

    "చూడండి, నాన్చి అడిగే అలవాట్లు నాకు లేవు. మీ నారాయణకిచ్చి మా అమ్మాయిని పెళ్ళి చేయాలనే అభిప్రాయం నా కెప్పటినుంచో వుంది. మీ ఉద్దేశ్యం ఏమిటి?"

    చిదంబరం సంతోషిస్తూ "ఉద్దేశం ఏమిటి? నాకు యిష్టం- అయిష్టం ఈ రెండూ లేవు. అయినా  యిటువంటి విషయాలు మా అమ్మతో మాట్లాడటం మంచిది" అన్నాడు.

    గంగాధరంగారు చనువు తీసుకొని చిదంబరం భుజంమీద చరుస్తూ "చంపారు. నాకన్నా ఒకటి రెండేళ్ళు పెద్దేగాని చిన్న అనుకోను. ఈ వయస్సులో మీ మాట కన్నా మీ తల్లిగారి మాటలకి ఎక్కువ విలువ యిస్తున్నారంటే ఆశ్చర్యంగా వుంది" అన్నాడు.

    ఈ మాటల్ని ఆయన కొంచెం అసహ్యంతో కూడిన ఒక విధమైన అసూయభావంతో అంటున్నాడని చిదంబరానికి తెలీదు.

    నవ్వుతూ "విలువల విషయం అట్లా వుంచండి. నాకేమీ తెలీదు. నా కసలు అనుభవం తక్కువ. ఆవిదతోనే మాట్లాడితే ఏం పోయిందీ" అన్నాడు.

    "అలాగైతే అలాగే కానిద్దాం"

    గంగాధరం గారు దృఢమైన మనిషి. వయస్సయితే పెద్దదిగాని, నడకలోనూ, నడతలోనూ కూడా యువకుల కుండే పటుత్వం ఆయనలో వుంది. చిదంబరం అట్లాకాక రోగిష్టిమనిషి, ఎక్కువ ఎండలోగాని, ఎక్కువ చలిలోగాని తిరిగితే ఆయన ఆరోగ్యం వెంటనే చెడుతుంది.

    అందుకనే ఎక్కువదూరం పోకముందే "ఇహ వెనక్కి పోదామా? చలిగా వుంది" అన్నాడాయన.

    గంగాధరంగారు సమాధానం చెప్పకుండానే వెనక్కి తిరిగాడు. ఊళ్ళోకి వచ్చి చీలిపోవలసిన సమయం వచ్చాక ఆయన చిదంబరాన్ని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు.

    చిదంబరం ఇంటికి వచ్చేసరికి కనుచీకటి పడింది. భోజనాలైనాక భార్యతో ఈ విషయం కడపతానికి ఆయన పూనుకున్నాడు.

    "చూడసలు? నేనే మాటన్నా ఎవరూ పట్టించుకోరు. ఏది ఏమైనా మీ అందరి కన్నా పెద్దవాడినన్న విషయం ఒప్పుకుంటావా?"

    రాత్రి తొమ్మిది గంటలకు ఆయన పడుకోబోయేముందు ధోరణి ఈ విధంగా సాగింది. శారదాంబ కొంత గోడవారగా నిలబడివుంది. విశాల నేత్రాలతో భర్తవంక చూస్తూ "చెప్పండి. మీరేం చెప్పినా వింటాను" అంది మధుర కంఠంతో.

    "అలా అన్నావు బాగుంది. నేను పెద్దవాన్ని. నాకూ పిల్లాజెల్లా వున్నారు. వాళ్ళ ముచ్చట్లూ అవీ  చూడాలని నాకు వుంటుందంటావా? వుండదంటావా."

    "ఎందుకు వుండదు? తల్లి దండ్రులయిన ప్రతివారికీ సహజమేగా"

    చిదంబరం యిప్పుడు అసలు విషయాన్ని బయట పెడుతూ "మరయితే నారాయణకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏమిటి?"

    భర్త మాటల్లో నమ్మకం లేకపోయినా ఆ మాటల్ని విని సంతోష పరవశురాలవుతూ శారదాంబ "అవశ్యం, అలాగే చేయండి" అంది.

    "పిల్లను వెదికే భారం కూడా నామీద వేసుకున్నాను. నేను కూడా నారాయణుడి సుఖాన్ని కోరినవాడ్ని. వాడికి ఈడూ జోడూగా వుండే పిల్లను తెచ్చి ముడిపెట్టవలసిన భాద్యత నామీదనే వుందికదా!"

    శారదాంబ మాట్లాడలేదు.

    చిదంబరం ఆమె ముఖంవంక పరిశీలనగా చూస్తూ "అయితే నువ్వు జానకిని చూశావుగా! ఆమె గురించి నీ అభిప్రాయం ఏమిటి?"

    "ఏ జానకి!" అని శారదాంబ ఉత్కంఠతతో ప్రశ్నించింది.

    "గంగాధరం గారి కూతురు"

    శారదాంబ ఒక్కక్షణం వూరుకుని "ఆ పిల్ల బాగనే వుంటుంది" అంది.

    చిదంబరం సంతోషంగా "చూశావా, నేను గనుక సెలక్టు చేశానా, ఆ పిల్ల బాగుండకుండా వుండదు. నే నిదివరలో ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినా అనుకునే వాడిని, 'మహలక్ష్మిలా వుంది. మా ఇంటికోడలైతే బాగుండు'నని! ఆశ్చర్యంగా ఇవాళ గంగాధరంగారు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు!"

    "మీరు ఏమన్నారు?"

    సంతోషం ఇంకా అధిగమించగా ఆయన "ఏమంటానే! పిచ్చిదానా? అమ్మతో నేరుగా మాట్లాడమన్నాను. అన్నట్టు ఈ విషయం అమ్మతో చెప్పటం మరిచిపోయాను. ఏదీ? ఎక్కడుందామె!" అని గట్టిగా "అమ్మా" అని కేకవేశాడు.

    "ఎందుకురా!" అని లోపలెక్కడ్నుంచో వినిపించీ వినపించనట్లుగా అందామె.

    "ఒకసారి ఇటురా."

    మధ్య హాల్లో చాపమీద ఛాయను దగ్గరకు తీసుకుని కథలు చెబుతున్న ఆవిడగారు విసుక్కుంటూ మెల్లిగా లేచివచ్చి "ఎందుకురా పిలిచావు?" అని అడిగింది.

    "నిల్చోలేవు, కూర్చో! నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి."

    కొడుకు ఇలా అనేసరికి నిజంగా ఏదో ముఖ్యమైన సంగతే చెప్పబోతున్నాడని గ్రహించి గుమ్మంమీద కూర్చుంటూ "చెబుదూ" అంది బయటకు.

    చిదంబరం పెద్దవ్యవహారకర్తలాగ "గంగాధరంగారి పిల్ల జానకిని గురించి నీ అభిప్రాయం ఏమిటి?"

    "ఎందుకూ?" అని ఆవిడ సాగదీసింది. "ఆహాఁ! చెబుదూ

    ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడని కొడుకు ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడంటే తగినంత కారనం వుండకపోదని ఆ వృద్ధురాలు గ్రహించి, హాల్లోంచి 'ఎంతసేపు బామ్మా' అని కేకేసిన ఛాయకు "నువ్వు పడుకోవే" అని కేకేసి. "ఆఁ జానకి విషయమా? కొంచెం కరుగ్గా వుండే స్వభావమని నలుగురూ చెప్పుకుంటారు. అందులో నిజానినిజాలు తెలీవు సుమా" అంది సాలోచనగా.

    ఆయన వెంటనే అందుకుని "నలుగురూ అనుకునే మాటలు మనకు రుజువు ఏమిటి? లోకులు కాకులు. అంతెందుకు ఆ పిల్లని చూస్తేనే బోధపడుతుంది. సరే ఆ విషయం అలా వుంచు. మనం వాళ్ళతో సంబంధం కలిపితే ఎట్లా వుంటుంది!" అన్నాడు.

    "ఎవరూ? నారాయణ విషయమా?" అని ముసలావిడ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ కుతూహలంగా ప్రశ్నించింది.

    "ఊఁ అదే."

    ఆవిడ తాత్కాలికంగా సంతోషపడినా, ఇంట్లోకల్లా పెద్దదిక్కు తనే కావటంచేత కొంచెం జాగ్రత్తగా యోచించి "సంబంధాలు కలుపుకోవటం అంటే అంత తేలికైన విషయం కాదురా అబ్బాయి, ఎన్ని పుట్టు పూర్వోత్తరాలు చూడాలీ, ఏమిటీ? దానికంతా జరగవలసిన తతంగం చాలా వుంది మరీ!" అంది.

    "అవును. అందుకనే ఆ విషయాలు నీ మీదనే వదిలివేస్తున్నాగా!"

    ఆవిడ ఆనందంతో "అయితే నేను చెప్పినట్లు నడుచుకుంటార్రా?" అంది.

    "ఎందుకు నడుచుకోము? ఈ యింటి పెద్దవి నీవు. నీ మాట వినకపోతే యింకెవరి మాట వింటాము?" అన్నాడు చిదంబరం.

    "అయితేరేపోసారి గంగాధరంగారిని పిల్చుకురా" అని తల్లిగారు ఆజ్ఞ యిచ్చింది.

    శారదాంబ సందేహంతో "ముందుగా నారాయణ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిదికదా" అంది.

    "వాడుమట్టుకు ఎందుకు కాదంటాడు? నారాయణ విషయం నాకు తెలీదా?" అంది మంచిదికదా" అంది.

    "వాడుమట్టుకు ఎందుకు కాదంటాడు? నారాయణ విషయం నాకు తెలీదు?" అంది ముసలావిడ.

    "అయినా ఒకసారి కనుక్కుంటే పోయింది లేదుగా."

    ముసలావిడ కోడలి వంక ఒకసారి చురచురా చూసి "ఓహొ, నాకన్నా అన్నీ నీకే ఎక్కువ తెలుసల్లెవుందే" అన్నది.

    కోడలు జవాబు చెప్పలేదు.

    "సరే అయితే, అలానే కనుక్కోండి" అంటూ ఆవిడ అక్కణ్ణుంచి లేచి జాంమ్మంటూ లోపలికి వెళ్ళిపోయింది.

    మరునాడు ఉదయం నారాయణకు కాఫీ అందిస్తూ అంది శారదాంబ "నీతో ఒక విషయం చెప్పాలిరా?"

    ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. తల్లీ కొడుకూ యిద్దరే కూర్చుని వున్నారు.

    "ఏమిటమ్మా?" అనడిగాడు నారాయణ.

    "ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవటం నీ కిష్టమేనా?"

    అతను తలయెత్తి తల్లి వంకచూస్తూ "ఎందుకమ్మా" అని ప్రశ్నించాడు.

    "ఎందుకేమిటిరా? ఏయేడు పైబడినకొద్దీ పెళ్ళి చేసుకునే అవసరం ఎక్కువౌతుందా లేదా? నిన్న మీ నాన్నగారు కూడా అన్నారు, నువ్వు ఇష్టపడితే సంబంధాలు చూద్దామని?"

    "ఇప్పుడావిషయాలన్నీ ఎందుకులెద్దూ?" అని నారాయణ తప్పించుకొబోయాడు.

    శారదాంబ పట్టువిడవకుండా "ఆహాఁ, ఇవాళ నువ్వు చెప్పి తీరాలి, నా ముందు నువ్వు మాట దాచుకోలేవని తెలుసు. అందుకనే అడుగుతున్నాను. ఏమిటి నీ అభ్యంతరం?" అనడిగేసింది గబగబా.

    నారాయణ జవాబు చెప్పకుండా వూరుకున్నాడు.

    "నాతో చెప్పవా నాయనా?"

    "ఏం చెప్పమంటావు?"

    నారాయణ వేసింది నిజంగా చిక్కు ప్రశ్నే! అందుకే శారదాంబ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కాని తర్వాత సర్దుకుని సూటిగా "ఇప్పుడు నీకు పెళ్ళిచేసుకోవటం ఇష్టం అవునా కాదా?"

    ఒకటి..... రెండు..... మూడు నిమిషాలదాకా నారాయణ పెదాలు విప్పలేదు. శారదాంబ సందిగ్ధంగా అతనివంక చూస్తూ ఏదో అనబోయేసరికి అతనే అన్నాడు - -

    "నాకు యిష్టంలేదు"

    ఏదో అనబోతున్న ఆవిడ పెదాలు అలానే నిలిచిపోయాయి. మరుక్షణంలో ముఖం అంతా నల్లగా మారగా.....తలవొంచుకుంది.

    "నువ్వసలు ఈ ప్రశ్న అడగకుండా వుండాలిసింది?"

    ఆమె మాట్లాడలేదు.

    "అమ్మా!" అన్నాడు నారాయణ కష్టంగా.

    తల్లి పలకలేదు.

    నారాయణ ఇంకోసారి పిలిచాడు. లాభం లేకపోయింది. సగం త్రాగిన కాఫీ గ్లాసును అక్కడే వదిలి కలత చెందిన మనస్సుతో అతను అక్కడ్నుంచి లేచిపోయి తన గదిలోకి వెళ్ళాడు.

    ఉదయం లేస్తూనే తల్లి ఈ ప్రసక్తి ఎందుకు తీసుకువచ్చిందో అతనికి అర్థం కాలేదు. తగినంత కారణం వుంటేగాని ఆమె ఏ విషయమూ తనతో అనదు. ఆమె నోటినుంచి ఈ మాట వచ్చాయంటే వెనక కొంత భాగవతం జరిగి వుండాలి.

 Previous Page Next Page