"కొందరి స్వభావాలంతే అవంతీ! బహుశా మనకే డబ్బు విలువ తెలియక అలా ఫీలవుతామేమో, మీరంతా సుఖపడాలనేదేకదా ఆయనింత శ్రమపడుతున్నది?" అనునయించడానికి అంది వైజయంతి.
"సుఖానికి అంతెక్కడ? డబ్బు సంపాదించడం తప్పని నేననడం లేదు. కాని మానవత్వం అనేదికూడా మర్చిపోతే ఎలా? పదిమందిని బాధ పెట్టి సంపాదించిన డబ్బుతో నేను సుఖపడలేను. నాకీ సుఖాలు వద్దు, స్టేటస్ వద్దు పదిమందిని ఆదరించాలి. వాళ్ళ ఆదరణ పొందాలి. అది నా పాలసీ."
"నీ బాధ నా కర్ధం అయింది అవంతీ!" అనుకుంది వైజయంతి! ఆ సాయంత్రం విషాదంగా మారింది. కొన్ని సత్యాలు గుటకపడవు.
"మీ అన్నయ్య కూడా నీలాగా ఫీలవుతాడా?"
"అబ్బే లేదు. వాళ్ళకు తగ్గ కొడుకు. వాళ్ళంటే అన్నయ్యకు ప్రాణం ఆ యిష్టంలో వాళ్ళ తప్పులు కప్పడిపోతాయి- అంతే".
"చాలా మందిలో అదే గుణం కనిపిస్తూంది అవంతీ! తమవాళ్ళు చేసేవి తప్పులుగా అనిపించవు".
"నిన్ను కాలేజీలో కలవమని నాన్న చెప్పిన రోజు, మీరూ మా వాళ్ళలాంటి వాళ్ళే అనుకున్నాను. ఆ స్టేటస్ వుంటే తప్ప డాడీ అలా చెప్పరు మరి. అందుకే నిన్ను ఏడిపించాలనుకున్నాను. కానీ నీ అమాయకత్వం చూశాక తప్పు చేశాననిపించింది. అందుకే అంతసేపు మాట్లాడానీతో."
వైజయంతి నవ్వేసింది.
అవంతి కూడా నవ్వి "సారీ! నీ మనస్సు కూడా కష్టపెట్టాను. కాని నాకు అనిపించింది - ఇలాంటి జీవిత సత్యాలను నీకు చెప్పాలని. ఇక ఈటాపిక్ వదిలేసి మరేదయినా మాట్లాడుకుందాం పద. నా పుస్తకాలు చూద్దువుగాని" అంది.
* * *
రాత్రి ఇంటికొచ్చేసరికి పదకొండయ్యింది. అయినా డైరీ రాయడం మానలేదు వైజయంతి.
"ఇవ్వాళ అవంతినుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళింట్లో వంటకాలన్నీ బావున్నాయి. మా అమ్మ వంటవాణ్ని మెచ్చుకుంటున్నప్పుడయినా వాళ్ళ మమ్మీ అవన్నీ అవంతే చేసిందని చెప్పలేదు. మేమిద్దరం నవ్వుకున్నాం. అవంతి రహస్యంగా అంది. ఏ విషయంలో నయినా ఎవరిమీదా ఆధారపడకూడదన్న ఆశయంతో తను వంట నేర్చుకుందట. నాకు టీ చేసుకోవటం కూడా రాదు అని చెప్పుకోవాలంటే సిగ్గేసింది. ఆ అవసరం రాలేదు, రాదు, అన్న దృష్టితో పెరిగానిన్నాళ్ళూ కాని అది తప్పేమోననిపిస్తోంది. ఒకరోజు వంటమనిషి "కాకా" లేవకపోతే, మమ్మీ ఇంట్లో లేకపోతే టీ కూడా చేసుకు తాగలేని అసమర్దురాలిని రోజూ టీ చేసిచ్చే కాకాకి ఓ కప్పు కాఫీ చేసి యివ్వలేని స్థితిలో వున్నాను. ఈ అలవాటు మార్చుకోవాలి. త్వరలో వంట నేర్చుకోవాలి. అవంతి మామూలు అవంతి కాదు. ఆమె నా స్నేహితురాలు కావడం నా చైతన్య స్రవంతికి ప్రారంభం".
* * *
అప్పటివరకూ నత్తనడకలా నడిచిన రోజులు తను చదువుతున్న పుస్తకం పుటలకి మల్లే వేగంగా కదిలిపోతున్నట్లుగా అనిపించింది వైజయంతికి. చూస్తుండగానే బియ్యే పూర్తయిపోవచ్చింది.
4
రాత్రి పదకొండవుతుంది. నోట్సు వ్రాయడం పూర్తి చేసి పుస్తకం మూసిపెట్టి, గదిలోంచి బయటకు వచ్చింది వైజయంతి.
తల్లిదండ్రుల గదిలో లైటు వెలుగుతోంది.
"ఏమిటమ్మా, లోపలకు రా" చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి లేచింది డాక్టర్ రజని. వైజయంతి ఏదైనా సీరియస్ విషయం మాట్లాడవలసి వుంటేనేగాని ఆ వేళప్పుడు తన బెడ్ రూంలోకి రాదు.
వైజయంతి వచ్చి మంచంమీద కూర్చుంది.
"మమ్మీ ఏ సెలవుల్లో సిమ్లా, కులూ వెళదామనుకుంటున్నాను. సరేనంటే కాలేజీలో పేరు ఇచ్చేస్తాను".
"ఈ సెలవుల్లో తప్పకుండా రమ్మని మావయ్య ఉత్తరం రాశాడు కదమ్మా! అక్కన్నుంచి మనం ముగ్గురం ఎక్కడికయినా వెళ్ళివద్దాం".
"అదికాదు మమ్మీ! మేము ట్రెక్కింగ్ చేద్దామనుకుంటున్నాము. దానికోసం ముందుగా ఏర్పాట్లు చేయించుకోవాలి".
"ట్రెక్కింగా? రెండు నెలలనుంచి పరీక్షలని విశ్రాంతి లేకుండా చదువుతున్నావు. ఎంత చిక్కిపోతున్నావో తెలుసా? ఈసారి సెలవుల్లో మన ఊరెళితే నీకు కొంత చేంజ్ వుంటుందని కాస్త విశ్రాంతి చిక్కుతుందని అనుకున్నాం".
"ఇప్పుడేమంత కష్టపడిపోతున్నాను మమ్మీ? రోజుకి ఏడుగంటలు నిద్రపోతున్నాను. నా వయసుకీ, హైట్ కీ తగ్గ బరువే వున్నాను. ఈ సంవత్సరం మాత్రమే నాకు ఛాన్సుంది మమ్మీ యూనివర్శిటీలో చేరితే మళ్ళీ వీలుకాకపోవచ్చు! వెళతాను మమ్మీ" గారంగా అంది.
"నిన్ను వద్దని కంట్రోల్ చెయ్యను వైజూ! కానీ నాకే గిల్టీగా అనిపిస్తోంది. మా ఉద్యోగాలలో పడి నీతో ఎక్కువ గడపలేకపోతున్నామేమో! అందుకే నువ్విలా విశ్రాంతి లేకుండా వ్యాపకాలు పెట్టుకుంటున్నావేమోనని నీ స్వయం ప్రతిభను అభివృద్ధి చేసుకుంటున్నావనే ప్రతిసారీ మీ డాడీతోపోట్లాడి నిన్ను సపోర్టు చేస్తున్నాను. కాని నాకే అనుమానం వస్తోంది. నిన్ను చాలా కష్టపెడుతున్నానేమోనని!"
"అదేమిటి మమ్మీ! నేనేమయినా చిన్నపిల్లనా ఇంకా? నా కెపాసిటీకి మించిన పనులేం చెయ్యడంలేదు. మీరు మాత్రం సెలవుల్లో వీలయినప్పుడల్లా ప్రోగ్రాంలు వేస్తూనే వున్నారు. కలిసి బయటకు వెళుతూనే వున్నాం. నిజం చెప్పాలంటే మా స్నేహితులు చాలామంది ఇళ్ళలోకంటే మనమే ఎంతో సంతోషంగా వున్నాం మమ్మీ! అన్నీ వుండి ఇంట్లో వాళ్ళ సహకారం, ఎంకరేజ్ మెంట్ లేక మా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఆ విషయంలో మీరు నాకిస్తున్న స్వతంత్రానికి నేను చాలా గర్వపడుతుంటాను".
"దేనికిట గర్వపడడం?" డాక్టర్ సారధి లోపలకు వస్తూ అన్నాడు.
"వైజూ ఈ సెలవుల్లో సిమ్లా, ట్రెక్కింగ్ కి వెళతానంటోంది. మనం ఊరెళదాం అనుకున్నాం కదూ! ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం" అంది రజని.
"మనమూ వెళదాం కులూకి, ఓ వారం రోజులుండి మనం వచ్చేద్దాం" అన్నాడు సారధి.
"బావుంది సమస్య పరిష్కారం అయిపోయిందన్నమాట" తేలిగ్గా అంది తల్లి వైజయంతి హాయిగా శ్వాస పీల్చుకుంది.
లేవబోతూంటే "ఒక్క నిముషం కూర్చోమ్మా వైజూ" సారధి కూడా పక్కనే కూర్చుంటూ అన్నాడు.
"ఏమిటి డాడీ?"
"ఈసారితో నీ బియ్యే అయిపోతుంది. మనం ఊరు వెళ్ళగానే మావయ్యవాళ్ళు అడుగుతారు నీ పెళ్ళి గురించి. సంబంధాలు చూస్తామంటారు. ముందుగా నీ అభిప్రాయం కనుక్కుంటే వాళ్ళకు ఏదో సమాధానం చెప్పవచ్చు. నాకయితే మంచి సంబంధం కుదిరితే చేస్తే మంచిదనిపిస్తోంది. అయినా నీ ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యను చెప్పు".
"నా కిప్పుడే పెళ్ళి వద్దు డాడీ! ఇంకా చదువుకోవాలి తర్వాత ఏదయినా జాబ్ చేయాలి. మీరు మామయ్య వాళ్ళకు గట్టిగా చెప్పండి, మంచి సంబంధమంటూ నన్ను విసిగించవద్దని".
"అయితే తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు?"
"ఎమ్. ఏ. లో చేరాలనుకుంటున్నాను. అలాగే అయ్యేయెస్ కి ప్రిపేరవుతాను". స్థిరంగా జవాబిచ్చింది వైజయంతి.
"గుడ్! అయితే సరే వెళ్ళి పడుకో" భుజం మీద తడుతూ ఆప్యాయంగా అన్నాడు సారధి. కూతురు తనకు కావలసినదేమిటో ధైర్యంగా చెప్పగలగడం అతడికి సంతోషంగా వుంది.