Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 12


    ప్రియాంక ఏమిటన్నట్లు కనుబొమ్మల్ని ఎగురవేసింది.

    "నీ పెళ్ళి విషయం- మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నీవు వూ... అంటే పెళ్ళికొడుకులు మనింటి ముందు క్యూ కడతారు. అందులో నీకు నచ్చినవాడ్నే నీవు ఎన్నుకోవచ్చు. ఏమంటావ్?" సుదర్శన్ రావు ఆశగా అడిగాడు.

    ప్రియాంక సీట్లోంచి లేచింది.

    "పందెం గడువు పూర్తి కాలేదు. త్రినాధ్ తో పందెం కాసి ఇప్పటికి సరీగ్గా ఇరవై నెలలయింది" అంది ఒకింత గంభీరంగా.

    "త్రినాధ్... త్రినాధ్ ఎవడమ్మా వాడు...? ఓ అడ్రస్ లేనివాణ్ణి పట్టుకుని..."

    తండ్రి మాటలకు మధ్యలోనే అడ్డొచ్చింది ప్రియాంక.

    "తప్పు నాన్నా... పొరపాటుగా అంచనా వేస్తున్నారతన్ని. ఇప్పుడు అడ్రసుందతనికి. అందలం ఎక్కే ప్రయత్నంలో కొంతమేరకు విజయం కూడా సాధించాడు. ఇంకెంత కాలం? కేవలం 8 నెలలు. అతన్ని ఓడించి ఆ విజయగర్వంతో నీ కూతుర్ని అనిపించుకుని అప్పుడు పెళ్ళి చేసుకుంటాను..." ఇక దీనికి తిరుగులేదన్నట్టు తెగేసి చెప్పింది.

    క్షణాల్లో చాలా దూరం ఆలోచించాడు సుదర్శన్ రావు.

    "సరే... నీ ఇష్టం తల్లీ! ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి టెండర్ ప్రిపేర్ చేయండి... నేను బయట పనులు చూసుకుని వస్తానంటూ కూతురు ఇంటివైపు వెళ్ళకుండా పని అప్పగించి తను బయలుదేరాడు. అతనెక్కిన కారు సరాసరి ఇంటివైపు దూసుకుపోయింది.


                  *    *    *    *


    గుప్తా అగర్ వాల్ ఎస్టేట్ లోకి వెళ్ళాడు.

    ఓ గంట తరువాత గుప్తాకి అగర్ వాల్ తో ఇంటర్వ్యూ లభించింది.

    గుప్తా తను వచ్చిన పని గురించి పూర్తిగా చెప్పాడు.

    నిజానికి అగర్ వాల్ కి సుదర్శన్ రావుతో చాలా కాలంగా శత్రుత్వం వుంది. కాని... మంచం మీద పడున్న స్థితిలో తను సుదర్శన్ రావు మీద కాలు దువ్వలేడు. కాని తన జీవితాశయం మాత్రం అదే. అలా అని తన పెంపుడు కొడుకును కష్టాలపాలు చేయలేడు. ఏ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్న అగర్ వాల్ వైపు ఆశగా చూస్తున్నాడు గుప్తా.

    అంతలో అగర్ వాల్ కొడుకు వచ్చాడు. అప్పటికే అతను అంతా విన్నాడు.

    "సారీ... గుప్తాజీ... ఈ స్థితిలో నాన్నగార్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. ఐదారునెలల్లో నాన్నగారు పూర్తిగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు. కావాలంటే అప్పుడు చూస్తారు..." అతను ఖండితంగా చెప్పేశాడు.

    గుప్తా ఒక్కసారి నైరాశ్యంలో మునిగిపోయాడు. సమాధానం అదేనా అన్నట్లు గుప్తా అగర్ వాల్ వైపు చూశాడు. అతని కళ్ళలో ఏ భావము కనిపించలేదు.

    నచ్చజెప్పే ప్రయత్నం మరికొంతసేపు చేశాడు గుప్తా.

    అగర్ వాల్ దత్తపుత్రుడు ససేమిరా వీల్లేదనడంతో గుప్తా నిస్పృహతో లేచి నుంచున్నాడు.

    "ఇంతకీ సుదర్శన్ రావుతో తలపడాలనుకునే వ్యక్తెవరు...?" అగర్ వాల్ ఆసక్తిగా అడిగాడు.

    అతను నిర్ణయం మార్చుకుంటాడేమోనన్న ఆశతో- "త్రినాధ్ వసుంధరా ఇండస్ట్రీస్ చైర్ మన్" అన్నాడు గుప్తా.

    "రాపిడ్ గా బిజినెస్ లో పైకొస్తున్న జమ్ అతనేనా?! మోస్ట్ థ్రిల్లింగ్ కోరమాండల్ ఇండగ్ ఫ్రెడరిక్, పాన్ పరాగ్ కొఠారి, స్కైప్యాక్ కులకర్ణి, హెచ్.సి.ఎల్. కంప్యూటర్స్, షిప్ నాడార్, సామ్ టెల్ టి.వి. ట్యూబ్స్, సతీష్ కవురాలాగా అతి తక్కువ కాలంలో అంత పైకొచ్చాడంటే నిజంగా తెలివి కలవాడే. అతనికి నా అభినందనలు అందజేయ్.

    కాని అతనికి హెల్ప్ చేయలేకపోతున్నందుకు, అతనితో చేతులు కలిపి సుదర్శన్ రావును దెబ్బకొట్టే యజ్ఞంలో సమిధను కాలేకపోతున్నందుకు క్షమించమని కూడా అడుగు..." అగర్ వాల్ మాటలతో మళ్ళీ నిరాశ ఆవరించింది గుప్తాకి.

    "బై ది బై... ఇతను నా కొడుకు... పెంపుడు కొడుకు. ఈ మధ్యే దత్తు తీసుకున్నాను. పిల్లలులేని నన్ను, నా ఆస్తిని చూసి ఈగల్లా ముసురుకోబోయిన స్వార్ధపరులైన నా బంధువుల్ని చావుదెబ్బ తీయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెవరో తెలియకుండా, నా వెనుక ఎంత ఆస్తి వుందో కూడా తెలియకుండా నన్ను నెలరోజులపాటు కంటికి రెప్పలా చూసుకున్న ఈ దిక్కులేని యువకుణ్ణి నేను దత్తు తీసుకున్నాను. పేరు సిద్దప్ప..." అగర్ వాల్ గుప్తాకి అక్కడున్న యువకుణ్ణి పరిచయం చేశాడు.


                  *    *    *    *


    "చూడు- ఇప్పుడిక నా పద్ధతి నచ్చక నువ్వు చేసేది కూడా ఏం లేదు. పిల్లలు పెళ్ళీడుకొచ్చారు. ఇప్పుడు ఆడది అబల కాదంటూ జెండా ఎగరవేశావనుకో నువ్వే దెబ్బతింటావ్. ఇకపోతే నేను పిల్లలకు ఓ కథ చెప్పాను. అది కథని నీకూ, నాకూ తెలుసు. వాళ్లు మాత్రం అది నిజమే అనుకుంటున్నారు. వాళ్ళలాగే అనుకోవాలంటే నీవు నోరెత్తకూడదు. నేను చెప్పిన కథనే రిపీట్ చేయాలి. కాదూ కూడదని నిజం చెప్పే ప్రయత్నం చేశావనుకో- నిన్నేం చేయను- ఎందుకంటే శిలగానైనా నువ్వు మన పిల్లలకు కావాలి. నా చెల్లెలు అని కూడా చూడకుండా ఆ వసుంధరదేవిని, ఆమె కొడుకును ఖైమా చేయిస్తాను-" నింపాదిగా భార్య మనస్సులో నాటుకునేలా బెదిరించాడు సుదర్శన్ రావు.

    ఆమె మౌనంగా వింటుండిపోయిందే తప్ప నోరు మెదపలేదు.


                                       *    *    *    *


    "మనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా మనం బాగా సంపాదించడమే అని ఒకప్పుడు నిశ్చయించుకున్నాం. కాని ఇప్పుడు ఆ మెయిన్ మోటివ్ ని వదిలేసి పగ, ప్రతీకారం అంటూ అలవికాని వ్యాపారాల్లోకి అడుగిడుతున్నావ్... దీని పర్యవసానం భయంకరంగా వుండవచ్చు. దేనికైనా సమాధానం చెప్పగలిగేది డబ్బు ఒక్కటే. 

    ఆ డబ్బుండ బట్టే గదా మనమీ ఆఫీస్ బిల్డింగ్ కొనేశాం. ఆ డబ్బుండ బట్టేగదా ఈరోజు కొన్ని వందలమందికి ఉద్యోగాలివ్వగలిగాం. ఆ డబ్బుండబట్టే గదా ఈనాడు కడుపునిండా తింటున్నాం. కంటికింపైన బట్టలు కడుతున్నాం. ఆ డబ్బుండ బట్టేగదా... కొత్త కొత్త వ్యాపారాల్లోకి ఎంటర్ అవుతున్నాం-" ఇంజనీర్ ఒకింత మందలింపు ధోరణిలో అన్నాడు.

    త్రినాధ్ కొద్ది క్షణాలు ఏం మాట్లాడలేదు. అతనేం సమాధానం చెబుతాడోనని హిందూ, బోస్, ఇంజనీర్, అప్పుడే వచ్చిన గుప్తా ఎదురు చూస్తున్నారు.

    "డబ్బు పెట్టి తెలివి తక్కువవాడికి అవసరం గదా అని తెలివి కొనగలవా? పిరికివాడు ధైర్యాన్ని కొనుక్కోగలడా...? మూర్ఖుడు వివేకాన్ని కొనుక్కోగలడా?

    డబ్బు చేయగల పనులు ఎన్ని వున్నాయో, చేయలేనివీ అన్ని వున్నాయ్...

    So money will not buy intelligence for the fool or admiration for the coward, or respect for the incompetent. The Man whoattempts to purchase the brains of his superiors to serve him, with his money replacing his judgement, ends up by becoming the victim of his inferiors.

    So no man may be smaller than his money..."

    గుడ్లప్పగించి వినడమే తప్ప నోరు తెరుద్దామన్న స్పృహ కూడా కోల్పోయారక్కడున్న నలుగురు.

    వాళ్ళింకా తేరుకోనేలేదు.

    "ఇంగిత జ్ఞానంలేని పులి సయితం తననెవరన్నా గాయపరిస్తే పగ తీర్చుకునే వరకు నిద్రాహారాలు మానేస్తుంది. మనం చేసేది వ్యాపారం- మనమే వ్యాపారం కాదు. కన్నతల్లికి, కనులు తెరిపించిన దైవానికి అవమానం జరిగితే చూస్తూ వూరుకోవడం పచ్చి స్వార్ధం. నాల్గవ సంవత్సరం చివరి రోజున అంటే 1460వ రోజున లెక్క చూసుకుంటే అతని ఆస్తికి నా ఆస్తి రెట్టింపు వుండాలి. సో... నేను సంపాదించవలసింది ఎంత అన్నది కాదు ప్రశ్న. అంతా వదిలేసుకుని డబ్బెంట పరిగెత్తటానికి- 1460వ రోజుకి అతనికెంత ఆస్తి వున్నదన్నదని పాయింట్. యు కేచ్ మై పాయింట్?" త్రినాధ్ వాళ్ళ కెప్పుడూ ఒక పజిలే.


                                       *    *    *    *


    "ఏమైంది గుప్తాజీ...?" త్రినాధ్ తిరిగి మామూలు మూడ్ లోకి వచ్చాడు.

    గుప్తా జరిగిందంతా చెప్పాడు.

    త్రినాధ్ అంతా విని ఆలోచనలో పడ్డాడు.

    గుప్తా ఇక్కడో పొరపాటు చేశాడు. అదే, అగర్ వాల్ దత్తపుత్రుడు సిద్దప్ప అని చెప్పకపోవడం.

    "మరెవరూ లేరా...?" త్రినాధ్ విసుగ్గా ప్రశ్నించాడు. గుప్తా ఆలోచిస్తున్నాడు- షిప్పింగ్ కాంట్రాక్ట్ చేసేవారు ఇంకెవరన్నా వున్నారా అని.


                   *    *    *    *


    "బయటకు వెళ్తే చాలు అకారణంగా వెంటబడే మగవాడు- ఒక్కసారి మాట్లాడితే నన్ను ప్రేమిస్తున్నాననే మగాడు- నన్ను ఆకర్షించటానికి తన్ను తాను కోల్పోయే మగాడు- నా ధీరత్వం ముందు తల ఎత్తలేని మగవాడు- ఉహూ మగవాడంటే సదభిప్రాయం లేదు నాకు.

    ఆడదంటే తెలీని మగవాడు-

    చిన్న పూవులోని సౌకుమార్యాన్ని, వానచినుకులోని సౌందర్యాన్ని, ఆకాశం అంచున సూర్యుడు వ్రాసే కవితా పంక్తుల్ని, అర్దరాత్రి నిశ్శబ్దంలో మూసినా కనురెప్పల వెనుక మెత్తగా కదలాడే కమనీయ దృశ్యాల్ని, కార్తీక మాసపు చిరుచలి రాత్రి కుప్పగా కురిసే వెన్నెల మిలమిలల్ని, చలికాలపు తొలి ప్రొద్దున మంచుతెరల మధ్యనుంచి అలవోకగా కదిలే హుస్సేన్ సాగర్ చిరు అంచుల్ని, హృదయాన్ని తెరిచి తనకంటూ ఏం దాచుకోక, ఏమీ మిగుల్చుకోక, తనలోని ప్రేమనంతా లోకం పాలు చేసే చిన్నారి పూబాల సుగంధాన్ని, తన తనువులో అణువణువునా రగిలే కోరికనీ, తన మనసులో తన చూపుల్లో పొందుపరచి, తన పెదవిపై తెలియపరచి, వేలి తాకిడికి కంపించి నవరాగాలు నినదించే వీణలా, స్పందించే ఆడదాని అంతరంగాన్ని అనుమాత్రం తాకలేని మగాడు. అలాంటి మగవాడి పట్ల జాలి వుంది నాకు.

    ప్రపంచంలో ఏ సంపదతోనూ సరితూగలేని ప్రేమని కావాలని, మగవాడికి అందించినా అందుకోలేని అర్భాకుడని నాకో స్థిరమైన అభిప్రాయం... కాదంటావా?" ప్రియాంక సౌమ్యంగానే అన్నా సైంటిస్ట్ ముఖం వివర్ణ మయింది.

    అతనామె దగ్గరకు అరగంట క్రితమే వచ్చాడు.

    వచ్చీరాగానే ఆమెపై తనకున్న ప్రేమను వెల్లడించి ఆమె నిర్ణయానికై ఎదురుచూడగా వచ్చిన సమాధానమది.

    ప్రేమపై, ప్రేమించగల ఆడదానిపై, మగాడిపై ఈమె కింతటి అవగాహన, స్థిరమైన అభిప్రాయాలున్నాయా...?!

    సైంటిస్ట్ కి తల కొట్టేసినట్టుగా వుంది.

    ముందిప్పుడు ఆమె ముందు పరువు దక్కించుకోవాలి.

    లేదంటే అవమానం, అవమానంలో నిరసన ఉద్భవిస్తే ఆమె తనకు శాశ్వతంగా దూరం కావచ్చు. దాన్ని తను భరించలేడు. అతను చప్పున తేరుకొన్నాడు-

    "నీవి ఉన్నత భావాలు. నేను పవిత్రంగా, నిష్కల్మషంగా, నిర్మలమైన స్నేహాన్నే కోరుకుంటున్నాను. నాలో ఎలాంటి లాలన, ఆకర్షణ, వేరే ఆలోచనలు లేవు..." సైంటిస్ట్ తనలోని కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు.

    ఆమె ముందు ఆశ్చర్యపోయింది.

    ఆ తరువాత నవ్వింది.
   
    కిన్నెరలా-

    కిలకిలా నవ్వింది...

 Previous Page Next Page