Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 11


    అవన్నీ ఇప్పుడు మూగవోయాయి...

    చిత్రమైన అనుభూతి... ఎదుటి మనిషి కళ్ళలో కనిపించే ఆనందం తనను స్పృజించింది. తట్టి లేపింది... అప్పుడు తనలో కలిగిన ఆనందం రెట్టింపు తృప్తి కొండంత-

    "ఏవి...? తనిప్పటి వరకూ అందించిన విజయాలు- గొప్పవని ముందుకు రావేం-?

    ఇద్దరు చాలాసేపు నిశ్శబ్దాన్ని చీల్చే ప్రయత్నమేదీ చేయలేదు.


                                        *    *    *    *


    "టెండర్ చూశావా...?"

    కృష్ణా ఓబరాయ్ హోటల్ సూట్ లో పచార్లు చేస్తూ అన్నాడు సుదర్శన్ రావు కొడుకు యోగేష్ వేపు చూస్తూ.


                                       *    *    *    *


    "హార్బర్ కాంట్రాక్ట్స్ ఏవీ అతను వదలడు. ఆ కాంట్రాక్ట్స్ లో లాభం ఎక్కువగా వుండడం ఒక కారణమైతే... ఆ మంత్రిత్వ శాఖలో అతని చెంచాలు ఎక్కువ వుండటం మరో కారణం..."

    గుప్తా చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు త్రినాధ్.


                  *    *    *    *


    "చూశాను డాడీ... కేవలం లాభం కోసమే కాదు. ప్రెస్టేజ్ కోసమైనా మనమీ కాంట్రాక్ట్ వదలరాదు" యోగేష్ పేపర్ లో వున్న ప్రకటన వైపు చూస్తూ అన్నాడు.

    సుదర్శన్ రావుకు కొడుకు ఆలోచన బాగా నచ్చింది. కిటికీలోంచి క్రిందకు చూస్తూ "అయితే ఢిల్లీ ప్రయాణం కట్టు... టెండర్ ని ప్రిపేర్ చేయించు" స్థిరంగా అన్నాడు సుదర్శన్ రావు రోడ్డుమీంచి చూపు మరల్చకుండానే.


                   *    *    *    *


    "మనం టెండర్ వేయవచ్చా?" త్రినాధ్ గుప్తాని ప్రశ్నించాడు.

    "సారీ సార్... అందులో ఏ మాత్రం అనుభవం లేని మనకు టెండర్ వేసే అవకాశం వున్నా అంగీకరిస్తారన్న నమ్మకంలేదు..." గుప్తా ఒకింత విచారంగా అన్నాడు.


                                          *    *    *    *


    "నాకో చిన్న అనుమానం డాడీ..." యోగేష్ మెల్లగా అన్నాడు.

    "ఏమిటది?"

    "త్రినాధ్ మనమీద పగబట్టి వున్నాడు..."

    "ఊ... అయితే?"

    "అతను పోటీచేస్తే...?" ఇంకా నయం కాని చేతివేలివైపు చూసుకుంటూ అన్నాడు.

    "అసంభవం... అతనికా ఆసక్తి వున్నా అర్హత లేదు" ధీమాగా అన్నాడు సుదర్శన్ రావు.


                   *    *    *    *


    "అనుభవం లేకపోవచ్చు... అది వున్న వారికి గట్స్ లేకపోవచ్చు. అనుభవం అర్హతా వున్నవారిని ముందు నించోబెట్టవచ్చుగదా?"

    త్రినాధ్ సాహసానికి గుప్తా ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.

    "అర్ధమైంది... మీ పథకం. అంటే అర్హత వున్నవార్ని మనం అడ్డం పెట్టుకోవాలి. సరే అలాంటి మనిషిని చూస్తాను. కాని... తీరా ఆ టెండర్ మనకే వచ్చిందనుకోండి. పూర్తి చేయగలమా...?" గుప్తా సందేహించాడు.

    త్రినాధ్ ఆలోచిస్తూండిపోయాడు.

    నిజమే... కోట్లలో వున్న హార్బర్ నిర్మాణం అంటే సాధారణ విషయం కాదు.

    మనం చేయం- అతనే చేస్తాడు... ఆ తర్వాత మునిగిపోతాడు-" త్రినాధ్ మాటలు గుప్తాకి అర్ధం కాలేదు.

    "ఇంతకీ అర్హత వున్న మనిషెవరు...?" త్రినాధ్ కి ఒక నిర్ణయం అంటూ తీసుకున్నాక అది మంచిదైనా, చెడ్డదైనా ఆలస్యం చేయడం ఇష్టం వుండదు."

    "అగర్ వాల్- అయితే అతనికీమధ్యే పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. చిత్రమైన పరిస్థితుల్లో అతనో యువకుణ్ణి దత్తత తీసుకున్నాడు. అతనూ తెలుగువాడే. మనం అతన్ని అప్రోచ్ అవ్వాలి. మీరు ఓ.కె. అంటే నేవెళ్ళి కల్సి వస్తాను..."

    "తక్షణం బయలుదేరండి. ఆ! మన పాస్ పోర్ట్స్ వీసాల విషయం ఎంతవరకూ వచ్చింది?"

    "మరోవారంలో పాస్ పోర్ట్స్ వస్తాయి. అవి రాగానే టూరిస్ట్ వీసాకి అప్లై చేస్తాను."

    "ఓకే-" అన్నాడు త్రినాధ్ ఫైల్లోకి తొంగిచూస్తూ.


                                         *    *    *    *


    "మనం వేస్తున్న టెండర్ వలన మన కంపెనీకి మంచి లాభాలు రావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన ప్రెస్టీజియస్ కాంట్రాక్టు పూర్తి చేసిన ఇమేజ్ దక్కితే దక్కవచ్చు. కాని నేనిప్పుడు చైర్ పర్సన్ ని. ఏదైనా నా ఇష్టప్రకారమే జరిగితీరాలి..." ప్రియాంక ఒకింత పొగరుగానే అంది.

    హఠాత్తుగా కూతురిలా మాట్లాడుతుందేమిటని సుదర్శన్ రావు మెదడు మెద్దుబారిపోయింది.

    "అలాగే తల్లీ... నీ ఇష్టం కనుక్కుందామనేగా కాంట్రాక్టు విషయం చెప్పింది-" సుదర్శన్ రావు సౌమ్యంగా అన్నా, దానివెనుక చిరాకు వ్యక్తం అయింది.

    "ఆ కాంట్రాక్టు మనం చేపట్టాలంటే నేనడిగిన విషయాలకు మీరు సమాధానం చెప్పి తీరాలి" మొండిగా అంది ప్రియాంక.

    "అడుగు చెబుతాను."

    "మీ చెల్లెలు వసుంధరాదేవీ, మీరూ ఎందుకు దూరమైపోయారు? వాళ్ళ స్థితికి కారకులు?"

    సుదర్శన్ రావులో బి.పి. ఒక్కసారి పెరిగిపోయింది. కానతనికి ఎవర్ని ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలుసు. "నువ్వు నమ్మినా నమ్మక పోయినా నేను చెప్పబోయేది మాత్రం నిజం. నేను చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ని. నా పద్ధతి చూసి కోపోద్రిక్తుడైన మానాన్న ఆస్తిని రెండు సమభాగాలుగా చేసి నా చెల్లెలు పేర, నా పేర రాసి, కొన్ని కండీషన్స్ పెట్టారు. నేను 25 సం||లోపు పెళ్ళి చేసుకోవాలని, అదీ సాంప్రదాయబద్ధంగా వుండాలని, వేరే కులం అమ్మాయిని చేసుకోరాదని, పెళ్ళి అయిన దగ్గర్నుంచి భార్యను ప్రేమగా చూసుకుంటూ, దుబారా ఖర్చులు చేయకుండా, చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని నిబంధనలు పెట్టారు. అలా కాని పక్షంలో ఆస్తి అంతా తన కూతురుకే దక్కుతుందని నిబంధనలు పెట్టారు. అలా కాని పక్షంలో ఆస్తి అంతా తన కూతురుకే దక్కుతుందని వీలునామా వ్రాశారు-" సుదర్శన్ రావు చెప్పడం ఒకింతసేపు ఆపి ఫ్రిజ్ వద్దకు వెళ్ళి అందులోంచి బాటిల్ తీసి గొంతు తడుపుకున్నాడు.   

    తండ్రి నోటివెంట కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూండడంతో ప్రియాంకతోపాటు యోగేష్ కూడా ఆశ్చర్యపోతున్నాడు.

    "అదలా ఉండగా మా నాన్న ఉన్నట్టుండి మరణించారు. అందుకు కారణం గుండెపోటు. ఆ గుండెపోటుకి కారణం-" అంటూ పళ్ళు పటపటా కొరికాడు సుదర్శన్ రావు.

    ఆసక్తిగా వింటున్నారు ప్రియాంక, యోగేష్.

    "నేను అల్లరి చిల్లరిగా తిరిగి మా నాన్నను బాధపెట్టిన మాట వాస్తవమే. కాని అంతకంటే ఘోరమైన పనిచేసిందా వసుంధరాదేవి. కులంకాని వాడిని ప్రేమించింది. అది నాకు తెలిసి అన్నగా మందలించబోయాను. నన్ను చులకన చేసి, నా ఇష్టం వచ్చిన అతన్ని ప్రేమిస్తాను. పెళ్ళి చేసుకుంటాను. అలా చేస్తే ఆస్తిలో వాటారాదనే నిబంధన నీకు వుంది. కాని, నాకు లేదు. అనవసరంగా ఈ విషయంలో తలదూర్చితే నీ ఆస్తి నీకు దక్కకుండా చేస్తానని బెదిరించింది. కాని ఆ విషయం మా నాన్నకు తెలిస్తే గుండె పగిలి చనిపోతారనే భయంతో మౌనంగా వుండిపోయాను. నా మౌనాన్ని అసమర్ధతగా తీసుకొని ప్రియుడితో పేట్రేగిపోయి ప్రవర్తించడం మొదలెట్టింది. అది క్రమంగా ఊర్లో అందరి దృష్టిలోకి వెళ్ళిపోయింది. నీ చెల్లెలు కులంలేని వాడితో తిరుగుతుంటే అసమర్ధుడిలా నువ్వు కాబట్టి చూస్తూ ఊరుకున్నావ్- మేమయితే ముక్కలు కింద నరికి పారేసేవాళ్ళం, అని ఫ్రెండ్స్ నన్ను మానసికంగా చిత్రవధకు గురిచేశారు.

    "దానితో ఇక లాభంలేదని, ఏమైతే అవుతుందని మా నాన్నకు చెప్పాను- ముందు ఆయన నమ్మలేదు. ఓరోజు ఉన్నట్టుండి పూలదండలతో నాన్న ముందు ప్రత్యక్షమయ్యారు. దాన్ని సహించలేని బలహీనమైన ఆయన గుండె ఆగి పోయింది.

    అది తెలిసిన ఊరి ప్రజలు నా చెల్లెల్ని, ఆవిడ భర్తనీ అసహ్యించుకున్నారు. అదంతా నావల్లనే జరిగిందని వాళ్ళిద్దరూ పగబట్టారు. నేను పెళ్ళి గురించి అంత తొందరపడలేదు.

    దానికి కారణం అసలు వయస్సుని దాచటమే.

    తీరా మంచి సాంప్రదాయబద్ధమైన సంబంధం చూసుకుని పెళ్ళి చేసుకోవాలనుకునే సమయానికి నాకు పాతికేండ్లు దాటిపోయాయని తెలిసింది. నాకు జరిగిన మోసానికి నేనెవర్నీ నిందించలేదు. నాలో నేనే కృంగిపోయాను. వీలునామాలోని నిబంధనల్ని అతిక్రమించానని నా వాటా ఆస్తిని తమ సొంతం చేసుకొన్నారు. తోడబుట్టినవాడినన్న జాలి కూడా లేకుండా ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. అలా అవమానింపబడి, మోసగింపబడి బయటపడిన నేను కసితో, పగతో, పట్టుదలతో రోజుకూలీలాంటి పనులు చేస్తూ కొంత కాలానికి నిలదొక్కుకోగలిగాను.

    ఆ సమయంలోనే మీ అమ్మతో నాకు పెళ్ళయింది. అప్పటి నుంచి నాకు బాగా కలిసిరావడం ప్రారంభమైంది. వ్యాపారమన్నాక అందరూ ఒక రకంగానే చేయలేరు. నా పద్ధతిలో నేను శ్రమిస్తూ మీకోసం ఈ సంపదను సృష్టించాను. నాలాగా నా కన్నబిడ్డలు బాధపడకూడదని, రాయల్ గా బ్రతకాలని ఆశించాను.

    ఇకపోతే ఆమె వాటా ఆస్తినీ, నా వాటా ఆస్తినీ అమ్మి వ్యాపారం ప్రారంభించాడు నా చెల్లెలి భర్త. అప్పుడు కూడా సిగ్గు విడిచి వాళ్ళ కంపెనీలో చిన్న ఉద్యోగం ఇప్పించమని నా చెల్లెల్ని ప్రాధేయపడ్డాను. అయినా నన్ను కనికరించలేదు.

    "... తరువాత బళ్ళు ఓడలయ్యాయి. ఓడలు బళ్ళయ్యాయి. వాళ్ళు వున్నది వదిలించుకుంటే, నేను నాకు లేనిది సంపాదించుకున్నాను. ఇప్పుడు చెప్పు... ఎవరిది తప్పో... అవును... వ్యాపారంలో దెబ్బతిన్న నా చెల్లెలు ఆమె భర్త వస్తే పైసా ఇవ్వనన్నాను. నేను కర్కోటకుణ్ణి కావచ్చు. నన్ను మోసగించి, అవమానించి, ఇంట్లోనుంచి గెంటి వేసిన నా చెల్లెల్ని నేను ఆమె కష్టకాలంలో ఆదుకోలేదు. ఒప్పుకుంటాను. నాకు నా కన్నబిడ్డల స్వార్ధమే ఎక్కువ. అది తప్పేనా...? తప్పయితే చెప్పు- నాకు జరిగిన అవమానాల్ని నా బిడ్డల తృప్తి కోసం దిగమ్రింగుకుని వార్ని చేరదీస్తాను-" సుదర్శన్ రావు కళ్ళలో నీళ్ళు. ఎప్పుడూ ఎంత విపత్కర పరిస్థితుల్లోను కనిపించని కన్నీళ్ళు... ప్రియాంక కదిలిపోయింది. తను అనవసరంగా తన తండ్రిని బాధపెట్టానేమో? తోడబుట్టిన చెల్లెల్ని ఆదుకోకపోవడం నిర్దయతో కూడుకున్నదే అయినా, తనకి జరిగిన అవమానానికి అదే తగిన సమాధానమేమో- అనవసరంగా తను రీజన్ కోరి తమనెంతో ప్రేమగా చూసుకునే తండ్రిని బాధపెట్టానేమో-?

    అంతే... ఆమెలో రీజనింగ్ తిరిగి వెనుకడుగు వేసింది.

    సాధించాడు... మొత్తానికి సుదర్శన్ రావు కూతుర్ని నమ్మించి ఆమెపై విజయం సాధించాడు. కూతురు మోములో కనిపిస్తున్న భావాల్ని తేలిగ్గా చదివేశాడు. ఇప్పుడు సుదర్శన్ రావు భయపడుతున్నది తన భార్య గురించే. తన కూతురు ఇంటికెళ్ళేలోపే తను తన భార్యను కలిసి చివరి బెదిరిమ్పును డిక్లేర్ చేయాలి.

    "టెండర్ వేయండి నాన్నా- అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు రావాలి. శ్రీమతి వసుంధరాదేవి మన మీదకు సమరశంఖం పూరించిందట. కొడుకును విలుకాడిని చేసి తను సారధి అయి మన కోట మీదకు రథాన్ని మళ్ళించిందట. మన వేపునుంచి మీరు సారధి అయితే నేను త్రినాధ్ తో పోటీకి సిద్ధపదతాను. కమాన్! ఛాలెంజ్!" అంది కోపంగా ప్రియాంక.

    కూతురులో ఆవేశం పడగ విప్పింది. ఇదే అదును- సమ్మెట దెబ్బల్ని సిద్ధం చేయడం మంచిది.

    "అలాగే బేబీ- మనం టెండర్ వేస్తే మనకు పోటీవచ్చే దమ్మున్న మగాడెక్కవడూ ఈ ప్రాంతంలో ఇంతవరకూ పుట్టలేదు. ఇకపోతే తండ్రిగా నాకున్న ఒక బాధ్యతను నెరవేర్చుకునేందుకు తాపత్రయ పడుతున్నాను. దానికి కూడా నీ సహకారం కావాలి. అందిస్తావా-? అందులోనూ నీ ఇష్టమే చెల్లుతుంది విషయం ఏదైనా నీకు ఆనందం కలిగించేదిగానే వుండాలన్నది నా స్థిర నిర్ణయం" మొదటి సమ్మెట దెబ్బ వేశాడు సుదర్శన్ రావు.

 Previous Page Next Page