Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 11

  

      "ప్లేయింగ్ కార్ద్సు యిండస్ట్రీ పెడితే బాగుంటుందేమో! ఇప్పటిరోజుల్లో అది చాలా లాభసాటిగా వున్నట్టుంది" అని ఒకతను సజెస్ట్ చేశాడు.
   
    "అంతకన్నా ఫైవ్ స్టార్ హోటల్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే హోటలు బిజినెస్ లో సాధారణంగా నష్టంరాదు."
   
    ప్రదీప్ వాళ్ళ సంభాషణ అంతా వింటున్నాడు. అతనికి కొంచెం ఏవగింపు కలిగింది.
   
    "చూడండి" అన్నాడు. "ప్రభుత్వం మెడికల్ కాలేజీలనుండి ఒక్కొక్క డాక్టర్ని తయారుచెయ్యడానికి కొన్నిలక్షలు ఖర్చు పెడుతుంది. అన్ని లక్షలు ఖర్చుపెట్టి ఒక్కో డాక్టర్ని తయారుచెయ్యటం ప్లేయింగ్ కార్ద్సు యిండస్ట్రీని, లేకపోతే ఫైవ్ స్టార్స్ హోటల్ని రన్ చెయ్యడానికి కాదు. ఆ పన్లు చెయ్యడానికి చాలామంది వున్నారు. ఒక డాక్టరుధర్మం తన వృత్తిని నిర్వహించటం తనవృత్తిలో శిఖరాగ్రాలకి ఎదగటం."
   
    ఎవరీ చాదస్తుడన్నట్టుగా కొంతమంది అతనివంక పరిహాసపూర్వకంగా చూశారు.
   
    "అట్లా అయితే యింకోపని చేయవచ్చు" అని మరో ప్రబుద్దుడు సలహా యిచ్చాడు.
   
    "ఏమిటంటే పెద్ద హాస్పిటల్స్ ని, చాలా పెద్ద హాస్పిటల్ని ఫైవ్ స్టార్ హోటల్ మోడల్ లో రన్ చెయ్యవచ్చు. ఇటు బిజినెస్ చేసుకోవచ్చు. ఆయన చెప్పినట్లు వృత్తిధర్మం నిర్వహించనూవచ్చు దేశంలో ధనికులైనవాళ్ళు, పర్సనల్ ఎంజాయ్ మెంట్ కావాల్సిన వాళ్ళు యీ హాస్పిటల్ కు..."
   
    "ఆపండి" అన్నాడు ప్రదీప్ చాలా ఆగ్రహంతో "మీరంతా విద్యావంతులై వుండీ, సమాజంలో ఓ స్థానం కలిగిన వాళ్ళయివుండీ ప్రొఫెషన్స్ గురించి యింత చౌకబారుగా మాట్లాడటం నేను సహించను. పెద్ద పెద్ద హాస్పిటల్స్ నిర్మించటం ఎంజాయ్ మెంట్స్ కోసం కాదు. ఆధునిక పరికరాలతో ఆధునిక చికిత్సా విధానాలతో ప్రజలకు ఉపయోగపడటంకోసం మామూలు హాస్పిటల్స్ లో తగ్గని వ్యాధులనుండి విముక్తి కలిగించటంకోసం."
   
    "ఎందుకలా గట్టిగా అరుస్తారు? మీరేం డాక్టరు కాదుగా, లాయరైవుండి..."
   
    "లాయరేమిటి? డాక్టరేమిటి? ప్రొఫెషన్సన్నిటికీ ఒక మహోన్నతమైన ఆశయం, దృక్పథం వుంటాయి. వాటికి వ్యాపారదృష్టీ, చౌకబారు లక్షణాలు అంటగట్టటం నేను సహించను."
   
    "మా యిష్టం వచ్చినట్లు మేము మాట్లాడుకుంటాము. వద్దనటానికి మీరెవరు?" అన్నాడు ఆ వ్యక్తికూడా రెచ్చిపోతూ.
   
    "పదిమంది మధ్యలోకి వచ్చినప్పుడు మీయిష్టం వచ్చినట్లు మీరు మాట్లాడటానికి వీల్లేదు" అన్నాడు ప్రదీప్ గట్టిగా అరుస్తూ.
   
    ఆ యువకుడు గ్లాసు ఎత్తి నేలకేసి కొట్టాడు. "మాట్లాడితే.... ఏం చేస్తావేమిటి?"
   
    సరిగ్గా అంతకుముందే మాలతి ప్రదీప్ ని వెదుక్కుంటూ అక్కడికి వచ్చింది. ఒక్కనిముషం అక్కడ నిలబడేసరికి జరిగేదంతా ఆమెకర్ధమైపోయింది.
   
    ఆ ఎదురుగా వున్నది కజిన్ రమేష్, అతని ఆప్తమిత్రులు ఆమెకు ఎవర్నీ వ్యాఖ్యానించటం యిష్టంలేకపోయింది.
   
    "ప్రదీప్!" అని పిలిచింది మృదువుగా.
   
    అతను అంత ఆవేశపు స్థితిలోనూ ఉలికిపడి తలత్రిప్పి చూశాడు.
   
    "రా! వెళ్ళిపోదాం."
   
    "అదికాదు మాలతీ!"
   
    "ప్రదీప్! ప్లీజ్!"
   
    ఏమనుకున్నాడో మెదలకుండా లేచి నిలబడి ఆమెవెంట నడిచాడు.
   
    నడుస్తుంటే అడుగులు తడబడుతున్నాయి. తల గిర్రున తిరుగుతుంది.
   
    వొళ్ళు తూలింది.
   
    క్రిందపడబోయినట్లు అవబోతే మాలతి భుజంమీద చెయ్యివేసి పట్టుకుంది. అక్కడ్నుంచి ఆమె మెల్లగా నడిపించుకుంటూ కారుదగ్గరకు తీసుకొచ్చింది.
   
    "ఎలా వెళతావు?"
   
    "....ఊ!"
   
    "ఎలా వెళతావు?"
   
    "వె....ళ...తా...ను" మాట చాలా ముద్దగా వచ్చింది.
   
    అతను కారు డ్రైవ్ చేసేస్థితిలో లేడని మాలతి గ్రహించింది. "నేను తీసుకు వెళతాను పద" అంటూ డోర్ తెరచి అతన్ని ప్రక్కసీట్లో కూర్చోబెట్టింది. ఆమె స్టీరింగ్ ముందు కూర్చుని యింజన్ స్టార్టుచేసింది.
   
    అతన్ని ఇంటిదగ్గరకు తీసుకొచ్చాక అతిప్రయాసమీద తాళంచెవి జేబులో వెతికి తలుపు తెరిచింది. స్విచ్ వేసి అతన్ని నడిపించుకుంటూ లోపలి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి వెనక్కి తిరిగి రాబోతుంటే అతనిచెయ్యి వచ్చి ఆమెను పట్టుకుంది.
   
    ఉలిక్కిపడింది.
   
    "బిందూ!"
   
    "....."
   
    "నన్ను విడిచి నువ్వు వెళ్లొద్దు."
   
    మృదువుగా విడిపించుకోబోయింది.
   
    "బిందూ! ప్లీజ్!"
   
    "ప్రదీప్! నువ్వు పడుకుని నిద్రపో!"
   
    "నువ్వు వెళ్ళవుగా."
   
    "ఉహు."
   
    రెండు నిముషాల్లోనే అతని కళ్ళు మూతలు పడిపోయి, గాడనిద్రలో మునిగి పోయాడు.
   
    ఆమె నిట్టూర్పు విడిచి, అతని చేతినుండి విడిపించుకుని అక్కడ్నుంచి కదిలింది.
   
                                  6
   
    ప్రదీప్ కు మెలకువ వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. అప్రయత్నంగా వాల్ క్లాక్ వైపు తిరిగి చూసేసరికి ఎనిమిదవుతుంది. 'అరె' అనుకుంటూ ప్రక్కమీదనుంచి లేవబోయాడు. తలంతా బరువుగా నొప్పిగా అనిపించింది.
   
    ఎవరో బజర్ నొక్కుతున్నారు.
   
    మెల్లగా లేచి హాల్లోకి వచ్చాడు. బహుశా రామూ అయివుండవచ్చు. బయటినుండి బజర్ నొక్కుతున్నాడు. తాళంచెవి ఎక్కడుంది? అటూ యిటూ చూశాడు. కిటికీ దగ్గర నేలమీద పడివుంది. తీసి డోర్ తెరిచాడు.
   
    రాము లోపలకు వచ్చి అతనివంక చూసి ఏదో అనుమానం తోచి, "అయ్యగారూ వంట్లో బాగాలేదా?" అన్నాడు.
   
    "బాగానేవుంది."
   
    "కళ్ళూ అవీ..."
   
    "రామూ! నువ్వెళ్ళి పనిచూసుకో."
   
    రాము మరేమీ మాట్లాడలేక లోపలకు వెళ్ళిపోయాడు.
   
    ఏం జరిగింది?
   
    తలదిమ్ముగా వుంటే చేత్తో పట్టుకుని సోఫాలో కూర్చుని ఆలోచించాడు. అతనికి క్రమంగా జరిగిందంతా గుర్తువచ్చింది. రాత్రి... గెట్ టు గెదర్...పార్టీలో తాను డ్రింక్ చెయ్యటం... అక్కడ ఏదో మనసుకు కష్టంతోచే చర్చ జరగటం...
   
    ఇంటికి ఎలా వచ్చాడు?
   
    మాలతి... మాలతి తీసుకొచ్చింది.
   
    అతనికి చాలా సిగ్గువేసింది. తాను డ్రింక్ చేశాడు. అంతేగాక ఒళ్ళు తెలీనిస్థితిలో మాలతివల్ల ఇక్కడకు తీసుకురాబడ్డాడు.
   
    లేచి ముఖం కడుక్కుని, కాఫీ త్రాగాక మాలతికి ఫోన్ చేశాడు. ఆమె రిసీవ్ చేసుకుంది.
   
    "మాలతీ!"

 Previous Page Next Page