Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 11

  

     "సగం ఇస్తావా? నేనేమన్నా చందాకొచ్చానా? లేక ముష్టి అడుక్కుంటున్నానా?" అతను ఆటో దిగి షర్ట్ స్లీవ్స్ పైకి తోసుకుంటూ - అన్నాడు.
   
    "పూర్తిగా ఎందుకివ్వాలీ? నాతోపాటు నువ్వూ తిరిగావుగా. నీ ముక్కు ఎక్కడా అంటే చుట్టూ చూపించినట్లు తీసుకొచ్చావు. అసలే నీ సుత్తి కబుర్లకి తలనెప్పి వచ్చింది" ధరణి కూడా కోపంగా అంది.
   
    "తలనొప్పి వస్తే వెంటనే స్ట్రాంగ్ కాఫీ తాగాలి" అన్నాడు.
   
    "నీ సలహాకి థాంక్స్"
   
    "పక్కన పకోడీలు కానీ చేగోడీలు కానీ ఉంటే బావుంటాయి!" అన్నాడు.
   
    "లేవు!" ధరణి ఇంటి తాళం తెరుస్తూ అంది.
   
    "నాకు తెలుసు! అందుకే తెచ్చాను. వేడి వేడి పకోడీలు!" పొట్లం చూపించాడు.
   
    ఇంతలో శ్రీధర్  "ధరణీ!" అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చి "చందూ నువ్వెప్పుడొచ్చావురా?" అన్నాడు.
   
    "బావా.... ఎప్పుడు వచ్చితివీవు...." అని చందూ పద్యం అందుకున్నాడు.
   
    "చూస్తూనే అడుగుతావేరా? ఇంతకీ వాకిట్లో ఆటో ఆగి ఉందేవిటీ?" భార్యని చూస్తూ అడిగాడు శ్రీధర్.
   
    కాఫీ కప్పులూ, పకోడీల ప్లేటు పట్టుకొస్తున్న ధరణి "మీ బావమరిదినె అడగండి" అంది.
   
    "ఏరా, ఉద్యోగంకాని వచ్చిందా? ఆటోలో తిరుగుతున్నావు?" అడిగాడు శ్రీధర్.
   
    "ఉద్యోగం దొరక్కే ఆటోలో తిరుగుతున్నాను, జనాన్ని తిప్పుతున్నాను" కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు చందూ. శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. "అంటే?"
   
    "కాఫీ" అందించింది ధరణి.
   
    "నువ్వుండు.. ఏరా ఆటో నడుపుతున్నావా?" వినకూడని విషయం వింటున్నట్లుగా వుంది శ్రీధర్ ముఖం.
   
    "యా! పకోడీలు తిను బావా" ప్లేటు అందించాడు చందూ, "నా మొదటి సంపాదనలో నీ కోసం అక్క కోసం తీసుకొచ్చాను."
   
    "ఛ! అదేం పనిరా? నువ్వు ఇలా వీధుల్లో ఆటో నడుపుతున్నావంటే నాకెంత అప్రతిష్టా? మీ బావమరిది ఆటోడ్రైవరా ఎవరైనా అంటే ఏం చెప్పనూ?" శ్రీధర్ బాధగా సోఫాలో కూలబడ్డాడు.
   
    ధరణి కోపంగా "ఔను అని చెప్పండి! వాడేమైనా పరీక్ష పేపరు లీక్ చేసి న్యూస్ లో నానుతున్నాడా? లేక అసెంబ్లీలో అసహ్యంగా సిగపట్టు పడ్తున్నాడా? నిక్షేపంగా ఆటో నడుపుకుంటున్నాడు. ఇందులో మీరింత సిగ్గుపడడానికే విటటా?" అంది.
   
    "భలే మాట్లాడావక్కా! అచ్చు 'మా అక్క దేవత' సినిమాలోలాగా?" క్లాప్స్ కొట్టాడు చందూ.
   
    "ఏవిటి ధరణి నువ్వుకూడా....అంతగా ఉద్యోగం దొరక్కపోతూ ఏదైనా వ్యాపారం పెట్టించేవాళ్ళంగా" నసుగుతూ అన్నాడు శ్రీధర్.
   
    "ఇదీ పనేనండీ! సొంతంగా చేసుకుంటున్న వ్యాపారమే" అంది ధరణి.

    "మర్యాద అనేది ఉండాలిగా!" అన్నాడు శ్రీధర్.
   
    "అక్కా! నువ్వు అర్జెంట్ గా బావని ఆటోడ్రైవర్ సినిమాకి తీసుకెళ్లాల్సిందే. లేకపోతే ఇలాగే డిపాజిట్ కోల్పోయిన అభ్యర్దిలా సెల్ఫ్ పిటీతో ఏదో మాట్లాడ్తూ వుంటాడు" అన్నాడు.
   
    ధరణి నవ్వేస్తూ "ఇప్పుడు మాకు ఖాళీ లేదు. మేజర్ వర్మగారింటికి వెళ్ళాలి. కొద్దిగా నీ ఆటోలో దింపరా" అంది.
   
    శ్రీధర్ కల్పించుకుని "ఏవిటి ధరణీ నువ్వు కూడానూ? పద చందూ, బట్టలు మార్చుకో, నువ్వుకూడా పార్టీకి వద్దువుకానీ...." అన్నాడు.
   
    "నేను పార్టీకా? నో నో. కావాలంటే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆరున్నరకల్లా నేను సంజీవయ్య పార్క్ దగ్గరుండాలి" అన్నాడు చందూ.
   
    "ఏరా..... ఏవిటి సంగతీ" అనుమానంగా అడిగింది ధరణి.
   
    "శీతాకాలం పొగమంచు ఇంకా దట్టంగా ఉంది.....చలికి శరీరం చిన్నగా కంపిస్తోంది!"
   
    "వర్ణనలు వద్దు. సీన్ చెప్పు చాలు!" అంది ధరణి.
   
    "ఆ అమ్మాయి మీగడబొమ్మలా వుంది. జును ముక్కలా, మృదువుగా వుంది!"
   
    "ఏమిటా డైరీప్రోడక్ట్స్ ఎడ్ వర్ టైజ్ మెంట్లు? త్వరగా చెప్పి ఏడు జున్ను ముక్క ఏమిటి?"
   
    "నేం చెప్తున్నది అమ్మాయి గురించి" చందూ తలతిప్పి కోపంగా అన్నాడు.
   
    "అప్పుడేవైంది?" ధరణి విసుగ్గా అడిగింది.
   
                                                                           3
   
    ఆ అమ్మాయి చేతిలోంచి కుక్కపిల్ల అమాంతం క్రిందకి దూకి పరిగెత్తసాగింది.
   
    "అయ్యో..... ట్రిక్క.... ట్రిక్క..." ఆ అమ్మాయి అరుస్తూ దాని వెనకాల పరిగెత్తినా దాని వేగం అందుకోలేకపోయింది. చూస్తూన్న చందూ ఆగలేకపోయాడు. కుక్కపిల్ల కోసం స్పీడ్ గా పరిగెత్తడం మొదలు పెట్టాడు. కుక్కపిల్ల కూడా వేగం పెంచి పరిగెత్తుతూ దారిలో ఉన్న ఓ లోతైన గోతిలో పడిపోయింది.
   
    అది దూరంనుంచి చూసిన అమ్మాయి "ట్రిక్క!" అని కళ్ళనీళ్ళతో కేకపెట్టింది.
   
    "మీ ట్రిక్కకి ఏం ఫరవాలేదు! నేను రక్షిస్తాను" అభయం ఇస్తూ, తనూ గోతిలోకి దూకేశాడు చందూ.
   
    గోతిలో పడగానే నడుం కలుక్కుమంది. ట్రిక్క చెవులునిక్కబొడుచుకుని అతనివైపు చూసింది.
   
    అతను చేతులు జాపుతూ "రా!" అన్నాడు.. ట్రిక్క ఒక్క గెంతు గెంతి "భౌ" అంది. "అయ్యబాబోయ్!" చందూ గుంటలో గోడవైపు నక్కాడు. ట్రిక్క "గుర్...ర్...." మని అతనివైపు హీరోయిన్ గార్డియన్ అంత క్రూరంగా చూడసాగింది.
   
    ఇంతలో గోతి మీదనుంచి "మైగాడ్... చాలా లోతుగా ఉందే" అన్న అమ్మాయి కంఠం వినిపించింది.
   
    చందూ ఆశగా పైకి చూస్తూ "ఏవండీ మీ ట్రిక్కని కాస్త పిలుస్తారా?" అన్నాడు.
   
    "రక్షిస్తాను అన్నారుగా" అంది అమ్మాయి.
   
    "కానీ అరుస్తోంది" అన్నాడు చందూ.
   
    "కేవలం దొంగవెధవల్ని చూస్తేనే అరుస్తుంది - అని చెప్పాడండీ అమ్మిన అతనూ!" అంది అమ్మాయి అమాయకంగా.
   
    చందూ కోపంగా "అంటే?" అన్నాడు.
   
    "పాపం! ఇంత ఎత్తునించి పడిపోయినందుకు, దానికి కాస్త మతి చలించిందేమోనండీ!"
   
    "వామ్మో! పిచ్చి కూడా ఎక్కిందా?" చందూ అరిచాడు.
   
    "భౌ.....భౌ.....భౌ...." ట్రిక్క అతని మీదకి ఎగురుతూ అరుస్తోంది.
   
    "నో.... నో.....నై వద్దు.....వేండ! దీన్ని కాస్త దీని మదర్ టంగ్ లో పిలవండీ!" అరిచాడు చందూ.
   
    "ట్రిక్క.... స్టాఫ్" ఇంగ్లీషులో అరిచింది అమ్మాయి.
   
    ట్రిక్క ఆగి చెవులు నిక్కబొడుచుకుని పైకి చూసింది.
   
    చందూ ఓసారి గుండెలనిండా గాలి పీల్చుకుని పైకి చూశాడు.
   
    "పాపం... గీరుకుపోయినట్లుంది!" అమ్మాయి జాలిగా అంది.
   
    "ఔను!" మోచేయి చూసుకుంటూ అన్నాడు.
   
    "మంచి వెటర్నరీ డాక్టర్ దగగ్రికి తీసుకెళ్ళి కట్టు కట్టిస్తానమ్మా....ఏడవకు!" అంది అమ్మాయి ఆమె మాట్లాడేది కుక్కపిల్ల గురించని తెలిసి అతను ఎర్రగా చూశాడు.
   
    "ఎత్తుకుని పైకి రండి....ఊ.....క్విక్!" అంది.
   
    "ఎలా? అరుస్తోందిగా" అన్నాడు.
   
    "ఫరవాలేదు. ఎత్తుకున్నాక ఊరుకుంటుంది" అంది.
   
    "ఊరుకోకపోతే?" అనుమానంగా అడిగాడు.
   
    "ఓసారి కరుస్తుంది. అంతేగా?" అమ్మాయి విసుగ్గా అంది.
   
    చందూ భయం భయంగానే కుక్కపిల్లని గట్టిగా పట్టుకుని ఎత్తుకున్నాడు. అది వెంటనే అతని చేతిని కసుక్కున కరిచింది.
   
    "అమ్మో!" అరిచాడు చందూ.
   
    "ఆ.... ఆ.... వదిలిపెట్టకండి-" ఆ అమ్మాయి తన చేతిని జాపింది.
   
    ఆ అందమైన చేతిని చూస్తూ ఆమె ఆజ్ఞని కాదనలేకపోయాడు. కష్టపడి పైకివచ్చి ఆమె చేతిని అందుకోవడానికి చెయ్యి చాపాడు.
   
    ఆమె కూడా రెండు చేతులూ జాపింది.

    చందూ ఆ ఆహ్వాననికి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆమె చేతుల్లోకి వెళ్ళబోతూ ఉండగా, ట్రిక్క ఒక్క  దూకులో ఆమెని చేరుకోవడం, ఆమె దాన్ని గుండెలకి హత్తుకుని "మై లవ్.... మై స్వీట్ డార్లింగ్! ఐ లవ్ యూ!" అనడం చకచకా జరిగిపోయాయి.
   
    చందూ ఉస్సూరని నిట్టూర్చాడు.
   
    "మీ సాయం మరవలేనిది" అంది చందూతో ఆ అమ్మాయి.

 Previous Page Next Page