"నిన్నట్నుంచి. కానీ నిన్న ఇది ఇంకొంచెం ఎక్కువసేపు కనబడింది. కొంచెం చిన్నసైజులో" అన్నాడు రమణ. "ఏమిటది?"
క్షణం మాట్లాడలేదు ప్రొఫెసర్ తరువాత సాలోచనగా అన్నాడు "ప్రాక్సీమా సెంక్చువరీ....."
రమణకీ దాని గురించి తెలుసు భూమికి దగ్గరగా వున్న నక్షత్రం అది. దగ్గరగా అంటే.....సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం అంగుళం అనుకొంటే, భూమికీ ఆ నక్షత్రాలకీ మధ్యనున్న దూరం నాలుగు మైళ్ళు అంత దగ్గర.
"ఇంతకుముందు టెలిస్కోప్ లో అంత పెద్దదిగా కనిపించేది కాదు. ఇప్పుడెందుకు కనిపిస్తూంది?" రమణ అడిగేడు.
"ఇంకో రెండు రోజులు పోతేగానీ ఏమీ చెప్పలేను."
ఆ రెండ్రోజులూ రమణ పత్రిక ఆఫీసులో చేరే సన్నాహాల్లో ఉన్నాడు. హెల్తు సర్టిఫికెట్ల ఒరిజినల్స్ చూసుకోవటంతో కాలం గడిచిపోయింది.
ఆ రోజు రమణ అక్కడ పని చెయ్యడానికి ఆఖరిరోజు.
పదకొండు గంటలవేళ. వ్రాస్తున్న కాగితాలలోంచి తలెత్తి "అర్ధమయింది" అని అరిచేడు ప్రొఫెసర్.
రమణ అతడివేపు చూసేడు.
"ప్రాక్సిమా సెంక్చువరీ గురించి అర్ధమయింది" అన్నాడు ప్రొఫెసర్. "భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరం వున్న ఆ నక్షత్రం నాలుగు రోజుల క్రితం ముప్పై అయిదు నిముషాలపాటు కనబడింది. అది కనబడే సమయం రోజుకి నిముషంపాటు తగ్గుతూ వస్తూంది. భూమి డయామీటరు దాదాపు ఎనభై లక్షల మైళ్ళు....." అంటూ తన పేపర్లవైపు చూస్తూ ఆగేడు.
".....దాదాపు ఎనిమిది గంటల కాలం కనబడాల్సిన ఆ నక్షత్రం ఇంత తొందరగా కనపడి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? చాలా సింపుల్ థియరీ ట్రైన్ లో వెళుతున్నప్పుడు దూరంగావున్న చెట్టు, దగ్గరగా వున్న చెట్టుకన్నా ఎక్కువసేపు కనబడుతుంది అంతేకదా_"
రమణ నవ్వేడు. "ఆ నక్షత్రం పూర్వం కన్నా దగ్గరగా వచ్చిందంటారా?"అన్నాడు.
"రావటం కాదు. వస్తూ వుంది. ఇంకా వస్తూనే వుంది. రోజుకి నిముషంపాటు అది కనబడటంలో తేడా వస్తూంది కదా! ఎనిమిదిగంటలు కనపడేదల్లా అరగంటే కనపడుతూందిప్పుడు. అంటే దాదాపు నెలరోజుల క్రిందటే అది తన ప్రయాణం ప్రారంభించి ఉండాలన్నమాట. ప్రస్తుతం భూమిచుట్టూ అది ఇరవై అయిదు నిముషాల్లో ప్రదక్షిణం చేస్తూంది. అంటే పది వేళ మిలియన్ల మైళ్ళ దూరానికి వచ్చిందన్నమాట."
"ఇంత పెద్ద మార్పుని ఇంతవరకూ ఎవరూ గమనించలేదంటారా?" అడిగేడు రమణ.
"ఆ అనుమానం నాకు నిన్ననే వచ్చింది. కొన్ని పాత సామానులుంటే అమ్మేసి, గ్రీన్ వీచ్ అబ్జర్వేటరీకి, మాంచెస్టర్ యూనివర్సిటీ లో మౌంట్ కి ఫోన్ చేసేను."
"ఏమన్నారు వాళ్ళు-?"
ప్రొఫెసర్ పై కప్పు కేసి క్షణం పాటు చూసి కళ్ళు దించుతూ "దాదాపు నెలరోజుల క్రితం అబ్జర్వేటరీస్ అన్నీ మూసెయ్యమని ఆర్డరొచ్చిందంట!"అన్నాడు.
ఇద్దరూ చాలాసేపు మాట్లాడలేదు.
గది అస్తవ్యస్తంగా వుంది. ప్రొఫెసర్ వర్క్ చేసిన కాగితాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. కాళ్ళ సందులోంచి ఎలుక ఒకటి పరుగెత్తుకు వెళ్ళిపోయింది.
నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ప్రొఫెసర్ లేచి "పద టీ తాగుదాం" అన్నాడు.
ఇద్దరూ బయటికొచ్చేరు. తలుపు దగ్గరికి లాగగానే ఆటోమేటిక్ లాక్ పడిపోయింది. బయట చిన్న నాబ్ తిప్పి, తలుపు దగ్గరగా వేస్తే లాక్ పడిపోయే ఏర్పాటున్న తలుపు అది.
రోడ్డు నిర్మానుష్యంగా వుంది. బాగా ఎండగా వుంది.
"ఈ మధ్య నాకు మాటిమాటికీ బయటికి రావాలనిపిస్తోంది" అన్నాడు ప్రొఫెసర్. "ఇంతకుముందు ఆర్నెల్లకొకసారి ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టేవాణ్ణి. ఇప్పుడు చూడు.....క్రిందటి నెల వచ్చాను. మళ్ళీ ఇప్పుడు రావాలనిపించింది."
"నేను మీతో కలవాలని వ్రాసిపెట్టి వుంది ఆ రోజు. అందుకే వచ్చారు....." అన్నాడు రమణ.
"మళ్ళీ ఈ రోజు నిన్ను సాగనంపటానికి వస్తున్నాను."
రమణ మాట్లాడలేదు.
ఇద్దరూ ఇరానీ హోటల్లో కూర్చున్నారు. రెండు సింగల్ చాయ్ లకు ఆర్డరిచ్చేరు. హోటల్ రష్ గా లేదు. నాలుగురోడ్లు కలిసే చోటులో వున్నా, పక్కనే యింకో పెద్ద హోటల్ వుండటంవల్ల దీనికెవరూ రారు. గల్లా పెట్టె వద్ద కూర్చొన్నవాడు కునికిపాట్లు పడుతున్నాడు. రమణ చుట్టూ చూసి, తల తిప్పేసరికి ప్రొఫెసర్ నీటి చుక్కతో చూపుడువేలు ముంచి టేబుల్ మీద బొమ్మ వేస్తున్నాడు. ఇంతలో టీ వచ్చింది. దాంట్లో ఇంకో వేలు ముంచి ఇంకో చుక్క పెట్టేడు. "ఇది భూమి" అన్నాడు.
ప్రొఫెసర్ సంగతి తెలిసిన రమణ మౌనంగా టీ తాగసాగేడు.
"బ్రెస్సెల్ థియరీ సంగతి తెలుసునా?" అడిగేడు ప్రొఫెసరు తెలీదన్నట్టూ తల అడ్డంగా వూపేడు రమణ.
"ఒక నక్షత్రం మనకి ఎంత దూరంలో వున్నదీ తెలుసుకోవటానికి అతడు థియరీ చెప్పేడు. ఇదుగో ఈ పచ్చటి చుక్క భూమి అనుకో. ఈ నీటిచుక్క నక్షత్రం. ఈ రోజు అది ఇరవై ఎనిమిది నిమిషాలు కనబడింది. నిన్న ఇరవై తొమ్మిది నిముషాలు. దీని స్థానభ్రంశం. సూర్యుడు భూమికి అత్యంత దూరంగా వున్న రోజు జరిగి వుంటుంది. అంటే ఏ రోజు?"
"జూన్ ఇరవై ఒకటో తారీఖు?"
"కరెక్ట్. ఈ నక్షత్రం దాదాపు ముప్పై అయిదు రోజుల్లో కొన్ని కోట్ల మైళ్ళు ప్రయాణం చేసి ఉత్తరం నుంచి దక్షిణదిశగా వెళ్తూంది. అయితే ఓ అనుమానం వుంది. మనం మామూలు టెలిస్కోప్ లో కనుక్కొన్న ఈ విషయాన్ని అంతకన్నా అధునాతనమైన పరికరాలు అంటే ఆల్ట్రావాయిలేట్, ఎక్స్ రే, రేడియో, టెలిస్కోప్ లలో మిగతావాళ్ళు ఎందుకు కనుక్కోలేదు.....? కొంచెం షుగర్ పట్రా వెయిటర్ బాబూ..... ఇదిగో ఈ నక్షత్రం ఈ యాంగిల్ లో వస్తోంది. భూమి యిటు వెళ్తోంది....."
వెయిటర్ పంచదార కప్పు తెచ్చి బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. నస్యం పట్టినట్టు దాన్ని కొంచెం తీసి బల్లమీద పోసేడు. "ఇది సూర్యుడు....." అన్నాడు.
ఈ పిచ్చిచేష్టల్ని ఎవరన్నా చూస్తున్నారేమోనని కనుకొలుకుల్లోంచి చుట్టూ చూశాడు రమణ.
"ఈ నక్షత్రం ఇలా వెళ్ళే సమయానికి....." అంటూ ప్రొఫెసర్ గీత గీశాడు. "సూర్యుడికి ఈ పక్కగా భూమి వస్తుంది. ఇంకోలా చెప్పాలంటే ఈ నక్షత్రం భూమికి దాదాపు యాభై లక్షల మైళ్ళ దూరంనుంచి ప్రక్కగా దూసుకుపోయి అనంతమైన విశ్వంలో కలిసిపోతుంది. నెలరోజులు ప్రయాణం చేసిన ఆ నక్షత్రం ఇప్పటికి దాదాపు నాలుగు కోట్ల కోట్ల కోట్ల మైళ్ళు పయనించింది. ఆ వేగం అలాగే కొనసాగితే, అది భూమికి అత్యంత సమీపంలోకి రావటానికి ఇంకా ఇరవై రోజులు - అంటే ఆగస్టు పదిహేడో తారీఖు అవుతుందన్నమాట. నా లెక్క సరి అయితే.....ఈ టీ చల్లారిపోయింది. ఇంకో టీ తెప్పించు.....నా లెక్కకరెక్టయితే సరిగ్గా ఆ రోజు పదకొండుగంటల పది నిముషాలకి ఈ దూసుకుపోవడం జరుగుతుంది."
వెయిటరు వచ్చాడు "ఇంకో టీ" అన్నాడు రమణ. వెయిటర్ వెళ్ళిపోయాడు.
"ఆగష్టు పదిహేడు. పగలు.....పదకొండు గంటల పది నిముషాల నుంచీ.....మూడు సెకండ్లపాటూ ఆ నక్షత్రపు అయస్కాంత ప్రభావం భూమిమీద పడుతుంది."
వెయిటర్ టీ తీసుకొచ్చేడు.
"పడితే ఏమవుతుంది.....!" అడిగాడు రమణ.
"ఏమవుతుంది, భూమి ఫెటేలున పేలిపోతుంది..... ఇదిగో వెయిటర్! ఇందులోనూ షుగర్ తక్కువగా వుంది."
రమణకి ఓ క్షణం ఏమీ అర్ధం కాలేదు. ప్రొఫెసర్ స్పూన్ తో టీ కలుపుతున్నాడు. సాయంత్రం పూట సరదాగా హోటల్ కి వచ్చిన వాడిలా తాపీగా వున్నాడు. రమణకి నవ్వొచ్చింది. బలవంతంమీద ఆపుకుంటూ "అయితే మనందరం చచ్చిపోతామా ప్రొఫెసర్ గారూ!" అని అడిగాడు.
"ఇంకా నిర్దారణగా చెప్పలేను" అన్నాడు.
ఇద్దరూ లేచి బయటకు వచ్చారు.