అతడికి తెలుసు-తను సమర్ధుడినని!
కావలసిందల్లా ఒక్కటే....లక్ష్యం!
ఏమిటా లక్ష్యం?
విశ్వామిత్రుడు తనకు రెండు సూచనలు చేశాడు.
మొదటి సూచన ప్రకారం తను మహాత్ముడు కావాలి. రెండవ సూచన ప్రకారం జీవితాన్ని ప్రణయయాత్రగా మలచుకోవాలి.
ఎంత ప్రయత్నించినా తను మహాత్ముడు కాలేడు.
ఎందుకంటే మహాత్ములు ఫలితాల నాశించరు. విఘ్న నిహన్యమాన్యులై దృత్యున్నతోత్సాహులై ముందడుగు వేస్తారు. తామెవరికి సాయపడాలనుకుంటున్నారో వారు తమ సాయాన్నపేక్షిస్తున్నారా అని ఆలోచించరు. తను సాయం పొందేవాళ్ళే అవమానించినా చలించరు.
కానీ తానలా కాదు. అవతల వ్యక్తి తన సాయాన్నాపేక్షించినప్పుడు వాడికి సాయపడగలడు. వాడు నిరసిస్తే సహించలేడు.
ఇక మిగిలింది ప్రణయయాత్ర.
ఎందుకో అతడికి ప్రణయమంటే భయంగావుంది. ఆడది స్వార్ధంతో మగాడ్ని నీచుణ్ణి చేస్తుందన్న అభిప్రాయం అతడిలో బలంగా ఉంది....... అయినా సీతనతడు పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. కనీసం ఒక స్త్రీ హోదాను పెంచుతున్నానన్న తృప్తితో.
సీత అతడి హోదాను అవహేళన పరిచింది. అతణ్ణి నిరసించింది.
మరో స్త్రీని ఎన్నుకుంటాకతడు భయపడుతున్నాడు. విశ్వామిత్రుడిచ్చిన గుళిక అతడి వద్ద ఇంకా నిష్ప్రయోజనంగా అలాగే పడి వుంది.
అతడు తాను తరచుగా వెడుతూండే మైదానానికి మళ్ళీ వెళ్ళి చూశాడు. విశ్వామిత్రుడు కానీ, భగవంతుడు కానీ అతడికి దర్శనమివ్వలేదు.
"ఈ జీవితం నిష్పయోజనం....నేనెందుకూ పనికిరాను...." అనుకున్నాడతడు.
సందిగ్ధావస్థలోపడి చివరికో రోజున ఎలుకల మందు కొన్నాడతడు.
ఆ రాత్రి భోజనంలో మందును కలిపాడు. భోంచేశాడు. నిద్రపోయాడు.
అతడిలో యిప్పుడు చచ్చిపోతానన్న భయం లేదు. మోక్షగామిలా, నిర్వికారంగా ఉన్నాడతడు.
మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అది శాశ్వత నిద్ర కాబోతోందని అతడికెంతో తృప్తిగా ఉంది.
11
రాజేంద్ర పుస్తకం తెరిచి రవీంద్రకు అందించాడు.
"మగాడు కానివాణ్ణి మాత్రమే ఆడది పరిహసిస్తుంది. మగాడయితే ఆమె వాణ్ణి పరిగ్రహిస్తుంది" అని చదివి పుస్తకం మూశాడు రవీంద్ర.
"నీ మగతనం నా దగ్గర కాదు, ఆమె దగ్గర రుజువు చేసుకో" అన్నాడు దేవేంద్ర.
"కొందరి మగతనానికి ఋజువులక్కర్లేదు అన్నాడు రవీంద్ర.
"మన తెలివితేటలు మనమీదే చూపించుకుంటూ కూర్చుంటే శత్రువులకవి మిగలకుండా పోతాయి" అన్నాడు చిరాగ్గా.
"పరిహసిందని కోపమొచ్చినా అంత అందమైన ఆడపిల్లని శత్రువనడం నాకు నచ్చదు" అన్నాడు దేవేంద్ర.
రవీంద్ర నవ్వి, "ఆడపిల్లనయినా, ఆ భగవంతుడినయినా తొందరగా కోరుకోవాలంటే శత్రుత్వమే సరైన మార్గమని ఆనాడు జయవిజయులు ఋజువు చేశారు" అన్నాడు.
"అయితే యిప్పుడేం చేద్దాం?" అన్నాడు రాజేంద్ర.
"ఇప్పుడో చేప ఎర చుట్టూ తిరుగుతోంది. ఆ చేపను పట్టి ఎక్వారియంలో పెట్టి మిగతా చేపలకు ఎరగా వేద్దాం."
"ఎలా?"
"ముందుగా మన దేవేంద్ర ఆమెని పెళ్ళి చేసుకుంటాడు...."
"నేను ప్రతిభను పెళ్ళి చేసుకోను" అన్నాడు దేవేంద్ర.
"ఎందుకని?"
"నా కళ్ళు హాసను చూశాయి"
"నువ్వు ప్రతిభను కళ్ళతో కాదు, మనసుతో చూడు...."
"నా మనసు హాసను కోరుతోంది."
రవీంద్ర చిరాగ్గా "నీ మనసు ప్రతిభను వద్దంటోందా?" అన్నాడు.
దేవేంద్ర మాట్లాడలేదు.
"ప్రతిభ గులాబివంటిది. ఆమెను నలిపి అత్తరు తయారు చేసి దాన్ని వంటికి పూసుకుని హాస వద్దకు వెడితే...."
దేవేంద్ర మాట్లాడలేదు. ప్రశ్నార్ధకంగా రవీంద్ర వంక చూశాడు.
"నీవు కారణజన్ముడివి. ఒక్క హాస కోసమే నువ్వు పుట్టలేదు. వరుసగా ఎందరో కన్నెపిల్లలు నీ పరమవుతారు. అందుకోసం ముందు ఒక్కసారి ప్రతిభను పెళ్ళి చేసుకో...."
"నీ ప్లానేదో సరిగ్గా చెప్పి ఏడు...."
"నా ప్లాన్ లో ఏడ్వడానికేమీ లేదు. అంతా నవ్వులు, పువ్వులే!"
ఇది ఉపోద్ఘాతంగా ప్రారంభించి రవీంద్ర తన మిత్రులకు పథకాన్ని వివరించాడు. పువ్వులకు, నవ్వులకు భయంకరంగా తోచే ఆ పథకం ఆ గదిలో మెరుగులు దిద్దుకుంటోంది.
12
పార్కుకి అందాన్నిస్తున్నారా ఆడపిల్లలు. వారి మాటలు ప్రకృతికి సంగీతాన్ని వినిపిస్తున్నాయి.
అందరూ జోక్స్ చెబుతున్నారు. విని నవ్వుకున్నారు.
ఉన్నట్లుండి "మనమెప్పుడూ యిలాగే నవ్వుతూ వుండగలమంటారా?" అంది ప్రతిభ.
"నీకా అనుమానమెందు కొచ్చింది?" అంది లలిత.
"ఎప్పుడూ నవ్వుతూండాలంటే ఆ రహస్యం హాసకు తెలుసు" అంది మాలతి.
"ఏమిటే ఆ రహస్యం?" అనడిగింది ప్రతిభ.
"చాలా సింపుల్. ఎప్పుడూ నవ్వుతూండడమే!" అంది హాస.
"అదంత సులభం కాదు...."
"ఎందుకు సులభం కాదు? జీవితంలో ప్రతీదీ తేలికగా తీసుకుంటే ప్రతిదానికీ నవ్వుకోవచ్చు."
"ప్రతిభ నవ్వి "నువ్వు పరీక్ష ఫెయిలయ్యావనుకో, ఏం చేస్తావు?" అంది.
"కొందరు పరీక్ష ప్యాసైతే జోక్. నేను ఫెయిలయితే జోక్."
"ఏం చేస్తావో చెప్పు."
"అంతా ఏడుస్తూ చేసేది నేను నవ్వుతూ చేస్తాను."
"ఉన్నట్లుండి యాక్సిడెంట్లో నీ కాలొకటి పోయిందనుకో...."
"అంతా ఏడుస్తూ కుంటితే నేను నవ్వుతూ కుంటుతాను...."
"ఒకవేళ నీకు బ్లడ్ క్యాన్సరని రేపే తెలిసిందనుకో" అంది ప్రతిభ.
"అంతా ఏడుస్తూ చస్తారు. నేను నవ్వుతూ చస్తాను" తడుముకోకుండా అంది హాస.
సుగుణ తెల్లబోయి "వింటేనే నా వళ్ళు జలదరించింది. ఎంత తేలిగ్గా అనేశావే!" అంది.
"అంటుందిలే ఊహ అని తెలుసు కాబట్టి...." అంది ప్రతిభ.
"ఊహ సంగతలాగుంచు. నీకు కష్టాలు కానీ జబ్బులు కానీ చావు కానీ రాబోతూంటే ఏడ్చి ఏం చేస్తావు? వాటిని తగ్గించుకోగలవా?" అంది హాస.
"తగ్గించుకోలేమని కష్టాల్లో నవ్వగలమా?"
హాస నవ్వింది. "ఊళ్ళో ఓ మనిషి పోయాడు. వాళ్ళింట్లో అంతా ఏడుస్తున్నారు. ఆ సమయంలో మీ ఇంట్లో పెళ్ళి జరుగుతోంది. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు తలంబ్రాలు పోటా పోటీగా పడి పోసుకుంటున్నారు. అప్పుడు నువ్వేడుస్తావా, నవ్వుతావా?"
"నువ్వేం చేస్తావో చెప్పు."
"ఇంట్లో సంతోషముంటే ఎదురింట్లో కష్టాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేవాడెప్పుడూ ఏడుస్తూనే వుంటాడు. చుట్టుపక్కలెలాగున్నా తనింట్లో సంతోషానికి మాత్రమే రియాక్టయ్యేవాడు స్వార్ధపరుడు. స్వార్ధాన్నిబట్టి వాడు నవ్వడమో, ఏడ్వడమో చేస్తూంటాడు. నేనైతే మా యింట్లో సంతోషముంటే అందుకు నవ్వుతాను. మా యింట్లో దుఃఖముంటే ఎదురింట్లో సంతోషానికి నవ్వుతాను."
"ఎదురింట్లోనూ సంతోషం లేకపోతే?"
"ఎక్కడ సంతోషముంటే అక్కడికి వెతుక్కుంటూ వెడతాను. మన దుఃఖానికి మనం లొంగిపోకపోతే నవ్వడానికి మన చుట్టూ బోలెడంత సంతోషముంది."
మాలతి ఆశ్చర్యంగా "నువ్వు చెప్పేది వినడానికి చాలా బాగుంది. కానీ ఆచరణలో సాధ్యమేనంటావా?" అంది.
"నాకు ఎనిమిదేళ్ళప్పుడు మా ఎదురింట్లో అబ్బాయి పరీక్ష పోయింది. మా పక్కింటబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అతడు మా పక్కింటబ్బాయిని మెచ్చుకుని సంతోషించాడు. వాళ్ళమ్మ తిట్టింది_ సిగ్గులేదూ అని! దాని కతడేమన్నాడో తెలుసా, 'నాకు సిగ్గుంది కానీ అందుకు ఫెయిలవలేదు. తెలివి చాలక ఫెయిలయ్యాను. నేను ఫెయిలయ్యానని ఏడుస్తూ కూర్చుంటే పరీక్ష ప్యాస్ కాను. మనిషి ఆరోగ్యంగా వుండాలంటే ఎప్పుడూ సంతోషంగా వుండాలి. నా పరీక్ష పోతే పోయింది. నా స్నేహితుడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అందుకు సంతోషించనీ!' అని. వాళ్ళమ్మ అందరికీ ఆ మాటలు చెప్పుకుని బాధపడేది. తర్వాతి సంవత్సరం ఆ కుర్రాడు కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు."
"అంతా చిత్రంగా వుంది"
"ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనుకుంటే మనిషి స్వార్ధంనుంచి బైట పడగల్గుతాడు...." అంది హాస.