Previous Page Next Page 
హృదయాంజలి పేజి 10

    "లేనివాళ్ళు అడగడానికీ, అడుక్కోవడానికీ తేడాలేదురా! ఇన్నాళ్ళు ఎంతో అభిమానంగా, గంభీరంగా బ్రతికాం. ఇవాళ నన్ను ముష్టితెచ్చి బ్రతికించాలని చూడకండి. ముష్టి తిండితో బ్రతకడంకంటే నాకు చావే సుఖంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి!"     "ఇంట్లో నీకు పెడదామంటే ఏం లేదు! మరి నిన్ను మేం బ్రతికించుకోవాలంటే ఏం చేయాలమ్మా?" గుడ్లనీరు కక్కుకుని అడిగింది అపురూప.

    "చిన్నపిల్లలు మీరేం చేస్తారు. ఏమీ చేయొద్దు. మనింటి పరువు తీసేపనులు అసలు చేయొద్దు. మనిషి పేదరికంలోనే ఆత్మనిగ్రహం చూపాలి. మనిషి బ్రతకడమే ముఖ్యంకాదు. బ్రతుకుతీరు ముఖ్యం. నేనున్నా లేకున్నా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమిది" ఆవిడ ఆయాసంతో కాస్సేపు ఆగింది. "మీరు ఏవేవో చేయాలనుకొన్నారు నా కోసం! ఏం చెయ్యకుండా సంకెళ్ళు వేశానుకదూ!" పిల్లల ముఖాల్లో కనిపించిన ఆశాభంగం చూసి బాధకలిగింది అరుణకు. నలుగురినీ తన ఎండిన గుండెలమీదికి చేర్చుకొని కౌగిలించుకుంది. "రత్నాల్లా నలుగురి పిల్లలు నాకేం తక్కువని అప్పుడే చస్తానర్రా?" దుఃఖాశ్రువులో, ఆనందాశ్రువులో...ఆమె చెక్కిళ్ళు తడిశాయి.
 
    కాని, మాట నిలుపుకోలేదు అరుణ. ఆ రాత్రి ఆయాసం ఎక్కువై అంతిమశ్వాస విడిచింది.

    తల్లిలేని పక్షుల్లా అయిపోయిన పిల్లల్ని అక్కున జేర్చుకొని గుండె పగిలేలా ఏడ్చాడు ఆచారి.
 
    ఉన్న పొలం అమ్మేసి ఆమెకు పరంలో సౌఖ్యాలన్నీ అమర్చాడు.

    తల్లి పోయింది. భార్య పోయింది. మృత్యువు ఇంకా ఏ మూలనో పొంచి వుండి ఇంకెవరినో ఎత్తుకుపోవాలని చూస్తున్నట్టుగా భయవిహ్వలుడు కాసాగాడు ఆచారి.
 
    తను పోతే తన పిల్లలు అనాధలై రోడ్లుమీద పడతారు తన పిల్లల్లో ఎవరు పోయినా బ్రతకలేడు తను. వాళ్ళు తన దాంపత్య జీవితానికి తీపి గుర్తులు ఆ గుర్తులే ఈ భారమైన బండి ప్రయాణాన్ని సాగదీయాలి.

 
                                  *    *    *

    ఆచారిని దారిద్ర్యభారం బాగా కృంగదీస్తున్న సమయంలో పొరుగూరు కరణంగారు జాలిపడి తమ ఊరి గుడి అర్చకత్వం స్వీకరిస్తే నెలకో రెండువందలు ఇవ్వగలనని చెప్పాడు.

    ఏటిలో కొట్టుకు పోతున్న వాడికి గడ్డిపరకే గొప్ప ఆధారమని పించినట్టుగా అర్చకత్వమే గొప్ప అదృష్టమనిపించింది ఆచారికి. కుటుంబ యుక్తంగా గుడి సత్రంలోకి మారిపోయాడు.

    స్వామి నైవేద్యానికి పొంగలి నిమిత్తం రోజూ అర్ధశేరుబి్యం, పులిహోర కలపడానికో, చెక్కెరపొంగలి చేయడానికో కావలసిన చింతపండు, బెల్లం, పొపుగింజలు, నూనె బొటాబొటిగా ఇస్తారు.

    గుడి ఊడ్చే ఆమెకీ, భజంత్రీలకీ ప్రసాదం పెట్టగా మిగిలింది పిల్లలకి పెడతాడు ఆచారి. భక్తులు వచ్చినరోజు అదీ వుండదు.

    ధర్మం ఇంకా అక్కడక్కడా బ్రతికే ఉండినట్టుగా అయ్యగారన్న భక్తిభావంతో కొందరు పాలు, కూరగాయలు తెచ్చిస్తుంటారు.
   
    అయినా రోజులు గడ్డుగానే గడుస్తున్నాయి.
 
    కాని నిత్యం భగవంతుడి సేవలో గడుస్తున్నందుకు మనసు తేలిక అనిపిస్తుంది ఆచారికి.
 
    పులిహోర, పొంగలి తిని తిని మొహం కొట్టింది పిల్లలకు.
 
    బలమైన ఆహారం లేక చందూకి కాళ్ళు చేతులు పుల్లల్లా అయి పొట్ట వచ్చేసింది వాంతులు విరేచనాలయ్యి ఓ అర్ధరాత్రివేళ ఒళ్ళు చల్లబడిపోయింది చందూకి.
 
    ఊరికీ గుడికీ అరమైలు దూరం. ఆచారి చంకలక్రింద కర్ర తీసుకుని పరిగెత్తినట్టుగా వెళ్ళి వైద్యుడిని నిద్రలేపి తీసుకు వచ్చేసరికి చందూలో హంస ఎగిరిపోయింది, తల్లినీ, నాన్నమ్మనీ కలుసుకోవడానికి.
 
    చందూని మట్టిచేసి వచ్చాక అపురూప ఒక్కటే పట్టుబట్టి కూర్చొంది.  "మనం ఇక్కడుండొద్దు నాన్నగారూ! చందూ వెళ్ళిన దారిలోనే మేమూ వరుసగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం పట్నం వెడదాం పిల్లలకి కూడా ఫాక్టరీల్లో చిన్న చిన్న పనులు దొరుకుతాయట. అలా పనులు చేసుకుంటూ చదువుకొనే పిల్లలు బోల్డుమంది ఉన్నారట. కరణంగారు చెప్పారు."
    "పిచ్చితల్లివి. పట్నమంటే మాటలా? ఇక్కడ తిన్నారా? అని అడిగేవాళ్ళైనా ఉన్నారు. అక్కడ అదీ ఉండదు పట్నాలంటే మనుషులుండే మహారణ్యాలు. ఒకరిది ఒకరికి పట్టదు. ఎవరి ప్రపంచం వాళ్ళది.ఫ్యాక్టరీల్లో పనులంటే ఆఫీసరు ఉద్యోగాలేమీ కాదుకదా? కూలిపని! ఆ కూలిపనే చేయాలనుకుంటే ఇక్కడా దొరుకుతుంది. పొలాల్లో కూలిపని దొరుకుతుంది. మానాభిమానాలు చంపుకుని, బ్రతకడమే ముఖ్యమనుకుంటే ఏ రెడ్డిగారి పశువుల కొట్టం వూడ్చో ఏ కరణంగారి ఇంటి వాకిలి వూడ్చో బ్రతకవచ్చు. బ్రతకడానికి ఇక్కడా అవకాశాలు ఉన్నాయమ్మా"

    "మాకు బ్రతకడమే ముఖ్యంకాదు నాన్నగారూ! చదువుసంధ్యలు లేకుండా పశువుల్లా అయిపోతున్నామనే నా బాధ. మాకు చదవస్తుందనుకుంటే మేం ఎవరిళ్ళ దగ్గరయినా పాచిపని చెయ్యడానికయినా, పేడ ఎత్తడానికయినా సిద్దమే. కాని, ఇక్కడ మాకు చదువుకొనే అవకాశం లేదు. పట్నం వెడితే పని చేసుకుంటూ చదువుకోవచ్చు. మాకు చదువు కావాలి నాన్నగారూ" అపురూప గట్టిగానే వాదించింది.

 Previous Page Next Page