Previous Page Next Page 
హృదయాంజలి పేజి 11

    సంధ్యవేళ కరణంగారు వచ్చారు దైవదర్శనానికి.
 
    "మహానగరంలో మాయాజాలం సంగతి మీకు తెలీదా కరణంగారూ? పిల్లలకి లేనిపోని మాటలు ఎందుకు చెబుతున్నారు . పట్నం వెళితే బాగుపడినవాళ్ళకంటే చెడిపోయినవాళ్ళే ఎక్కువ!" తీర్ధప్రసాదాలు ఇవ్వడం అయ్యాక అన్నాడు ఆచారి.
 
    "నిజమే! మహానగరాల్లో బ్రతికిన వాళ్ళకంటే చెడినవాళ్ళే ఎక్కువ , కాని, మీరు ఇంకా చెడడానికి ఏముంది? ఇంకా చెడడానికేమీ లేనప్పుడు భయమెందుకు? మీ గురించి మాట్లాడడానికి ఇప్పుడేమీ లేదు! మీ పని అయిపోయింది. ఒకనాడు మీరెంతో ప్రజ్ఞావంతులు! చదువులోనైతేనేమి? పాటలు పద్యాలు నాటకాలు అయితేనేమి - మీ గురించి తెలియనివాళ్ళు ఈ చుట్టుపక్కల అరుదు! బహుముఖమైన మీ ప్రజ్ఞ మీ వాళ్ళతోపాటే ఈ లారీ చక్రాలక్రింద నలిగిపోయిందేమో అన్నట్టుగా మీరు మూగబోయారు. చైతన్యహీనులయ్యారు. ఇప్పుడు మనం చూడాల్సింది పిల్లల గురించి. వాళ్లకి సరైన బట్టపొట్ట మీరివ్వలేక పోతున్నారన్నది కాదు ప్రశ్న. వాళ్ళ భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్న. చదువుకొంటే వాళ్ళు బ్రతుకగలరు. మనుషుల్లా మర్యాదగా జీవించగలరు. చదువు సంధ్యలు లేని వాళ్ళ జీవితాలు మీరే వూహించండి ఆచార్లూ! ఆడపిల్లలకి తిండి పెట్టగలరేమోగాని వాళ్ళకి కట్న కానుకలిచ్చి పెళ్ళిళ్ళు చేయలేరు. ఇక వున్నది ఒక మగపిల్లవాడు! చదువు సంధ్యలు లేకపోతే వాడేం కావాలి గోడలు కట్టేపనికో, గడెం తోలేందుకో పనికివస్తాడు. అదా మీరు వాడి విషయంలో కోరుకునేది?"

    "అది కాకపోయినా నేను చేయగలిగింది ఏముంది కరణంగారూ! భవిష్యత్తు అంటారా? దాన్ని వూహించే ధైర్యం నాకులేదు, భగవంతుడి మీద భారంవేసి ఏరోజు కారోజు గడిపి వేయడమే"
 
    "అదే భగవంతుడి మీద భారం వేసి పిల్లల్ని తీసుకుని పట్నం చేరండి ఆచార్లూ! మా అక్క కొడుకు పట్నంలో పని చేస్తున్నాడు. వాడు పిల్లలకి ఏదో ఒక మార్గం చూపకపోడు. మీరో నాలుగు ట్యూషన్లు చెప్పుకున్నా రంటే పిల్లలకింత ఆసరా అవుతారు కదా?"
 
    "ఇక్కడ పదిరూపాయలొచ్చినా ఒక్కటే, అక్కడ వందొచ్చినా ఒక్కటే. ఇక్కడ మనం తినేది అక్కడ ఇంటద్దె తినేస్తుంది. మిగతా ఖర్చులు దానికి తగ్గట్టే వుంటాయి. మాబోటివాళ్ళు పట్నవాసపు కాపురం చేయాలంటే బండి చక్రంలోపడి నలిగిపోయినట్టే."

    "మీ ఇష్టం ఆచార్లూ! బరువు బాధ్యతలు మోసేది మీరైనప్పుడు నేను ఇంతకు మించి చెప్పడం భావ్యంగా ఉండదు. చదువుకోలేకపోతున్నామే అని ఆ పిల్లలు బాదపడడం చూసి నాకు తోచిన సలహా చెప్పానంతే" అని సెలవు తీసుకున్నాడు కరణంగారు.
 
    కాని, అపురూప తండ్రి అభ్యంతరాన్ని లెక్క చేయలేదు. వెళ్ళి తీరాల్సిందే. అని పట్టుబట్టింది. ఉదయభాను అక్కకంటే ఎక్కువ పట్టు బట్టాడు "నాన్నగారూ! మీరు రాకపోతే నేనొక్కడిని పారిపోయి ఐనా చదువుకొంటాను! అక్కడ హోటళ్ళలో కప్పులు కడుగుతూ చదువుకొనే పిల్లలు ఎంతమందో ఉంటారు.!"

    వంశాంకురం వాడొక్క డు ! పారిపోయి చదువుకొంటానంటున్నాడు. ఏం తిన్నాడో, ఎక్కడున్నాడో అని తల్లడిల్లిపోతూ తామిక్కడ! కష్టమో సుఖమో అందరూ కలిసి పంచుకోవడం మేలుకదా....!

    చిట్టచివరికి అంగీకరించక తప్పలేదు ఆచారికి.

                *    *    *

    కరణంగారి తమ్ముడు మోహన్ రావుకు సిటీలో జనరల్ స్టోర్ వుంది. చాలా పత్రికలకి ఏజెన్సీ కూడా వుంది. అతడి చేతికింద ఇద్దరబ్బాయిలు ఇదివరకే పని చేస్తున్నారు.
 
    కరణంగారు తమ్ముడికి ఆచారి బ్రతికిచెడిన వైనం గురించి చెప్పి, చదువుకోవాలన్న అభిలాష ఇంతదూరం తీసుకువచ్చిందని చెప్పి వాళ్ళకి ఏదయినా ఆధారం చూపి ఆదుకోమని చెప్పాడు.

    మోహన్రావు జనరల్ స్టోర్ ప్రక్కనే ఒక అద్దెపుస్తకాల షాపు వుంది. అది ఓ శాస్త్రిగారిది అతడీమధ్యనే డోర్ డెలివరీ ప్రారంభించాడు. అతడి క్రింద పని చేయడానికి కుర్రాడి అవసరముందని తెలిశాక ఉదయభానును రికమెండ్ చేశాడు మోహన్ రావు అయితే అతడితో ఉదయం., సాయంత్రం పని చేయించుకోవాలనీ బడి వేళకి వదిలేయాలని చెప్పాడు.
    వెంటనే ఉదయభానును పనిలోకి తీసుకున్నాడు శాస్త్రి.

    ఆచారికి కూడా ఒకటిరెండు ట్యూషన్లు మాట్లాడిపెట్టారు మోహన్ రావు.

    వారంరోజులు మోహన్ రావు ఆశ్రయంలో ఉండి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక అద్దె గదిలోకి మారిపోయారు.

    పిల్లలు ముగ్గురూ స్కూళ్ళలో చేరారు.

    పట్న వాసపు కాపురం ప్రారంభమైంది.

 Previous Page Next Page