8
అత్యంత ఆకర్షణీయంగా అలంకరించుకున్న సుశీలను చూసి ముగ్దుడయ్యాడు రాజారావు.
చెల్లెలు తన సూచనకు మనసారా అంగీకరిస్తున్నదని తృప్తిపడ్డాడు.
సుశీల ప్రక్కనే ఏ ఆలంకారాలూ లేకపోయినా మెరుపు తీగెలా మెరుస్తున్న అనితనూ, అనితకేసి కళ్లప్పగించి చూస్తున్న రమణరావునూ చూసేసరికి మతిపోయింది రాజారావుకి. అతని గుండె కలుక్కుమంది.
తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు.
"అనితా! మీ రైతులు సరిగా శిస్తులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నావుకదూ! ఆ వ్యవహారాలు చూసుకుందాం వస్తావా?" అన్నాడు.
అనిత వెంటనే లేచింది.
"పద!"
గడప దాటీ దాటగానే అనిత పేచీ మొదలుపెట్టింది.
"నేను నడవలేను. మా కారులో వస్తావా! నీ స్కూటర్ మీద తీసికెళ్తావా?"
అనిత కారులో వెళ్లటానికి రాజారావుకు అభిమానం అడ్దోచ్చింది.
"నా స్కూటర్ మీదే వెళ్దాం!"
స్కూటర్ బయలుదేరాక రాజారావు మీదికి వంగి "పాపం! నన్ను నీ స్కూటర్ మీద తిప్పాలని నీ కంత ముచ్చటగా ఉందా!" అంది పెంకెగా....
రాజారావు గుర్రుమని "కాసేపు మాట్లాడక కూర్చోండి. ఏ పొలానికి తీసికెళ్లమంటారో చెప్పండి" అన్నాదు.
"ముందా బహువచనం మానండి. తరువాత ఏదైనా పార్కుకి నడపండి."
"పిచ్చివేషాలు వెయ్యకు!"
"నువ్వు నన్ను బయలుదేరదీసింది మా పొలాలకోసం కాదని నాకూ తెలుసు. కాదని ఒట్టుపెట్టుకు చెప్పు..."
క్షణకాలం రాజారావు మాట్లాడలేకపోయాడు.
"పార్కుల వెంట తిరగటానికి అసలు కాదు."
"మరి, దేనికో?"
"నీ బారినుండి ఆ రమణరావును తప్పించడానికి____"
పకపక నవ్వింది అనిత.
"ఎందుకు నవ్వుతున్నావు?"
"ఇలా స్కూటర్ వెనుక కూర్చుని నీతో మాట్లాడలేను. నన్నెక్కడికయినా అందమయిన చోటికి తీసికెళ్ళు. మీకు గులాబితోట ఉందటగా! అక్కడికి తీసికెళ్ళు__"
"నాకు పనిలేదు__"
"పనివున్నా కొన్ని సందర్భాల్లో మానుకోవాలి. మీ చెల్లెలి క్షేమం నిజంగా కోరినవాడివైతే తీసి కెళ్ళు__"
"దీనికీ మా చెల్లెలి క్షేమానికీ ఏం సంబంధం?"
"నేను స్కూటర్ మీద కూచుని అరవలేను."
రాజారావు నిర్లక్ష్యంగా ఉండాలని నటించినా అతనికి సాధ్యం కాలేదు. తమ గులాభితోటలోకి తీసి కెళ్ళి "చెప్పు!" అన్నాడు కూర్చుని. అనిత గూలాబులను చూస్తూ "అబ్బ! ఎన్ని రకాల గులాబులను తెప్పించారు? తోట చాలా అందంగా ఉంది." అంది.
"ఏదో చెప్తానన్నావు. త్వరగా చెప్పు."
విసుగ్గా అన్నాడు.
"నాకు దాహం వేస్తోంది."
"ఇంటి కెళ్ళాక మంచినీళ్ళు త్రాగుదువు కాని..."
"ఈ లోగా దాహంతో నాకు ప్రాణం పోతుంది. నీకు స్త్రీ హత్యా పాతకం చుట్టుకుంటుంది."
"అబ్బ!"
విసుక్కుంటూ లేచిన రాజారావును పచ్చగడ్డిమీద సగం వొరిగి కొంటెగా చూస్తూ "బావా! కొబ్బరి నీళ్ళు తెచ్చిపెట్టు" అంది అనిత. అనిత వంక కొరకొర చూసి వెళ్ళి కొబ్బరి బోండాం కొట్టించి నీళ్ళు గ్లాసులో పోసి తెచ్చిపెట్టాడు.
"నువ్వు చాలా మంచివాడివి బావా!"
రాజారావు తెచ్చిన నీళ్ళు తాగేసి అంది.
"ఏదో చెప్తానన్నావు."
"ఈ అందమైన సాయంకాలం, ఇంత అందమైన తోటలో అంత కన్న అందంగా ఉన్న నీ ఎదురుగా కూర్చుని ఈ సమయాన్ని పిచ్చి కబుర్లతో పాడుచెయ్యమంటావా?"
"అనితా! ఎవరనుకుంటున్నావు నన్ను?"
"అది తెలుసుకోవాలనేగా ఇక్కడి కొచ్చాను నేను?"
"ఏమిటి?"
"స్కూటర్ మీద ఎక్కించుకుని ఈ ఏకాంత ప్రదేశానికి తీసుకు రావటం నీకు బాగుంది కాని మాట్లాడటం నాది తప్పోచ్చిందా?"
రాజారావు వుద్రేకంగా అనిత రెండు చేతులూ గట్టిగా పట్టుకుని "వాగుడు కట్టిపెట్టు ఏదో చెప్తానన్నావ్! చెప్పు!" అన్నాడు.
"అబ్బబ్బ! చేతులు వదులు. ఎవరూలేరని ఏవిటీ అత్యాచారం? పరపురుష స్పర్శ నేను భరించలేను."
రాజారావు చటుక్కున చేతులు వదిలి ముఖమంతా ఎర్రబడగా "అయామ్ సారీ!" అన్నాడు.
ఆ ముఖంలోకి అర్ద్రంగా చూస్తూ "నా బారినుండి రమణరావును కాపాడటానికి తీసుకువచ్చావా నన్ను?" అంది.
"అవును."
"నా బారినుండి కాపాడతావు సరే! నా లాంటివాళ్ళు-నా కున్న అందంతోపాటు నాకు లేని చాంచల్యం కూడా కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి బారినుండి కాపాడగలవా?"
తెల్లబోయాడు రాజారావు.
"లాయరుగారి మెదడు కోర్టులోనే తప్ప తక్కిన ప్రదేశాలలో పనిచెయ్యదా? నీకు ప్రధానమైనది ఏమిటి? నీ చెల్లెలికి పెళ్ళి కావటమా? ఆవిడ సుఖంగా ఉండటమా?
"పెళ్ళీ చేసుకుని సుఖంగా కాపురం చెయ్యటం_____"
"నిజంగా నీ ఉద్దేశం అదే అయితే రమరణరావుకి సుశీలను ఇస్తాననవు."
"ఏం? రమణరావుకు ఏం తక్కువయిందీ?"
"ఏం తక్కువో నీకు కూడా తెలుసునని నన్ను అతని ముందు నుంచి తప్పించి తీసుకురావటంలోనే అర్థమయింది. అది తెలుసుకుని కూడా సుశీలను అతడికే ఇద్దామనుకుంటున్నావా? నీ బరువు దించుకోవటమే నీకు ప్రధానమా? ఆ తరువాత సుశీల కష్ట సుఖాలు నీ కక్కర్లేదా?"
రాజారావు లోలోపల మధనపడి అపరాధిలా అనిత వంక చూస్తూ "పెళ్ళియ్యాక ఇలాంటి చాపల్యాలు సర్దుకుపోవా?" అన్నాడు.