Previous Page Next Page 
అనిత పేజి 10

   
                                                    7


    రాణితో సహా అనిత దిగగానే ఒక్కసారిగా శారదమ్మ ఆశలన్నీ నేలమట్టమయి పోయాయి.
    ఎవరినైనా అభిమానించటమే కాని, ద్వేషించటం తెలియని సత్యకాలపు మనిషి ఆవిడ.
    పెళ్ళి కాకుండానే కూతుర్ని కని నిర్లక్ష్యంగా నించున్న అనితను చూసి కంగారు పడిందే కాని, ద్వేషించలేకపోయింది.
    రాజారావు అనితను వీతిలోంచే వెళ్ళగోడతాడని భయపడింది.
    విచిత్రంగా అనిత తమ ఇంట్లో స్థానం సంపాదించటంతో మరింత విస్తుపోయింది.
    "బామ్మా!" అంటూ దగ్గిరకొచ్చిన పసిపాపను చీదరించుకోగలిగే కాఠిన్యం శారదమ్మలో లేకపోయింది.
    క్షణాలలో రాణి శారదమ్మ దగ్గిర చనువయిపోయింది.
    అనిత రాణికోసం కుదిర్చిన ఆయా లక్ష్మమ్మ ఇంటిపనులన్నీ చక్కబెడుతోంటే శారదమ్మ రాణితో  కబుర్లు చెప్పకుంటోంది.
    కన్నకూ, కమలకూ రాణి రావటం చాలా సంతోషంగా వుంది. రాణి తనతో రకరకాల ఆట సామానులు తెచ్చుకుంది. ఆ ఆటసామానులు చూస్తూ కన్నకు కమలకూ వళ్ళు తెలియటంలేదు.
    ఒకసారి రాణి"మావయ్యా!" అంటూ రాజారావు చేతిలో బిస్కట్ పెట్టబోయింది.
    "ఛ! నన్ను 'మావయ్యా!' అని పిలవకు," అన్నాడు చికాగ్గా రాజారావు.
    "మరి, ఏమని పిలవను?"
    అమాయకంగా అడిగింది రాణి.
    అక్కడే వున్న అనిత కలిగించుకొని "నాన్నా! అని పిలు. పాపం! అలా పిలిపించుకోవాలని ఆశగాఉంది కాబోలు!" అంది.
    "నాన్నా!"
    ముద్దుగా అంది పాప.
    కమల, కన్న చప్పట్లు కొట్టారు.
    రాజారావుకు వళ్ళు తెలియని కోపమొచ్చింది
    "నేను నీ నాన్నని కాను."
    "మరి. ఎవరు మా నాన్న?"
    "మీ అమ్మ నడుగు"
    "అమ్మ  నువ్వని చెప్పిందిగా!"
    అనితా! ఏమిటిది?"
    "ఏముంది?"
    "ఛ! ఛ! ఈ పాపను ఇక్కడినుండి తీసుకుపోండి. ఒక్క క్షణం శాంతి లేదు."
    "అంత అశాంతి ఎందుకు బావా! నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను చేసుకోనందా?"
    "నోరు మూసుకో! ప్రేమించడంతప్ప నాకు వేరేపనిలేదు."
    "నీకు తీరుబడిగా ఉన్న సమయం చూకొని కలుగుతుందేమిటి ప్రేమ?"
    "అందరూ నీలా ఎవరు కనిపిస్తే వాళ్ళను ప్రేమించరు"
    "ఓహొ! నువ్వు కనపడక ముందునుంచి ప్రేమిస్తున్నావన్న మాట. కలలో చూశావా? ఊహలో చిత్రించుకున్నావా? ఫోటో చూశావా?"
    "అనితా, మాటలు జాగ్రత్తగా రానీయ్!"
    "అతి జాగ్రత్తగా నీ మనసులో నిజాల్ని తాకేలా మాట్టాడుతున్నాను గనుకనే నీ కింత కోపం వస్తోంది.కదూ బావా!"
    "నువ్వు...నువ్వు..."
    "నీ మరదల్ని...."
    రోషంతో పళ్ళు కొరుకుతూ తడుముకోంటూన్న రాజారావుకు సమ్రతతో అందించింది అనిత.
    విసురుగా లేవబోయిన రాజారావు కాలికి తగిలి రాణి క్రిందపడి ఏడుపు మొదలు పెట్టింది.
    రాజారావు గాభరాగా రాణిని లేవనెత్తి ఎత్తుకుని బుజ్జగించి అతికష్టంమీద ఓదార్చాడు.
    ఎంతో సేపటికి రాణి ఏడుపు మాని కళ్ళు తుడుచుకుంది.
    రాణీని దింపి వాడిలా ఆ "సుశీలా! త్వరగా తయారవు ఇవాళ మూడు గంటలకు రమణరావుగారు వస్తున్నారు." అని చెప్పి వెళ్ళీపోయాడు.
    రమణరావు పేరు వింటోనే అనిత కళ్ళు మండాయి. సుశీల కళ్ళు చీదరించుకున్నాయి. "వదినా! నీ కున్న దైర్యంలో పదోవంతు నాకుంటే ఎంత బాగుండును? ఈ పీడ వదిలించుకునే దానిని...."
    అనిత భుజంమీద చెయ్యి వేసి దిగాలుగా అంది సుశీల.
    అనిత ముఖం ఉత్సాహంతో వెలిగింది. తన భుజంమీది సుశీల చెయ్యి అప్యాయంగా నొక్కుతూ "అంటే రమణరావు మీద నీకేమీ ప్రేమ లేదా?" అంది.
    "ప్రేమా? పాడా? వాడంటే నాకు అసహ్యం!"
    "మరి, ఆమాట మీఅన్నయ్యతో ఎందుకు చెప్పకూడదు?"
    "హమ్మో అన్నయ్యంటే నాకు చాలా భయం."
    "అంత చండశాసనుడా మీ అన్నయ్య."
    "నీకు తెలియదు వదినా! మా నాన్నగారు అప్పుల సముద్రంలో వదిలిన ఈ కుటుంబాన్ని గట్టుకు తేవడానికి మమ్మల్నందరినీ వృద్దిలోకి తేవటానికీ అన్నయ్య ఎంతపాటు పడుతున్నాడో ఊహించలేవు."
    "అన్ని అప్పులున్నాయా మీకు?"
    "నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ అన్నయ్యతో చెప్పకు. మాకు అప్పులున్న సంగతి మరొకరికి తెలియటం, అన్నయ్య కిష్టంలేదు. అప్పుడు మేమున్న స్థితిలో పెద్ద కట్నాలిచ్చి నాకు మంచి సంబంధం తేవటం తేలికైన పనికాదు అన్నయ్యకి. అంచేత రమణరావు తనంతట తను నన్ను ఇష్టపడుతున్నందుకు ఆనందిస్తున్నాడు. నేను గట్టిగా కాదంటే బలవంతపెట్టడు-కాని బాధ పడతాడు."
    "మీ అన్నయ్య బాధపడతాడని నీకు ఇష్టంలేని పెళ్ళి చేసుకుని జీవితాంతం బాధపడతావా?"
    "ఏం చెయ్యమంటావు మరి?"
    "మీ అన్నయ్యతో స్పష్టంగా ఇష్టంలేదని చెప్పక్కర్లేదు నేను చెప్పినట్లు చెయ్యి. రమణరావు పరుగెట్టి పారిపోతాడు."
    "అంత తేలికకాదు. మొహంమీద ఉమ్మేసినా తుడుచుకు నవ్వే రకం..."
    "కెందుకూ? నా మాట విను..."
    "అన్నయ్యకు ఎదురు తిరగక్కర్లేకుండా ఆ రమణరావును తప్పించుకునే ఉపాయ మేదైనా సరే, తప్పకుండా వింటాను."
    "రైట్! నువ్వు అందంగా ఆలంకరించుకో!"
    "ఛ! వాడి దగ్గిరకు వెళ్ళటమే మంటగా ఉంటే ఆలంకారాలోక్కటా?"
    "అదికాదు. ఆలంకరించుకో! నువ్వు వ్యతిరికిస్తున్నట్లు మీ అన్నయ్యకు తెలియకూడదు. ఆ రమణరావుతోనే చెప్పిస్తాను. మీ సుశీల నాకు వద్దని..."
    సుశీల ఆశ్చర్యంగా చూసింది.

 Previous Page Next Page