Previous Page Next Page 
అనిత పేజి 12

   
    
    "సర్దుకోకపోతే!"
    రాజారావు సమాధానం చెప్పలేకపోయాడు. వడిలిపోయిన అతని ముఖంలోకి సంతృప్తిగా చూస్తూ "నిన్ను మరొక్కటి అడుగుతాను చెప్పు," అంది.
    "అడుగు."
    "నీకు సుశీలమీద మాత్రమేనా ప్రేమ? నీ చెల్లెళ్ళందరి మీద ఉందా?"
    "ఇంటి పెద్ద కొడుకుని మానాన్నగారు కుటుంబ బాధ్యతలన్నీ నా మీద వదిలి వెళ్ళారు. నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అందరి మీదా నాకు ప్రేమ ఉంది వాళ్ళను వృద్దిలోకి తీసుకురావటమే నాఏకైక ధ్యేయం-"
    అనిత ఏదో మాట్లాడబోయిన దానిలా పెదవి కదిపి అంతలో తనను తను నిగ్రహించుకుంటున్న దానిలా ఊరుకుంది.
    "ఏమిటది?"
    "ఇప్పుడు చెప్పవలసిన విషయంకాదు.
    "పోదాం పద!"
    అనితా రాజారావులు ఇంటికొచ్చేసరికి సుశీల హుషారుగా రేడియో వింటోంది. రమణరావు లేడు.
    రాజారావు ఆశ్చర్యంగా "రమణరావుగారు ఏరీ? అన్నాడు.
    "నువ్వు వెళ్ళిపోయిన పది నిముషాలకే వెళ్ళిపోయారు.
    "అదేం? నువ్వు ఏమైనా........"
    "రామ! రామ! ఉండమని ఎంతో ప్రాధేయపడ్డాను. వంట్లో బాగుండలేదుట! వెళ్ళిపోయారు.
    "వంట్లో బాగుండలేదా?"
    రాజారావు త్వరత్వరగా రమణరావును చూడటానికి వెళ్ళి పోయాడు.
    సుశీల, అనిత ఒకరి చేతులోకరు పట్టుకుని విరగబడి నవ్వుకున్నారు.

    
                                                          9

    
    రమణరావు శరీరంనిండా స్వేదజలం క్రమ్ముకొంది-ముఖం పాలిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. కళ్ళు చలిస్తున్నాయి. కొన్ని క్షణాలలో కొన్ని సంవత్సరాలు జబ్బుపడ్డ మనిషిలా అయిపోయాడు-
    "రమణరావుగారు! ఏమిటి వంట్లో సుస్తీ?"
    ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు.
    రమణరావు బెంబేలుగా రాజారావును చూస్తూ"సుస్తీయా? వంట్లోనా? నాకా?లేదే! ఏం లేదు" అన్నాడు.
    "మరి, సుశీల మీకు వంట్లో సుస్తీ అని చెప్పిందే! మీరు అలాగే కనిపిస్తున్నారు."
    "సుశీల చెప్పిందా? అలా కనిపిస్తున్నావా? అవును, సుస్తీ! ఏదో సుస్తీ చేసింది."
    "ఎందు కలా కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? మా ఇంటికి వెళ్దాం రండి."
    మీ ఇంటికా? వద్దు! వద్దు! రాను! రాను!"
    "అదేమిటీ? మా యింటికి రారా?"
    "రానంటే వస్తాను. వస్తానంటే ఇప్పుడు రాను ప్లీజ్ నన్ను క్షమించండి. మీరు వెళ్లండి ప్రస్తుతం నేనేం మాట్లాడలేను. తరువాత మాట్లాడుకుందాం!"
    రాజారావు ఆశ్చర్యంగా చూసి ఏదీ అర్థంకాక వచ్చేశాడు.
    "రమణరావుగారికి ఎలా ఉందన్నయ్యా!" ఎంతో ఆదుర్దాగా అడిగింది సుశీల.
    "ఏమోనమ్మా! ఎందుకో గాభరాగా కనిపిస్తున్నాడు. అడిగితే చెప్పటంలేదు. ఇక్కడేమైనా జరిగిందా?"
    "చెప్పుకొదగిన సంఘటన ఏదీ జరగలేదే! జానకి వచ్చింది ఆకస్మాత్తుగా లేచి పోయారు."
    "జానకి వచ్చిందా?"
    కోపంగా అడిగాడు.
    "అవును. అమ్మకు గుండెలో నొప్పివస్తే సేవ చెయ్యటానికి వచ్చింది. వంట చేసి అమ్మకు కావడం పెట్టి ఇప్పుడే వెళ్ళింది."
    రాజారావు కోసం మంచులా కరిగిపోయింది. "దౌర్భాగ్యురాలు?" అన్నాడు బాధగా నుదురు రాసుకుంటూ.
    అనిత ఉద్రేకంగా లేచింది.
    "జానకి  కాదు దౌర్భాగ్యురాలు! ఈ నాటి మన సామాజిక వ్యవస్థ దౌర్భాగ్యవుది! దానికి ప్రతినిధులమయిన మనం దౌర్భాగ్యులం!"
    "మనం చేసే పాడు పనులకు సమాజం ఏం చేసింది?"
    "పాడుపనులు చేసింది ఎవరు? డబ్బూ అధికారం ఉన్న పెద్ద మనుష్యులుగా చెలామణి అవుతున్న కొందరు. ఆ అక్రమాన్ని సహించి ఊరుకుంది సమాజం. అంటే మనం! మధ్యన నలిగిపోయేది జానకి వంటి అమాయకులు!"
    "జానకిది తప్పులేదనే అనుకుందాం. ఒంటరిగా పార్కుకి వెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది?"
    "బాగుంది నీ వాదన! వొంటరిగా పార్కుకి వెళ్ళిన స్త్రీకి రక్షణలేని సమాజమన్న మాట మనది! సమస్యలను దైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోలేక వెనక్కి చీకటిలోకి పారిపోదామంటావా? అబలలకూ బలహీనులకూ రక్షణ కల్పించవలసింది పోయి వారిని వెలుతురు చూడకుండా దాక్కోమంటావా? దుర్మార్గాన్ని యదేఛ్చగా పెరగనిస్తావా?"
    "కోర్టులో జానకి దోషిగా రుజువయింది. పత్రికలన్నింటిలో ఈ వార్త వచ్చింది. ఊరంతా ఉడికింది. జానకిని ఎలా కాపాడతారు?"
    "నువ్వు లాయర్ వి, జానకి కేసు విచారణ నాటికి నువ్వు డిగ్రీ అందుకోలేదు గనుక మన న్యాయస్థానాలలో మర్మాలు తెలియకపోవచ్చు.
    ఈ నాడు నీకు బాగా తెలిసి ఉండాలి. కోర్టులు ఎల్లవేళలా న్యాయానికే బద్దమయి ఉంటున్నాయా? రాజ్యాధికారాన్నే డబ్బుతో కొంటున్న యీ యుగంలో న్యాయాన్ని కొనలేరా?"
    లోలోపల మధన పడుతున్నట్లు రాజారావు బొమలు ముడుచుకొన్నాయి. కొంచెంసేపు ఏదీ మాట్లాడలేకపోయాడు. చివరకు ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన వ్యక్తిలా లేచి నించున్నాడు.
    "వ్యక్తిగతంగా ఆశయాలూ అభిరుచులూ వేరు. గౌరవనీయమైన కుటుంబపు పెద్దగా నా బాధ్యతలు వేరు. జానకిని నా సొంత చెల్లిలా  అభిమానించాను. కాని ఈ నాటి స్థితికి మన సారా బాధ పడుతున్నాను. కానీ జానకి ఇక్కడికి రావరానికి వీల్లేదు. మీరు అక్కడికి వెళ్లటానికీ వీల్లేదు. నా చెల్లెళ్లకు మంచి సంబంధాలు కుదిరి పెళ్ళికావాలి. అన్నిటికంటె అదే నా ప్రధానమైన ధ్యేయం..."

 Previous Page Next Page