ఇలా ఆలోచిస్తుండగానే అయన నుంచి మళ్ళీ హెచ్చరిక వినపడింది అలారం మ్రోగిందని.
ఆయనమీద కోపం కూడా మరిచిపోయి ఆశ్చర్యపడ్డాను. ఈ వింత శ్రీవారికి చూపించడం కోసమైనా మరొక్క రోజాయనకు ఆతిధ్యం యివ్వాలనిపించింది. నాకు, శ్రీవారైతే మరీ థ్రిలై పోతారు. ఆయనకు కుక్కర్ మ్రోగితేనే యింకేమీ వినపడదని గోల పెట్టేస్తారు.
నేను లేచి కాఫీ కలుపుతుండగా ఎవరో తలుపు తట్టారు. ఆయనే లేచి వెళ్ళి తలుపు తీశాడు. వచ్చింది పక్కింటి తులశమ్మ గారు.
నేనాయనకు కాఫీ యిచ్చి తులశమ్మగారిని వంటింట్లోకి తీసుకుపోయాను.
'ఆయనేవరమ్మా " అడిగింది తులశమ్మ.
"శ్రీవారి బంధువులు కానీ- ఏమిటలా వేళకాని వేళలో వచ్చారు" అన్నాను. సాధారణంగా తులశమ్మ ఈ సమయంలో నిద్ర పోతుంటుంది.
"ఆ ఏమీ లేదు, మీరు జాన్సన్ మిక్సీ గాని కొన్నారేమిటి?" అడిగింది తులశమ్మ.
"ఆ అనుమాన మెందుకు కొచ్చింది " అన్నాను ఆశ్చర్యంగా. మా యింట్లో మిక్సర్ వుంది. ఇంకొకటి కొనాలని కూడా నేననుకోలేదు. కానీ నిప్పు లేందే పొగ రాదంటారు.
"అబ్బే ఏం లేదూ -- పేపర్లో రాస్తుంటారు గదా -- అదైతే నలభై అయిదు నిమిషాలు ఆగకుండా వాడుకోవచ్చనీ మీ యింట్లో ఆగకుండా ,మిక్సర్ శబ్దం వస్తుంటే బహుశా జాన్సన్ మిక్సర్ కొని టెస్టు చేస్తున్నారేమోననుకున్నాను. టెస్టు చేస్తే మధ్యాహ్నం సమయాల్లో చేయకండమ్మా నిద్ర చెడిపోతుంది. ఏ సాయంత్రంలో అయినా ఫరవాలేదు" అంది తులశమ్మ.
నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు. అది మిక్సర్ చప్పుడు కాదనీ, సూరపరాజు గురక అని చెప్పగానే మాత్రం తులశమ్మ గుక్కపట్టి పడిపోయింది. ఆవిణ్ణి సేద తీర్చడం చాలా కష్టమయింది.
ఈలోగా సూరపరాజు వంటింట్లోకి వచ్చి "ఏమమ్మా నా నిద్ర అయిపొయింది మరి" అన్నాడు.
వెంటనే తులశమ్మ లేచి వెళ్ళిపోయింది.
సూరాపరాజు నా దగ్గర దండకం ఆరంభించాడు. "ఈ ఇరుగు పొరుగులకు బొత్తిగా మర్యాదలు తెలియవమ్మా. ఇంట్లో చుట్టం వున్నాడు గదా ఏ టిఫినైనా చేసి పడుతుందేమో ననుకుని వెంటనే వెళ్లిపోవద్దూ -- పోనీలే నేను రాగానే అయినా వెళ్ళిపోయింది -- మనం జీడిపప్పు పకోడీలు ప్రారంభిద్దామా!"
తప్పుతుందా -- అయన అధ్వర్యంలో వంటకం ప్రారంభమయింది. తయారయేసరికి నిజంగానే అద్భుతంగా వచ్చాయి. పెద్ద పళ్ళెం నిండా వున్నాయి.
"ఈ పళ్ళెం నిండా ఉన్నాయి గదా చాల్లెనేమోనని భయపడకు. ఇది పూర్వకాలపు శరీరం. ఈజీగా చెల్లిపోతాయివన్నీ. ముందు మనిద్దరం కాసిని తిందాం. మీ అయన వచ్చేసరికి మన ముగ్గురికీ మూడు ప్లేట్లుంచు. ఇప్పుడు తినేయడమై పోయింది గదా అని మరి తిననని అనుకోకు" అన్నాడు సూరపరాజు.
"అబ్బే అలా ఎందుకనుకుంటానండీ" అన్నాను కాస్త వ్యంగ్యం ధ్వనించేలా.
ఆయనది పట్టించుకోలేదు. ప్లేట్లో సర్ది ఇచ్చాను. క్షణాల మీద తినేశాడు.
"నువ్వు తినడం లేదేమామ్మా!" అన్నాడు.
'ఆయనొచ్చాక తింటానండీ" అన్నాను.
'సరే నాకు మరో ప్లేటేయ్యి" అన్నాడు సూరపరాజు.
"మంచినీళ్ళు తాగుతారా?" అన్నాను.
"వద్దమ్మా , టిఫిన్ పూర్తిగా తిన్నాక గానీ మంచి నీళ్ళు తాగకూడదు. ఎప్పుడు మంచినీళ్ళు తాగానో అప్పటితో టిఫిన్ తినడం అయిపోయిందన్న మాటే" అంటూ అయన యింకో రెండు ప్లేట్లు తిన్నాకనే మంచినీళ్ళు త్రాగాడు.
మధ్యాహ్నం గడిచిపోతే ఆయనకింక కాఫీ అక్కర్లేదుట. అదో శుభవార్త చెప్పాడాయన నాకు. ఎటొచ్చీ శ్రీవారితో పాటు కలిసి టిఫిన్ తినే సమయంలో మాత్రం ఓ కప్పు కాఫీ ఇమ్మన్నాడు.
ఆయన్ననహ్యించుకోవడం తగ్గించి వినోదించగలిగాను. శ్రీవారు వచ్చేసరికి నేను వీధి గుమ్మంలోనే నిలబడి క్లుప్తంగా సూరపరాజు గురించి చెప్పి జీడిపప్పు పకోడీల గురించి కూడా క్లుప్తంగా చెప్పాను. ఎందుకంటె మా ఇద్దరి మాటలకూ తేడా వుండకూడదు.
"సూరపరాజా- వాడెవరు?" అన్నది అయన రియాక్షన్ . ఆయన్నే అడగండన్నాను ఆశ్చర్యంగా.
అయితే సూరపరాజు ఆయన్ని ఒరేయ్ అని పిలిచి అవీ యివీ కబుర్లు చెప్పి అసలాయన ప్రశ్న వేసే అవకాశం కూడా యివ్వలేదు.
కాసేపు కూర్చుని, జీడిపప్పు పకోడీలు అందరితో కలిసి తిని , "ఇంకో గంటలో వచ్చేస్తాను" అంటూ బయటకు వెళ్ళిపోయాడాయన.
అప్పుడు మా యిద్దరికీ మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నేను జరిగినదంతా తూచా తప్పకుండా శ్రీవారికి చెప్పాను. అంతా విని "ఎలా సహించావిదంతా శ్రీమతీ!" అన్నారాయన ఆశ్చర్యంగా.
"ఒక్కొక్కరి ముఖారవింద ప్రభావం. మీరు మాత్రం నోరెత్తి ఆయనెవరో అడిగారా?" అన్నాను.
ఇంతకీ ఆ సూరపరాజేవరో ఆయనకూ తెలియదు. కానీ అయినవాడే అయుండాలంటారాయన. అయినవాడు కాకపోతే మరీ అంత చనువుగా వుండలేడట.
"సరే ఓ గంటలో వస్తారుగా చూద్దాం" అన్నారాయన.
కానీ సూరపరాజు మళ్ళీ రాలేదు. శ్రీవారు కంగారుపడి ఇల్లంతా వెదికారు. ఏమైనా పట్టుకు పోయాడేమోనని. కానీ పాపం అలాంటిదేం జరగలేదు. "ఊ జబర్దస్తీ చుట్టమెవడో ఎంత ఆలోచించినా అంతు బట్టడం లేదు" అంటూ తల పట్టుకున్నారాయన.
సూరపరాజు విషయం మరో నాలుగు రోజుల వరకూ మిస్టరీ గానే వుండిపోయింది. అయితే ఒక రోజున బజార్లో మాకు సూరపరాజు కనబడ్డాడు. సూరపరాజుతో పాటు ఒక ముసలావిడ వుంది. ఇంచుమించు వాళ్ళతో పాటే మరో జంట నడుస్తోంది. ఆ జంట మాకు తెలిసినదే! శ్రీవారి స్నేహితుడు కమలాకరమూ, అతడి భార్యానూ....
అప్పటికప్పుడు సూరపరాజు కు ఎదురుపడ్డం మాకిష్టం లేకపోయింది. అయితే ఆ జంటను కుతూహలంగా వెంబడించడంతో సూరపరాజు జంట ఓ పార్కులో స్థిరపడగా కమలాకరం మాకు విడిగా దొరికాడు.
'అయనేవరు , మీకు చుట్టాలా ?" అనడిగారు శ్రీవారు.
"ఏదో దూరపుచుట్టం, కానీ పెద్ద యిబ్బంది వచ్చి పడింది. ముసలాయన ఆరోగ్యం మంచిది కాదు. రక్తపు పోటు , మధుమేహం, డాక్టర్లు కాఫీ తాగకూడదన్నారు. పంచదార తినకూడదన్నారు . ఉప్పూ కారం మానేయాలన్నారు. ముసలాయనకు జిహ్వ చాపల్యం . అయన ఆరోగ్యాన్ని పిల్లలు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటున్నారు. కూడా అయన పిల్లలు కూడా వచ్చారు. ముసలాయన్ని విడిగా వదలరు వాళ్ళు. వదిలేస్తే యెక్కడ ఏం తినేస్తాడోనని భయం వాళ్ళకి. ఈరోజు వాళ్ళని ఎక్కడైనా తిరగమని ముసలాళ్ళకు మేం బాడీ గార్డులుగా బయల్దేరాం" అన్నాడు కమలాకరం.
'అలాగా -- అయితే ఆయన్నేప్పుడూ విడిగా వదలరా?"
"ఎందుకు వదలరూ? చాలాసార్లు వదుల్తుంటారు. వదిలినప్పుడెం చేస్తారంటే అయన చేతికి పర్సిచ్చి అందులో ఎంత డబ్బుందో పైసలతో సహా కూడా లెక్క రాస్తారు. ఒక్క పైసా ఖర్చయినా ఇంటిల్లిపాదీ శోకాలు పెట్టి ఆయనకు స్థిమితం లేకుండా చేస్తారు. అందుకని అయన తీసుకు వెళ్ళిన డబ్బు తీసుకు వెళ్ళినట్లే వెనక్కు తెచ్చేస్తాడు. ఈ ఆంక్షతో వాళ్ళు ముసలాయన్ని అదుపులో పెడుతున్నారు." అన్నాడు కమలాకరం.
ఉన్నట్లుండి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అందుకు కారణం ఆరోజు సూరపరాజు పర్సు నాచేతి కిచ్చేక డబ్బు లెక్క చూసుకుంటున్న దృశ్యం గుర్తుకు రావడం.
ఒకప్పుడదే దృశ్యం నన్నాయన్ను ద్వేశించేలా చేసింది. ఆ దృశ్యమే యిప్పుడు నా కాయనపై జాలి కలిగిస్తోంది.
భగవంతుడా మనం చూసే దృశ్యాల్లోని నిజానిజాలే తెలుసుకోలేని అల్పులుగా మమ్మల్నేందుకు సృష్టించావు? అని మనసులో బాధపడ్డాను.
సూరపరాజు ను తల్చుకుంటేనే నా మనసిప్పుడు సానుభూతితో ద్రవించి పోతోంది. నేను శ్రీవారి చేయి పట్టుకుని "ఊ" అన్నాను. పదండి పోదాం అనడానికి గొంతులో ఏడుపు ధ్వనిస్తుందని భయం వేసింది.
-----------