ఇంతకీ అయన అలారం టైం పీసుతో తిరిగోస్తాడా? ఎందుకు రాడు? టైం పీసు ఖరీదు వంద చిల్లర.
అప్పుడే నాకో అనుమానం వచ్చింది. టైం పీసు తీసుకుని అయన వెళ్ళిపోతుంటే నాకు బెంగ పుడుతుంది. ఆయన్ని అనుమానిస్తాను! ఆ అనుమానం పోవడం కోసమే తన పర్సు ఇంట్లో వదిలి వెళ్ళాడు. అంటే ఈయనకు మర్యాద తెలుసి వుండాలి. తను పైసా ఖర్చు చేయకుండా పకోడీలు తినాలనుకునే మనిషికీ మర్యాదేమిటో నాకు అర్ధం కావడం లేదు. మొత్తం మీద ఈయన విచిత్రమైన మనిషి."
దుకాణం వాడు ఏమనుకున్నాడో అలారం టైం పీసు చూసి! ఆయనకు అబద్దం చెప్పకుండా వుండాల్సింది ... అందువల్లనే ఈ గొడవంతా వచ్చింది.
నా ఆలోచన లింకా తేలకుండానే సూరపరాజు తిరిగి వచ్చేశాడు. ఆయనకు ఓ చేతిలో పొట్లాలున్నాయి. రెండో చేతిలో అలారం టైం పీసుంది. వస్తూనే అయన నావంక అదోలా చూసి "ఏమమ్మా -- కాఫీ తాగి గంట కావస్తోంది కాఫీ చేసేశావా నేను గుర్తు చేయాలా ?" అనడిగాడు.
"నీ ఆధార్టీ మండిపోనూ " అని మనసులో మాత్రం అనుకుని వంటింట్లోకి పరుగెత్తి ఈసారి కాస్త ఎక్కువగానే కాఫీ కలిసి ప్లాస్క్ లో పోసి తీసుకొచ్చాను. మొత్తం మూడు కప్పులు చేశాను. ఈసారి అయన దీనికి నన్ను చాలా మెచ్చుకుంటాడని ఆశించాను. నేను కూడా ఇప్పుడాయన మెప్పును ఆశిస్తున్నాను. వాటం చూస్తె సూరపరాజు మా ఆయనకు చాలా దగ్గర బంధువులాగున్నాను.
నా చేతిలో ప్లాస్కు ను చూస్తూనే సూరపరాజు "ఎంత పని చేశావమ్మా?" అన్నాడు.
ఏం జరిగిందో నాకు అర్ధం కాక ప్రశ్నార్ధకంగా అయన వంక చూశాను.
"ఫ్లాస్కు లోంచి కాస్త కాస్త పోసుకుని కాస్త కాస్త దాచుకోవడం నాకు చేతకాదమ్మా --కాఫీ ఎంతుంటే అంతా తాగి తీరాల్సిందే! అయినా ఈ విషయం నీకు చెప్పడం మరిచిపోయాను. తప్పు నాది. శిక్ష నీకు ...." అంటూ అప్పటికిప్పుడు మొత్తం మూడు కప్పుల కాఫీ ఒక్కసారే తాగేసి "నీ చేతి కాఫీ చాలా బాగుందమ్మా" అన్నాడు.
నా గుండె చేరువై పోయింది. నా ముఖంలో హావభావాలు మారిపోతున్నాయని నాకు తెలిసిపోతుంది. అలా జరగడం నా కిష్టం లేదు. మాట ,మారిస్తే కాని నేను మామూలు మనిషిని కాలేను. ఎందుకంటె ఆయన్ను చూస్తుంటే నాకు కోపం, ఉక్రోషం ఆగకుండా వచ్చేస్తున్నాయి. అందుకని "బాబాయ్ గారూ --- మీరు అలారం టైం పీసు ఇవ్వకుండానే సరుకులు తీసుకోచ్చారే!" అన్నాను.
అయన నవ్వి "ఏదో -సరదా కన్నాను కానీ వీధిలో వీధిలో వుంటూ దుకాణం వాడు ఆమాత్రానికి ముఖం చూసుకోడని నాకు తెలుసు. మీకైతే అరువు అలవాటు లేదు కానీ నాకు అనుభవమే కదా! అలారం టైం పీసు తాకట్టు పెడితే అసహ్యంగా కూడా వుంటుంది. మీ యిల్లు గుర్తు చెప్పడం కోసమని ఇది తీసుకు వెళ్ళి - కావాలంటే ఉంచుకోమని సరదాగా అన్నట్లు అన్నాను ..." అన్నాడు.
తెలివైనవాడే ....కానీ తెలివితేటలూ అన్ని సమయాల్లోనూ ఉపయోగించడెం --
నేనిలాగనుకుంటుండగానే సూరపరాజు -- "అన్నట్లు నా పర్సు నీ కిచ్చాను కదమ్మా -- ఇంక నాకిచ్చేసేయ్ " అంటూ అడిగేశాడు.
ఆ క్షణంలో నా వళ్ళు భగభగ మండింది. ఎలాగో తమాయించుకుని పర్సాయన చేతికిచ్చాను. డబ్బు లెక్క పెట్టుకోండి. అన్న మాటలు నోటి చివరి దాకా వచ్చి ఆగిపోయాయి. నేను మర్యాదను అంత సులభంగా వదిలిపెట్ట లేకపోయాను.
అయన పర్సు జేబులో పెట్టుకుని "కాసీని మంచినీళ్ళు తీసుకురామ్మా!" అన్నాడు. నేను లోనికి వెళ్ళి క్షణాల మీద మంచినీళ్ళు తీసుకొచ్చాను. వచ్చేసరికి కళ్ళబడ్డ దృశ్యం నన్నాశ్చర్యచకితురాల్ని చేసింది.
సూరపరాజు పర్సు లోని డబ్బు చిల్లర తో సహా లెక్క పెట్టుకుంటున్నాడు. అంతా అయ్యేక జేబులోంచి ఏదో కాగితం తీసి మొత్తం సరిపోయిందో లేదో చూసుకుంటున్నాడు.
సిగ్గు, అవమానం నా శరీరాన్ని కుంచింపజేశాయి. అయన నన్ను కూడా తనవంటి సిగ్గుమాలిన మనిషికిందే లెక్క వేసుకున్నాడా?
నేను మంచినీళ్ళు తీసుకును వెళ్ళేసరికి అయన పర్సు జేబులో పెట్టుకుని -- జేబులోని కాగితాన్ని నాకు చూపించాడు. దాని మీద ఒక అంకె వున్నది.
"చూశావా అమ్మా! ఇది ఈ పర్సులో ఎంత డబ్బుందో చెప్పే అంకె! ఈ కాగితం మీద అంకెకూ, పర్సు లోని డబ్బుకూ ఒక్క పైసా కూడా తేడా రాకూడదు" అన్నాడు.
'అవున్లెండి - లెక్క చూసుకోలేక పోయారా ? అందులోనూ పర్సు నా చేతికి కూడా ఇచ్చారు మరి" అని కాస్త నిష్టూరంగానే అన్నాను.
సూరపరాజు చలించలేదు. "జాగ్రత్తకు యెవరైనా నా తర్వాతనే అమ్మా, పర్సు దేముంది ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా ఓ నోటో, కాస్త చిల్లరో జారిపడిపోవచ్చు. అందుకే ఎవరికి పర్సిచ్చినా నేను డబ్బు లెక్క పెట్టుకుంటాను " అని అయన మంచినీళ్ళందుకుని తాగి "కాస్త నడుం వాలుస్తానమ్మా మడత మంచం వాల్చగలవా?" అన్నాడు.
నేను మదతమంచం వాల్చి పక్క వేశాను. అయన పడుకోబోతూ "ఇందాకా మూడు కప్పులూ తాగేశాను కదా అని ఇంక ఇవ్వాల్సినపని లేదనుకోకు. ఒక్కసారి యెన్ని కప్పులు తాగినా ఒక్కసారి కిందే లెక్క?" అన్నాడు.
భగవంతుడా ఇదెక్కడి తద్దినం తెచ్చి పెట్టవురా అనుకున్నాను మనసులో. ఇలాంటి అలవాటు శ్రీవారి కుందంటే వచ్చే జీతమంతా కాఫీకే సరిపోతుంది!
నిమిషాల మీద అయన గుర్రు పెట్టాడు. అసలే స్థిమితం లేకుండా వున్న నాకు ఈయన గుర్రొకటి. శబ్దం వల్ల ఇల్లంతా అదిరిపోతోంది. అదలా గుంచితే ఆయన ఉనికి అనుక్షణం గుర్తు చేస్తోందా గుర్రు.
అయన రాగానే ఈ సూరపరాజేవడో నాకు తెలియదు. అవతలకు పొమ్మను అంటే బాగుండును. ఈ మర్యాద హీనుణ్ణి ఒక్క క్షణం కూడా భరించ లేననిపిస్తోంది. అయితే ఆయన్ను నేనేమీ అనలేకపోతున్నాను. ఎందువల్ల? అందుక్కారణం నా మొహమాటమా? అయన రూపు రేఖలా?
నా మొహమాటం అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటె బిచ్చగాళ్ళ మీద నేను అధార్టీ చేస్తాను. రిక్షావాళ్ళని దెబ్బలాడలేను. కూలీలను తిడతాను. ఈయన్నేమీ అనలేక పోతున్నాను. నాపట్ల అమర్యాదగా ప్రావ్ర్తించిన నేనేమీ అనలేకపోతున్నాను. అందుకు కారణం అయన కట్టిన పంచ, వేసుకున్న లాల్చీ ముఖ కవళికలు.
చూడ్డానికి అయన గొప్పవాడిలాగున్నాడు. చేతలలో లేవు. అయినా అయన మీద ద్వేషం పెంచుకుంటున్నాను. తప్పితే ఏమీ అనలేకపోతున్నాను.
ఆలోచిస్తుండగా అయన కంఠం వినపడింది. "ఏమమ్మా అలారం మోత వినబడలేదా?"
ఉలిక్కిపడ్డాను . అలారం మోత నిజంగానే నాకు వినపడలేదు. అయన గుర్రు శబ్దం ఇల్లంతా ఆక్రమించేయాగా యింకా అందులోంచి అలారం శబ్దం ఎక్కడ వినిపిస్తుంది. అవునూ అసలది ఆయనకు మాత్రం యెలా వినిపించింది! బహుశా అయన గుర్రు ఆయనకు వినిపించదేమో!
నేను కాఫీ కలుపుతుండగానే అయన గలగలా నవ్వి "ఏమమ్మా నిద్రపోతున్న నాకే వినిపించింది. మెలకువగా వున్న నీకు వినపడలేదేంటమ్మా అలారం మోత" అన్నాడు.
నేను ఏడ్వలేక నవ్వి ఊరుకున్నాను. అయన కాఫీ తాగేసి మళ్ళీ పడుకున్నాడు. పడుకుని రెండు క్షణాలైనా కాకుండా గుర్రు మొదలెట్టాడు. ఆ శబ్దం నేను భరించలేక పోతున్నాను. ఇలాంటి బాధల్నుంచి తప్పించుకునేందుకు ఏకాగ్రత ఒక్కటే ఉపాయం. ఏదైనా పుస్తకం తెచ్చి చాడువుదామనుకున్నాను. సోఫా దగ్గర టీపాయ్ మీద పక్కింటావిడిచ్చిన నవల వుంది. అది చదువుదామనుకుని పుస్తకం తీయగానే చేయి జారి పుస్తకం క్రింద పడింది.
"అబ్బా -- ఏమిటమ్మా చప్పుళ్ళు" అన్నాడాయన. విసుగ్గా.
నేనాశ్చర్యపోయాను. అయన గుర్రు శబ్దంలో నాకసలది వినపడనే లేదు. అంత గుర్రు పెడుతూ అయన ఈ శబ్దానికి నిద్రాభంగం పొందాను. "నీ అసాధ్యం కూలా -- భలేవాడివే" అని మనసులో అనుకున్నాను. ఆ తర్వాత నుంచి నన్నో కుతూహలం బాధించింది. అయన గుర్రులో ఈసారైనా నేను అలారం వినగలనా అని. పట్టుదలగా కూర్చున్నాను. ఆయనకు వినబడ్డ అలారం నాకు మాత్రం యెందుకు వినపడదు?
పట్టుదలగా చెవులు రిక్కించి మరీ కూర్చున్నాను. అప్పుడే ఇంకో విచిత్రం తెలిసింది నాకు.
మనిషి ఆగి ఆగి ఊపిరి పీలుస్తాడు. మనిషి గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది. అలాంటప్పుడు గురక కూడా ఆగి ఆగి రావాలి గదా! ఈయన గురక ఆగడం లేదు. ఎడ తెరిపి లేకుండా బాజా వాయిస్తున్నట్లుగా వుంది. గాయపడి వెనుక తంబురాలాగ్రాన ఒక్కక్షణం వ్యవధి లేకుండా శబ్దం వస్తుంటే నాకు సంగీతానికి శృతి పెట్టె గుర్తుకొచ్చింది. అయన ఒకసారి గుర్రుపెడితే అది గది గోడలో తగిలి ప్రతిధ్వనిస్తోంది. ఈలోగా అయన మళ్ళీ గుర్రు పెడుతున్నాడు. ఆగకుండా గురక వినిపించడానికి కొక్కటే కారణమయిండాలి.