Previous Page Next Page 
దీప శిఖ పేజి 11

                                 

    అటూ శంకరం గారూ మానసికంగా ఎంతో బాధపడి పోతుంటే నేనే ఆయన్ని ఓదార్చి "ఎందుకు బాధపడతారు ?...మనియార్డరు తిప్పెశాడని మనం ఎందుకు అనుకోవాలి. మనం రాసిన ఎడ్రసు తప్పు కావడం వల్ల కూడా మని ఆర్డరు తిరిగి వచ్చేయ వచ్చుగా?....అయినా గోపాలం రాసిన ఆ ఒక్క పంక్తి ఉత్తరం లోనూ సరి అయిన అడ్రసు రాశాడా ఏమన్నానా?........ఉండండి నేను రాజమండ్రి వెళ్లి రామనాధం గారికి తెలుసునేమో అడ్రసు కనుక్కుని డబ్బు పంపిస్తాను-- అని చెప్పి ఇక్కడికి బయలుదేరి వచ్చాను. వస్తుంటే అయన అన్నదేమిటంటే బావగారూ అడ్రసు ఎవరిని కనుకున్నా సరే. ఏం చేసినా సరే -- నెలనెలా మీకో వంద రూపాయలిస్తాను. వాటి నెలాగాయినా గోపాలానికి అందిస్తూ ఉండండి. ఓ మాటు మని ఆర్డరు తిప్పేసినా వాడికి నాకు నేనై , నా చేతుల్తో మళ్ళీమని ఆర్డరు పంపను. పౌరుషం అనేది వాడికి కాదు-- నాకూ ఉంది. అంటూ నాచేతికి వంద రూపాయలు ఇస్తే అవి పట్టుకుని ఇలా వచ్చాను. ఇక పై వ్యవహారం అంతా మీరు నడపాలి-- అంటూ ముగించాడు శేషయ్య.
    "ఇందులో నేను చెయ్య గలిగింది ఏముంది?" అన్నాడు రామనాధం.
    "అలా అనకండి. అటు అన్నా ఇటు తమ్ముడూ కూడా సమ ఉజ్జీలు. పట్టుదలలు ఇద్దరికీ సమానమే. ఓ మాటు అన్నగారు పంపిన డబ్బుని తిరగగొట్టేసిన వాడు ఇంకో మాటు తీసుకుంటాడని ఏముంది?......ఒకమారు ఇలా జరిగాక మళ్లా తన చేతుల్తో ఎలా పంపిస్తారు శంకరం గారైనా?...అయితే డబ్బు లేకుండా అతనికి సాగదు. పంపించకుండా ఈయన మనస్సూ ఆగదు. అందువల్ల నేనో పద్దతి ఆలోచించాను. నెలనెలా శంకరం గారిచ్చే డబ్బు నేను తీసుకొని, నమ్మకస్తుడైన మా ముసలి పాలేరు వెంకడి ద్వారా మీకు పంపిస్తూ ఉంటాను. మీరు దానిని గోపాలానికి మీరు పంపిస్తున్నట్లే మనియార్డరు చెయ్యండి..."
    "అబ్బో -- అన్నగారి డబ్బే తృణీకరించిన వ్యక్తీ నా దగ్గర డబ్బంటే తీసుకుంటాడా?....మహా పౌరుషం , మొహమాటం ఉన్న మనిషి. ఒకటి రెండు నెలలు అలాగే పంపిస్తే "మీరిక ముందు పంపించవద్దు . ఇక్కడ నేనేదో స్కాలర్ షిప్పు కోసం ప్రయత్నిస్తున్నా -- పైగా కాళీ టైము లో రెండు మూడు ట్యూషన్స్ కూడా చెప్పదలిచాను ......." అంటూ ఏదేదో రాశాడు అన్నాడు రామనాధం.
    "మీరు ఎలాగో అలాగ రాసి ఒప్పించండి. ఆఖరికి అప్పుగా యిస్తున్నాను. తర్వాత తీరుద్దువు గానిలే అనండి. మొత్తం మీద ఇది వాళ్ళన్నయ్య పంపిస్తున్న డబ్బు అని మాత్రం తెలియ నియ్యకండి. అలాగే నేను కూడా ఇలా మభ్య పెట్టి గోపాలానికి పంపిస్తున్నాం అనే సంగతి శంకరం గారికి తెలియ నివ్వను. తెలిస్తే "చూశావా! నా పేరని పంపితే పుచ్చుకోకుండా రామనాధం గారి పేరని పంపితే పుచ్చు కున్నడన్న మాట" అని అయన బాధపడతారు. ఇంతకీ పని జరగడం కావలసింది. ఈ రహస్యం మన ఇద్దరి మధ్యే ఉండనీయండి కొన్నాళ్ళ దాకా -- అవసరం అయినపుడు బహిరంగం చేద్దాం ." అన్నాడు శేషయ్య.
    "సరే బాగానే ఉంది కాని, ఇలా చెయ్యడం వల్ల ముందు ముందు ఏం ఇబ్బందులు వస్తాయో, ఏం కొంపలు మునుగుతాయో , సరే కానివ్వండి." అంటూ శేషయ్య చేతిలో డబ్బుని రామనాధం అందుకున్నాడు.
    "నాకు మాత్రం రావాలని లేదంటారా? హాయిగా ఈ అయిదారు రోజులూ పిఠాపురం రాజా వారి దివాణం లో జరిగే ఆ వసంతోత్సవాల్ని కళ్ళకి కరువుతీరా చూడాలనీ, చెవుల తుప్పు వదిలే లాగ నారాయణ దాసు గారి హరి కధని, సంగమేశ్వర శాస్త్రి గారి కచేరీ ని వినాలనీ, రామజోగా రావు కుస్తీ పట్లూ, కూచిపూడి వారి ప్రదర్శన లూ మళ్ళీ ఓ మారు చూసి ఆనందించాలని మిత్రులు పానుగంటి లక్ష్మీ నరసింహం . మొక్కపాటి సుబ్బరాయుడు గార్లతో....నవ్వుతూ కబుర్లూ చెపుతూ లోకాన్ని మర్చిపోయి హాయిగా కాలక్షేపం చెయ్యాలని, నాకు మాత్రం లేదూ?" అన్నాడు రామనాధం కళ్ళజోడు తీసి, పెట్టుకొని కోర్టు కాగితాలు చూసుకుంటూ.
    "ఎప్పుడడిగినా ఇలా ఓ పెద్ద లిస్టు చదవడం తప్పిస్తే ఎప్పుడు రావడమో మాత్రం చెప్పవే. మొన్న దసరా ఉత్సవాలకీ అంతే. దుర్గాష్టమి నాడు వెళదాం. నవమి నాడు బయలుదేరుదాం , నీకెందుకు విజయదశమి నాడు అక్కడ ఉంటాం కదా అంటూ ప్రయాణం నాన్చి  నాన్చి మొత్తం మీద ఇప్పుడు కుదరదు లే , వసంతోత్సవాలకి వెళదాం అంటూ వాయిదా వేశావు ఈ అయిదారేళ్ళ నుంచి పిఠాపురం ఉత్సవాలు అలా ఉంటాయి ఇలా ఉంటాయి అని ఊరించడమే కాని ఒక్కమాటు తీసికెళ్ళ లేదు కదా!" అంది విజయ బుంగమూతి పెట్టి కోపంగా చూస్తూ -
    "ఏం చెయ్యమంటావమ్మా? ఈ కోర్టు గొడవలతో ఒక్క క్షణం తీరిక ఉండడం లేదు. పోనీ నిన్ను ఒక్కదాన్నీ వెళ్ళమంటే వెళ్ళ నంటావు . ఏం చేసేది ?"
    "అదిగో అడిగితె అలా అంటావు. పోనీ వెళ్లొద్దులే?" అంది కోపంగా విజయ.
    "ఒక్కదానివీ వెళితే మాత్రం ఏమిటి భయం? పిఠాపురం ఊరు ఊరంతా మనకి స్నేహితులే....ఎవరి ఇంట్లో ఉన్నా ఉండొచ్చు. లేదా మన మేడే ఉంది రధం వీధిలో. తాళం తీసుకొనేది హాయిగా ఈ నాలుగు రోజులూ అందులో ఉండేది...."
    "ఒక్కదాన్నీ చచ్చినా వెళ్ళను....."
    "అయితే ఎల్లుండి ఇద్దరం వెళదాం . అందాకా అగు."
    "ఎల్లుండి వెళితే మరి రేపు తుమురాడ సంగమేశ్వర శాస్త్రి వీణ కచేరీ అయిపోదూ?"
    "అవును. అయన కచేరీ వినవలసిందే. పెద్దవాడయ్యాడు . మళ్ళీ ఎప్పుడు వింటామో ఏమో!
    "అందుకే ఇవాళ వెళదాం అంటున్నా. పైగా నేను అయన కచేరీ ఒక్కసారి కూడా వినలేదు ఏం మావయ్యా వెళదామా?....." అంది విజయ ఆశగా మావయ్య ముఖంలోకి చూస్తూ.
    రామనాధం నవ్వి "ఎల్లుండి ఆర్గ్యూ చెయ్యవలసిన ముఖ్యమైన మర్డర్ కేసు ఒకటి ఉంది, అది అయిన తర్వాత సాయంత్రం కాని బయలు దేరడానికి లేదు పైగా తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళిపోతే ఎలాగ?.....పరీక్షలయి మద్రాసు నుంచి తిన్నగా ఇక్కడికే, ఇవాళో రేపో వస్తానని గోపాలం ఉత్తరం రాశాడుగా" అంటుండగా.
    "వస్తాడేమి టండీ ?....వచ్చాను అంటూ జట్కా వాడి చేత పెట్టె బెడ్డింగ్ పట్టించుకుని వస్తూ గోపాలం హాల్లో అడుగు పెట్టాడు.
    "వచ్చావా! రా, గోపాలం . ఇప్పుడే నీ మాట అంటున్నాను. నూరేళ్ళు అంటూ కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుంటూ ఎదురు వెళ్ళాడు. రామనాధం. అనుకోని ఆనందాన్ని పొందిన అనుభూతి తో నోట మాట రాక కేవలం కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది విజయ.
    గోపాలం బాగా మనిషి అయ్యాడు. మద్రాసు నీళ్ళకి రంగు వచ్చి నునుపు దేలడు కూడా. రాత్రి అంతా రైలు లో ప్రయాణం చెయ్యడం వల్ల బట్టలన్నీ నలిగి, గెడ్డం మాసి , ముఖం నీరసంతో కొద్దిగా సడలినా ముఖం కంటికి మాత్రం ఒడిలిన మొగలి రేకులా అందంగానే కన్పించాడు. పాత పరిచయం ఎంత ఉన్నా, గోపాలాన్ని చూడగానే , విజయ కొత్తగా సిగ్గు గా ఓరగా చూసింది. తనకేసి చూసిన విజయ ని, రామనాధం గారు చూడకుండా కళ్ళతో పలకరించాడు గోపాలం.
    స్నానాదికాలు పూర్తీ చేసుకున్న తర్వాత భోజనం దగ్గర, సెలవల్లో తను ఇటు రాకుండా మద్రాసు లోనే వుండి అభివృద్ధి చేసుకున్న విజ్ఞానమూ ఏర్పరచు కొన్న పెద్ద పెద్ద బారిస్టర్ల పరిచయాలూ , మిత్రుల సలహాలని కాదని తను మద్రాసు లో కాకుండా రాజమండ్రి లో రామనాధం గారి దగ్గరే "అప్రేంటీసు" చేయాలని తీసుకున్న నిర్ణయం. అన్నింటి కంటే ముందుగా తను పరీక్షలు బాగా రాసిన పయినం-- ఇవన్నీ చెప్పాడు గోపాలం.

                                        
    హల్లో సావకాశంగా కూచున్నాక "మీ ఊరు కబుర్లేనైనా తెలుస్తున్నాయా?' అని ప్రశ్నించాడు రామనాధం గోపాలాన్ని.
    "ఉహూ........ నేను మద్రాసు వెళ్ళిన కొత్తలో మా అన్నయ్య పేర ఓ ఉత్తరం రాశాను. డానికి జవాబు రాలేదు. దాంతో నేనూ ఊరుకున్నా" అన్నాడు గోపాలం తలవంచుకుని గోళ్ళు గిల్లుకుంటూ.
    రామనాధం బరువుగా నిట్టూర్చాడు.
    "ఈ మధ్య కబుర్లు మీకేమైనా తెలిశాయా?' అన్నాడు గోపాలం ఆతృతగా.
    "తెలియడాని కేముంది? అంతా కులసాగానే ఉన్నారుట. మీ అన్నయ్య కట్టిస్తున్న ఇల్లు కూడా పూర్తీ కావచ్చినదట. నేడో రేపో గృహప్రవేశం ముహూర్తం పెడతారట!...పరీక్షలయ్యాక నువ్వు ఎప్పుడు మద్రాసు లో బయలుదేరుతావో తెలుసుకు రమ్మన్నారు. పెద్ద కాపుగారు అంటూ. వాళ్ళ వెంకడు అడిగి వెళ్ళాడు మొన్న -- ఇవాళ రేపట్లో ఇక్కడికి వస్తావని చెప్పాను....."
    గోపాలం "ఉహూ!" అంటూ ఊ కొడుతున్నాడు.
    ఇంతలో తడిచేతులు పైట కొంగుతో తుడుచుకుంటూ విజయ వచ్చి అక్కడ కూర్చుంది. గోపాలం విజయ ముఖం లోకి చూశాడు. బాగా చిక్కినట్లు కనిపించింది.
    "చక్కని వాళ్ళు చిక్కినా అందమే" అనుకోని నవ్వుకున్నాడు.
    "ఊ....అయితే నీ ప్రోగ్రాం ఏవిటీ?' అన్నాడు రామనాధం . అందులో నువ్వు ఉంటావా. మీ ఊరు వెళతావా అన్న అర్ధం ధ్వనించింది గోపాలానికి.
    నేను ఇక్కడ రెండు మూడు రోజులుంటే ఈయనకి కష్టంగా ఉంటుందా?.....ఎప్పుడూ లేంది ఇలా అన్నాడేవిటి?....నువ్వు రావాలి. నాలుగు రోజులుండాలి అంటూ ఎప్పుడూ బలవంతం చేసే మనిషి ఇవాళ ఎందుకు ఇలా అనవలసి వచ్చింది ?....అవును మరి తను అన్నయ్య తో అన్ని సంబంధాలు తెంపే సుకున్నట్టు ఇక్కడే ఉంటున్నాడు. ";లా" చదువు కని మద్రాసు వెళ్ళినా, అక్కడ ఉన్నా తను బతికింది ఈయన డబ్బు మీదనే. ఆ తీసుకున్న డబ్బు కేవలం అప్పుగా మాత్రమె అని తను ఎంత అనుకున్నా, తీర్చేసే పద్దతి మీదే తీసుకుంటూన్నానని తను ఎన్ని మార్లు రాసినా , ఈయన దృష్టి లో తను లోకువే! నిజమే. ఈ పరిస్థితిలో తను ఇక్కడ ఒక్క క్షణం ఉండకూడదు......అయితే ముందు వెనకలు ఆలోచించకుండా పల్లె వెళితే దాని వల్ల వచ్చే పలితాలు ఎలా ఉంటాయో . తీరా వెళితే అన్నయ్య తనతో మాట్లాడక పొతే !....... నామాట కాదని దిక్కరించి వెళ్ళిన వాడిని మళ్ళీ నా దగ్గర కెందు కొచ్చావంటే ఏం సమాధానం చెప్పేటట్లు?.......
    ఏవిటో ! తన వెర్రి గాని ?....ఈ భయాలన్నీ ఎందుకు తనకి ?..... ఓ గదో ఇల్లో తీసుకుని ఈ ఊళ్ళో నే వేరే ఉండొచ్చు కదా? ఇంక తను ఒకళ్ళ మీద అధారపడ వలసిన అవసరం ఏం ఉంది?....తనంతటి వాడు తను ఈ రకంగా అడ్డూ అపూ లేకుండా గోపాలం చేస్తూన్న ఆలోచనల కి, రామనాధం గారి ప్రశ్న , అంతరాయాన్ని కలిగించింది.
    అయన ప్రశ్నకి సమాధానంగా "వారం పది రోజుల దాకా పల్లెకి వెళ్ళ నండి పరీక్షల కని రాత్రిం పగళ్ళు చదవడం , ఆదుర్దా తోటి ఆందోళన తోటీ పేపర్లు రాయడం, వీటితో బుర్ర కాటేక్కి పోయింది. సరదాగా ఓ వారం రోజులు ఏ స్నేహితుల ఇళ్లకో వెళ్లి కాలక్షేపం చేస్తే గాని......." అని అంటూ మధ్యలో ఆగిపోయాడు గోపాలం.
    "అయితే ఓ పని చెయ్యకూడదు ? అన్నాడు రామనాధం గోపాలం విజయా అతని కేసి చూశారు.
    "నీకు సరదాగా కాలక్షేపం అయినట్టూ ఉంటుంది. విజయ కి సాయంగా వెళ్ళినట్టూ , నాకో సమస్య తీరినట్టూ కూడా అవుతుంది. ప్రయాణం బడలిక లేకపోతె ఈ సాయంత్రమో, రేపు పొద్దుటో , విజయ ని తీసుకుని ఫిరాపురం వసంతోత్సహాలకి వెళ్ళు-- అక్కడ మన మెడలో మీరుంటే , ఎల్లుండి మర్డర్ కేసు చూసుకుని నేను వచ్చి మీతో కలుస్తాను."
    రామనాధం చెప్పింది విని గోపాలం తెల్లబోయాడు . ఏవిటి ఈయన అనేది? యుక్త వయస్సు లో ఉన్న విజయ నీ , తననీ మూడో వ్యక్తీ లేకుండా వెళ్ళ మంటున్నాడు? ఇదేవిటి? సామాన్యంగా లోకంలో ఆడపిల్ల బాధ్యతలున్న వాళ్ళందరికీ ఉండే అభ్యంతరాలు ఈయనకి లేవా?.....అసలాయన మనస్సులో ఆ భావమే మెదిలినట్లు లేదు. చిత్రంగా ఉందే !....తన మీద విజయ మీదా ఎంత విశ్వాసం ...నిశ్చింతగా, నిర్మలంగా ఉన్న హృదయం ఈయనది. లోకం తాలుకూ కాలుష్యాలు ఏవీ సోకని ఈ పవిత్ర హృదయుని గురించి తను ఇందాకా ఎంత సంకుచితంగా ఊహించాడు?

 Previous Page Next Page