మావయ్య మాటలు విని విజయ కూడా అదిరి పడింది. తనని, గోపాలాన్ని ముందు వెళ్ళమంటారేమిటి మావయ్యా ?.... అమ్మో , తలుచుకుంటే ఏదో భయంగా ఉంది. గోపాలం తనతో వస్తాడంటే సంతోషంతో గంతు లేసిన హృదయమే, గోపాలం మాత్రమె వస్తాడంటే ఎందుకో బెదురుతోంది.
"ఏం గోపాలం?.... మాట్లాడవేం?" అన్నాడు రామనాధం.
వెంటనే సమాధానం చెప్పలేక ఒక్క క్షణం ఊరుకొని ఇబ్బందిగా గుటక వేసి "సరే, విజయ కి అభ్యంతరం లేకపోతె నాకు అభ్యంతరం లేదు" అన్నాడు గోపాలం.
"విజయ కి అభ్యంతరం ఏం ఉంటుంది ?.....ఏం విజయా?" అన్నాడు రామనాధం.
"తనకి లేంది నాకే నేమిటి అభ్యంతరం ?" అంది విజయ కొంచెం పౌరుషంతో ............................
రైల్లో ప్రయాణం చేసినంత సేపూ, ఒకళ్ళ తో ఒకళ్ళు మాట్లాడకుండా విజయా గోపాలం ఇద్దరూ మౌనంగానే ఉన్నారు.
ఇద్దరి మెదడు లోనూ తెగని ఆలోచనలు.
ఇద్దరి మనసులలో నూ ఆగని భయందోళనలు.
ఇద్దరి గుండేల్లోను చెప్పలేని బరువు భారాలు--
రామనాధానికి పిఠాపురం లో ఉన్న పిత్రార్జితం తాలుకూ మేడ తలుపులు అతను వచ్చి తీసి, ఏ ఏడెనిమిది ఏల్లో అయింది. కానయితే చుట్టూ ఆవరణ లో ఉన్న మొక్కలకి నీళ్ళు పోసే షరతు మీద దొడ్లో కాపురం ఉంటూన్న తోటమాలి మాత్రం తన దగ్గరున్న మారు తాళం చెవులతో ఏ నాలుగైదు నెలల కో అన్నీ గదులూ తీసి పరుశుభ్రం చేసి మంచాలూ కుర్చీలూ వంట సామానులు అన్నీ ఓ మారు తుడిచి, తిరిగి తాళాలు వేస్తూ ఉంటాడు కనుక కాని, లేకపోతె విజయా గోపాలం వెళ్లేసరికి ఇల్లంతా అడవి లా ఉండి ఉండేది. కొత్తలో వీళ్ళేవరో కొత్తవాళ్ళు అని అనుమానించినా , చెప్పిన ఆనవాళ్ళు తెచ్చిన అసలు తాళం చెవుల గుత్తీ , పట్టుకొచ్చిన చేతి ఉత్తరం -- ఇవి కారణంగా తోటమాలి , వీళ్ళిద్దరూ రామనాధం గారి తాలుకే అని నమ్మాడు.
అరగంటలో ఇల్లంతా బాగు చేశాడు. పెరట్లో ఉన్న చెట్ల నుంచి రెండు కొబ్బరి బొండాలు దింపి ఇద్దరికీ ఇచ్చాడు. అంగడి నుంచి సరుకులూ, రాజావారి సత్రం నుంచి వంట పాత్రలూ తెచ్చి ఇచ్చాడు. పాలూ, పెరుగూ పట్టుకు వచ్చాడు.
విజయ ఇటికలు పేర్చి ఎండి రాలిన కొబ్బరి మట్టలు చేర్చి వేడి నీళ్ళు పెట్టింది. గోపాలానికి-- తన మమకారాన్ని కోరికలని కలబోసి వండినట్లు రుచిగా పదార్ధాలు తయారు చేసింది. నడవ లో తెల్లని పక్క వేసి, తలగడా మీద సున్నం రాసి ఈనెలు తీసిన ఆకులూ , వక్కలూ పెట్టింది. ఆమె చేస్తున్న ఆ సపర్యలు చూస్తుంటే గోపాలానికి చెప్పెలేని ఆనందం, పట్టరాని ఉద్వేగం కలజోచ్చాయి. ఇద్దరూ ఏదో ఒక గంబీరమైన మధుర సన్నివేశం కోసం మౌనంగా తియ్యని బాధతో వేచి ఉన్నట్టు అనిపిస్తున్న మరుపురాని ఆ రోజుని చూస్తూన్న కొద్దీ. అలాంటి అనంతమైన రోజులతో హాయిగా సాగే భావి వైవాహిక జీవితం పై మక్కువ ఎక్కువ కాసాగింది గోపాలానికి. ఇలా రాబోయే రోజులను గూర్చి తియ్యగా కలలు కంటూ మంచం మీద నడుం వాల్చిన గోపాలానికి ముందు వాకిట్లో విజయా తోటమాలీ మాట్లాడుకొనే మాటలు సన్నగా చెవుల్లో పడుతున్నాయి."
"సెప్పండమ్మా ఆరు మీకే మవుతారు?' అన్నాడు మాలి.
"ఏమవుతారనుకున్నావు?" నవ్వుతూ అడిగింది విజయ.
"ఏం అనుకుంటే ఏం తిరకసో?" మీరు చెప్పండమ్మా"
విజయ ఏం చెబుతుందో వినాలని గోపాలమూ ఉత్కంట తోనే ఉన్నాడు.
"అయన నాకు ఏమీ కారు."
విజయ సమాధానం విని గోపాలం నిస్తేజుడై పోయాడు.
"పొండమ్మా! అంత మరే పెపెంచం తెలియని వెర్రిడ్ని కాదు. ఏమీ కాకపొతే ఆరితో కలిసి మీరు ఎందుకు వస్తారు."
కొంచెం సేపు ఆగి "ఊరికే అన్నానోయ్!....అయన మా మేనత్త కొడుకు- నాకు బావ అవుతాడు" అంది విజయ.
విజయ సమాధానం గోపాలం లో ఆనంద తరంగాన్ని రేపింది. ఎంత చక్కని సంబంధాన్ని కలిపింది.
సాయంత్రం దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు గారికి రామనాధం రాసి ఇచ్చిన ఉత్తరం చూపించాడు గోపాలం. అయన ఆదరంతో గోపాలాన్ని , విజయ నీ పలకరించి దివాణం లోకి తీసుకెళ్ళాడు. తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారు ఆరోజు వీణ మీద వాయించిన పాటలన్నీ శృంగార సంబంధమైనవే!.... రాళ్ళు కరిగేటట్లు , అమృతం కురిసేట ట్లు లోకాన్ని మరిపించే టట్లు తన్మయుడై తానె నాదమైనట్టు , వీణ లోంచి అమర సంగీతాన్ని ప్రవహింపచేశారు ఆరోజు శాస్త్రి గారు. కచేరీ లో మొదటి నుంచి చివరి దాకా ఒళ్ళు మరిచి పరవశయై కూర్చున్న విజయ ని మధ్య మధ్య గమనిస్తూనే ఉన్నాడు గోపాలం.
రాత్రి ఇంటికి వచ్చాక కూడా విజయా, గోపాలం మౌనంగానే ఉన్నారు. పొద్దుటే రాజమండ్రి లో బయలుదేరిన తర్వాత వాళ్ళే ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ మాట్లాడుకోలేదు. అసహజంగా గంబీరంగా ఉన్న ఆ వాతావరణం ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది. అయితే ఎవరు మాట్లాడే టట్లు?....ఏమని?.....
"మీకు మేడ మీద పక్క వేశాను" అంది విజయ. రాత్రి భోజనం చేసి, నడవ లో పచార్లు చేస్తూన్న గోపాలంతో. మేడమీద గదిలో గోపాలం ఒక్కడికే తెల్లగా పాల మీగడ లాంటి పక్క వేసి ఉంది. పక్క మీద పడుకొని కిటికీ లోంచి పలకరిస్తున్న పంచమి చంద్రుడ్ని చూస్తున్నాడు గోపాలం. అందంగా వంగిన నెల వంకతో గుండ్రంగా వంపు తిరిగిన విజయ చిరు గడ్డం చక్కదనం భాసిస్తోంది. నల్లగా లోకం అంతా పరుచుకున్న వెన్నెల విజయ నవ్వులా పరిమళిస్తోంది. చుక్కలు చెక్కిన ఆకాశం, మల్లెల అలంకరణ లో అతిశయించిన విజయ వీనిల కుంతలాల అందాన్ని, తనలో పొదుపు కుంటోంది. ఇలా సర్వమూ విజయ రూపంగానే భాసిస్తున్న లోకాన్నిచూస్తూ తనని తాను మరిచి ఆనందిస్తున్న గోపాలం చెవులకి ఎవరో తన వెనక వచ్చి నిలబడినట్టు మెల్లని సవ్వడి వినిపించింది. అయినా తను పరవశిస్తున్న ఆ అందాల లోకం నుంచి దృష్టి మరల్చలేదు, కొంతసేపు అయాక ఎవరో దగ్గినట్టు అయి వెనక్కి తిరిగి చూశాడు.
విజయ?
టేబిల్ కి దగ్గరగా నిలబడి ఉంది.
పట్టలేని ఉద్వేగంతో "విజయా!" అంటూ దిగ్గున లేవబోయాడు మంచం మీంచి.
"ఆహా!.... అవసరం అవుతాయోమోనని మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఈ టేబిల్ కింద పెట్టా-- వస్తా " అంటూ గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది విజయ.
గోపాలానికి చెప్పలేనంత నిరాశ కలిగింది.
అందాల రాశి విజయ.
అనురూపమైన యౌవనం తో తను.
ఇంట్లో ఉద్రేకాన్ని కలిగించే వాతావరణం.
బయట ఉద్వేగాన్ని రెచ్చగొట్టే వెన్నెల.
వశం తప్పి విచ్చల విడిగా విహరించాలని ఉరకలు వేస్తున్న శరీరం. సంఘికమైన మర్యాదలూ, నాగరికమైన స్నేహ సంబంధాలూ అతిక్రమించకు అని శాసిస్తున్న మనస్సు.
ఎప్పటికేనా విజయ తనదే అనే భరోసా.
సంపన్నుడైన రామనాధం, సదాచారవర్తనుడైన అన్నయ్యా, ఏమి అవరోధం కలిగిస్తారో అనే భయం.
ఇలా ఆశ నిరాశల మధ్య, ఆనందా వేదనల సందున , అవకాశ అవరోధాల మాటున తన ఆలోచనలో పడి నలుగుతుంటే, సాహసించి ఏ నిర్ణయాన్నీ తీసుకోలేక, అలాగని తపిస్తూన్న మెదడు నీ శరీరాన్ని వశం చేసుకుని స్థిమితంగా నిద్రించనూ లేక. మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ తియ్యని బాధతో సతమత మౌతున్నాడు గోపాలం. అలా ఎంతసేపు కాలక్షేపం చేశాడో కాని, మేడ మెట్లు ఎక్కి ఎవరో పైకి వస్తున్న అలికిడి విని, మంచం దిగాడు. ఒకటి రెండు అడుగులు వేసేటప్పటికి గుమ్మం లో ఎదురైంది విజయ.
ఇంత అర్ధరాత్రి సమయంలో ఇలా వచ్చిందేమిటి?
ఇంత రాత్రయినా ఈయనింకా నిద్ర పోలేదన్న మాట?
ఇలా ఒకళ్ళు నొకళ్ళ చూసి తెల్లపోయారు.
తప్పు చేసిన దానిలా తల వంచేసి, వెంటనే తన రాకకి సంజాయిషీ చెబుతున్నట్లు "నిద్దర పట్టకపోతే నిశ్శబ్దంగా చూస్తూ పడుకోవాలి గాని, ఇలా చప్పుడు చేసుకుంటూ పచార్లు చేస్తే ఎలా?.......... కింద గదిలో వాళ్లకి నిద్దరక్కర్లే?....మీ మూలాని నా నిద్దరంతా పాడయింది " అంటూ నిష్టూరంగా అంది విజయ.
"నావల్లా?' - తెల్లబోయాడు గోపాలం.
"అవును మీవల్లే!" అంటూ విసవిసా మెట్లు దిగి వెళ్ళిపోయింది విజయ.
ఎంత అన్యాయం ?....తను అసలు మంచం దిగందే, చప్పుడు చేస్తూ పచార్లు చెయ్యడానికి.
కుర్చీ లాగినట్లూ, కిటికీ తలుపులు తెరిచినట్లూ, మంచి నీళ్ళ బిందె లో గ్లాసు ముంచి నట్లూ , ఇలా రకరకాలయిన చప్పుళ్ళు కింద గదిలోంచి తెల్లవారే దాకా వినిపిస్తూనే ఉన్నాయి గోపాలానికి.
తెల్లారేక ఒకళ్ళ తో ఒకళ్ళు మాట్లాడుకోనూ లేదు , నిద్దర్లు లేక ఎర్ర బడ్డ కళ్ళనీ, నీరసించిన ముఖాల్నీ పరస్పరం చూపించుకోనూ లేదు. ఇద్దరూ సాయంత్రం దాకా రామనాధం రాక కోసం మౌనంగా వేచి ఉన్నారు. ఎంత రాత్రయినా రామనాధం రాలేదు. ఎందుకు రాలేదు చెప్మా అనుకుంటూ ఇద్దరూ తెగ తర్కించు కున్నారు. ఎవళ్ళ మనస్సులో వాళ్ళు. వసంతోత్సవాలు చూసి వచ్చి క్రితం రాత్రి లాగే ఆ రాత్రి కూడా అస్థిమితంగా గడిపారు.
ఏ పూట కా పూటే రామనాధం కోసం వేచి చూడడం --
ఏరోజు కారోజే అయన వస్తే బాగుండునని అనుకోవడం.
ఒకటి...రెండు...మూడు....నాలుగు రోజులు గడిచిపోయాయి. రామనాధం గారు రాలేదు. అయన కబురూ తెలియలేదు. వసంతోత్సావాలు హాయిగానూ, ఆహ్లాద కరం గానూ ఉత్తెజకం గానూ ఉన్నాయి. కాని, ఒంటరిగా ఇద్దరూ నాగరిక సరిహద్దు ల్ని అదిగమించకుండా కాలక్షేపం చెయ్యడం మాత్రం రోజు రోజుకీ అసాధ్యం కాసాగింది. రామనాధం రాలేదేమా అని ఆందోళన కారణంగా, కొంతా, ఇంకా అలా ఒంటరిగానే ఉంటె ఏ బలహీనత కి లోనై పోతామో అనే భయం వల్ల కొంతా, వసంతోత్సవాలు పూర్తిగా పరిసమాప్తి కాకుండానే, గోపాలం, విజయా రాజమండ్రి తిరిగి వెళ్ళిపోడానికి ఉద్యుక్తులయ్యారు.
ఈ నాలుగైదు రోజులలోనూ విజయ అందం అందీ అందని దై రెట్టింపు ఆకర్షణీయంగా కన్పించసాగింది గోపాలానికి.
ఒంటరితనాన్ని స్వార్ధానికి వినియోగించు కోకుండా ఎంతో సంయమనం తోనూ, మరెంతో సంస్కారంతో నూ ప్రవర్తించి నందుకు గోపాలం మీద అంత క్రితం ఉన్న అభిప్రాయం ఉన్నతోన్నతం అయింది విజయకి.
రామనాధం పిఠాపురం ఎందుకు రాలేదో ఇంటికి వచ్చాక తెలిసింది ఇద్దరికీ. ముద్దాయి కి ఎక్కడ శిక్ష పడుతుందో అనే ఆందోళన తో, ఒళ్ళు మరచి ఆవేశంతో మర్డర్ కేసు ఆర్గ్యూ చెయ్యడం వల్ల రామనధానికి రక్తపు పోటు వచ్చిందట. అందువల్ల ఆరోజు పిఠాపురం రాలేకపోయాడు. మర్నాడేనా వద్దాం అని ప్రయత్నం చేస్తే డాక్టర్లూ, మిత్రులూ కలిసి కాదన్నారుట. అతి బలవంతం మీద ఈ నాలుగు రోజులూ వీల్లేదని అపు చేశారట?.....
"మరి మాకెందుకు తెలియ పరచలేదు " అని నోచ్చుకుంటున్న గోపాలానికి, జరిగిందంతా విని కన్నీళ్ళూ కారుస్తూ నిలబడి ఉన్న మేనకోడలు కీ సమాధానంగా చిరునవ్వు నవ్వుతూ అటో ఇటో అయితే మీకు ఎలాగా కబురందుతుంది . రాకా తప్పదు. ఎటూ కాకుండా మిమ్మల్నేందుకు ఇప్పటి నుంచి కంగారు పెట్టడం అని నేనే మీకు కబురు చెయ్యొద్దని మిత్రులందరినీ కట్టడి చేశా" అన్నాడు రామనాధం.
అంత బాధలోనూ కోపం వచ్చి మావయ్య కేసి ఎర్రగా చూసింది విజయ.
"నిర్లిప్తంగా అనేస్తారేవిటండీ అంతేసి మాటలు?' అన్నాడు గోపాలం.
"నిర్లిప్తం కాకపొతే? నాకేం లంపటాలున్నాయని చావంటే భయపడడానికి?....ఓ పెళ్ళామా బిడ్డలా?....ఎటొచ్చీ మా విజయ భవిష్యత్తూ ఏవిటా ఆన్నదోక్కటే నాకు పట్టుకొన్న బెంగ."
రామనాధం మాటలు విని "అప్పగింతలు పెడుతూన్నట్లు నువ్వలా మాట్లాడకు మావయ్యా-- నాకు బాధ వస్తూ ఉంది" అంటూ బావురు మంది విజయ.