మల్లె లనగానే విజయ కి మరో సంఘటన జ్ఞప్తి కి వచ్చింది. ఆరోజున గోపాలానికి విపరీతంగా జ్వరం వచ్చి రూం లో పడుకుని వున్నాడని తెలిసి జ్వరం తగ్గి ఒకటి రెండు పత్యాలు వంట బట్టే దాకా ఇక్కడే ఉందువు గానని చెప్పి అతణ్ణి మావయ్య ఇంటికి తీసుకువచ్చాడు. అతనికి జ్వరం తగ్గేదాకా రెండు మూడు రోజులూ తనకి ఇంట్లో పనేం తోచలేదు. అత్మీయులేవరో బాధపడుతుంటే ఆందోళనగా ఉంటుందీ అలా ఉంది మనస్సు మాటిమాటికీ. అతని మంచం దగ్గరికి వెళ్లి చూసి రావడమే సరిపోయేది తనకి-- గంట గంటకీ జ్వరం చూడటమో, మందు ఇవ్వడమో , బార్లీ ఇవ్వడమో చేస్తూ దాదాపు రోజంతా అతని దగ్గరే గడిపేది. రాత్రిళ్ళు కూడా అతనికేం కావలసి వస్తుందో అనే ఆలోచన. ఎలా వుంటుందో నని భయం. ఈ రెండింటి వల్లా నిద్ర పట్టేది కాదు అన్నం అంతకు ముందే సయించేది కాదేమో తిండీ నిద్రా సరిగా లేక తనకి ఒంట్లో విపరీతమైన నీరసంగా ఉండేది.
నేనిలా తనకోసం ఆందోళన చెండుతూండడం గమనించినట్లు న్నాడు. ఓరోజు సాయంత్రం మావయ్య ఇంకా కోర్టు నుంచి రానప్పుడు నేనుతని మంచం దగ్గరగా నేల మీద కూర్చుని బార్లీ ఇస్తూ వుంటే "విజయా నాకోసం ఎందుకింత శ్రమ పడతావు" అన్నాడు గోపాలం.
"నేనిప్పుడు శ్రమేం పడుతున్నాను?"
"ఏం పడుతున్నావో నీరసించి లోతుకుపోయిన ఆ కళ్ళూ, పాలిపోయిన ఆ చెక్కిళ్ళూ , నుదుటి మీద నిలిచిన ఆ చిరు చెమటా ఇవే చెబుతున్నాయి "
తనకి వెంటనే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
కాని అవి కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తూ చిన్నగా నవ్వి 'అబ్బాయి గారికీ పూట జ్వరం దిగజారింది. అందుకు కవిత్వం బయలుదేరింది" అంది.
గోపాలం నీరసంగా నవ్వుతూ "నువ్వన్నట్లు నేను నిజంగా కవిత్వమే చెప్పగలిగి ఉందును, మా సీనియర్స్ అడివి బాపిరాజు, కవి కొండల వెంకట్రావూ లాగ-- కొద్దిలో తప్పిపోయింది " కాని అన్నాడు.
"ఏం?....."
"బాపిరాజు కీ వాళ్ళకీ ఉన్న అదృష్టం నాకు లేదు నేను కాలేజీ లో చేరిన ఏడాది కి కూల్డ్రే గారు వెళ్ళిపోయారు. ఆయనే ప్రిన్సిపాలు గా ఇంకా ఉంటేనా. భోజరాజు గారి ముఖం చూసిన వాళ్ళందరి కీ కవిత్వం వచ్చినట్లు అయన సాహచర్యం చేసిన మా కాలేజీ స్టూడెంట్స్ కి అందరికీ ఈ పాటికి కవిత్వం వచ్చేసి ఉండును."
"అందుకే బతికి పోయాం. లేకపోతె భారీ పరిశ్రమ కింద తయారయి పోయిన ఆక వుల అందరి కవిత్వాన్నీ వినలేక చచ్చి ఉందుము. స్వదేశం వెళ్ళిపోయి కూల్డ్రే గారు ఈ దేశానికి ఎంతో సేవ చేశారు"
అంటూ నవ్విన తన నవ్వులో గోపాలం కూడా శ్రుతి కలిపాడు.
"ఇక్కడ హల్లో ఉక్కబోతగా ఉంది. అలా వరండా లోకి వచ్చి కూచుంటే గాలి వేస్తుంది" అంటూ లేవబోయాడు గోపాలం.
"లేవకండి నీరసంగా ఉంటుంది." అని తను అంటుండగానే లేచి గడప దాటుతూ తూలీ పడబోయాడు . చటుక్కున తను జబ్బ పట్టుకుని' అపు చేసింది కనక కాని లేకపోతె ఎంత ప్రమాదం!.....
అలా గోపాలం శరీరం తన శరీరానికి ఒక్క మారు తగలడంతో కోటి వీణలు ఒక్కసారి తనలో మీటినట్లు, లక్ష ఏతాములతో తన శరీరం లోని రక్తాన్నంతా గుండె లోకి తోడి పోసినట్లు, అనంతమైన శక్తి తరంగాలు నరనరాల్లో నూ మహా వేగంగా ప్రవహించినట్లు , శరీరం వేడి ఎక్కి గుండె బరువెక్కి నరనరాలు మధుర మైన బాధతో ఒణికి పోయి మెదడు ఒక్క క్షణం ఎమీపని చేయకుండా నిస్తేజ మై పోయింది. తనలో కలిగిన కల్లోలమే గోపాలం లో కూడా కలిగినట్లు తను గ్రహించింది. ఒక్కమారుగా వేడి ఎక్కిన అతని శరీరం తను పట్టుకున్న అతని జబ్బ దగ్గర వేగంగా కొట్టు కుంటూన్న నరాల్ని బట్టి.
మనస్సూ, శరీరం పూర్తీ స్వాధీనం లోకి వచ్చాక కాని తెలియలేదు తన చేతిలో అతని చెయ్యి ఉండి పోయిందన్న సంగతి సిగ్గుతో చట్టున తన చెయ్యి తీసేసుకుంది, అలా చెయ్యడం అతనికి ఇష్టం లేనట్లున్నది. బాధగా తన కళ్ళల్లోకి చూశాడు. అంత చప్పున ఆతని చేతిని వదిలేసినందుకు తనకీ బాధగానే ఉంది. అయితే అతను మళ్లా తన చేతి ని అతని చేతుల్లోకి తీసుకోవచ్చే. తీసుకుంటాడేమోనని ఆశించింది. ఉహూ!?...." పిరికివాడు ?" అనుకొంది. వరండాలో కుర్చీ మీద అతన్ని కూర్చోబెట్టి తను దగ్గర్లో నిలబడి ఉంది. చాలాసేపటి దాకా ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఎదురుగుండా మల్లె తీగ నిండా మొగ్గలు పువ్వులూ ఆకూ కనిపించకుండా ఉన్నాయి. తను పందిరి దగ్గరికి వెళ్లి నాలుగు రోజులయిందేమో . రెండు మూడు రోజుల క్రితం పూసిన పువ్వు లన్నీ వాడిపోయి రాలి పోతున్నాయి.
ఇలా వున్న మల్లె పందిరి ని చూసి "ఏవిటీ మధ్య పువ్వులు కోసుకున్నట్లే లేదే ?...." అన్నాడు గోపాలం. పందిరి కేసి తను కూడా ఓ మాటు చూసి మాట్లాడక ఊరుకుంది . సమాధానం ఏం చెప్పలేదు.
"ఈ నాలుగు రోజుల నుంచీ నాసేవలు చెయ్యడానికే సరిపోయి ఉంటుంది. పాపం పువ్వులు కోసుకోడానికి కాళీ చిక్కలేదు ....అవునా?" అన్నాడు గోపాలం తన కళ్ళలోకి చూసి నవ్వుతూ --'
అబ్బే అది కాదు అన్నట్లు చప్పరించి "మామూలుగా కూడా ఈ పందిరిని అని అట్లా ఉండవలసినవే !" అంది తను.
"ఏమో?"
"మొగ్గలు కొయ్యడం మా మావయ్య కు ఇష్టం ఉండదు. విచ్చిన పూలు పెట్టుకోడం నా కిష్టం ఉండదు. అందువల్ల పూసి, అవి పందిరినే రాలిపోతాయి."
"ఎప్పుడూ పెట్టుకోలేదా నువ్వు పువ్వులూ?"
"ఉహూ!"
"అబద్దం ఆడకు. నేను ఎఫ్. ఏ. లో చేరడాని కని మొట్టమొదట వచ్చినప్పుడు అదే మొదటి సారి నిన్ను చూసినప్పుడు ఆరోజున నువ్వు మల్లె పువ్వులు పెట్టుకున్నావు. నాకు బాగా జ్ఞాపకం నల్లని జడలోంచి విచ్చిన తెల్లని మల్లెలు పచ్చని మెడని తాకుతూ ఎంత అందంగా తొంగి చూస్తున్నాయో అనుకున్నాను కూడా!"
అ మాటలు వింటుంటే తనకి ఒళ్ళంతా గగుర్పోదించింది. సిగ్గూ సంతోషం ముంచు కొచ్చేశాయి. తన రూపాన్ని గోపాలం ఎంత శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొన్నాడు? జాగ్రత్తగా పదిల పరచుకొన్నాడన్నమాట హృదయంలో తన జ్ఞాపకాన్ని!!
అవును,
జ్ఞాపం వచ్చాక తను మొదటిసారిగా జడలో పువ్వులు పెట్టుకున్న రోజు అది....తీరా తను పువ్వులు కోసి మాల కట్టేసింది. జడలో పెట్టుకో" అని మావయ్య పదేపదే ప్రోత్సహించాడు , ఏ దేవుడి కైనా వేద్దాం అంటే, మావయ్య బ్రహ్మ సమాజ మతం పుచ్చుకున్న కారణంగా ఇంట్లో ఓ దేవుడి ఫోటో గాని విగ్రహం కాని ఏమీ లేదు, సందేహిస్తూ సందేహిస్తూ పెట్టుకుంది ఆరోజున పువ్వులు, ఆ తర్వాత మళ్లా జడలో పువ్వులు పెట్టుకున్న జ్ఞాపకం లేదు తనకి.
"పందిరి నిండా అలా పువ్వులు విరగబూస్తుంటే ఇంచక్కా కోసుకుని పెట్టుకో కూడదూ?" అన్నాడు గోపాలం.
మీ కిష్టమా....పెట్టుకో మంటావా?" అంది తను.
"పువ్వులు....అందులో మల్లెలు....కోసుకుని పెట్టుకోకుండా ఆడపిల్లవు ఎలా వుంటున్నావా అన్నదే ఆశ్చర్యం."
"మీ మాటలు వింటుంటే జడలేదు కాని లేకపోతె మీరే పెట్టుకొనేలా ఉన్నారు" అని కిలకిలా నవ్వుతూ పువ్వులన్నీ కోసి, పెద్ద మాలగా కట్టి "అమ్మో ఎంత పెద్ద దండ అయిందో, ఇది ఏ దేముడి మేడ లోనో వెయ్యవలసిందే కాని జడలో పెట్టుకోడానికి వీలు లేదు. బరువుతో జడని లాగేస్తుంది ." అంటూ రెండు చేతుల్తోటీ దండ ని పట్టుకొని నిలబడి ఉంది తను.
ఇంతలో కోర్టు నుంచి వచ్చి గేటు తీసికొని లోపలికి వస్తున్న మావయ్య అక్కడి నుంచే "విజయా!-- గోపాలం జ్వరం ఎలా వుంది?...ఓ శుభవార్త.......విశ్వవిద్యాలయ వ్యాసరచన పోటీలో గోపాలానికి ఫస్టు ప్రైజు వచ్చిందట?....ఇప్పుడే వాళ్ళ కాలేజీ దగ్గర అనుకుంటున్నారు. మనం గ్రాండ్ గా అభినందనలు అందించాలి....అని గట్టిగా అరుస్తూ, వరండా లోనే కనిపించిన తమ ఇద్దర్నీ చూసి ఆగిపోయి "ఓ....ఇక్కడే ఉన్నారా?...... అప్పుడే దండ కూడా రెడీ చేశావన్న మాట....వెరీ గుడ్ " అన్నాడు.
మావయ్య మాటలు వినేసరికి ఆనందం పట్టలేకపోయింది తను. సంతోష సంభ్రమాశ్చర్యాలతో చేతిలో దండనీ మావయ్యకి అందించింది. మావయ్య దండనీ గోపాలం మెడలో వేశాడు . ఇద్దరూ చప్పట్లు కొట్టారు. గోపాలం సిగ్గుతో నవ్వుకొన్నాడు. ఆ తర్వాత , మల్లె తీగ మొగ్గ తొడగడం మొదలెట్టింది మొదలు పూర్తిగా మానేసే దాకా రోజూ తను మల్లె పువ్వులు పెట్టుకోవడం మానేది కాదు.
ఈ రకంగా తియ్యని కలల లాంటి ఆలోచనలతో తేలిపోతూ , మధురమైన గత స్మృతులలోకి కరిగిపోతూ, వెన్నెల చల్లదనం లో, పుష్ప సౌరభాల తియ్యదనం లో, బరువైన భావాల తపన వల్ల వేడి ఎక్కిన శరీరం వెచ్చదనం లో కలిసిపోయి, ఈ లోకాన్నే మరిచిపోయి మరేదో అలౌకికానందాన్ని అనుభవిస్తున్న విజయ కి "రామనాధం గారూ!" అన్న కేక వినిపించి ఉలిక్కి పడి చూసింది. భళ్ళున తెల్లారి పోయింది. చుక్కలూ చంద్రుడూ వెలవెలా బోతున్నాడు . గేటు దగ్గర శేషయ్య గారు కేకేస్తున్నారు.....
రాత్రి పూర్తిగా నిద్రలేక ఎరమందారం లా మారిన కళ్ళని ఎవళ్ళకీ చూపించలేక , శేషయ్య గారి రాకని మాత్రం నిద్రపోతున్న మావయ్య కి తెలియపరచి, వంటింట్లో కి వెళ్లి ఇంటి పనులేవో దూసుకోసాగింది విజయ. హాల్లో మావయ్యా శేషయ్య గారూ ఏ విషయం గురించో ముచ్చటించు కుంటున్నారు-- కోర్టు గొడవలు కాబోలు అని అనుకుంటూ ఆ సంగతి అట్టే పట్టించు కోకుండా తన పనుల్లో తను నిమగ్నం అయిపొయింది విజయ.......
రామనాధం ఆశ్చర్యంగా "ఆహా....అలాగా!....శంకరం గారు పంపించిన మని ఆర్డరు గోపాలం తిరగ గొట్టేశాడా?' అన్నాడు.
"అందువల్ల శంకరం గారు మానసికంగా ఎంత బాధ పడుతున్నారో ?....... మా అమ్మకి పుట్టిన ఎడెనమండుగురి పిల్లల్లోనూ, పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళం మేం ఇద్దర మూను, అమ్మా, నాన్నా కూడా పోయాక ఇంక వాడికి నేనూ, నాకు వాడూ తప్ప ఎవరున్నారు ?...... అమ్మ పోతూ పోతూ గోపాలాన్ని నా చేతుల్లో పెట్టి పోయినందుకు ఇప్పటి దాకా నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నానే వాడిని! ........ప్లీడరీ వద్దురా అమ్మ ఆశయం ప్రకారం కలెక్టరు కావడానికి ప్రయత్నించరా అంటే , కాదని నా మాటని గడ్డి పరక కంటే కనిష్టంగా తీసేసి, ఓ మాటు రాజమండ్రి వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నించి "లా" చదవడానికి అదే పోవడం పోతాడా......చదవడానికి , ఉండడానికీ డబ్బు అక్కర్లే?.......ఎరగని ఊళ్ళో వాడెం అవస్థ పడుతున్నాడో అని ఇక్కడ నేను బెంగ పెట్టుకుని కూచోనా? అయినా తను మరీ కాదూ కూడదంటే నేను చెప్పించాక పోయానా?..... "నీకు అర్దికపు ఇబ్బందులు కలిగించటం ఇష్టం లేక ఎవరో స్నేహితుల సహాయం వల్ల "లా" లో చేరాను" అని ఒక వాక్యం ఉత్తరం రాస్తే అక్కడితో అయిపోయిందా?.... వాడి వల్ల నాకు అర్దికపు ఇబ్బందులా?......తెలివి తక్కువ మాట! తెలివి తక్కువ మాటా అని?......
సరే కుర్రతనం వల్ల పౌరుషం వచ్చి ఏదో అఘోరించాడు -- సరే -- డబ్బు పంపిస్తే తీసుకోడానికి ఏం వచ్చింది?.....తిప్పి పంపెస్తాడా?........నా తమ్ముడు నేను పంపించిన డబ్బు-- తిప్పెస్తాడా? ...ఇలా అవమానించడం కంటే శుభ్రంగా ఓ కత్తి పుచ్చుకొని ఈ అన్నయ్య పీక కోసేయ్య కూడదూ?.......ఎంతపని చేశాడు....తెలివి తక్కువ దద్దమ్మ.. నామీద కోపం అయితే కోపంగా ఉంచుకోమను. అంతేకాని డబ్బు తీసుకోడాని కేం? డబ్బు లేకుండా ఏం చేస్తాడు?......పస్తులు పడుకుంటాడా?.......ఆ స్నేహితులెవరో తనకి ఎల్లకాలం పంపిస్తారా? ఇంతకీ ఏం అవస్థ పదుతున్నాడో ఏమో?........భోజనం తిన్నగా చేస్తున్నాడో, లేదో-- వాడక్కడ పస్తులు పడుకుంటున్నాడంటే నాకిక్కడ నోటికి ముద్ద ఎలా వెడుతుంది చెప్పండి శేషయ్య గారూ-- దీని కేదేనా . మార్గాంతరం ఆలోచించండి . గోపాలానికి డబ్బు అందే విధానం చూడండి -"