Previous Page Next Page 
అపరాజిత పేజి 11


    'వాన వస్తోంటే ఎల్లా వెడతావు? ఎక్కడికి వెళ్ళాలి?' అన్నాడతను. తలుపు దగ్గరాకు వచ్చి దానిమీద చేయి ఎత్తివేసి నిలబడివున్నాడతను. అల్లా అడుగుతోంటే ఎల్లా అబద్ధం చెప్పడం?'
    'వెళ్ళాలి, బావ తగ్గితే బాగుండును' అన్నదామె మళ్ళీ.
    'తగ్గదు యిప్పట్లో వాళ్ళింటికి వస్తానని చెప్పావా? కూర్చుంటుందిలే' అన్నాడతను.
    'పార్కుకి వెళ్ళాలి' అన్నదామె. ఏం మాట్లాడుతాడోనని భయం ఎల్లా సమాధానం చెప్పాలో తెలియదు.
    సావిట్లో గుడ్డ ఉయ్యాలలో పడుకున్న శకుంతల కదలడం లేదు, కదిలినా బాగుండును.
    'నేను వెడతానేం?' అన్నది మాధవి. అంటూ బెదురుగా అతనివంక చూసింది. కొంచెం కళ్ళు వాల్చి తనవంక చూస్తున్న అతని కళ్ళరెప్పలు పొడుగ్గా వున్నాయి. తనతో చెప్పాలనుకుంటున్న విషయాలన్నీ ఆ రెప్పలమాటున నీడలై కదిలాయి. తన ప్రశ్నకి జవాబు చెప్పకుండా అతనల్లాగే చూస్తున్నాడు.
    'మాధవీ? మీ పెద్ధనాన్న నీతో అన్ని విషయాలూ చెప్పారా?" అన్నాడు. చెప్పారని అనబోయి, లేదని తలూపిందామె...
    'నేను చెప్పనా ఆ విషయాలు యిప్పుడు అల్లా కూర్చోవూ?' అన్నాడు. వాన ముసురై, వేలుగుపోయి చీకటి అయిపోతోంది ఆకాశం. ఇంటికి రావడం ఎంత పొరబాటు చేశానని అనుకుంటోంది. తన ఆరాటం అతనికి కనుపించకుండా ఉండాలని తను వెళ్ళడం ఎంత అవసరమో, వెళ్ళకపోతే తన జీవితం ఏమైపోతుందో అర్ధం కావు యితనికి. తను చెప్పడానికి వీల్లేదు, చెప్పడం చేతకాదు.
    'లోపలికి జల్లు వస్తోంది. తలుపు వేసేస్తా, అల్లా కూర్చో' అన్నాడతను. లైటు వేశాడు. గోడదగ్గరికి కుర్చీ లాక్కుని అతను కూర్చున్నాడు.
    'ఇంకా ఏం వెడతావు, కూర్చో!' అన్నాడు.
    నడిచి వెళ్ళిన పాదాలు తనవి కానట్లు నడిచి వెళ్ళిందామె కిటికీ దగ్గరికి. అక్కడ కూర్చుంది. మనస్సు వెలుతురులో దారి తెలియని గబ్బిలంలా తిరుగుతోంది. వానలో తడిసి ఏ బెంచీమీదో కూర్చుని క్షణ క్షణం గేటుకేసి చూస్తుంటాడు మధు. తను రాదని నమ్మలేని చూపులతో చూస్తుంటాడు. ఇంకా రాలేదు, ఏమైందని ఆరాట పడుతుంటాడు. తనదే పొరబాటు, వస్తానని వప్పుకోవడం అసలు. అల్లా వప్పుకున్న మనిషి రాజారావు కూర్చోమంటే ఎందుకు కూర్చోవాలి? వెళ్ళిపోవాలని విదిలించి పోవాల్సింది.
    'అంతగా ఆలోచిస్తున్నావు. ఎవరా ఫ్రెండు, వానలో యింతసేపు పార్కులో ఎల్లాగూ ఉండదు. ఈ పాటికి వెళ్ళి పోయుంటుంది' అన్నాడతను. పోనీ అంతా చెప్పేస్తేనో?
    'మధు వస్తానని చెప్పాడు పార్కుకి' అన్నదామె. అతను ఆశ్చర్యంగా చూశాడు. మరుక్షణం ఓహో అన్నట్లు కదిలాయి అతని పెదవులు. కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది,
    'ఇంతసేపు ఉండడులే అతను. నువ్వు రాలేదని ఇంటికి బయలుదేరి వస్తోంటాడు. ఇంటికి రాగానే చెప్పొచ్చులే వాన వచ్చిందని-పోనీ, మా బావ వెళ్ళనివ్వలేదని చెప్పొచ్చులె, అన్నాడతడు. ఆమె వాన వంకే చూస్తోంది.
    అతను కొంచెం ఆగి అన్నాడు. 'మీ పెద్దనాన్న, పెద్దమ్మ ఏమీ అనరా అల్లా వెడితే' అని, తనని పరీక్షిస్తున్న ట్లుగా ఏమిటీ ప్రశ్నలు-మధు నేను పెళ్ళి చేసుకుంటాం, యింక వాళ్ళు అనేదేమిటి అన్నంత మాట వస్తోంది ఆమె పెదవుల మీదకి, అనరని తలాడించింది ఆమె, కానీ వెంటనే, 'వాళ్ళకి తెలియదు యీవేళ అందుకు వెడుతున్నానని' అన్నది.
    అతను చిన్నగా నవ్వాడు. 'మరి నాకు చెప్పావేం యీ సంగతి?' అన్నాడు. నిజమే, ఎందుకు చెప్పాను అనుకుంది. పొరపాటయింది చెప్పడం, యిప్పుడు పెద్ద గొడవ చేస్తాడేమోనని బెరుకుగా చూసింది అతనివంక. అతను కొంచెం కదిలి ఆమె వేపు తిరిగాడు. ఉలిక్కిపడినట్లు లేచి నిలబడిందామె. అతను నవ్వాడు.
    'ఏమిటి అంత భయం? నేను ఏదో చేసేస్తాననుకుంటున్నావా నిన్ను?' అన్నాడు ఆమె సిగ్గుపడినట్లు కూర్చుంది.
    'అతని అప్పు తీరిపోయిందా?' అన్నాడు రాజారావు. లేదని తలాడించింది ఆమె. 'ఎంతుంది?'
    'మూడువేలు.' కొంచెంసేపు అల్లా చూస్తూండిపోయిన అతను నిట్టూర్చాడు. 'అది తీర్చేద్దామా మాధవీ? అన్నాడు.
    ఆమె ఏమీ అనలేదు. 'పోనీ తీర్చేస్తే నీకు చాలా సమస్యలు తగ్గుతాయి కదూ? అన్నాడు. తీర్చేస్తే అతను నిన్ను వదలి పెడతాడా అని అతని భావం. వదిలితే నన్ను చేసుకుంటావా అన్న ప్రశ్న వుంది. కళ్ళెత్తి అతనివంక ఒక్కసారి చూసి, మళ్ళీ గోడవేపు కళ్ళు త్రిప్పింది.
    'శ్యామల నాకు అన్నీ చెప్పింది. ఎందుకు చేశావు అంతపని నువ్వు? అంత బాధ్యత భరించగలననుకున్నావా? అతనెందుకు యిచ్చాడు అంత డబ్బు? వాళ్ళ వాళ్ళు ఏమీ అనరా?' అనడిగాడు అతను. నిజంగా యివన్నీ తెలుసుకోవడానికే అడుగుతున్నాడా అన్న అనుమానంతో మళ్ళీ అతనివంక చూసింది. ఎడంచేత్తో నుదుటి మీది జుట్టు పైకి త్రోసుకున్నాడతను.
    'ఇవన్నీ నేనడగటం యిష్టం లేదా నీకు?' అన్నాడు.
    వాన చప్పుడు తగ్గింది. మాధవి చటుక్కున లేచి కిటికీ తలుపు తీసింది. సన్న చప్పుడవుతోంది గానీ పెద్ద వాన పోయింది.
    'వాన తగ్గింది, నేను వెడతా.' అన్నది. అంటూనే యివతలికి వచ్చేసింది. చీరైనా మార్చుకోకుండా చెప్పులు తొడుక్కుని, ఎవరితోటీ చెప్పకుండా బయటికి వచ్చేసింది. గుమ్మం దిగాక డబ్బు లేదని గుర్తు వచ్చి వెనక్కి వెళ్ళి గదిలో గూట్లోని చిన్న పర్సు తీసుకుంది. ఆ కుర్చీలో అల్లాగే కూర్చుని వున్నాడు రాజారావు. వెళ్ళిపోతున్న ఆమెని పలుకరించలేదు.
    పార్కులో దీపాలు బూజు పట్టినట్లు వెలుగుతున్నాయి. గేటులోంచి వెళ్ళి ఎడమవేపు తిరిగింది. మామూలుగా మధు, తాను కూర్చునే చోటికి వెళ్ళింది. అక్కడ అతను లేడు. అనుకున్నంత పనీ అయింది. వచ్చి, చూసి, చూసి వెళ్ళిపోయాడు. ఆరున్నరకూడా కాలేదింకా పోనీ వానవల్ల రేడియో రూం దగ్గర నిలబడ్డా డేమోనని అక్కడికి వెళ్ళింది. అక్కడ లేడు. కొంచెం సేపు తచ్చాడి బయటికి వచ్చింది. గేటు దగ్గర మరికొంతసేపు నిలబడింది. వచ్చే పోయేవాళ్ళు తనని పరీక్షగా చూస్తున్నారు. బస్సు ఎక్కి తిరిగి యింటికి చేరేటప్పటికి ఏడుంబావుఅయింది.
    వంటింట్లో పీట మీద కూర్చుని శకుంతలని వళ్ళో పెట్టుకుని పాలు పడుతోంది పెద్దమ్మ. 'ఎక్కడికి వెళ్ళావు?'
    'ఒక ఫ్రెండు దగ్గరికి వెళ్లాను. పెద్దనాన్న యింకా రాలేదా? కూర సంగతేమిటి? అనడిగింది మాధవి.
    'వచ్చి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళారు. వంకాయలు తెచ్చారు, తరుగు వస్తా,' అన్నదామె. మాధవి కూర వసారాలో పెట్టుకుని తరిగేటప్పటికి శకుంతలని ఉయ్యాల్లో పెట్టి మడిబట్ట కట్టుకుని వచ్చింది పరమేశ్వరి. తను యింట్లో లేకపోతే యిదే తిప్పలు ఆమెకి. అక్కడే పీటమీద కూర్చుంది మాధవి.
    'మీ పెద్దనాన్న చేత బుక్కు బైండు పెట్టిస్తున్నాడుట మీ బావ. విన్నావా?' అన్నదామె. ఇదన్న మాట పెద్ధనాన్న సఖ్యతకి కారణం.
    'ఈయనకి ఏం వస్తుంది బైండింగు పని?' అన్నది మాధవి.
    'ఎవరో పనివాళ్ళ నిద్దరిని వేస్తాడుట. ఈయనకేం వస్తుంది నా తలకాయ! అతను పొలం అమ్మాడుట. పద్నాలుగు వందలు పెడతాడుట దీనికోసం.'
    'ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు?' అన్నదామె.
    'మీ పెద్దనాన్నే. రాధ ఏమిటి మాట్లాడుతోంది బావతో?' అన్నది పెద్దమ్మ. రాధ ఏం మాట్లాడినా గొణగొణా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారోనని ధ్యాస ఉండదు.
    'మా క్లాసుమేట్సు అందరూ అంతే నండీ. సినిమా కధలైనా, బొమ్మలైనా సరే పడి చచ్చిపోతారు. సినిమాలో ఒక్కసారి ముఖం చూపించిన ఏ పక్షిని అయినా సరే, చూడాలని ఆత్రపడిపోతారు. నాకు పరమ అసహ్యం ఆ వేషాలు చూస్తే. మా సరోజ అడిగింది ఏమే, 1969 లో ఎంతమంది తారలు పెళ్ళిళ్ళు చేసుకున్నారో చూశావా అని. అదే పని దానికి మరి.' ఇల్లా చెబుతుంది కబుర్లు రాధ.
    ఏ సమస్యా పట్టకుండా ఎల్లా వుంటుంది పద్దెనిమిదేళ్ళ పిల్ల అని ఆశ్చర్యం వేస్తుంది మాధవికి. ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో పసిగట్టదు. చెప్పినా విననట్లే, పట్టనట్లే వుంటుంది. ఏదో పుస్తకం, పేపరు, కూనిరాగం, అద్దం దగ్గర సింగారం, లేకపోతే ఫ్రెండ్సుతో బాతాఖానీ ఎప్పుడో ఒకటో అరో వ్యాసాలు గిలుకుతుంది.
    బావకంఠం వినబడటంలేదు. ఎప్పుడోచ్చాడో! వాళ్ళిద్దరూ అల్లా మాట్లాడు కుంటోంటే వెళ్ళడం యిష్టం లేక కూర్చున్నది మాధవి.
    ఒక పావుగంటకి రాధ వచ్చింది లోపలికి. 'అక్కా-విన్నావా? సరోజ పరీక్షకి వెళ్ళదుట. నోట్సు అన్నీ నాకిచ్చేసింది. అస్తమానం సినిమాలు చూస్తోంటే ఏమోతుంది? ఇప్పుడు వణుకు వస్తోందిట. ఏం లాభం? అన్నది ఉత్సాహంగా.
    అక్కలో అంత ఉత్సాహం కనబడలేదామెకి.
    'బలే వాన కురిసిందికదూ?' అన్నది. ఔనని తలూపింది మాధవి.
    'అమ్మా, వంటైందా? బలే ఆకలేస్తోంది. బావతో కలిసి కూర్చుని తినేస్తా' అన్నది. జడవిప్పి అల్లుకుంటూ గదిలోకి వెళ్ళిందామె.
    కాస్సేపటికి మాధవి లేచి సావిట్లోకి వచ్చేసరికి రాజారావు వంగి ఉయ్యాలో పడుకున్న పాపాయిని ముద్దుపెట్టుకుంటున్నాడు. ఆమె గాజుల చప్పుడికి లేచి జుట్టు సవరించుకుని ఆమె వంక చూశాడు. 'నిద్ర పోతోంది' అన్నాడు ఏదో సంజాయిషీగా తను కన్నబిడ్డని ముద్దుపెట్టుకోవడానికి సంజాయిషీ యిస్తున్న అతన్ని చూసి మాధవి మనస్సులో ఏదో తడిగా కదిలింది.
    'అతనున్నాడా నువ్వు వెళ్ళేటప్పటికి?' అన్నాడు. లేడని తలాడించింది ఆమె. గదిలోకి వెళ్ళిన రాధ బయటికి వస్తుందేమోనని భయం. నిజానికి తనకి బయట అరుగుమీదకి వెళ్ళి మధు వచ్చాడేమో చూద్దామని వుంది. అందుకని తలవంచుకుని గబగబ నాలుగడుగులు ముందుకు నడిచింది. 'మాధవీ - నేను యిందాక మాట్లాడుతోంటే వెళ్ళిపోయావు.' అన్నాడు రాజారావు.
    'వస్తా' అని మొహమాటం లేకుండా నడిచి అరుగుమీదకి వెళ్ళింది. మధుగది మూసేవుంది. వీధంతా చీకటి. కొంచెం దూరంలోవున్న ఒకే దీపంకాంతి రోడ్డు మీద పారే నీళ్ళ మీద పడుతోంది. చేయి చాచి చూసింది. చాలా సన్న తుంపర పడుతోంది. ఏమైనాడో అతను? భోజనానికి వెళ్ళాడేమో?

 Previous Page Next Page