8
ఇంట్లోకి వెడదామని వెనక్కి తిరిగే టప్పటికి గుమ్మంలో రాజారావు నిలబడి వున్నాడు. ఏమిటల్లా తరుముకు వస్తున్నాడితనని భయం వేసింది. అతను పొరుగూరి లో వున్నప్పుడు శకుంతల భారం ఒకటే తెలిసింది. ఇప్పుడు యితని రాక మరీ క్రుంగదీస్తోంది.
'ఇంకా రాలేదా అతను? వచ్చాక చెబుదువుగానిలే సంజాయిషీ. మరి బయటికి వెడదాం వస్తావా' అన్నాడు తను. చాలా మృదువుగా, తన మనస్సుకి ఎలా గైనా నచ్చచెప్పి, వప్పించాలన్నట్లు మాట్లాడుతున్నాడు. 'వాన పడుతోంది' అన్నదామె.
'ఫరవాలేదు సన్న చినుకులేగా? మళ్ళీ నేను రేపు వెళ్ళి పోవాలి. ఒక్కసారి నాతో రమ్మని అడిగేపాటి చనువు ఉండకూడదా నాకు.' అన్నాడు. మాధవి ఏమీ అనలేదు.
మనస్సు అనేది వుంటుందన్న సంగతే గ్రహించనివాడు పెద్దనాన్న మనస్సువున్నా అది బలంగా పలకనిస్థితి పెద్ధమ్మది. భూమికి ఆరంగుళాల ఎత్తున అడుగులు వేస్తూ, ఏ లోకాల సువాసనలనో ఆఘ్రా ణిస్తూ, దృశ్యాలు చూస్తూ జీవనపధంలో నడిచిపోగలదు రాధ. ఇంతమందిలో తనని నీతో మాట్లాడాలని వుంది, రావూ, అని లాలనగా అడిగే రాజారావుని విదిలించడం ఎల్లా?
'ఒక్కసారి అల్లా కొంచం దూరం వెళ్ళి వద్దాం. ఏం? చెప్పులు వేసుకు రా.' అన్నాడతను మళ్ళీ. మాధవి లోపలికివెళ్ళి చెప్పులు వేసుకుని ఎవరితోటీ చెప్పకుండా వచ్చింది.
కొంతదూరం నడిచి, వీధి మలుపు తిరిగారు. వెనుకనుంచి వచ్చిన బస్సు రయిమని దూసుకు వెడుతోంటే 'పడిపోతావు' అని చేయిపట్టుకుని లాగాడు రాజారావు ఆమెని.
దీనితో మాధవి బిగుసుకు పోయింది. 'నేనింటికిపోతాను. రాను' అన్నది. అన్నదే కానీ, అతను 'వద్దు. ఒక్కసారి నా మాట విను' అని అతను నడుస్తోంటే తనూ నడిచింది.
'నీ సమస్యలు చెప్పుకోవడానికి నీకు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదూ నువ్వు? నా స్థితీ అల్లాగే వుంది మాధవీ! చదువుకుని, వివేకంగల మనిషిగా నీతో అన్నీ మాట్లాడాలని వచ్చాను నేను. ఎంత కాదనుకున్నా, మనిద్దరి సంసారాలకి ఒక సంబంధం ఏర్పడింది. ముందు మనం ఏం చేయాలో ఆలోచించుకోవద్దూ?' అని ఆగాడతను.
కొంచెం ఆగి, 'ఇదంతా శుష్క ప్రసంగం అనుకుంటున్నారా?' అన్నాడు. 'లేదు. చెప్పండి' అన్నది.
'నేను అడిగాను సాయంత్రం నిన్ను-మధు అప్పు తీర్చేద్దామా అని. ఆ దబ్బు యిచ్చేసి అతనితో తెగత్రెంపులు చేసుకోమని అంటున్నా ననుకోకు. నీ సమస్య తీర్చడానికి సాయపడదామని అన్నాను. ఏమంటావు?' అన్నాడతను. మెల్లిగా నేల చూస్తూ అడుగులు వేస్తోందామె. వీధిదీపం వెలుగులో ఫుట్ పాత్ మీద నీడలు పడుతున్నాయి. అప్పుడప్పుడొక కారు, సైకిలు పోయిన అలికిడి మినహా అంతా నిశ్శబ్దంగా వుంది.
'ఇంత దబ్బు ఎక్కడిది?' అన్నదామె.
'నా దగ్గరుంది. ఇస్తాను. ఇవ్వాలని నాకుంది.'-
'పెద్దనాన్నతో ఏదో వ్యాపారం పెట్టిస్తావన్నారుట?'
'అన్నాను కొద్దిపాటి చాలు. ఆయనకి అందరికీ యిబ్బందే. పైగా మధు వెళ్ళి పోతే రూము అద్దెకూడా...'
చటుక్కున ఆగింది మాధవి. అతని వంక చూసింది. మధు వెళ్ళిపోతా నంటున్నాడా, ఎవరితో అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఎక్కడికి వెడతాడు అన్న ప్రశ్నలన్నీ కళ్ళల్లోంచి బాధాకిరణాలై వెలువడుతున్నట్లు చూసింది రాజారావు వంక.
'మీ పెద్ధనాన్న అన్నాడు మరి. ఎంత వరకు నిజమో. నీకు తెలియకుండా వుంటుందా అని అన్నాను. అక్కడ తెలుసుకుందువుగాని - మాధవీ, ప్లీజ్, పద, అల్లా చూస్తూ నిలబడకు' అన్నాడతను.
ఇవేమీ విననట్లు ఆమె, 'ఎందుకు వెళ్ళిపోతాడు?' అన్నది.
'నాకు తెలియదు. నిజంగా తెలియక అన్నా నీ మాట. అడిగి తెలుసుకుందువు గాని.' మాధవి ముఖం పాలిపోయి, కళ్ళల్లో నీళ్ళు పైకి చిమ్మివచ్చి కళ్ళు మసక లైనాయి. అతనికి చీకట్లో కనబడును కదా అని ఆపుకోవడానికి ప్రయత్నించక, అల్లాగే నిలబడింది.
'ఎంత బాధ పడుతున్నావు మాధవీ, పద, వెడదాం,' అన్నాడతను. మళ్ళీ ఎంతో దూరం నడిచారిద్దరూ. పార్కు గేటు దగ్గర అతను ఆగి, 'పూర్తిగా వాన పోయింది కదా లోపలికి వెడదామా?' అన్నాడు. ఆమెకి ఎక్కడో ఒకచోట కూర్చోవాలని వుంది. అతని వెంట నడిచివెళ్ళి బెంచీ మీద కూర్చుంది.
అతనికి అంత దగ్గరగా కూర్చున్నానన్న ధ్యాస అయినా లేకుండా ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగింది, 'ఎందుకు వెళ్ళి పోతాడు అతను?' అని.
'వెళ్ళడేమో ఒకవేళ, ఐనా నీతో చెప్పకుండా ఎక్కడికి వెడతాడు?' అన్నాడతను. రాజారావు పేరు ఎత్తితే కస్సుమని ఏదో అయిపోతాడు మధు. ఇతను శాంతంగా, మనస్సు తెలిసిన నెచ్చెలిలా మాట్లాడుతున్నాడన్న సంగతి ఆమెకు తెలిసింది అంత కలవరంలోనూ.
'పోనీ అప్పు తీర్చేద్దాం, మీరిస్తారా డబ్బు?' అన్నది.
'ఇస్తాననేగా చెప్పింది? మీ పెద్ద నాన్న ఏం చెప్పారు నీతో?' అన్నాడతను.
ఇంకేం చెప్పాడు, మీ పెళ్ళిమాట చెప్పాడు' అన్నది నిజానికి దీనికి సమాధానం ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి - 'మాధవీ! ఇంట్లో డబ్బుకి చాలా యిబ్బందిగా వుంటోందేమో కదూ?' అన్నాడు.
నెయ్యిలేకుండా తనూ, పెద్దమ్మా ఎన్ని రోజుల నుంచో తింటున్నారు. చీరెలు చాలక యిబ్బంది పడుతోంది తను. రాధ ఫీజు కట్టాలంటే అప్పు చేసింది. ఇబ్బందే మరి.
కానీ ఆమె 'అంత యిబ్బంది లేదులెండి' అన్నది. నెలనెలా వందరూపాయలు పట్టుకెళ్ళి మధుకి యివ్వాలంటే చాలా కష్టంగా అనిపించేది. 'ఇంకో ఎనిమిదినెలలు, ఏడునెలలు కట్టాలి' అంటూ డబ్బు తీసుకుని మధు నిట్టూర్చేవాడు. తనకి యెంత యిబ్బందిగా వుందో చెప్పేవాడు రెండేసి వందలు కట్టాలంటే. కానీ భరించారు.
అదంతా గడిచిపోయింది. గడిచి గట్టెక్కిన సుఖం కనబడటం లేదు. శకుంతల సంగతి ఏమిటి? భగవంతుడు నెత్తిన మట్టి పడేసిన ఈ క్రొత్త సమస్య సంగతి ఏమిటి? మధు అల్లా అనుకోడు-నీ నెత్తిన ఎందుకు పడేశాడు ఆ సమస్య-నువ్వేకొని తెచ్చుకుంటున్నావు' అంటాడు.
'శకుంతలని మీరు తీసుకెడతారా?' అన్నదామె. అతను మాట్లాడలేదు. ఊపిరి బరువుగా వదలడం వినిపించింది. ఇంత దగ్గరగా వున్నావేమిటి అని అవతలికి జరిగిందామె. కొంచెం ఆగి 'తీసు కెళ్ళమంటావా?' అన్నాడు రాజారావు.
'నేనేం చెబుతాను?' అన్నదామె.
'తీసుకెడితే ఎవరూ లేరు మాధవి దాన్ని చూడ్డానికి, నే నొక్కడినే ఏం చేయను; మ్రోడైపోయాను..' అని అతను ఆగిపోయాడు. ఆమెకు దగ్గరగా జరిగి చేయి పట్టుకున్నాడు. 'విదిలించకు మాధవీ! నీకు-తెలియదూ-నేను పెళ్ళి చూపులకి వచ్చినప్పుడే నా మనస్సుకి ఏమిజరిగిందో! విడదీయలేని చిక్కుల్లోకి వెళ్ళిపోయావు నువ్వు. నేనేమీ చేయలేను నిన్ను రక్షించడానికి' అన్నాడు. ఆవేశంగా విదిలించవద్దని అతను నిస్సహాయంగా అన్న ఆ మాటతో ఆమె అల్లాగే వుంచింది ఆ చేయి. వెచ్చని అతని వ్రేళ్ళు గట్టిగా చుట్టి వేస్తున్నాయి ఆమె చేతిని.
'ఆ అప్పు తీర్చేసి, నన్ను పెళ్ళి చేసుకోమని అడగాలన్న దురాశ వేడిగా మంటలా లేస్తాంది. అతి సున్నితమైన నీకు ఎన్నో తగిలాయి గాయాలు. అన్ని వేపుల నుంచి వత్తిడి వస్తే తట్టుకోలేక నలిగిపోతున్నావు. స్వార్ధంతో నేనూ నిన్ను ఎల్లా బాధపెట్టనని నాకోరిక గొంతు నులిమేస్తున్నాను.
శ్యామల చెప్పింది మాధవి చూస్తుంది పాపని, యిచ్చేయండి అని. సరేనన్నాను మాట యిచ్చాను. కానీ ఎల్లా చూస్తావు నువ్వు? నీకు ఏమిటి బంధం?' బిగ్గరగా, ఆవేశంగా అతను అంటూ, యిలా ఆమె అరచేతిని నొక్కి పడుతున్నాడు. చటుక్కున ఆ చేయి తీసుకుని పెదవులకి అద్దుకొన్నాడు, వదిలేశాడు. లేచి నిలబడ్డాడు. 'వెడదాం పద' అన్నాడు. ప్రేమతో, ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి ఔతున్న ఆ క్షణంలో కూడా అతనిని వివేకం వెన్నుచరచి లేపినట్లయింది. చటుక్కున మాటత్రుంచి అతను లేవగానే గాలిలో వదిలినట్టయింది. మాధవికి.
'మీరు శకుంతలని తీసుకు వెళ్ళకపోతే - నేను మధుతో మాట్లాడాను-' అన్నదామె. తను ఏం మాట్లాడింది? అతను ఏమన్నాడు? ఆ నిజాలన్నీ ఇతనితో చెప్పడానికి సిగ్గు వేస్తోంది.
'నువ్వు దానిని పెంచుకోవడానికి వప్పుకొన్నాడా మధు? వద్దు మాధవీ కి నేను కన్నబిడ్డకి మరొకడూ తండ్రిగా చలామణి కావడమేమిటి?' అన్నాడతను.
'వెడదాం రా మాధవీ! ఇక్కడుంటే లాభంలేదు. అంటూ వంగి ఆమె చేయి పట్టుకుని లేవనెత్తాడు. వేడిగా, అతి వేడిగా వున్నాయి అతని వ్రేళ్ళు ఆమె లేచింది. లేస్తే ఎలాగు? ఏమి తీరినట్లు సమస్య?
'ఐతే తీసుకెడతారా శకుంతలని?' అన్నది.
'అబ్బా! విడిచిపెట్టవు ఆ ప్రశ్న! నువ్వు మధుని పెళ్ళి చేసుకున్న మర్నాడు నేను పాపాయిని తీసుకెడతా అంతవరకూ నువ్వే చూడు.' అన్నాడతను. దూరంగా జరిగి నడవసాగాడు.
తొమ్మిదిన్నరకి యింటికి చేరారు. మధు గది యింకా మూసే వుంది. సావిట్లో కూర్చున్న రాధ యిద్దరి వంకా వింతగా చూసింది. శివశాస్త్రి కునికిపాట్లు పడుతున్న వాడల్లా కళ్ళు విప్పి, 'ఎక్కడికి వెళ్ళావోయ్?' అని మాధవి వంక చూసి, మరోమాట అడుగకుండా లేచి 'వడ్డిస్తున్నావా, అతనొచ్చాడు' అంటూ లోపలికి వెళ్ళాడు.
* * *
మర్నాడు ప్రొద్దున్నే రాజారావు ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రిక్షా మాట్లాడి తెచ్చుకొని సామాను అందులో పెట్టుకొంటోంటే, అందరూ అరుగు మీదకి వచ్చి నిలబడ్డారు. అందరి తోనూ చెప్పి, మాధవి వేపు తిరిగి, చిన్న నవ్వుతో 'వస్తానేం?' అన్నాడు. ఆమె తలవంచుకుంది. పెద్దమ్మ, పెదనాన్న రిక్షా కదలగానే లోపలికి వెళ్ళారు. పరధ్యానంగా తలుపు అవతల నిలబడిన మాధవి అల్లాగే వుండిపోయింది అడుగు అవతలికి వేయకుండా.
బయట అరుగుమీద నుంచి లోపలికి వస్తున్న రాధ ఆగి, 'బావ వెళ్ళాడని అంత ఫీలై పోతున్నావేం?' అన్నది, మాధవి వులిక్కిపడి ఏమిటి యింత మాట అన్నదని గ్రహించుకునేలోపే తమాషాగా నవ్వి లోపలికి వెళ్ళింది రాధ. 'ఏంమాటలివి రాధా?' అన్నది. అల్లాగే నిలబడి పోయింది పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా ఏమిటి అంతమాట అన్నది. ఉద్దేశ్యమేమిటి అన్న ప్రశ్న లోపల ఉడికింది. పట్టుకోని అడగాలని, కానీ అడగలేదు. నిట్టూర్చి కొంతసేపటికి లోపలికి వెళ్ళింది.
మధు కనబడలేదు. గదిలోపల గడియ వేసివుంది ప్రొద్దున్న. కాలేజీకి వెళ్ళే లోపు అతన్ని కలుసుకోవాలి. పార్కుకి ఎందుకు రాలేదు. వచ్చి వెళ్ళిపోయారా, రాత్రికూడా యింటికి రాలేదేం అని అడగాలి. మన సమస్యలన్నీ తీరుతాయి. బావ పిల్లని తీసుకెళ్ళి పోతున్నాడు, మీ అప్పు తీరుస్తానన్నాడు అని చెప్పాలి. ఇవన్నీ ఆలోచించుకుని గబగబ స్నానం చేసి భోజనం చేసేసింది. గదిలోకి వెళ్ళి జడవేసుకుని, బొట్టుపెట్టుకుని, చీరతీసుకుందామని పెట్టెదగ్గర కూర్చుంది.
'మా అందరికంటే నీకు బావ దగ్గరి వాడై పోయాడా మాధవీ?' - వెనుక నుంచి అనుకోకుండా వచ్చిన ఈ ప్రశ్నకి మాధవి నిశ్చేష్టురాలైంది. చీరె తీసుకోవటం మానేసి, చేతులు అల్లాగేవుంచి కూర్చుంది. ఉన్నట్లుండి ఒక్కసారి దీనికి ఏమివచ్చింది, యింతింత మాటలంటోంది? కారణం లేకుండా ఎందుకిల్లా అబాండాలతో ప్రారంభమైంది ఈరోజు మెల్లిగా పెట్టెమూసి, వెనక్కి తిరిగింది మాధవి.
'ఏమిటి అన్నావు?' అన్నది. రాధ జడ పాయలు మళ్ళీ అల్లుకుంటూ ఒక కాలుచాచి నిలబడి వుంది. ఆ నిలబడ్డంతో నిర్లక్ష్యం, వాల్చివున్న ఆ కళ్ళల్లో తొంగి చూడబోతున్న ఎగతాళి - ఒక్క క్షణంలో స్పురించాయి మాధవికి.