లిబర్టీటాకీస్ ముందు టక్కున ఆగిపోయిన అప్పారావు ఓ డిప్యూటీకమీషనర్ తనవెంటే కాపలాగా నడవటాన్ని సహించలేకపోయాడేమో ట్రాఫిక్ ఐలెండ్ దిమ్మపైకెక్కి ఉధృతంగా ఉపన్యాసం ప్రారంభించాడు.
"మహాజనులారా..... ముందుగా నేనుపోలీసు జులుం నశించాలని మనం చేస్తున్నాను. అంతేకాదు ఈ ఉద్యమం యింతటితో ఆగదని, పోలీసుల్ని చూసి మీకు కంగారు పడొద్దని కడదాకా మనం యిలాగే పోరాడాలని నీకు మనవి చేస్తున్నాను"
జనంచప్పట్లు అతడికి మరింత వూపునిచ్చాయి.
"అయితే మహాజనులారా! మన దేశం కాని జాతికాని ఆ మాటకొస్తే ప్రతిఒక్కరుగాని చాలా బాధపడాల్సినవిషయమది. ఎందుకంటే మనం నష్టపోయింది యింతా అంతా కాదు. ఈ దేశంలోగా మన రాష్ట్రంలో గానిమనం ముఖ్యంగా మన పేద ప్రజలు చాలా సమస్యల్లో బ్రతుకుతున్నారు.
ఆ విషయం మీకు తెలుసు. నాకు తెలుసు యింకా మనందరికీ తెలుసు. అంతమాత్రంచేతమనం బాధపడకూడదు. ఇప్పుడు మనం సాగించేది వీర పోరాటమని మరోసారిమనం చేస్తూ పూజ్యబాపూజీ నెహ్రూపుట్టినటువంటిదేశంలో దేశ దేశాల్లోనూ, కోనకోనల్లోనూ పేరు గడించిన జాతిలోమనం యింకా ముందుకుపోవాలని కోరుకుంటున్నాను"
ముందే అందించిన ఆదేశంప్రకారం మళ్ళీ ఊరేగింపు జనం చప్పట్లుకొట్టారు. ఆఫీసులకి చేరలేకట్రాఫిక్ మధ్యలోనే ఇరుక్కున్న జనం తన ఉపన్యాసం వినడానికే నిలబడ్డారన్న అపోహతో ఎవరికీ అర్ధం కాని సందేశాల్ని, పొంతన లేని వాక్యాల్ని వాంతి చేయబోయాడు అప్పారావు.
"అంచేతమహాజనులారా.....మనం కాని, మనపిల్లలు కాని, మనచుట్టూవున్న పెద్దలు కాని, పేరు పేరునాకానీ ఏమైనా కానీ, కొండల్లోగాని కోనల్లోగాని మనం గట్టిగా నిలబడాలని మనవి చేస్తున్నాను. అలా యీ సమస్య పరిష్కరించబడుద్దని నేను అనడంలేదు. త్యాగాలు అవసరం పడొచ్చు రక్తపాతాలే ముఖ్యంకావచ్చు. నిద్రాహారాలేలేకపోవచ్చు. మనం ఓ సమస్య తో దూసుకుపోవాలని తెలియచేస్తూ శలవు తీసుకుంటున్నాను. మనం మన నాయకుడి దగ్గరకి నడిచినిలదీయాలంటూ చివరగా జైకొట్టమంటున్నాను....."గొంతు సవరించుకొని అరిచాడు "సీతారామరాజు."
"అమర్ హై"
'బ్రిటిష్ ప్రభుత్వం' 'అమర్ హై' ఫెడెల్మని కొట్టాడు అలా అన్నవ్యక్తిని.
"నాకొడకా, కల్లు ఎక్కిపోయిందేటి. బ్రిటిష్ ప్రభుత్వం.....డౌన్ డౌన్ అనాలి" రహస్యం చెప్పిమరోమారు కేకపెట్టాడు" బ్రిటిష్ ప్రభుత్వం, డౌన్ డౌన్....."
జనవాహిని ముందుకు కదిలింది. బషీర్ బాగ్ చౌరస్తాలో ఇంచుమించు ఇలాంటిమరో ప్రొసెషన్ కలిసింది అప్పారావు బృందాన్ని ఇప్పుడు జనం వందలునుంచి వున్నారు. డిసిపివైర్ లెస్ లో మరికొంత మందిపోలీసు బలగం కోసం కంట్రోల్ రూమ్ కి తెలియజేశాడు. ట్రాఫిక్ అస్తవ్యస్తమైపోతోంది.
నాంపల్లివేపుగా మరో ఊరేగింపు బృందంవచ్చి గన్ పౌండ్రిదగ్గర కలిసింది. సంఖ్యవెయ్యిదాకా పెరిగిపోయింది. రోడ్డుకి ఇరుపక్కలా వున్నషాపుల యజమానులుభయంతో షట్టర్లుదించుతున్నారు.
అప్పారావుకిదంతా చాలా ఉత్సాహంగా వుంది. మిగతా రెండు బృందాల్నీ లీడ్ చేస్తున్న వారికన్నా తనే బ్రహ్మాజీకి ఎక్కువ యిష్టుడు కావడంతో.
యిప్పుడేం జరిగినా ఆ ఘనతంతా తనకే చెందినట్టు అబ్బురపడిపోతున్నాడు.
బ్రహ్మాజీ నియోజకవర్గానికి చెందిన జనం ఏ క్షణంలో అయినా రెచ్చిపోయిషాపులపై దాడి చేసేట్టున్నారు. ఈ మాస్ సైకాలజీ తెలిసిన డిసిపి పోలీసుల్ని చుట్టూమోహరింప చేసి చాలా ఏకాగ్రతగా పరిస్థితుల్ని గమనిస్తున్నాడు.
ఊరేగింపు అబిడ్స్ ని చేరి మిన్నుముట్టేనినాదాలతో అంతా ఉత్సాహంగా నడుస్తుండగా ధైర్యంగా ముందుకొచ్చింది లిజి "మాస్టారూ" పిలిచింది ఓ అట్ట పట్టుకు నడుస్తున్నయువకుడ్ని "ఈ ఊరేగింపు దేనికి?"
"తెల్వద్" టక్కున అన్నాడు.
"మీ చేతిలో వున్న అట్టలో ఏం రాసి వుంది?"
"తెల్వద్"
"ఎక్కడికి?"
"తెల్వద్"
నివ్వెరపోయింది.
"మరెందుకువెళుతున్నావ్?"
తెల్వద్ అనబోయి వెంటనేకృతజ్ఞతలు వ్యక్తం చేశాడు" బారాత్ లో వస్తే పైసలిస్తా రమ్మండు అన్న....వూకనే కూసోడమెందుకని వచ్చిన"
"అన్నెవరు?"
అప్పారావుని చూపెట్టాడు
"నమస్తే...."
నినాదాలహోరులో నడుస్తున్న అప్పారావు ఇదో అవాంతరంలా భావించాడు "ఎవర్నువ్వు" అంతకన్నా సభ్యతని ఆశించలేదామె.
"ఓపత్రికా విలేఖర్ని"
ఉత్సాహంగా చూసేడు..." అయితే పేపర్లో ఫోటోలొస్తాయన్నమాట"
"అవును"
"శభాష్! ఫోటోలు తీసేసుకో"
"ముందుమిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగాలి"
"అడుగు"
"ఈఉద్యమం దేనికి?"
గొంతుసవరించుకున్నాడు "బ్రిటిష్ వాళ్ళు సీతారామరాజుని చంపినందుకు..."
"వ్వాట్" అప్రతిభురాలైంది" అందుకని ఇప్పుడు ఉద్యమంలేవదీశారా?"
"ఇందాక ఉపన్యాసం వినలేదా?"
"విన్నాను కాని అర్ధం కాలేదు."
ఈ జవాబుతో చాలా చికాకనిపించింది. కాని ఆమెపై విరుచుకుపడితే ఫోటోలు పడే ఛాన్స్ తప్పిపోతుందని నిగ్రహించుకున్నాడు" మరైతే మొత్తం మళ్ళీ చెప్పాలంటావ్"
'అక్కర్లేదు క్లుప్తంగా చెప్పండి"
"మేము....అంటే మా పేద ప్రజానీకంమాలాంటి పేదమన్యప్రజలకోసం ప్రాణాలు విడిచిన సీతారామరాజుని చంపిన తెల్లదొరల జులుంని ఖండిస్తున్నాం......ఆ తెల్లదొరల వంశీకులు వచ్చి యిక్కడ తప్పు జరిగిందని లెంపలేసుకోవాలని కోరుతున్నాం."
"గాడ్" అబ్బురంగా నిలబడిపోయింది....." చాలా చిత్రమైన సమస్య"
"మరే..అయినా మేం త్యాగాలు చేసైనా సాధించాలనుకుంటున్నాం" దృఢంగా అన్నాడు రాజపడినట్టు వల్లిస్తూ" అంచేత....నా మాటవిని వెంటనే నా ఫోటోతీసేసుకో."
ఆమె ఇంకా తేరుకోలేదు. అసలు ఇలాంటి ఓ సమస్య మొదలయ్యే అవకాశం ఉందంటే ఆమెనమ్మబుద్దికావడం లేదు.
ఇక ఫోటో తీసుకునేదే-అదిగో సరిగా అప్పుడు వినిపించాయి ఆర్తనాదాలు-పోలీసులాఠీచార్జి మొదలైంది. మరో పక్క అబిడ్స్ జంక్షన్ లోని షాపులు లూటీ అయిపోతున్నాయి. జనం కకావికలయిపోతున్నారు. తొక్కిసలాటలో పసిపిల్లలు నలిగిపోతున్నారు.
అప్పారావు కంగారు పడిపోయాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అసలు లూటీ చేయాల్సింది అక్కడ కాదు అన్నపూర్ణాహోటల్ ప్రాంతంలో.
అలాఖచ్సితమైన ఆదేశాలు ఇచ్చాక కూడాతొందరపడ్డారు అనుయాయులు.
అమాంతంజనం మధ్యకిపరుగెత్తాడు బాధని అభినయిస్తూ.
సాక్షాత్తూ ఎమ్మెల్యే రంగంలోకి అడుగు పెట్టడంతో-పైగా అధికార పార్టీవాడు కావడంతో పోలీసు అధికారులు అతడ్ని సమీపించి ఏదోనచ్చచెప్పబోయాడు కాని వినలేదు బ్రహ్మాజీ.
"హయ్యో....మల్లేశూ, రాములూ...మైసయ్యా" నేల పడిపోయినవ్యక్తులంతా తననియోజకవర్గంమనుషులే అనిపించేట్టు పేరుల్తో పిలుస్తూ మరీగుండెలు బాదుకుంటున్నాడు.
"ఎవరు....శాంతియుతంగా సాగుతున్న ఊరేగింపుపై యీ పోలీసు జులుంకి ఆదేశించింది ఎవరూ అని నేను నిలదీసిఅడుగుతున్నాను...."
"సర్" డిసిపి నెమ్మదిగా అన్నాడు "పోలీసు పర్మిషన్ లేకుండా వూరేగింపు నిర్వహించడమేకాక షాపుల్ని లూఠీ చేయాలని ప్రయత్నించారు. అందుకే లాఠీఛార్జి తప్పనిసరైంది"