Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 11


    క్యాష్ కౌంటర్ లో ఇచ్చిన రెండు లక్షల క్యాష్ ను సూట్ కేస్ లో సర్ధింది కాదంబరి. అన్నీ యాభై రూపాయల నోట్లకట్టలు కావడం వల్లకాస్త యిబ్బంది అయింది.
    శనివారం పన్నెండున్నరకె బ్యాంకు క్లోజ్ చేస్తారని ఎర్లీగా వచ్చింది. సూట్ కేసును చేతిలోకి తీసుకుని బయటకు నడిచింది. ఆఫీసుకారు బయటకు వెళ్ళడంవల్ల ఆటోలో రావల్సి వచ్చింది. ఇప్పుడు ఆటోలోనే వెళ్ళాలి. అంత డబ్బున్న సూట్ కేస్ చేతిలో వుంటే కాదంబరికి చేతులు వణుకుతున్నాయి. మొదటిసారిగా యింతపెద్ద మొత్తం డబ్బు డ్రా చేసింది. అసలు ఈ బ్యాంకు వ్యవహారాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు తనకెప్పుడూ చెప్పలేదు అభినయ్. మొదటిసారిగా తనకింత బాధ్యత అప్పగించాడు. అదీ అతను వూళ్ళోలేని సమయంలో ఇప్పుడు తన బాధ్యత రెట్టింపు వుంటుంది.
    రోజూ పొద్దున్నే పేపర్ లో ఇలాంటి విషయాలు చదువుతూనే వుంటుంది. బ్యాంకు దగ్గర 'మాయ'చేసి డబ్బు చోరీ చేసిన వార్తలు. ఇట్టే మాయం చేసేస్తారు నేర్పుగా. ఎవరినైనా తోడు అయినా తెచ్చుకోలేదు. తను చాలా జాగ్రత్తగా వుండాలి. అని అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకుంది. సూట్ కేసును గట్టిగా పట్టుకుంది. ఆటో కోసం చూస్తూ, రోడ్డుకు అవతలవైపు ఉన్న ఆటో దగ్గరికి వెళ్ళబోయింది.
    సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన....
    ఓ వ్యక్తి వచ్చి గట్టిగా కాదంబరికి డ్యాష్ ఇచ్చాడు. కాదంబరి చేతిలోని సూట్ కేస్ కింద పడింది. నితిన్ సెకన్స్ లో ఆ సూట్ కేస్ ను తీసుకొని ముందుకు కదిలాడు ఆ అగంతకుడు.
    కాదంబరి వెంటనే తేరుకుని గట్టిగా కేకలు వేసింది. "దొంగ... దొంగ.... సూట్ కేసు లాక్కెళ్తున్నాడంటూ" ఆ దొంగ పరుగెత్తడం మొదలెట్టాడు.
    జనం ఎలర్టయ్యేలోపే ఆ దొంగను ఓ వ్యక్తి ఒడిసి పట్టుకున్నాడు. ఆ దొంగ ఆ వ్యక్తి చేతిని కొరికి సూట్ కేసును అక్కడే వదిలి పారిపోయాడు.
    కాదంబరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది గబగబ. ఆ వ్యక్తి చేతిలోని సూట్ కేసు లాక్కొని ఓపెన్ చేసి డబ్బు చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది.
    ఆ తర్వాత ఆ వ్యక్తివైపు తిరిగి కృతజ్ఞతగా చూస్తూ చేతులు జోడించింది.
    "చాలా థ్యాంక్సండీ.... మీరే గనుక ఆ దొంగను ఆపి వుండకపోతే రెండులక్షల డబ్బు.... నా ఉద్యోగం వూడిపోయేది" అంది.
    "భలే వారే.... ఈ మాత్రానికే అంత ఎక్సయిట్ అయిపోతే ఎలా? ఎనీ హౌ మీ డబ్బు మీకు భద్రంగా చేరిందిగా..." అన్నాడు.
    "అవుననుకోండి... కానీ యిదంతా మీరు చేసిన సాయంవల్లే మీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు" అంది కాదంబరి ఓవర్ ఎక్సయిట్ అవుతూ.
    ఇంకా ఆమె మొహంలో ఆందోళన చెదిరి పోలేదు. క్షణంలో ఎంత ఘోరం జరిగి, తప్పి పోయింది. ఆ డబ్బే గనుక పోయి వుంటే మొహాన్ని అభినయ్ గారికి ఎలా చూపేది.
    "హల్లో... రోడ్డుమీదే ఇలా పరధ్యానంగా వుంటే ఎలా? మళ్ళీ ఎవరో ఒకరు యిలానే డ్యాష్ యిచ్చి డబ్బులు దోచుకెళ్ళగలదు" హెచ్చరికగా అన్నాడా వ్యక్తి.
    వెంటనే తేరుకొని "అవునవును" అంది.
    "నా ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడంలేదని అన్నారు. ఇప్పుడేమో కామ్ గా వుండిపోయారు" నిష్టూరంగా అన్నాడా వ్యక్తి.
    "ఓహ్... అయాం సారీ... చెప్పండి.... మీ ఋణం ఎలా తీర్చుకోమంటారు?"
    "పక్కనే ఏదైనా ఓ రెస్టారెంట్ లొ వేడివేడి కాఫీ తాగించి..." చెప్పాడతను.
    "దానికేం భాగ్యం.... అలానే" అంది ఈసారి సూట్ కేసును జాగ్రత్తగా గుండెలకు హత్తుకుని, గట్టిగా పట్టుకుంటూ....
    
                                   * * *
    
    "బైదిబై అయామ్ బెనర్జీ.... రామ్ బెనర్జీ..." అన్నాడు చేయి చూపుతూ ఆ వ్యక్తి.
    కాదంబరి రెండు చేతులూ జోదించి "నా పేరు కాదంబరి.... విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పి.ఎ.గా పనిచేస్తున్నాను" అని చెప్పింది.
    "ఓహో.... నైస్ మీటింగ్ టుయు.... అన్నట్టు అద్వైతి గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మహావతి బావమరిదిని నేను. కంపెనీల వ్యవహారాలు మా బావతోపటు నేనూ చూస్తుంటాను.
    "అలాగా!... మీలాంటి పెద్దవాళ్ళను కలుసుకునే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా వుంది" అంది కాదంబరి.
    ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ కాఫీతాగి బయటకు వచ్చారు ఇద్దరూ.
    "రండి.... నా కారులో మీ ఆఫీసు దగ్గర దింపుతాను. ఇంతమంచి కాఫీ ఇప్పించిన మీకు ఆ మాత్రం హెల్ప్ చెయ్యకపోతే నా బ్రతుకెందుకు?" అన్నాడు రామ్ బెనర్జీ.
    "ఒంటరిగా వెళ్ళే ధైర్యం కూడా లేదిప్పుడు. డ్రాప్ చేసి కాస్త పుణ్యం కట్టుకోండి" అంటూ కారులో కూర్చుంది బుద్దిగా.
    రామ్ బెనర్జీ కాదంబరిని విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందు దింపి, తను వెళ్ళిపోయాడు.
    కాదంబరి కారులో నుంచి దిగడం ఓ వ్యక్తి చాటునుంచి గమనించాడు.
    అతనే సెక్షన్ ఇన్ ఛార్జి శర్మ.
    
                                  * * *
    
    గ్రీన్ పార్క్ హోటల్...
    బార్ సెక్షన్ లొ ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు.
    "సార్... బుర్రంటే మీదే సార్... మీ నటన ముందు ఎవరైనా బలాదూరే..." మూడో రౌండ్ లో తూలుథూ అన్నాడు శర్మ.
    అప్పటికే ఆయన మూడు రౌండ్స్ పూర్తి చేశాడు. పెప్పర్ చికెన్, చిల్లీ చికెన్ సుష్టుగా లాగించాడు. ఫింగర్ చిప్స్ కి మళ్ళీ ఆర్డర్ చేశాడు.
    "ఈ బెనర్జీ ఏది చేసినా పకడ్బందీగా చేస్తాడు. నీవల్ల నాకు ఉపయోగం తక్కువ. మీ కంపెనీల నుంచి వచ్చే సరుకు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఏవీ నాకు సరిగ్గా తెలియవు. కానీ, ఆ కాదంబరికి అన్నీ తెలుసు.
    అన్నింటికన్నా ముఖ్యంగా ఆవిడను ఆ అభినయ్ గుడ్డిగా నమ్ముతాడు. అది చాలు మనకు.
    విరజ కంపెనీస్ ప్రోడక్ట్స్ కు మంచి మార్కెట్ వుంది. మా అద్వైతి కంపెనీలో లేబుళ్ళు మార్చి విరజ కంపెనీలో ప్రోడెక్ట్స్ కు ఓ బ్రాండ్ నేమ్ మనమే కల్పించి, మార్కెట్ లోకి రిలీజ్ చేయాలన్న ఐడియా కూడా వుంది.
    ముందుగా మనం తయారు చేసే డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని విరజ ప్రొడక్ట్స్ లో మిక్స్ చేయాలి. ఆ విధంగా మెల్లిమెల్లిగా ఆ ప్రొడక్ట్స్ ని దెబ్బతీయాలి. ఆ తర్వాత అంచలంచెలుగా మన ప్లాన్ యింప్లిమెంట్ చేయాలి. దానికి సరిపడ్డ కెపాసిటీ నీ దగ్గర లేదు. అందుకే ప్లాన్ వేశాను.
    కాదంబరి ఉదయం బ్యాంక్ కు వస్తుందని నువ్వు చెప్పిన ఇన్ ఫర్మేషన్ ఆధారంగా నా మనిషిని పెట్టి ఆమె సూట్ కేస్ దొంగిలించేలా చేశాను. ఆ తర్వాత, హీరోలా నేనే ఆ సూట్ కేస్ ను ఆమెకు అందేలా చేశాను. ఇదంతా ఫ్రీ ప్లాన్డ్..." బెనర్జీ సిగరెట్ పొగను రింగు రింగులుగా వదులుతూ చెప్పాడు.
    "భలే ప్లాన్ సార్ మీది...."
    ఫక్కున నవ్వాడు బెనర్జీ.
    "ఎందుకు సార్ నవ్వుతారు?"
    "ఈ మాత్రం ప్లాన్ ఏ తెలుగు సినిమాలో చూసినా తెలుస్తుంది. చిట్కా పాతదే....అయినా వర్కౌట్ అయింది."
    "భలే బోల్తా కొట్టించారు సార్....' శర్మ అన్నాడు.
    "కొన్నిసార్లు మన తెలివికన్నా, అవతలి వాళ్ళ తెలివితక్కువ తనమే మనకు ఉపయోగపడుతుంది శర్మా.... ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలు డబ్బు వసూలు చేసి, బోర్డు తిప్పేసి పోయినా, మళ్ళా చిట్ ఫండ్ కంపెనీల్లో జనం డబ్బు పెడుతూనే వున్నారు.
    పదేపదే మోసపోతూ, మళ్ళామళ్ళా మోసపోవడానికి రెడీగా వుంటారు. అమాయకత్వం వాళ్ళ సొంతం. అందరినీ మోసం చేయడం మనలాంటి వాళ్ళ కర్తవ్యం. అది వాళ్ళ ఖర్మ. ఇది మనలక్..." బెనర్జీ చెప్పాడు.
    అప్పటికే అయిదో రౌండ్ కూడా పూర్తి చేశాడు శర్మ.
    అతను ఏదీ వదలడు. ఫ్రీగా వస్తే అసలే వదలడు. తాగగలిగినంత తాగేసి, తినగలిగినంత తినేస్తాడు.
    మళ్ళీ చికెన్ మంచూరియా, స్ప్రింగ్ రోల్ ని ఆర్డర్ చేశాడు. బెనర్జీ చెప్పిందంతా విన్నాక అమాంతం లేచి, నేలమీద పాగిలపడి, బెనర్జీ కాళ్ళమీద పడిపోయాడు.

 Previous Page Next Page