సృష్టి సమస్తాన్ని నీ కనుసైగతో శాసించే సృష్టి కర్తా! ఏమిటి నీ లీలా విలాసం? ఏమిటీ విలాపాల విషాదం?
మహావతి అనీజీగా సోఫాలో నుంచి లేచాడు. అతను లేవగానే పదిమంది నౌకర్లూ కదిలారు. ఏ ఒక్కరూ స్విచ్చాన్ చేసి లైటు వేసే ధైర్యం కూడా చేయడం లేదు.
* * *
మహావతి మెట్లు ఎక్కుతున్నాడు. ఒక్కోమెట్టు ఎక్కుతుంటే ఒక్కో ఫీలింగ్ తను తన కూతురి గదిని సమీపించగలడా? ఆ గది తలుపు తెరిచి కూతుర్ని పరామర్శించగలడా?
ఒక్కటి కాదు.. రెండు కాదు.... ఇరవై సంవత్సరాలు.... ఇరవై సుదీర్ఘ వత్సరాలు.... సంవత్సరానికి మూడు వందల అరవై అయిదు రోజుల చొప్పున నెలకు ముప్పయి రోజులు.... రోజుకు ఇరవై నాలుగ్గంటలు పర్యంతమూ.... తన చిన్నారి అనుభవించే విచిత్రమైన యాతన. విషాదమైన వేదన....
"అయామ్ సారీ మిస్టర్ పతీ.... బిడ్డని బ్రతికించగలిగాము గానీ... తల్లిని 'సేవ్' చేయలేక పోయామని డాక్టర్లు అన్నప్పుడు.... ఆ బాధను దిగమింగిన మరుక్షణమే వన్స్ ఎగైన్ సారీ మిష్టర్ పతీ... మీ బిడ్డ కూడా..." అంటూ డాక్టర్లు తనవైపు సానుభూతిగా చూడ్డం యింకా అతనికి గుర్తున్న సంఘటనే.
"పాప చాలా బలహీనంగా వుంది. ఉండాల్సిన బరువులో సగం కూడా లేదు. కొన్ని రోజులు కాదు... నెలల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్ లోనే వుండాలి. తల్లి నుంచి ఆమెకు సంక్రమించిన అంతుపట్టని వ్యాధి ఇది. బిడ్డ గుండె బలహీనంగా వుంది." డాక్టర్లు కూడా ఎటూ తేల్చుకోలేని సమయంలో తనతో చెప్పిన ఆ మాటలు తనెలా మరిచిపోగలడు? అనుక్షణం.... అహర్నిశలూ బిడ్డనే తను కనిపెట్టుకుని వున్నాడు.
"చెన్నయ్... బొంబాయ్.... స్టేట్స్..... ప్రపంచమంతా తిప్పినా ఫలితం లేకపోయింది.
సైన్స్ కు అందని వ్యాధి.... డాక్టర్లకు అంతుపట్టని విషయం. చివరికి ఒకటి మాత్రం తేల్చి చెప్పారు. మీ పాపను పదిలంగా అతి పదిలంగా గాజుగదిలోని బొమ్మలా చూసుకోవాలి.
ఏ ఎమోషన్స్ కూ గురి కానీయొద్దు. ఎక్కువ నవ్వకూడదు. ఎక్కువ ఏడ్వకూడదు. యింగ్జయిటీ కూడదు. టెన్షన్ వుండకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఎమోషనూ ఆమె దరిచేరవద్దు".
ఒక్కక్షణం పట్టుతప్పి, మెట్లను ఆనుకొని వున్న రెయిలింగ్ పట్టుకున్నాడు.
ఏ తండ్రీ భరించలేని విషయం. మనసారా నవ్వలేదు. గుండె బరువు తీరేలా ఏడ్వకూడదు. ఫీలింగ్స్ ని వ్యక్తం చేయకూడదు. ఈ శిక్ష తనకా? తన బిడ్డకా?
ఇరవై ఏళ్లపాటు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇల్లే ఆమెకు పాఠశాల... ట్యూటర్లు కదిలి వచ్చారు. తన బిడ్డకు అమ్మఒడి లేదు. నాలుగ్గోడల మధ్య ఆ గదే బడి అయింది.
ఆ చిన్నివేళ్ళు అక్షరాలు దిద్దుతూ.... పాఠాలు చదువుతూ... "నాన్నా...." అని తన బాధను చెప్పుకునే అవకాశం కూడా లేదు.
ఎక్కడ తను కనబడితే తను ఎమోషనవ్వడమో, తన బిడ్డ సెంటిమెంట్ తో కదిలి పోతుందేమోనని తను దూరంగా వుంటూ వచ్చాడు. తను రాయిలా మారి, తన బిడ్డను మైనంలా చేశాడా?
ఆలోచనల అంతర్మధనంలొ శోకం శ్లోకమైంది. విషాదాల సంద్రంలో స్మృతులు మృతప్రాయమయ్యాయి. కంటికొసను చీల్చుకొని కన్నీటి కణం భగ్గుమంది.
* * *
దక్షిణాఫ్రికా అడవుల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కలపతో తయారైన ఆ గది తలుపును మెల్లిగా తెరిచాడు.
విధి వైచిత్రీ గమనించు.... విషాదాల చెలిమీ చిత్తగించు. కవి రాయని కావ్యం. రవి కాంచని వైనం....
* * *
నిశ్శబ్దంగా వుందాగది.
ప్లెజంట్ గా వుండేందుకు అనువుగా లైట్ బ్లూకలర్ పరదాలు కుచ్చులుగా వేలాడుతున్నాయి కిటికీలకీ, తలుపులకీ, గోడలకీ అక్కడక్కడ ఆమెవేసిన పెయింటింగ్స్.
అద్వైత కళ్ళు మూసుకుంది.
సన్నటి ఆమె పేదల్లో చిన్న ప్రకంపన శంఖం లాంటి ఆమె మెడ సన్నటి గొలుసును ఆభరణంలా స్వీకరించింది.
అందాన్ని రాశిగా పోసిన విధాత, ఆయుష్షుని ప్రసాదించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడ్డట్టున్నాడు. అందుకే ఆమె అందాన్ని కైవసం చేసుకొని ఆయుష్షుని ప్రశ్నార్ధకంగా మార్చుకుంది.
ఆమె ఎదురుగా కాన్వాసు.
ఆమె సన్నటి, పొడుగాటి చేతివేళ్ళు అతి పదిలంగా బ్రష్ ని పట్టుకున్నాయి.
ఆమె మనసులోని శూన్యంలా, కాన్వాసు మొత్తం ధవళవర్ణాన్ని ఆక్రమించుకుంది.
* * *
అద్వైత కళ్ళు తెరిచింది.
ఆమె చేయి కాన్వాసుమీద కదలాడే ఒయ్యారాల మందగమనే అయ్యింది. ఆ చేయి క...దు..లు..తూ...నే... వుంది.
ఆమె మనసు కాన్వాసు అయింది.
ఆమె ఆలోచనలు రంగులయ్యేయి.
ఆమె ఆవేదన బ్రష్షయ్యింది.
అస్తవ్యస్తమైన వైరుధ్య భావాలు, చిత్ర విచిత్రాలయ్యేయి.
క్షణాలు కరిగి, నిమిషాలు ఆవిరైపోతూనే ఉన్నాయి.
* * *
లోపలికి అడుగుపెట్టాడు మహాపతి.
అద్వైత అటువైపు తిరిగి వుంది. ఆమె తఃదేకంగా పెయింట్ వేస్తోంది. ఆ గది నిండా ఆమె వేసిన బొమ్మలే. ఆ బొమ్మల్లో ఆమె ఆవేదన.... ఆ బొమ్మల్లో అద్వైత మనసు ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూనే వుంది.
మహాపతి దృష్టి కాన్వాసుమీద పడింది. ఓ పక్షి ఆకాశంలో ఎగిరే ప్రయత్నం చేస్తోంది.
కింద అంతా సముద్రం. పైన ఆకాశం... ఆ రెంటి మధ్యా సముద్రంలోకి పడిపోతున్నట్టు ఆ పక్షి. చిత్రంగా ఆ పక్షికి రెక్కలు లేవు. అయినా దాని మొహంలో ఎగరాలనే తపన....
"బేబీ..." పిలిచాడు మహాపతి.
తలతిప్పి చూసింది అద్వైత.
"నాన్నా! మీరా?... ఎంతసేపైంది వచ్చి....?"
"ఇప్పుడే వచ్చాన్రా... ఏమిటమ్మా... బొమ్మ వేస్తున్నావా? చాలా బావుంది. కానీ పక్షికి రెక్కలు లేవు కదమ్మా!... రెక్కలు లేకుండా ఆ పక్షి ఎలా ఎగురుతుంది. పైగా కింద సముద్రాన్ని వేసావు.... పైన ఆకాశం వేసావు. ఆ పక్షి పరిస్థితి...."
అద్వైత నవ్వింది.... అతి పదిలంగా వచ్చిన నవ్వు అది.
"పక్షికి రెక్కలే ప్రాణాధారం కాదు నాన్నా... రెక్కలు లేని ఆ పక్షి ఆకాశంలోకి ఎగురలేదు. అలా అని కింద చూస్తే మహాసముద్రం... మధ్యలో త్రిశంకు స్వర్గంలో భీతిల్లే పక్షి..."
"పాపం... ఆ పక్షి బొమ్మకు రెక్కలు ఎందుకమ్మా వేయలేదు?" కూతురి తల నిమురుతూ అడిగాడు మహాపతి.
"ఆకాశంలో ఎగరాలని ఆ పక్షి తపన.... ఎగురలేని నిస్సహాయత.... నాలాగ.... కాదు నాన్నా!... స్వేచ్చగా తిరగాలని, మనసారా నవ్వాలని, గుండెబరువు దిగేలా ఏడ్వాలని వున్నా... ఏ ఎమోషన్ నీ వ్యక్తం చేయవద్దు కదా...
ఏ దేవుడిచ్చిన శాపం.
ఏ జన్మ పాప ఫలితమిది?
ఏ శాపానికి ఫలశృతి యిది? చెప్పండి నాన్నా...?"
అద్వైత తండ్రి గుండెలమీద తలపెట్టింది. రెండు వెచ్చటి కన్నీటి బాష్పాలు అతని గుండెని తడిపి, అతని మనసును పట్టి, మొత్తంగా అతన్ని కదిలించేశాయి.
"వద్దు చిట్టి తల్లీ!.... ప్లీజ్..... ప్లీజ్..... డోంట్ గెట్ ఎక్సయిట్...."
"నాన్నా.... ఆ పక్షికీ, నాకూ ఏ తేడా లేదని చెప్పానా? రెక్కలు లేకపోయినా ఎగరాలని ఆ పక్షి తపన.... ఆయుష్షు లేకపోయినా.... యింకా.... యింకా..... బ్రతకాలని ఈ తపన.... రెండు తపనల మధ్య తల్లడిల్లే నాకు ఈ తాపత్రయ మెందుకు నాన్నా....!"
అతనిలో గూడుకట్టుకున్న విషాదం అనే నిశ్శబ్దం స్తబ్ధమైంది.
* * *