Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 12


    "గురూ.... ఈ వేల్టి నుంచి నేను మీ శిష్యుడ్ని" అన్నాడు నిషా తలకెక్కడంతో.
    బెనర్జీ బేరర్ కు టిప్ యిచ్చి శర్మను అలానే వదిలేసి బయటకు నడిచాడు.
    ఇప్పుడతనికి శర్మతో పనిలేదు. పనికిరాని సామానుని స్టోర్ రూమ్ లోకి గిరాటేసినంత ఈజీగా పనికిరాని వాళ్ళను గిరాటేయగల సమర్ధుడు బెనర్జీ.
    
                                    * * *
    
    "హాల్లో విరజా! నేను అభినయ్ ని!"
    "ఆఁ! ఆఁ! చెప్పు!"
    "నాకిక్కడ మీటింగ్ అయ్యేసరికి మరో అరగంట పడుతుంది. నేను డైరెక్ట్ నాంపల్లి స్టేషన్ కి వచ్చేస్తాను. నువ్వు లగేజ్ తీసుకుని డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేయ్...."
    "అబ్బ! వెళ్ళే లాస్ట్ మినిట్ వరకూ ఆ వర్కు, టెన్షనూ ఏమిటి? ఇంటికొచ్చి రీఫ్రెష్ అయ్యి, డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చుకదా!?"
    "ప్లీజ్! ట్రైటు అండర్ స్టాండ్ విరూ! ఇక్కడ బిజీగా ఉన్నాను. చెప్పినట్టు చెయ్యి..." విసుగ్గా అన్నాడు అభినయ్.
    "అ...లా....గే...."
    "ఉండనా మరి! జాగ్రత్త, కార్లో స్టేషన్ కి వచ్చేయ్. టికెట్స్ పెట్టుకో.... బీ కేర్ ఫుల్... ఉంటా మరి..."
    "కోచ్ నెంబర్ తెల్సా?"
    "చెప్పు మర్చేపోయాను".
    "ఎ.ఎస్.వన్.... బెర్త్ నెంబర్ ఫోర్టీన్, ఫిఫ్ టీన్..."
    "థాంక్యూ.... ఉండనా మరి..."
    "అభీ! ట్రైన్ లో డిన్నర్ కి ఏం ప్యాక్ చెయ్యమంటావ్?"
    "మీల్స్ ఆర్డర్ చేద్దాంలే.... నువ్వేం వర్రీ కాకు"
    "సరే....!"
    "బై..."
    "బై..." ఫోన్ పెట్టేశాడు. విరాజ వెంటనే ఫోన్ పెట్టేయకుండా అలాగే నిలబడిపోయింది క్షణకాలం.
    ఇద్దరం కల్సి వెళదామంటే.... మళ్ళీ ఈ టెన్షన్ ఏమిటో?!
    అయినా అభినయ్ కి బిజినెస్ మైండ్ ఎక్కువయి పోయింది. ఎంతసేపూ సంపాదనేనా?! అందుకే ఈ ప్రోగ్రామ్ వేసింది తను. ఇప్పుడెలా తప్పించుకుంటాడో చూద్దాం! ఈ మూడు రోజులూ కట్టిపడెయ్యాలి తన ప్రేమతో... ఇడియట్...." స్వీట్ గా తిట్టుకుంది ఆఖరున.
    టైమ్ చూసింది. అప్పటికే ఫోర్ థర్టీ.... ఫైవ్ కే స్టార్ట్ అవుతుంది గోదావరి ఎక్స్ ప్రెస్ నాంపల్లిలో. "బాప్ రే బాప్! కానివ్వాలి" అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
    
                                  * * *
    పావుతక్కువ అయిదయింది.
    "సార్! గోదావరి ఫైవ్ కే మీరిక బయల్దేరండి. పావుగంటే టైమ్ వుంది. మళ్ళీ మధ్యలో ట్రాఫిక్" కాదంబరి హడావిడి చేసింది.
    "మైగాడ్! అవును కదూ! ఓ.కె. కాదంబరీ! నే బయల్దేరుతున్నాను. ఈరోజు ఎంత లేటయినా ఉండి, వర్క్ చేసి మరీ వెళ్ళు. డ్రైవర్ కి చెప్పాను. నిన్ను డ్రాప్ చెయ్యమని. రేపు మార్నింగ్ కూడా పికప్ చేసుకుంటాడు."
    "మీరు వెళ్ళండి సార్! నేను చూసుకుంటాను కదా! మీరేం టెన్షన్ పడకండి".
    "థాంక్యూ!"
    "ఆఁ! అన్నట్టు సర్! మీ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ ఎంత వుందో, ఏమో! ఈ రీఛార్జ్ కూపన్ మీ దగ్గర వుంచుకోండి. అత్యవసరంగా ఉపయోగపడొచ్చు" అంది సీల్డ్ రీచార్జ్ కూపన్ అందిస్తూ.
    "వెరీ గుడ్.... గుడ్ ఐడియా.... వెల్! నా గురించి ఇలా కేర్ తీసుకునే వాళ్ళంటే నాకెంత ఇష్టమో తెల్సా!" అన్నాడు అభినయ్ కూపన్ పాకెట్ లోపల పెట్టుకుంటూ.
    "ఇట్స్ మై డ్యూటీ సర్!" నవ్వుతూ చెప్పింది కాదంబరి.
    
                                    * * *
    
    నాంపల్లి రైల్వే స్టేషన్.
    "విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ బయలు దేరుటకు సిద్దంగా వుంది. "ఎనౌన్స్ మెంట్ వినపడింది అభినయ్ కు. ఎదురుగా కనపడిన పోర్టర్ ని పిలిచాడు. "ఎ.ఎస్. వన్ ఎక్కడని?"
    "అదిగో! అదేసార్!" అన్నాడు కాస్త పక్కగా వున్న థర్డ్ ఏ.సి కంపార్ట్ మెంట్ ను చూపిస్తూ.
    "థాంక్ గాడ్..." అనుకుంటూ ఎక్కేశాడు. ఛార్ట్ చూడ్డానికి కూడా టైమ్ లేదు. ఎక్కేశాడు. బండి బయలుదేరిపోయింది.
    "హమ్మయ్య! మొత్తానికి క్యాచ్ చెయ్యగలిగాను" అనుకుంటూ బెర్త్ నెంబర్ ఫోర్టీన్ కోసం వెతుకుతూ వెళ్ళసాగాడు.
    "ఈవిడగారు సీట్ లొ సెటిలయిపోయి వుండొచ్చు". అనుకుంటూ విరజ కోసం చూడసాగాడు.
    విరజ కనపడలేదు. "అదేవిటీ!" అతనిలో ఆత్రం పెరిగిపోతోంది. కంపార్ట్ మెంట్ మొత్తం రెండుసార్లు వెతికాడు. ఎక్కడా కనపడలేదు.
    సెల్ ఫోన్ తీశాడు.
    నెంబర్ డయల్ చేశాడు.
    విరజ సెల్ ఫోన్ ఆఫ్ చేసి వుంది.
    వెంటనే ఇంటి నెంబర్ డయల్ చేశాడు.
    మల్లి తీసింది.
    "మల్లీ! మేడమ్ బయలు దేరారా?" ఆత్రంగా అడిగాడు.
    "అవునయ్యా!"
    "ఎంతసేపయింది?"
    "చాలా సేపయింది బాబూ!"
    "కార్లోనే బయలుదేరారు కదా!"
    "అవునండీ!"
    "వెంట సెల్ ఫోన్ వుందా?"    
    "నాకు తెలవదయ్యగోరూ..."
    "సరే... సరే.... జాగ్రత్త" సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు.
    
                                  * * *
    
    అనీజీగా కూర్చున్నాడు తన సీటులో.
    ఏమైంది మరి! బయలుదేరాక రాకపోవటం ఏంటి? కొంపదీసి దారిలో ఏమైనా... తల్చుకోవడానికే భయం వేసింది అభినయ్ కి.
    అభినయ్ కి కోపం చెప్పలేనంత వచ్చేస్తోంది. విరజపైన వద్దంటే వెళ్ళక తప్పదంటుంది. అక్కడ అర్జెంట్ పనులు పక్కన పెట్టి, కేవలం తను విరాజ సంతోషం కోసం ఒప్పుకున్నాడు. ఇప్పుడిలా మళ్ళీ టెన్షన్...పెడుతుంది.
    మరోసారి విరాజ సెల్ ఫోన్ నెంబర్ ప్రెస్ చేశాడు.
    ఆఫ్ చేసి వుంది.
    విసుగ్గా కణతలు నొక్కుకున్నాడు.
    అతనికా క్షణంలో ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. అంతా టెన్షన్.
    ఆఫీస్ కి ఫోన్ చేశాడు.
    కాదంబరి ఎత్తింది.
    "హాల్లో! కాదంబరీ! మేడమ్ ఏమైనా ఫోన్ చేశారా?"
    "లేదు సర్! మీరెక్కడ్నుంచి సర్..."
    "నేను ట్రైన్ లో నుండే మాట్లాడుతున్నాను. విరాజ నాంపల్లిలో ఎక్కలేదు. ఏమయిందో తెలీడం లేదు. ఒకవేళ ఆఫీస్ కి ఏమయినా ఫోన్ వచ్చిందేమోనని".
    "లేదు సార్! ఫోనేం రాలేదు".
    "సరే.... నేను మళ్ళీ చేస్తాను" ఫోన్ కట్ చేశాడు. అతని టెన్షన్ కేమో ఎదురు బెర్త్పైన కూర్చున్న దంపతులు విచిత్రంగా అతనివైపు చూశారు.
    అతను అదేం పట్టించుకోలేదు.
    ఈలోగా సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. ట్రైన్ ఆగడంతోనే డోర్ దగ్గరికి నడిచాడు అభినయ్.
    ఆత్రంగా ఫ్లాట్ ఫామ్ పై చూశాడు. ఒకవేళ సికింద్రాబాద్ స్టేషన్ లొ ఎక్కుతుందేమోనని!
    ట్రైన్ లోకి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అడ్డు అని కిందికి దిగి నిలబడ్డాడు.
    అప్పుడు కనపడింది విరజ.
    కూలీవానితో లగేజి మోయిస్తూ హడావిడిగా వస్తోంది.
    అభినయ్ ప్రాణం లేచొచ్చింది.
    "ఏంటి విరజా! ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నాంపల్లి కెందుకు రాలేదు?"
    "సారీ అభీ! నీకు థ్రిల్ చేద్దామని!"

 Previous Page Next Page