"కుట్టీ? అని పిలిచేదాన్నండి"
"కుట్టీనా? అదేంపేరు?"
"ముద్దుపేర్లు అలానే వుంటాయండి. వాటికి అర్ధం వగైరాలు వుండనక్కర్లేదు. చిట్టీ, బుల్లీ, బుచ్చీ ఎలాగో - కుట్టీకూడా అంతేనండి. ఆఁ యిప్పుడే గుర్తుకొస్తోందండీ ఉండండుండండి. అసలు పేరు ఆంజనేయులు అనుకుంటానండీ."
"ఆంజనేయులు అనుకుంటావు. సరే. ఏంచేస్తాడు?"
.....తెలీదండీ"
"పోనీ ఎలావుంటాడు?"
"కొంచెం లావుగా, పొట్టిగా, నల్లగా వుంటాడండీ."
ఆమె చెప్పిన పాయింట్లన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ "క్రాపింగ్ ఎలా వుంటుంది?" అనడిగాడు.
ఆమె అతని వంక పరీక్షగా చూస్తూ "క్రాపింగ్.... మీ క్రాఫింగ్ లా అందంగా వుండదండీ" అని అనబోతూండగా.
"నా విషయం వొదిలెయ్యి నేనడిగింది ఆట్టీ క్రాఫింగ్ గురించి...?
"కొంచెంపలుచగా వుండి బట్టతలకాదుగాని బాగా పైకివుంటుందండీ. అక్కడక్కడ తెల్లవెంట్రుకలు మెరుస్తూ వుంటాయండీ."
"తెల్లవెంట్రుకలా? వయసెంతుంటుందేమిటి?"
"ఓ ముఫ్ఫయ్యేళ్ళు వేసుకోండి."
"ముఫ్ఫయ్యేళ్ళా?" అన్నాడతను ఆశ్చర్యంగా. "నీకంటే రెట్టింపే వయసున్న వాడ్ని ఎలా ప్రేమించావు?"
ఆమె తలవొంచుకుని కొంచెం బిడియంగా "మీకు తెలియని దేముందండీ? ప్రేమ గుడ్డిదంటారు కదండీ" అంది.
"నిజమేలే" అన్నాడతను ఒప్పుకుంటూన్నట్లు.
కొంచమాగి "అతని ఫోటో నీదగ్గిరేదయినా వుందా?" అనడిగాడు.
ఆమె ఇబ్బందిగా ముఖంపెట్టి "లేదండి" అన్నది.
"ఏ ఆధారమూ లేకుండా....గొప్పచిక్కు తెచ్చిపెట్టావు. అసలతన్ది ఈవూరేనా?"
"అవునండీ."
"ఎడ్రెస్ తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. కనీసం ఫోటో అన్నాలేదు..."
"ఆఁఆఁ వుండండి. ఓ ఐడియా వచ్చిందండీ" అన్నదా అమ్మాయి చాలా ఉత్సాహంగా.
"ఏమిటది?"
"ఓ కాయితం, పెన్సిలూ యివ్వండి"
"ఎందుకు?"
"ఇవ్వండి చెబుతా."
అతనయిదు నిమిషాలపాటు వెతికి పెన్సిల్ బయటకు తీసి, దాంతో బాటు పేపర్ కూడా యిచ్చాడు.
ఆ అమ్మాయి అక్కడున్న చెక్కకుర్చీని టేబిల్ దగ్గరకు లాక్కుంది.
టేబిల్ మీద వున్న స్కల్ ఆమెవంక వెక్కిరిస్తోన్నట్లు చూసింది. ఉలిక్కిపడి "ఏమండి! మీరేం అనుకోకపోతే దాన్నిక్కడ్నుంచి తీసెయ్యరూ?" అంది.
అతను స్కల్ ని టేబిల్ మీదనుండి తీసేసి ప్రక్కనున్న అల్మైరాలో పెట్టాడు.
ఆమె ఓ లావుపాటి పుస్తకం వొత్తుగా పెట్టుకుని పెన్సిల్ తో ఆ కాగితం మీద శ్రద్దగా బొమ్మగీసింది. చురుగ్గా, మెరుపులా కదుల్తోన్న ఆమె చేతివ్రేళ్ళను అతనాసక్తిగా గమనిస్తున్నాడు. అంతా కలిసి పది నిముషాలు పట్టలేదు. ఆమె ఒక మనిషి ముఖం తయారు చేసింది. ఆ పేపరు అతని కందిస్తూ "ఇదిగో యిలా వుంటాడండీ" అంది.
నిజంగా బొమ్మ చాలాబాగా గీసింది. సహజమైన ఆర్టిస్టులా గొప్ప నేర్పు, చాతుర్యం కలబోసి వుంది ఆమెలో-ఎటొచ్చీ ఆ బొమ్మలో వున్న మనిషే బాగాలేడు. వూరించిన బుగ్గలు, లావుగావున్న ముక్కు, వికారంగా వున్న మీసాలు.... ఆ కాగితం దగ్గర పెట్టుకుని ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. దంతపు బొమ్మలా, మీగడతరగలా, తబలా తరంగ ధ్వనికి రూపం కూర్చినట్లు మెరిసిపోతున్న యీ బంగారు తీగె యితన్నెలా ప్రేమించింది అనుకున్నాడు. మళ్ళీ తనే చెప్పిందిగా ప్రేమ గ్రుడ్డిది అని సరిపెట్టుకున్నాడు.
"ఏమిటండీ అలా చూస్తున్నారు?"
".... ..... ...."
"ఏమండీ! మిమ్మల్నే"
"ఊ" అంటూ యీలోకంలోకి వొచ్చాడు.
"ఏమిటలా చూస్తున్నారు?"
"ఏమీలేదు ఏమీలేదు సరే ఇవాళ్టినుంచీ యితన్ని వెదికే ప్రయత్నం చేస్తాను. అని మహేష్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా మడిచి జేబులో పెట్టుకున్నాడు.
* * *
సైకిల్ టైర్ లో గాలి తగ్గిపోయింది. అవతలి సందులోగాని సైకిల్ షాపు లేదు. అందుకని నడిపించుకుంటూ వెళుతున్నాడు మహేష్.
ప్రక్కనే మెల్లగా కారాగటం చూసి తలత్రిప్పి చూశాడు. సునంద స్టీరింగ్ ముందు కూర్చునివుంది.
"మహేష్! ఆ డొక్కు సైకిలు పారేసి నాతో కార్లో రాకూడదూ? మెడికల్ కాలేజి దగ్గర డ్రాప్ చేసివెళ్ళిపోతాను" అంది మృదువుగా.
"థాంక్స్ కాని నాకీసైకిలుమీదే సుఖంగా వుంటుంది".
"నువ్వొట్టి మొండివాడివి".
సునంద బి.ఏ. చదువుతోంది. ఆ వీధి మొదట్లో వున్న అధునాతనంగా కనబడే మేడ ఆమెతండ్రి నిరుడే కట్టించాడు.
"మహేష్! మీ ఇంట్లో ఎవరో అమ్మాయి కనబడుతున్నదేమిటి?" అనడిగింది సునంద మళ్ళీ తనే.
"అప్పుడే నువ్వెలా చూశావు?"
"ఇందాక డాబా ఎక్కితే మీ పెరట్లో అటూయిటూ తిరుగుతూ కనిపించిందిలే".
"మా చుట్టాలమ్మాయి".
"ఏమవుతుంది నీకు?"
"మరదలవుతుంది".
"గుడ్ కూడా ఎవరైనా వొచ్చారా? పేరేమిటి?"
"కూడా ఎవరూ రాలేదు. ప్రియంవద"
"ఐతే ఛాన్సే పేరు కూడా బాగుంది. అన్నట్లు మనిషి కూడా చాలా బాగుంది".
"చివరి రెండు వాక్యాలూ బాగానేవున్నాయి. కాని మొదటిదే బాగులేదు. అస్సలు బాగులేదు" అతను ముందుకు నడుస్తూ అన్నాడు.
"సారీ కోపమొచ్చిందా?"అంది కారతని ప్రక్కనుంచి మెల్లగా పోనిస్తూ.
"లేదులే" అన్నాడు.
"కోపంలో నువ్వు....." అవి ఏదో అనబోతూ హఠాత్తుగా పిల్లాడెవరో కారుకు అడ్డువొచ్చేసరికి గట్టిగా హారన్ మ్రోగించింది.