Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 11


    వసంత ఆశ్చర్యంగా, నమ్మలేనట్లుగా చూసింది. "నేను నీకు అసంతృప్తి కలిగిస్తున్నానా?"
    "అవును ఎన్నోసార్లు నేను డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడో, ఇంట్లోవున్నా నా వ్యాసంగం అదీ పూర్తయేసరికి-గాఢనిద్రలో వుంటావు. అలాంటప్పుడు ఎన్నోసార్లు నీమీద కోరిక కలిగింది. నిద్రలో వున్నప్పుడు నిన్ను కదిలిస్తే ఎలా కసురుకుంటావో తెలుసా? అయినా వ్యామోహం చంపుకోలేక ఎన్నోసార్లు నిన్ను దగ్గరకు లాక్కునేందుకు ప్రయత్నించాను. అన్నిసార్లూ కూడా నీతో అక్షింతలేతిని, చివరకు ప్రక్కకు తిరిగి పడుకునే వాడిని. అంతేగాని నిన్నేనాడైనా బలిమిని తీసుకున్నావా?"
    ఆమె అలాగే నిర్ఘాంతపోతూ వుండిపోయింది. తర్వాత చర్చ ఏమీ జరగలేదు.
    ప్రక్క మీదకి చేరాక అనంతమూర్తి ఆలోచిస్తూ గోడ వైపు తిరిగి పడుకున్నాడు. అతనిప్రక్కనే ఆమె మెదలకుండా పడుకుంది. చాలాసేపు మౌనంగా గడిచిపోయింది.
    చివరకు ఆమె వెనకనుంచి అతని గుండెమీద చెయ్యేసి "నిన్ను అన్నిసార్లు బాధపెట్టానా?" అన్నది నెమ్మదిగా.
    "మరి...?"
    "నీ మనసులో మాట యిన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు?"
    "చెప్పి ప్రయోజనం ఏముంది? అవసరం కూడా ఏముంది? ఒకరి స్వభావాలకు ఒకరు అలవాటు పడిపోవటం ఎన్నో అనర్ధాలను అరికడుతుంది కదా?"
    "ఇటు తిరుగు అటువైపు తిరిగి మాట్లాడుతోంటే ఏమీ బాగాలేదు" అని గట్టిగా తలవైపులాక్కుంది.
    అతను ఆమెకేసి తిరిగాడు బెడ్ లైట్ వెలుగులో ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. చూపులు ఒకరి లోతుల్ని ఒకరు తరచటానికా అన్నట్లు తీక్షణంగా, మెత్తగా సూటిగా, ప్రేమమయంగా, తడిగా, అవేక్టా కాంక్షలతో అలా ప్రసరించాయి.
    "మరి రా" అంది.
    "ఇప్పుడు వొద్దులే."
    "అబ్బో! బెట్టు చేయమాకు....రా"
    "ఇవేళ వొద్దన్నానుగా."
    "రేపు నేను గాఢనిద్రలో వుండి నిన్ను మళ్ళీ కసురుకోవచ్చు!" ఆమె నవ్వింది.
    అప్పటికీ అతనేమీ మాట్లాడలేదు.
    "యిదిగో మొండితనం చేస్తే నేనే విజ్రుంభించాల్సి వస్తుంది."
    "విజ్రుంభించు?"
    "నీకు తెలుసు అదీ కొత్త ఏం కాదులే" అతని ముఖానికి తన ముఖాన్ని దగ్గరగా చేర్చి అన్నది "ఏ భార్యా భర్తల మధ్యా అలాంటి సమయాలు లేకుండా వుండవు?"
    "అది నాకు తెలీదు" అతని కళ్ళలోకి మత్తువచ్చింది. చేతులు బలంగా ఆమెను దగ్గరకు లాక్కున్నాయి.
    
                                    * * *
    
    ఓరోజు ఆదివారం! అనంతమూర్తి ఖాళీగావున్నాడు.
    "వసంతా! ఈరోజు రాఘవ యింటికి వెడదామా?" అన్నాడు.
    వసంత సరేనంది.
    ఇద్దరూ వెళ్ళేసరికి లక్ష్మి గుమ్మంలోనే ఎదురైసాదరంగానే పలకరించి లోపలకు తీసుకెడుతూ "మీరు మా యింటికెప్పుడు రానేరారు" అంది వసంతతో.
    "కారణమేమీ లేదండి. విశేషమేమీలేక కుదరక."
    "ప్రమీలగారింటికి ఎప్పుడూ వెడుతూ వుంటారని తెలిసిందిలెండి" అందిలక్ష్మి నవ్వటానికి ప్రయత్నిస్తూ.
    "అదేమీలేదండీ నా కేవరయినా ఒకటే."
    "ఎవరయినా ఒకటే ఎందుకవుతుంది లెండి. మొన్న ప్రమీల గారు కలిశారు. మీరు రవ్వల గాజులు చేయించుకున్నారట. చాలా బాగున్నాయని చెప్పింది."
    వసంత ఏమీ జవాబు చెప్పలేదు. యిల్లు నాలుగు మూలలా చూసింది. అది యిల్లులా లేదు. ఒక్క వస్తువూ తీరుగా అమర్చిలేదు. విప్పిన బట్టలన్నీ దండాలకు చీదరంగా వ్రేళ్ళాడుతూ, నెలమీద అక్కడక్కడాపొర్లాడుతున్నాయి. పిల్లల స్కూలుపుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ-బల్లలమీదా, కుర్చీల మీదా, కుర్చీలలోనూ, నేలమీద ఇష్టం వచ్చినట్లు పడివున్నాయి. వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, మీదకుకలయబడుతూ, రామరావణ యుద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం తిన్న ఎంగిలికంచాలు వంటింట్లో పనిమనిషి రాకకోసం ఎదురుచూస్తూ నెలమీద అలాగేపడివున్నాయి. వాటిమీద ఈగలు ఝామ్మని ముసురుతున్నాయి.
    ముందు గదిలో మూర్తి, రాఘవ మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
    మూర్తికి ఎప్పుడో గాని స్నేహితుల్ని కలుసుకోవటం పడదు. అందుకని తన పత్రికను గురించీ, దానికి వచ్చే రచనల గురించీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాడు. ఈ మధ్య పత్రిక సర్క్యులేషన్ బాగా పెరిగింది. అలా అభివృద్దిలోకి రావటానికి తాను వేసిన పధకాలేమిటో, నిర్వహించిన పద్ధతులేమిటో వివరిస్తున్నాడు.
    లోపల్నుంచి ప్రతి అయిదు నిమిషాలకూ ఓసారి ఓ పిల్లో, ఓ పిల్లాడో వచ్చేవారు.
    "నాన్నా! తమ్ముడు చూడు. నా పుస్తకం చింపేశాడు" అని కూతురు ఫిర్యాదు చేసేది.
    రాఘవ స్నేహితుడు చెప్పే మాటలు వినటంమానేసి కూతురువంక తిరిగేవాడు చిరునవ్వు ముఖంతో "ఏమిటమ్మా! ఏం జరిగిందసలు...?" కూతురు చెప్పేది ఆసక్తిగా వినేవాడు ఆమెను సముదాయించి పంపేవాడు. ఈ కార్యక్రమం ఎంత సేపయినా పట్టనీ, ఎదురుగుండా ఒకమనిషి కూర్చున్నాడన్న ధ్యాస కూడా వుండేది కాదు.
    పిల్లలోపలకు వెళ్ళాక "ఆఁ ఏమన్నావు?" అనేవాడు అతనివైపుతిరిగి.
    మూర్తి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టేవాడు.
    ఈసారి కొడుకు వచ్చేవాడు.
    "నా పలక కనబడటం లేదు నాన్నా. ఎక్కడుందో మరి?"
    "అలాగా? వస్తున్నా నుండు నాన్నా" అని రాఘవ "యిప్పుడే వస్తానుండు" అని స్నేహితుడితో చెప్పి లోపల కెళ్ళి కొడుక్కి అప్పటికి అవసరంలేని పలక వెతికి పెట్టి ఏ పావు గంటకో మళ్ళీ వూడిపడేవాడు.
    "ఆఁ చెప్పు చెప్పు మంచి యింటరెస్టింగ్ గా వుంది?"
    అతను మళ్ళీ మొదలుపెట్టేవాడు.
    అయిదు నిమిషాలన్నా గడవకముందే చిన్నపిల్లాడు వచ్చేవాడు.

 Previous Page Next Page